రావమ్మా.. మహాలక్ష్మి – 2
గోవా..దిల్వారా బీచ్ కి కేవలo ఒక కిలోమీటర్ దూరం లో ఉన్న పెద్ద బంగళా అది.
ఎప్పుడూ సంతోషం తాండవించే మహల్ లాంటి ఆ బంగళా లో ఆరోజు విషాదం నాట్యం చేస్తున్నట్టు ఉంది.
ఆరోజు గోవా లో న్యూస్ చానెల్స్, ప్రసిద్ద చానెల్స్ కూడా ఒక్క విషయం గురించే పదేపదే న్యూస్ లైన్ లో వేస్తున్నాయి.
ప్రముఖ వ్యాపార దిగ్గజం, గోవా ని శాసిoచ గలిగే వ్యక్తి ఆనంద్ ప్రతాప్ ఆరోజు తన కుటుంబం తో సహా యాక్సిడెంట్ కి గురయ్యాడు. స్పాట్ లోనే ఆనంద్ ప్రతాప్, అతని భార్య నీలిమ, కొడుకు శరత్ చంద్ర స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు.
ఇక ఆ కుటుంబం లో మిగిలిన ఒకే ఒక వ్యక్తి అంజనీ దేవి, ఆనంద్ ప్రతాప్ తల్లి.
దిల్వారా బీచ్ సమీపంలో ఉన్న ఆ విలాస వంతమైన ఇల్లు విషాద సంకేతం లా మారడానికి అదే కారణం.
విషయం తెలిసి పలకరించడానికి వచ్చే వారి సంఖ్య పెరగడం తో ఆ ప్రాంతం లో రోడ్స్ రద్దీ పెరిగిపోయింది అంటేనే అతను ఎంత ప్రభావిత వ్యక్తో అర్ధం చేసుకోవొచ్చు.
ఇల్లంతా తెల్ల బట్టల్లో తిరిగే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. చావు పలకరింపు వచ్చే వారు తెల్ల బట్టలు వేసుకొని రావడం ఆనవాయితీ అక్కడ.
కొంత మంది ఏడుస్తున్నారు. మరికొంత మంది హడావుడిగా తిరుగుతున్నారు.బయట విశాల ప్రాంగణం లో ఆనంద్, నీలిమ, శరత్ ల మృత దేహాలు ఐస్ బాక్స్ లలో ఉంచారు.
గొప్ప గొప్ప వాళ్లంతా వచ్చి నివాళులు అర్పిస్తున్నారు.
అక్కడ ఉన్న వాళ్లలో బయటికి ఏం మాట్లాడుతున్నా.. వాళ్లలో వాళ్లు చెవులు కొరుక్కుంటున్న విషయం ఒక్కటే.
1000 కోట్ల ఆస్థి… ఆనంద్ కుటుంబం మొత్తం చనిపోయింది.. ఉన్నది వృద్ధాప్యం లో ఉన్న అంజనీ దేవి..మాత్రమే.
ఇంత ఆస్థి.. ఇప్పుడు ఏమవుతుంది.. ఎవరి సొంతం కానుంది..??
గోవాలోని ఆ విశాలమైన బంగళా ప్రాంగణం అంతా శోకసంద్రంలో మునిగిపోయి ఉంటే ప్రముఖుల రాకపోకలతో, ఏడుపులతో, కెమెరాల ఫ్లాష్ లైట్లతో ఆ ప్రాంతం హోరెత్తిపోతోంది.
కానీ, అక్కడి జనాల గుసగుసలు, కళ్ళల్లో కనిపిస్తున్న వింత ఆసక్తి వేరే విషయాన్ని చెబుతున్నాయి. వెయ్యి కోట్ల సామ్రాజ్యం క్షణాల మీద అనాథగా మారిపోయింది.
అంజనీ దేవి తన కొడుకు, కోడలు, మనుమడి మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆమె వయసు, ఆ బాధాకరమైన పరిస్థితిని చూసి అందరూ జాలిపడుతున్నారు. అదే సమయంలో, “ఈ అపారమైన ఆస్తికి ఇప్పుడు వారసులెవరు? వీలునామా రాశాడా లేదా?” అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులోనూ మెదులుతోంది.
ఆనంద్ కి పిన్ని కూతురయిన నిర్మల మాత్రం.. బాధ పడుతున్నట్టే పడుతూ.. ఆనంద్ కి తాను చెల్లెల్ని అవుతానని అందరితో చెప్పకనే చెబుతోంది. తదుపరి ఆ ఆస్థి కి వారసత్వం నాదే అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అది.
ఆనంద్ కి దూరపు సంభందం ఉన్న వాళ్లు కూడా అప్పుడే హల్చల్ చేస్తున్నారు.
70 ఏళ్ళ అంజనీ దేవి వద్దకి 50 ఏళ్ళ వ్యక్తి వెళ్లి..
అమ్మా.. అంత్యక్రియలు జరిపించాలి.. మీరు.. అంటూ ఆగిపోయాడు.
ఆమె ముడతలు పడిన తన ముఖం లో కన్నీళ్లు తుడుచుకుని.. ఏకాంబరం.. వీర్ ఎక్కడ?? అంది గంభీరంగా.
ఆ మాట విన్న నిర్మల ముఖం వెలిగిపోయింది.
అందర్నీ తోసుకుంటూ మరీ వచ్చి.. పెద్దమ్మ.. వీర్ ఎయిర్పోర్ట్ లో దిగాడు.. వస్తున్నాడు.. ఫోన్ లో మాట్లాడాను.. పాపం చాలా బాధ పడుతున్నాడు.. అంది నిర్మల.
అంజనీ దేవి కళ్లలోకి చూస్తూ నిర్మల చెప్పిన ఆ ఒక్క పేరుతో ఆ పెద్ద హాలులో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
”వీర్…”
ఆ పేరు వినగానే అక్కడ ఉన్న బంధువుల ముఖాలు మారిపోయాయి. గుసగుసలు మరింత పెరిగాయి.
ఏకాంబరం.. వీర్ అంత్యక్రియలు చేస్తాడు.. అని చెప్పి,
నిర్మల వైపు చూసి, వీర్ రాగానే నా గదిలోకి రమ్మని చెప్పు.. అని గంభీరంగా చెప్పి..
విగతజీవులుగా పడి ఉన్న తన కుటుంబం వైపు ఒకసారి బాధగా చూసి.. భుజాన వేలాడుతున్న శాల్ ని సరిచేసుకుంటూ బాధని గుండెల్లో అణచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అంజనీదేవి.
అంజనీ దేవి గదిలోకి వెళ్లిపోవడంతో ఆ హాలులో మళ్ళీ గుసగుసలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి.
”వీర్… అసలు ఈ వీర్ ఎవరు? ఆనంద్ ప్రతాప్ కి అతను ఏమవుతాడు? వీడు ఎక్కడినుంచి ఊడిపడ్డాడు?” బంధువుల మధ్య చర్చలు వేడెక్కాయి. కొంతమందికి వీర్ గురించి తెలుసు, మరికొంతమందికి అస్సలు తెలియదు. ఆనంద్ ప్రతాప్ వ్యాపార సామ్రాజ్యం మీద కన్నేసిన వాళ్ళందరికీ ఈ ‘వీర్’ ఎంట్రీ మింగుడుపడలేదు. ముఖ్యంగా ఆస్తిలో వాటా కోసమని ముందుగానే ప్లాన్ చేసుకుంటున్న నిర్మల ముఖంలోని ఆనందం ఒక్కసారిగా పెల్లుబికింది.
సరిగ్గా అప్పుడే… ఆ బంగ్లా గేటు దగ్గర ఒక ట్యాక్సీ వచ్చి ఆగింది. కారు దిగగానే అందరి చూపులు ఆ యువకుడి మీద పడ్డాయి.
పొడవుగా, గంభీరమైన రూపంతో, కళ్లలో తీవ్రమైన విషాదం, అదే సమయంలో ఏదో కోపం కలగలిసిన ఆకారంతో ఉన్న ఆ యువకుడే… వీర్!
