New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
చిత్రగుప్త – 1

చిత్రగుప్త – 1

నిజం నిప్పులాంటిది అని చాలా కథల్లో చదివాము! చాలా మంది నోటి నుండి విన్నాము!

అలాంటి నిప్పు లాంటి నిజాన్ని దాచిన గతాన్ని నువ్వు పాతిపెట్టగలవేమో కాని! నిజాన్ని, నువ్వు చేసిన పాపాన్ని ఎప్పటికీ పాతిపెట్టలేవు!

పాపం చేసి, ఆ నిజాన్ని దాచి, ప్రపంచానికి అబద్ధాన్ని పరిచయం చేస్తే, ఆ పాపపు కర్మ నిన్ను ప్రాయశ్చిత్తం చేసుకునే వరకు వెంటాడుతూనే ఉంటుంది!

అలా వెంటాడే కథే ఈ “చిత్రగుప్త!”

ఈ కథ లో ఉపయోగించిన పాత్రలు, వాటి పేర్లు, ప్రదేశాలు అన్నీ కల్పితాలు మాత్రమే! ఎవరిని ఉద్దేశించబడి రాసినవి కాదు!

హింస ని ప్రోత్సాహించడం కాని, హింస చేసేలా ప్రేరేపించడం కాని ఈ కథ ఉద్ద్యేశం కాదు!

 

◆ ◆ ◆ ◆ ◆

 

సెప్టెంబర్ నెల, మొదటి వారంలో ఆకాశాన్ని చీల్చుకొని వర్షపు చినుకులు నెమ్మదిగా కురుస్తున్నాయి!

 

రాత్రి సమయం! గడియారం పదకొండు గంటలు దాటింది. చీకటిగా ఉన్న ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి.

 

కురుస్తున్న వర్షపు చినుకులు ఇంకా ఇంటి కిటికీ అద్దాలపై జారుతున్నాయి. దూరంగా మెరుపు మెరుస్తుంటే, ఆ వెలుగు క్షణం పాటు గదిని ప్రకాశింపజేసి మళ్లీ చీకటి లోకి నెట్టేస్తుంది.

 

ఒక ఇంట్లో మాత్రం విచిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది. మొదటి అంతస్తు లోని ఒక గది తలుపు, లోపల నుంచి బిగించి ఉంది.

 

గది లోని లైట్లు వెలగడం లేదు. టేబుల్‌ పై ఉన్న చిన్న నైట్ ల్యాంప్ మాత్రమే వెలుగుతుంది. ఆ మసక వెలుతురులో గది మొత్తం అస్తవ్యస్తంగా కనిపిస్తుంది.

 

నేలంతా చిందరవందరగా పడి ఉన్న పుస్తకాలు, చిరిగిపోయిన కాగితాలు ఉన్నాయి!

 

అప్పుడే గాలిలో వేగంగా ఎగురుతూ గోడకు బలంగా తగిలింది ఒక మొబైల్ ఫోన్! స్క్రీన్ పై వెలుగుతున్న వెలుగులు, గోడకు తగలగానే టప్ అంటూ శబ్దం వచ్చి క్రింద పడిపోయింది!

 

అప్పటికే ఆ గోడ దగ్గర క్రింది భాగం లో పగిలిపోయిన ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది!

 

ఆ గది మధ్యలో మంచం అంచున కూర్చుని ఉంది ఒక అమ్మాయి! ఆమె కళ్ళు నిద్ర లేకపోవడం వలన ఎర్రగా ఉన్నాయి!

 

వణుకుతున్న చేతులను బలంగా పట్టుకుంది ఆమె! తన ముఖం లో ప్రశాంతత లేదు!

 

గుండెల్లో ఊపిరి తప్ప ఇంకేమీ మిగల్లేదన్నట్లు శూన్యం లోకి చూస్తుంది ఆ అమ్మాయి! ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉంటుంది!

 

కళ్ల నుంచి కారుతున్న కన్నీళ్లు చెంపలపై జారిపడి నేలపై చినుకుల్లా పడుతున్నాయి. ఆమె ఒక్కసారిగా గట్టిగా అరిచింది.

 

“ చాలు! ఇక నాకు చాలు! “ అంటూ ఎదురుగా ఉన్న టేబుల్‌ ని బలంగా నెట్టేసింది!

