New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మౌనమే ని భాష – 4

మౌనమే ని భాష – 4

ఆఫీస్ క్యాబిన్‌లో శ్రావణి తన కంప్యూటర్ ముందు కూర్చుని ఉంది కానీ ఆమె మనసు మాత్రం ఎక్కడో ఉంది. 

 

పని మొదలుపెట్టే ముందు ఒకసారి తన బ్యాగ్ చెక్ చేసుకుంది. ఎప్పుడూ తన చేతికి తగిలే ఆ లేదర్ డైరీ స్పర్శ తగలలేదు.

 

ఇక్కడే ఎక్కడో ఉండాలి అనుకుంటూ బ్యాగ్ లోని వస్తువులన్నీ పక్కకు జరిపి చూసింది. పెన్నులు, వాటర్ బాటిల్, క్యారియర్ డబ్బా అన్నీ ఉన్నాయి కానీ ఆ డైరీ లేదు. 

 

శ్రావణి గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పని అయింది. మళ్ళీ మళ్ళీ వెతికింది. బ్యాగ్ లోని చిన్న చిన్న జిప్పులు కూడా తెరిచి చూసింది. ఎక్కడా లేదు.

 

శ్రావణీ ఏంటి అంత కంగారుగా ఉన్నావు అని రమ్య ఆమె క్యాబిన్ లోకి వస్తూ అడిగింది.శ్రావణి తన కంగారును అదుపు చేసుకుంటూ ఏం లేదు రమ్య ఒక బుక్ కనిపించడం లేదు. 

 

బహుశా హడావిడిలో ఇంటి దగ్గరే మర్చిపోయి ఉంటాను అంది. లోపల ప్రాణం విలవిలలాడుతున్నా, బయటకు మాత్రం నిబ్బరంగా చెప్పింది.

 

అబ్బా దానికేనా అంత కంగారు ఇంటికి వెళ్ళాక చూసుకోలేవా రా కాసేపు కాఫీ తాగుదాం అని రమ్య పిలిచినా శ్రావణి వెళ్ళలేదు.

 

ఆ రోజంతా శ్రావణికి ఒక యుగంలా గడిచింది. ఆఫీస్ పనిలో మునిగిపోవాలని ఎంత ప్రయత్నించినా, ఆమె కళ్ళు తరచూ బ్యాగ్ వైపు వెళ్తున్నాయి. 

 

ఇంటి దగ్గరే ఉంటుంది.. పక్కాగా అక్కడే వదిలేసి ఉంటాను అని తన మనసుకి తనే నచ్చజెప్పుకుంది. ఎలాగోలా పని పూర్తి చేసుకుని, 

 

సాయంత్రం బస్సు కోసం కూడా ఆగకుండా ఆటో పట్టుకుని హడావిడిగా ఇంటికి చేరుకుంది.

 

ఇంటి తాళం తీస్తూనే శ్రావణి చేతులు వణకడం మొదలయ్యాయి. తలుపు తీసి లోపలికి వెళ్ళగానే లైట్లు కూడా వేయకుండా నేరుగా తన టేబుల్ దగ్గరకు వెళ్ళింది. 

 

అక్కడ డైరీ లేదు. మంచం మీద చూసింది, దిండు కింద వెతికింది, వంటింట్లో తను వంట చేసిన చోట కూడా వెతికింది. చివరకు తను బట్టలు ఆరేసిన చోట, కిటికీ పక్కన ఇల్లంతా గాలించింది.

 

గంట గడిచింది. శ్రావణి సోఫాలో నీరసంగా కూలబడిపోయింది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఆమె కళ్ళ నుండి నీళ్లు ధారగా కారుతున్నాయి.

 

ఆ డైరీ కేవలం ఒక పుస్తకం కాదు.. అది ఆమె గతానికి ఉన్న ఏకైక సాక్ష్యం. ఆమె ఎవరికీ చెప్పలేని రహస్యాలు, ఆమె కన్నీళ్లు, ఆమె కవితలు.. 

