New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రావమ్మా.. మహాలక్ష్మి – 1

రావమ్మా.. మహాలక్ష్మి – 1

తూరుపు వెలుగు రేఖలు పరచుకుంటుంటే.. మరో వైపు పక్షుల కిలకిలా రావాలు సన్నగా వినబడుతుంటే.. లేలేత సూర్య రశ్మి పడి.. తెల్లని పాలరాతి సౌధంలా ఉన్న ఆ ఆధునాతన పాలస్ కొత్త వెలుగులు చిమ్ముతున్నట్టు ఉంది. 

భవంతి చుట్టూ పరిమళ భరిత పొడవైన పూల మాలలు వేలాడదీసి ఉన్నాయి. వాటి పరిమళం గాలిలో వ్యాపించి ఒక మత్తయిన సువాసన ఆ ప్రాంతం అంతా గాలిలో వ్యాపించి ఉంది. 
భవనం ముందు ఒకవైపు లాన్ మరో వైపు ఖరీదైన కార్లు పార్క్ చేయబడి ఉన్నాయి. 
భవనం ఎత్తయిన స్తంబాల మీదుగా గంభీరంగా నిలబడిబట్టు ఎవరినో ఆహ్వానించ డానికి సన్నధ్ధమయినట్టు సర్వాలంకార భూషిత అయి ఉంది. 
భవనం ముందు విదేశాలనుండి తెప్పించిన టైల్స్ తో ఏర్పాటు చేసిన రాచబాట.. 50 మీటర్స్ దూరంలో ఉన్న పెద్ద గేట్ వరకు ఉంది. ఆ బాట మొత్తం గులాబీ రేకులు పరచి ఉన్నాయి. 
ఆ దారంతా అద్భుతమైన వస్త్రాలు ధరించిన సుందరాంగనలు.. తమ చేతుల్లో పూలరేకులు ఉన్న వెండి పళ్లెములు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉన్నారు. 
తలపై పొడుగాటి టోపీలు పెట్టుకున్న మగవాళ్ళు గేట్ ముందుకి వచ్చిన కార్ ని చూసి సైగ చేయగానే పూలరేకులు పట్టుకున్న ఆడవాళ్లు అప్రమత్తం అయ్యారు. 
ఆ భవంతి వైభవానికి ఏమాత్రం తగ్గని ఆ గేట్ తెరచుకోగానే ఒక పొడుగాటి రాజహంస లాంటి కార్ లోపలికి వచ్చి ఆగింది. 
పొడుగు టోపీ పెట్టుకున్న వ్యక్తి వడివడిగా వెళ్లి కార్ డోర్ తెరిచాడు. 
డోర్ తెరవగానే కలువ ఎరుపు రంగు పసిడి వన్నె కలసిన అందమైన పాదం బంగారు అందెల మెరుపుని ద్విగుణీకరించుకుంటూ భూమి ని తాకింది. 
బంగారు రంగు, ఎరుపు కలగలసిన లంగా, వోణి,.. చక్కగా దువ్వి వదిలేసిన కురులు, కాటుక రేఖ యే మన్మధ బాణం తో పోటీ పడుతున్నట్టు ఉన్న కను బొమలు.. వాటి మధ్య వెలుగు చిమ్ముతున్న చిన్న సూరీడు లా నుదుట బొట్టు, గులాబీ రంగు పెదవులపై అరవిరిసిన చిరునవ్వు తో ఒక అమ్మాయి కార్ డోర్ మూసి.. తనకోసం వేచి చూస్తున్న అందరి వైపు నవ్వుతూ చూసింది. 
అంతే ఆమె పై పూల వాన కురిసింది. ఆ పూల వానలో తడుస్తున్న వయ్యారాల మేను అలాగే ముందుకి నడచింది. 
ఆమె నడుస్తుంటే పూలరేకులు ఆమె సొగసులని తడుముతు వగచి నేలపై రంగవల్లులు దిద్దుతున్నట్టు ఉంది. 
ఆమె ముఖంలో సంతోషం దశదిశలు వ్యాపిస్తున్న సూర్య కాంతిని చిన్నబోయేలా చేస్తుంది. 
ఆమె ఆలా ముందుకి వచ్చి భవనం ముందు ఆగగానే.. ఒక అతివ.. ఆమె పై పన్నీర్ చిలకరించగానే.. ఆమె ముఖం ఒక్కసారిగా తడిసిపోయింది. 
