ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 1
చిమ్మచీకటి… ఆ పల్లెటూరి రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గుడిసె పైకప్పు మీద వర్షం కురుస్తోంది.
గుడిసె మూలన ఉన్న చిన్న దీపం వెలుతురులో, ఏడేళ్ల కూతురు అక్షర, ఐదేళ్ల కొడుకు వివేక్ ఆకలితో ఏడుస్తూ అమ్మ ఒళ్ళో తలదాచుకున్నారు. భర్త రాఘవ చనిపోయి అప్పుడే ఆరు నెలలు దాటింది. అప్పటివరకు ఇల్లే ప్రపంచంగా బతికిన తులసికి, ఇప్పుడు రేపటి బతుకు ఎలా అనే ప్రశ్న మిగిలింది.
పక్కింటి రంగమ్మ వచ్చి, “ఏమే తులసి, రేపటి నుండి మా పొలంలో కూలిపనికి వస్తావా? రోజుకు వంద రూపాయలు ఇస్తారు. పిల్లల్ని సాకాలిగా మరి.కన్నీళ్లు తుడుచుకుని తులసి తల ఊపింది. అవును, తను ఒంటరిది కాదు… ఇద్దరు పిల్లల తల్లి. వాళ్ల భవిష్యత్తు తన చేతుల్లోనే ఉంది.
మరుసటి రోజు ఉదయాన్నే ఎండలో తులసి పొలం పనుల్లోకి దిగింది. చేతులు కాయలు కాస్తున్నా, ఒళ్లు హూనమవుతున్నా పిల్లల మొఖాలు గుర్తుకు రాగానే ఆమెలో తెలియని శక్తి వచ్చేది. కానీ సమాజం ఊరుకోదు కదా… “మొగుడు లేనిది… దానికి అంత తిప్పలు ఎందుకు?” అంటూ కొందరు విసిరే మాటల ఎదురుగాలి ఆమె గుండెను రగిల్చేది.
ఒకరోజు పని ముగించుకుని వస్తుండగా, ఊరి బడి పంతులు ఆనందరావు గారు తులసిని చూశారు ఆమె పడుతున్న కష్టం, ఆమె కళ్లల్లో ఉన్న తపన ఆయనకు అర్థమైంది
“తులసి… నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావు కదా, ఈ కూలిపనులతోనే నీ జీవితాన్ని ముగించేస్తావా? నీ పిల్లలకు నువ్వు ఇచ్చే ఆదర్శం ఇదేనా? మళ్లీ పుస్తకాలు చేతిలోకి తీసుకో… నీ రాతను నువ్వే మార్చుకో!” అన్నారు ఆయన ధైర్యం చెబుతూ.
ఆ మాటలు తులసి మనసులో ఒక కొత్త దీపాన్ని వెలిగించాయి. పగలు పిల్లల కోసం రెక్కల కష్టం… రాత్రి పూట ఆనందరావు గారు ఇచ్చిన పుస్తకాలతో అక్షరాల యుద్ధం… తులసి ప్రయాణం మొదలైంది!ఆనందరావు మాస్టారు చెప్పిన మాటలు తులసి గుండెల్లో ఒక కొత్త ఆశను రేకెత్తించాయి. డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్నా, పెళ్లయ్యాక వంటింటికే పరిమితమైన తులసి, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పుస్తకం చేతబట్టింది. పగలు ఎండనక, వాననక పొలంలో కూలిపని చేస్తూనే, మనసంతా చదువు మీదే ఉంచేది
రాత్రి అవ్వగానే పిల్లలిద్దరికీ అన్నం తినిపించి నిద్రపుచ్చాక, ఆ చిన్న గుడిసెలో కిరోసిన్ దీపం వెలిగించి కూర్చునేది. నిద్ర కళ్లపై భారంగా తన్నుకొస్తున్నా, చల్లటి నీళ్లతో మొహం కడుక్కుని తెల్లవార్లూ చదివేది. ఆమె పట్టుదల చూసిన ఆనందరావు మాస్టారు ఒకరోజు, “తులసి, నువ్వు కేవలం చిన్న ఉద్యోగాల కోసం కాదు… సివిల్ సర్వీసెస్ (IAS) పరీక్షకు సిద్ధమవ్వు. నువ్వు కలెక్టర్ అయితే నీలాంటి ఎంతోమంది అనాథలైన ఆడపిల్లల బతుకులు మారతాయి” అని ఐఏఎస్ పుస్తకాలు తెచ్చిచ్చారు.