 

అన్నీ అందులోనే ఉన్నాయి. అది పోవడమంటే తన అస్తిత్వాన్ని ఎవరో లాగేసుకున్నట్టు అనిపించింది.ఎక్కడ పోయింది. బస్సులోనా లేక రోడ్డు మీద పడిపోయిందా అని ఆలోచిస్తూ తల పట్టుకుంది. 

 

ఎవరైనా దాన్ని చదివితే, తన బాధను చూసి నవ్వుకుంటే లేదా దాన్ని చెత్తబుట్టలో పారేస్తే ఈ ఆలోచనలే ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 

చీకటి పడింది. శ్రావణికి భోజనం చేయాలని కూడా అనిపించలేదు. కాసేపటికి లేచి ముఖం కడుక్కుని, అల్మారాలో ఉన్న ఒక ఖాళీగా ఉన్న కొత్త వైట్ నోట్ బుక్ తీసింది.

 

పాత డైరీ స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదని తెలుసు, కానీ తనలోని ఆవేదనను ఆపుకోలేక ఆ కొత్త పుస్తకంపై పెన్ను పెట్టింది.

 

ఆ కొత్త డైరీ మొదటి పేజీలో ఆమె ఇలా రాసింది:

 

నా సర్వస్వం నింపుకున్న అక్షర కావ్యం..

దిక్కులేని చోట మౌనంగా విలపిస్తోందా?

ప్రపంచానికి అది కేవలం ఒక కాగితాల కట్ట కావచ్చు..

నాకు మాత్రం అది నా ప్రాణం పోసుకున్న గతపు పుట!

 

నిన్ను వెతికే దారి తెలియక..

నిన్ను మోసే అదృష్టం లేక..

ఈ కొత్త పుస్తకంలో మళ్ళీ నా వేదనను మొదలుపెడుతున్నాను!!

 

ఆ అక్షరాలు రాస్తుంటే పేజీ మీద కన్నీటి చుక్కలు పడి రంగు వెలిసిపోతోంది. శ్రావణి ఆ కవిత్వాన్ని రాస్తూనే ఉంది.

 

ప్రియమైన డైరీ…..

       నువ్వు ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నావో నాకు తెలియదు. నీలోని నా రహస్యాలను చూసి ఆ అపరిచితుడు ఏమనుకుంటాడో అన్న భయం నన్ను వెంటాడుతోంది. 

 

కానీ ఒక్కటి మాత్రం నిజం.. నువ్వు లేని నా జీవితం మళ్ళీ ఒక శూన్యమైపోయింది. నా జ్ఞాపకాలను భద్రంగా కాపాడుకుంటావని ఆశించడమే నా వంతు.

 

శ్రావణి ఆ రాత్రంతా నిద్రపోలేదు. కిటికీ వైపు చూస్తూ ఉండిపోయింది. బయట కురుస్తున్న వర్షం ఆమె కళ్ళలో కూడా కురుస్తూనే ఉంది. 

 

ఒక పక్క వంశీ ఆ డైరీని తన బ్యాగ్ లో పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతుంటే, మరో పక్క శ్రావణి అదే డైరీ కోసం తన ఆత్మను వెతుక్కుంటోంది.

 

కాలం విచిత్రమైనది.. ఆమెకు దుఃఖాన్ని మిగిల్చిన ఆ సంఘటనే, ఆమె జీవితంలోకి ఒక వెలుగును తీసుకురాబోతోందని ఆమెకు తెలియదు.

 

గదిలో చీకటి రాజ్యమేలుతోంది. కిటికీ బయట వర్షం శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. శ్రావణి అలాగే కిటికీ పక్కన కూర్చుని, శూన్యంలోకి చూస్తూ తన గతంలోకి జారిపోయింది. 

 

పోయిన ఆ డైరీ స్థానంలో ఇప్పుడు తన ముందున్న కొత్త పుస్తకం వైపు చూస్తుంటే, ఆమెకు తన పదేళ్ల ప్రాయం గుర్తొచ్చింది.

 

                       కొనసాగుతుంది…….

 

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్….