ఏయ్ పన్నీర్ కొంచెం చిలకరించాలి.. ముఖం తడిసిపోయేలా కాదు.. అంది ఆమె సుత్తిమెత్తగా. 
ఆఁ ఆఁ.. ఇలానే కలలు కన్నావంటే వేడి నీళ్లు పోస్తా జాగ్రత్త..చిరాగ్గా ఉన్న మాటలు విన్నాక..
ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది ఆమె. 
మసగ్గా ఉన్న దృశ్యం కళ్ళు నులపగానే స్పష్టంగా కనిపించింది ఆమెకి. 
ఖాళీ చెంబుతో కోపంగా నిలబడి చూస్తుంది ఆమె తల్లి సీత. 
చుట్టూ అయోమయం గా చూసి.. పాలస్.. ఫ్లవర్స్.. పన్నీర్.. అంతా కలేనా..? అంది బుంగ మూతి పెడుతూ. 
నీ కలలు మండిపోను.. కాస్త వాస్తవంలో బ్రతకవే.. ఈరోజు చివరి ఎగ్జామ్ మరచిపోయావా.. లేచి రెడీ అవ్వు.. చెoబుడు నీళ్లు పోస్తే గానీ లేవలేదు.. అంటూ విసుక్కుంటూ అక్కడినుంచి వెళ్లిపోతున్న తల్లిని చూస్తూ..
పనీర్ అనుకుంటే.. కుళాయి నీళ్లు పోస్తావా.. బ్లీచింగ్ పౌడర్ వాసన వస్తుంది ఏమిటా అనుకున్నా అప్పుడే.. కలలు కంటున్నా అంటున్నావు కదా.. ఏదో ఒకరోజు నా కల నిజమవక పోదు.. అప్పుడే చెప్తా ఈ మహాలక్ష్మి అంటే ఏమిటో.. అంటూ గడియారం వైపు చూసి.. ఓరినాయనో.. 8 అయిందా.. మరో గంటలో ఎగ్జామ్.. రెడీ అవ్వాలి.. అంటూ మంచం మీంచి దిగి పెరట్లోకి పరుగు తీసింది మహాలక్ష్మి.
స్నానం ముగించుకుని వచ్చేసరికి వంటిట్లో చట్నీ పోపు వేస్తుంది సీత. 
హ్మ్.. అదే కొబ్బరి చట్నీ.. ముందు రోజు గుడికి వెళ్ళక పోతే అదీ ఉండదు.. రెండే రెండు గదుల ఇల్లు.. అదీ మావయ్య దయతలచి తమ పెరటి వైపు ఉన్న ఇంట్లో ఉండనిచ్చాడు కాబట్టి. ఈ ఇంట్లో ఉంటున్నందుకు అత్తయ్య తిట్టే తిట్లు తినడమే వాటిని భరించడమే అద్దె కడుతున్నట్టు.. అమ్మ బట్టలు కుట్టి ఏదో కొంత సంపాదిస్తుంటే రోజులు వెళ్ళదీస్తున్నాం.. అలాంటిది నీకెలాంటి కలలు వస్తాయి మహా.. అని నుదుట స్టికర్ పెట్టుకుని..
అమ్మా.. దోసెలు వేసేసావా.. అసలే పిండి పులుసి పోతుంది.. కొత్త పప్పు నానబెట్టి వేయొచ్చు కదమ్మా.. అంది మహాలక్ష్మి. 
హ్మ్.. ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు.. ఎండలు మండిపోతున్నాయి.. నిన్నే పప్పు రుబ్బింది..అయినా ఈ ఎండలకి పులిసిపోక ఏమవుతుంది.. తినేసి వెళ్ళు.. తినే తిండి ఎంచొద్దు.. అంటూ స్టీల్ ప్లేట్ లో రెండు దోసెలు, చట్నీ వేసి తెచ్చింది సీత. 
నా డిగ్రీ అయిపోతే విష్ణు కి చెప్పి ఏదో ఒక ఉద్యోగం వేయించమంటా..కోనేసుకుందాం ఒక బుడ్డి ఫ్రిడ్జ్.. అంది మహా. 
హా.. చాల్లే.. ముందు ఎగ్జామ్స్ బాగా రాయి చాలు.. విష్ణు ని ఎక్కువ ఇబ్బంది పెట్టకు.. వదిన ఏమైనా అంటుంది మహా.. అన్నట్టు.. వెళ్ళేటప్పుడు భవాని జాకెట్లు కవర్ లో పెట్టి ఇస్తా.. ఇచ్చేసి వెళ్ళవే.. అలాగే పాత బాకీ తో పాటు ఈ జాకెట్ల డబ్బులు కూడా ఇవ్వమని చెప్పు.. అంది సీత చెమటలు తుడుచుకుంటూ. 