 

ఆ టేబుల్ పైన ఉన్న పుస్తకాలు, పెన్ స్టాండ్, వాటర్ బాటిల్ ఒక్కసారిగా నేలపై ఎగిరిపడ్డాయి. అదే టేబుల్ పైన ఉన్న నైట్ ల్యాంప్, దానికి ఉన్న వైర్ సహాయంతో క్రిందకు వ్రేలాడుతూ మెరుస్తూ ఆగిపోతూ ఉంది!

 

క్షణ కాలం చీకటి, క్షణ కాలం వెలుతురు పడుతున్న ఆమె ముఖంలో శూన్యపు ఛాయలు నిండిపోయి ఉన్నాయి!

 

ఆమె ఊపిరి వేగంగా పీలుస్తుంది. తనలో నిండిపోయి ఉన్న ఆవేదన కారణంగా చేతులతో తన జుట్టు పీక్కుంటూ నేలపై మోకాళ్లపై కూర్చుంది.

 

“ ఎందుకు ? నా జీవితానికే ఎందుకు ఇలా జరిగింది ? “ ఆమె గొంతు బలహీనంగా ఉంది! ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్లు అక్కడ ఎవరూ లేరు.

 

కొన్ని క్షణాల తరువాత ఆమె కన్నీటి నుండి కన్నీరు కూడా రావడానికి మొండికేసింది! నెమ్మదిగా పైకి లేచి నిలబడింది ఆ అమ్మాయి!

 

ఇందాక తోసేసిన టేబుల్ కి ఉన్న డ్రాయర్ తెరిచింది ఆమె. ఆ డ్రాయర్ లో సగం వరకు విరిచేసిన బ్లేడ్ ఉంది! వణుకుతున్న చేతులతో ఆ బ్లేడ్ ని పట్టుకొని మణికట్టుపై పెట్టుకుంది!

 

బ్లేడ్ అంచు చర్మాన్ని తాకగానే ఆమె కళ్ల నుంచి మరింతగా కన్నీళ్లు జారాయి. చెయ్యి మరింత వణికింది.

 

కొన్ని క్షణాలు అలాగే నిలబడి, ఒక్కసారిగా బ్లేడ్‌ను దూరంగా విసిరేసింది. టింగ్ అంటూ శబ్దం వచ్చి ఆ బ్లేడ్ గోడను తాకి నేలపై పడింది.

 

“ నాకు చావడం కూడా చేతకాదు! “ కోపంగా అంది ఆమె! ఆ క్షణం ఆమె చూపులు ఆ గదిలోని సీలింగ్ ఫ్యాన్ వైపు పడ్డాయి! మరుక్షణమే బట్టలు వేయడానికి గోడకు అమర్చబడిన తాడు పై పడ్డాయి!

 

ఆ ఆలోచన కూడా ఆమె మనసు కుదురుగా ఉండనివ్వలేదు! తలను బలంగా అడ్డంగా ఊపింది.

 

“ లేదు! “ అని వెనక్కి అడుగు వేసింది. ఆమె ఎదురుగా ఉన్న పెద్ద అద్దం దగ్గరకు నడిచింది.

 

అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని కొన్ని క్షణాలు చూస్తూ నిలబడింది. కళ్ల కింద నల్లటి వలయాలు, చెదిరిపోయిన జుట్టు, ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళు, ఆ ప్రతిబింబాన్ని చూడలేక ఆమె ఒక్కసారిగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్‌ను తీసుకుని బలంగా అద్దంపై విసిరింది.

 

భళ్ళ్ మంటూ అద్దం వందల ముక్కలై నేలపై చెల్లాచెదురైంది. ఆ శబ్దం ఇంటి నిశ్శబ్దాన్ని చీల్చేసింది.

 

ఆ అమ్మాయి ఎవరు ? ఎందుకు ఆమె భాధలో ఉంది ?

ఆమె ఉన్న ఈ పరిస్థితులలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది!

ఇది మొదటి భాగం మాత్రమే! అసలు కథ ముందుంది!

మిగిలిన కథ తరువాయి భాగం లో చదవండి!

 

“ చిత్రగుప్త! “ అనే ధారావాహిక ఈ కథావర్ణిక లో నేను రాస్తున్న మొదటి ధారావాహిక! క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రాస్తున్న ఈ కథ చదివిన తరువాత మీ అభిప్రాయాలను సమీక్షల రూపం లో తెలియజెయ్యండి! ధన్యవాదాలు!

– మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹’