ఆవిడ మాటలు విన్న వెంటనే అదేంటి అత్తయ్య అలా అంటున్నారు అంటే మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా అని అనుమానంగా అడిగింది ప్రతిమ..
నా అనారోగ్యం కొత్తగా వచ్చింది ఏమీ కాదులే తల్లి.. మీ మామయ్య గారు చనిపోయినప్పుడే నా ఆరోగ్యం పాడైంది..
ఎక్కువగా ఆలోచించి ఆలోచించి ఆందోళన ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల రక్తపోటు వచ్చింది.. అది కాస్త గుండెపోటుకు దారి తీసింది..
అప్పుడు నా కొడుకు నన్ను ఎన్నో హాస్పిటల్లా చుట్టు తిప్పి నా ఆరోగ్యాన్ని కాస్తంత బాగుపడేలా చేశాడు..
వాడి బాధని చూడలేని నేను కూడా, నా బాధను దిగమింగుకొని కేవలం వాడి కోసమే బతుకుతున్నాను.. మీ మావయ్య గారు మనతో లేరు అన్న విషయాన్ని చిన్నగా మర్చిపోవడం మొదలు పెట్టాను..
ఇప్పుడు కాస్త పరవాలేదులే గుండెపోటు మళ్ళీ రాలేదు.. రక్తపోటు కూడా తగ్గు ముఖం పట్టింది.. అందుకే నన్ను ఎక్కువగా ఏ పనులు చేయనివ్వడు ..