New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రణయం శరణం గచ్ఛామి – 1

ప్రణయం శరణం గచ్ఛామి – 1

ఎపిసోడ్ 1
అది కాచీగూడ రైల్వే స్టేషన్.
సాయంత్రం వేళ లోకల్ ట్రెయిన్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చి ఆగీ ఆగడంతోనే ప్రయాణికుల రద్దీ పోటెత్తింది. ఆ తోపులాటల మధ్య నుంచే బయటకు అడుగుపెట్టింది ప్రజ్వల.
వెన్నెలను సవాలు చేస్తున్న పాలమీగడ లాంటి రంగు, తీర్చిదిద్దిన నడుము, ఒంపుసొంపుల్లో రాజసాన్ని దాచుకున్న రూపం. యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లెనిన్ కాటన్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్.. 
కుడిఛేయి రిస్ట్ కి బ్లాక్ చెయిన్ ఉన్న రిస్ట్ వాచ్, ఎడమ చేతికి ఒక అర డజను మట్టి గాజులు, నుదట వంపు తిరిగిన కనుబొమల మధ్య చిన్న నలుపు స్టిక్కర్, మీనాల్లాంటీ కాటుక కళ్ళు.. రోజా పూలకే గుబులు పుట్టించే గులాబీ రంగు పెదవులు, పాలుగారే నున్నని బుగ్గలతో,..చెదిరిన ముంగురులు ముఖంపై వాలుతుంటే,
 వాటిని సవరించుకుంటూ అజంతా శిల్పంలా నడిచొస్తున్న ఆమెను చూసి చుట్టుపక్కల చూపులన్నీ ఒక్క క్షణం స్తంభించిపోయాయి.
స్టేషన్ గేటు దాటగానే ఆటో డ్రైవర్లు ఆమె చుట్టూ మూగారు.
“మేడమ్.. ఆటోనా?” “దీదీ ఆటో చాహియే క్యా? కహా జానా?”
ఆ రణగొణ ధ్వనుల మధ్యే ఒక్కసారిగా రయ్ మంటూ శబ్దం చేస్తూ వచ్చి ఆగింది ఒక ఖరీదైన లగ్జరీ కారు. దాని రాయంచలాంటి దాని రాజసానికి పాపం.. ఎదురుగా ఉన్న ఆటోలన్నీ చిన్నబోయాయి. కారు డ్రైవర్ డోర్ తీసుకుని చకచకా దిగి వచ్చి వినయంగా వంగి చేతులు కట్టుకున్నాడు.
“అమ్మాయి గారూ.. కారు ఎక్కండి, వెళ్దాం.”
ప్రజ్వల కనుబొమ్మలు ముడిపడ్డాయి. కళ్లల్లో తీవ్రమైన అసహనం.
“నేను చెప్పేదీ, నీకు అర్థం కావడం లేదా వెంకటేశ్? నాకోసం కారు పంపొద్దని పొద్దున్నే చెప్పాను కదా! నేను ఆటో లోనే వస్తాను.”
“అలా అనకండి అమ్మాయి గారూ..” వెంకటేశ్ గొంతులో వణుకు, “పెద్దయ్యగారు తెలిస్తే ఊరుకోరు. నా ఉద్యోగం ఊడిపోతుంది. దయచేసి ఎక్కండి.”
“ఏమీ కాదు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్లిపో!”
అతని మాటలను ఏమాత్రం లెక్కచేయకుండా, పక్కనే ఉన్న ఒక ఆటో వైపు అడుగులు వేసింది ప్రజ్వల. ఆటో ఎక్కి అడ్రస్ చెప్పి ముందుకు సాగిపోయింది.
వెంకటేశ్ తల గోక్కుంటూ వెంటనే జేబులోంచి ఫోన్ తీసి ఒక నంబర్‌కు డయల్ చేశాడు. అటువైపు రెండో రింగ్‌కే కాల్ లిఫ్ట్ అయింది.
“చెప్పు వెంకటేశ్.” గంభీరమైన గొంతు.
“అది.. పెద్దయ్య గారూ.. అమ్మాయి గారు కారు వద్దని ఆటో ఎక్కి వెళ్ళిపోయారండీ.” భయపడుతూ చెప్పాడు.
క్షణకాలం నిశ్శబ్దం. ఆ తర్వాత అంతే స్థిరమైన స్వరంతో, “సర్లే.. ఆ ఆటో వెనకే జాగ్రత్తగా ఫాలో అవుతూ వచ్చేయ్.”
“సరేనండి పెద్దయ్యగారూ!” అంటూ వెంకటేశ్ కారును స్టార్ట్ చేసి ఆటో వెనుకే పోనిచ్చాడు.