వీర్ నేరుగా లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. బయట ఐస్ బాక్స్ లలో విగతజీవులుగా పడి ఉన్న ఆనంద్, నీలిమ, శరత్ ల మృతదేహాలను చూసి అతని గుండె పగిలినంత పనైంది. కళ్ల వెంట నీళ్లు కారుతున్నా, వాటిని బలవంతంగా ఆపుకుంటూ అడుగులు వేసాడు.
అతన్ని చూసిన బంధువులు వింతగా చూస్తుంటే, నిర్మల మాత్రం పైకి పరామర్శించేలా నటిస్తూ దగ్గరకు వెళ్లబోయింది. కానీ వీర్ ఎవరి వైపు కూడా కన్నెత్తి చూడలేదు.
అదే సమయంలో మెట్ల మీద నుంచి కిందకి వస్తున్న ఏకాంబరం వీర్ ని చూసి దగ్గరకు వచ్చాడు.
”బాబాయ్…” అని గొంతు పూడిపోతుంటే అడిగాడు వీర్.
ఏకాంబరం అతని భుజం మీద చేయి వేసి, “అమ్మగారు లోపల నీకోసమే ఎదురుచూస్తోంది బాబూ.. వెళ్లు..” అన్నాడు.
వీర్ ఎవరితోనూ మాట్లాడకుండా, సూటిగా అంజనీ దేవి గది వైపు నడిచాడు. తలుపు తట్టి లోపలికి వెళ్ళేసరికి… మంచం మీద కూర్చుని కన్నీరు తుడుచుకుంటున్న అంజనీ దేవి కనిపించింది
వీర్ ని చూడగానే ఆమె కళ్లలో జీవం వచ్చింది. ఆ వృద్ధాప్యంలోనూ ఆమె గొంతులో అంతులేని ధైర్యం ఉట్టిపడింది.
”వచ్చావా వీర్…” అంటున్న ఆమె దగ్గరికి అమ్మమ్మ అంటూ వెళ్లబోయిన వీర్ ని ఆపుతూ, ఆమె గంభీరంగా అంది-
”బాధ కాదు వీర్. ఇప్పుడు ఏడాల్సిన సమయం కాదు. ఈ కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకువచ్చిన వాళ్ళు ఎవరో తేల్చాల్సిన సమయం. ఆనంద్ మరణం కేవలం యాక్సిడెంట్ కాదు… ఒక పెద్ద కుట్ర!”
అంజనీ దేవి మాటలకు వీర్ షాక్ అయ్యాడు. అతని కళ్లలో కన్నీళ్లు ఇంకిపోయి, మంటలు కక్కసాగాయి.
పోలీసులు ఎంక్వయిరీ చేస్తారు.. నాకు తెలుసు.. నా కొడుకు, కోడలు, మనవడి మరణానికి కారణం అయిన వాళ్ళు ఎవరైనా సరే.. నాకు తెలియాలి వీర్.. ఈ వయసులో నా కట్టెకి ఆనంద్ తో చితి పెట్టించుకోవాలి.. కానీ.. నా బిడ్డ చలనం లేకుండా.. వాడి భార్య, బిడ్డ తో ఉన్నాడు.. ఇలా వాళ్ళని చూడటానికి భగవంతుడు నన్ను ప్రాణాలతో ఎందుకు ఉంచాడో అర్ధం కావడం లేదు.. అంటూ వీర్ గుండె పై తల పెట్టి ఏడవసాగింది అంజనీ దేవి.
ఆమె తల నిమురుతూ.. అమ్మమ్మ.. వాళ్లు ఎవరైనా సరే తెలుసుకుని తీరతాను.. వదిలిపెట్టను.. ఎట్టి పరిస్థితులలోను వదిలిపెట్టను.. అన్నాడు వీర్.
వీర్.. వాళ్లు ఎవరైనా సరే.. నా ఆనంద్ కి వారసత్వం లేకుండా చేద్దాం అనుకున్నారు.. కింద ఏడుస్తున్న వాళ్లు.. నీ తల్లితో సహా.. అందరూ ఆస్తికోసమే ఏడుస్తున్నారు.. అది నన్ను ఇంకా బాధిస్తుంది.. అంది అంజనీదేవి.
ఇంకా ఉంది
Swipe left/right or tap the sides to turn pages