అమ్మ.. ఎందుకమ్మ ఆ భవాని జాకెట్లు కుడతావు.. అది డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వదు.. అని నాలుగు ముక్కలు నోట్లో కుక్కుకుని ప్లేట్ సింక్ లో పెట్టింది మహా. 
కడిగేసి వెళ్లొచ్చు కదా.. ఆఁ ప్లేట్ ఎవరు కడుగుతారే.. నువ్వేమైనా మహారాణి అనుకుంటున్నావా..?? అంది సీత. 
తల్లి దగ్గరికి వచ్చి.. ఈలోకం లో తల్లి ఉన్న ప్రతిఒక్కరు మహారాజు, మహారాణి లే గానీ.. అంటూ ఆమె బుగ్గలు పుణికి.. ఆమె కాళ్ళకి నమస్కరిస్తూ.. “ఈరోజు ఎగ్జామ్ బాగా రాసేలా ఆశీర్వదించు..” అంది ఆమె. 
సీత ముఖంలో చిన్న చిరునవ్వు.. అలా వెలిగి మాయమై.. బాగానే రాస్తావ్ లే.. లే.. అంది నవ్వుతూ. 
వెరీ గుడ్.. సందు చివర విష్ణు ఎదురు చూస్తూ ఉంటాడు.. నేను వెళ్ళొస్తా.. అంది మహా.. తన బ్యాగ్ తీసుకుంటూ. 
అయ్యో.. నువ్వు బస్సు లో వెళ్లొచ్చు కదా మహా.. వదిన చూసిందంటే ఎన్ని మాటలు అంటుందో తెలుసు కదా.. వాడు ఉద్యోగానికి వెళ్ళాలి కదా.. అంది సీత. 
అమ్మా.. తల్లి.. నీ మేనల్లుడు ఏమి అరిగిపోడు.. నువ్వేం టెన్షన్ పడకు.. టైం అవుతుంది.. నేను వెళ్ళొస్తా.. అంటూ.. బయటికి నడచి ఆ ఇంటి ముందు ఉన్న పెద్ద ఇంటి పక్కన ఉన్న చిన్న సందులోంచి నడచుకుంటూ ముందుకి వెళ్లి గేట్ తీస్తుండగా…
అమ్మా.. మహా.. అన్న పిలుపు విని వెనక్కి చూసింది మహాలక్ష్మి. 
వరండా లో పేపర్ చదువుతూ కూర్చున్న మేనమామ సురేంద్ర ఆమె వైపు చిరునవ్వు తో చూస్తూ ఉన్నాడు. 
మావయ్య.. గుడ్ మార్నింగ్.. త్వరగా లేచావా.. అంది హుషారుగా మహా. 
నీకీవేళ లాస్ట్ ఎగ్జామ్ కదా.. అల్ ది బెస్ట్ చెబుదాం అని చూస్తున్న.. అన్నాడు సురేంద్ర.
ఓహ్.. మై స్వీట్ మావయ్య.. త్వరగా చెప్పేయ్ మరి.. అంది మావయ్య భుజం మీద తల వాలుస్తూ మహ.
బాగా రాస్తుంది నా బంగారు తల్లి.. అని, సందు చివర ఉంటాను అన్నాడు వాడు.. వెళ్ళు.. బాగా రాయి.. అల్ ది బెస్ట్.. అన్నాడు సురేంద్ర. 
థాంక్స్ మావయ్య.. అంది సంతోషం గా మహా లక్ష్మి. 
ఓకే.. లేట్ అవుతుంది వెళ్ళు.. అన్నాడు సురేంద్ర. 
బాయ్.. అంటూ హుషారుగా వెళ్తున్న మేనకోడలని చూస్తూ.. నీకు, విష్ణు కి పెళ్లి చేయాలని నా కోరిక.. అప్పుడైనా మీ అమ్మ కి మానసిక వేదన తప్పుతుందేమోనని.. కానీ నా భార్య సుప్రజ మాత్రం దీనికి ఒప్పుకోదు.. నా కోరిక ఏ భగవంతుడు తీరుస్తాడో చూడాలి.. అని పైకి చూసి దండం పెట్టుకున్నాడు సురేంద్ర. 
ఇంకా ఉంది