జూబ్లీహిల్స్ పరిసరాల్లోని ఒక విశాలమైన రాజప్రసాదం లాంటి విల్లా ముందు ఆటో ఆగింది.
ప్రజ్వల కిందకు దిగి ఆటో మీటర్ చూసి డబ్బులు చెల్లించింది. గేటు దగ్గర సెల్యూట్ చేస్తున్న సెక్యూరిటీ గార్డును కూడా గమనించనంతటి అలసట, చిరాకు ఆమె ముఖంలో కనిపిస్తున్నాయి.
విల్లా లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా ప్యాలెస్‌ను తలపించే ఇంటీరియర్ డెకరేషన్.. ఇటాలియన్ మార్బుల్స్, షాండ్లియర్లు. అంతటి వైభవం ముందు ప్రజ్వల వేసుకున్న కాటన్ చీర, ఆమె నిరాడంబరత అస్సలు పొంతన లేనట్టుగా ఉన్నాయి.
ఆమె రాకను గమనించిన వంటమనిషి కనకం లోపలికి చూస్తూ ఉత్సాహంగా అరిచింది.
“పెద్దయ్యగారూ! అమ్మాయి వచ్చిందండీ!”
విశాలమైన మెట్ల మీదుగా నెమ్మదిగా కిందకు దిగివచ్చారు రాజా హరిచంద్ర ప్రసాద్ గారు..
ఆరడుగుల విగ్రహం, తెల్లటి ఖద్దరు లాల్చీ పైజామా, ముఖంలో రాజసం. ప్రపంచవ్యాప్తంగా రకరకాల వ్యాపార సామ్రాజ్యాలను శాసిస్తున్న బిలియనీర్ ఆయన అని ఆ రూపమే చెబుతోంది.
ఎదురుగా సోఫాలో నీరసంగా కూర్చున్న ప్రజ్వలను చూస్తూ నిలబడ్డారాయన.
“ఏమ్మా ప్రజ్వలా.. ఈరోజైనా ఏదైనా ఇంటర్వ్యూ ఓకే అయిందా?” ఆయన గొంతులో గంభీరత ఉన్నా లోలోపల ఒక వెటకారం దాగుంది.
ప్రజ్వల నుదురు రుద్దుకుంటూ భారంగా నిట్టూర్చింది.
“ఊహూ.. లేదు తాతయ్యా, ఈరోజు కూడా మూడు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. ఒక్క చోట కూడా జాబ్ రాలేదు.”
“అవునా? ఎందుకట?”
ప్రజ్వల ముఖంలో చేదు నవ్వు మెరిసింది. “ఒకడేమో ఎక్స్‌పీరియన్స్ కావాలంటాడు.. నీలాంటోడు జాబ్ ఇస్తేనే కదా మాలాంటోళ్లకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేది అంటే సమాధానం ఉండదు! ఇంకొకడు నా క్వాలిఫికేషన్ సరిపోదంటాడు. 
ఇక మూడోవాడైతే.. ‘ఈ రెండూ లేకపోయినా పర్లేదు మేడమ్, నేనే అన్నీ చూసుకుంటాను.. నా మాట వింటే చాలు’ అంటూ ఎక్కడికో చూస్తూ మాట్లాడతాడు! వాడి మొహం మీద ఫైల్ విసిరికొట్టి వచ్చేశాను!”
ఆమె మాటలకు హరిచంద్ర ప్రసాద్ పెదవులపై చిన్న నవ్వు కదిలింది.
“మరి ఇప్పుడేం చేస్తావ్?”
“ఏం చేయాలో అర్థం కావడం లేదు తాతయ్యా.. కానీ నా కాళ్ల మీద నేను నిలబడేవరకు ఈ ప్రయత్నం ఆపను!”ఖచ్చితంగా అంది ప్రజ్వల.
అసలు అంతటి కుబేరుడైన హరిచంద్ర ప్రసాద్‌ను ‘తాతయ్యా’ అని పిలుస్తున్న ప్రజ్వల ఎవరు?
కార్ల కాన్వాయ్‌లు, సేవకులు ఉన్న ఆ రాజభవనంలో ఉంటూ, ఆమె బస్సుల్లో ఆటోల్లో తిరుగుతూ ఉద్యోగం కోసం ఇంతలా ఎందుకు తాపత్రయపడుతోంది?
 ఈ విలాసాల వెనుక ప్రజ్వల తలరాతను శాసిస్తున్న ఇంకేదైనా రహస్య బంధం ఉందా?తెలుసుకోవడానికి తరువాతి ఎపిసోడ్ చదవండి..
ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. అలాగే మీ అమూల్యమైన రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి! మీ ప్రోత్సాహమే నాకు బలం.. థ్యాంక్యూ!