కలెక్టర్… ఆ మాట వినడానికే తులసికి ఒక కలలా అనిపించింది. కానీ సమాజం ఆమెను అంత తేలిగ్గా వదిలేయలేదు. ఊరి ప్రెసిడెంట్ మురళి కన్ను తులసి మీద పడింది. ఒకరోజు పొలం పని ముగించుకుని ఒంటరిగా వస్తున్న తులసిని దారి కాశాడు. “ఏమే తులసి, మొగుడు లేనిదానివి… ఈ వయసులో నీకెందుకు ఈ చదువులు, తిప్పలు? నా మాట వింటే నిన్ను, నీ పిల్లల్ని మహారాజుల్లా చూసుకుంటా” అంటూ చేయి పట్టుకోబోయాడు.
తులసి ఒళ్లు కోపంతో రగిలిపోయింది. భయపడి వెనక్కి తగ్గకుండా, పక్కనే ఉన్న కట్టెను చేతుల్లోకి తీసుకుని, “మరోసారి నా జోలికి వస్తే ఈ ఊరి నడిబొడ్డున నిలబెట్టి తంతాను! మొగుడు లేకపోతే అనాథ అనుకున్నావా? నా పిల్లలకి నేనే తండ్రిని” అంటూ సింహంలా గర్జించింది.
ఆమె కళ్లల్లోని రౌద్రం చూసి మురళి భయంతో వెనక్కి తగ్గాడు గానీ, మనసులో పగ పెంచుకున్నాడు.
ఇంటికి వచ్చిన తులసి భయంతో, ఆవేదనతో ఏడ్చేసింది. కానీ ఆ కన్నీళ్లు ఆమెను బలహీనపరచలేదు, మరింత మొండిగా మార్చాయి. ఎలాగైనా ఐఏఎస్ సాధించి ఈ సమాజానికి తనేంటో నిరూపించాలని గట్టిగా నిశ్చయించుకుంది. ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు దగ్గరపడుతున్న వేళ, పరీక్ష రాయడానికి పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. పిల్లలని ఎవరి దగ్గర వదిలి వెళ్లాలో తెలియని పరిస్థితి.
పరీక్ష రాయడానికి చేతిలో పైసా లేదు, పిల్లలని చూసుకోవడానికి దిక్కు లేదు. తులసి ఆ గుడిసెలో కూర్చుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. సరిగ్గా అదే సమయానికి దేవదూతలా ఆనందరావు మాస్టారు అక్కడికి వచ్చారు. తులసి పరిస్థితి చూసి ఆయన గుండె కరిగింది.
“తులసి, అధైర్యపడకు. ఇదిగో ఈ ఐదు వేల రూపాయలు ఉంచుకో. నా రిటైర్మెంట్ డబ్బుల్లో దాచుకున్నవి. నువ్వు పరీక్ష రాయడానికి పట్టణానికి వెళ్ళు. పిల్లలిద్దరినీ నా ఇంట్లోనే ఉంచి, నా ప్రాణం లాగా చూసుకుంటాను. నువ్వు వెళ్లి నీ కల నిజం చేసుకో” అంటూ ఆమె చేతిలో డబ్బులు పెట్టి ధైర్యం చెప్పారు. మాస్టారి కాళ్లకు నమస్కరించి, కన్నీళ్లతోనే తులసి పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కింది.
ఇంకా ఉంది.
ప్లీస్ ఇగ్నోర్ మిస్టేక్స్.
ప్లీస్ ఫాలో మీ ♥️
Swipe left/right or tap the sides to turn pages