New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
చిత్రగుప్త – 3

చిత్రగుప్త – 3

::: మూడవ భాగం :::

 

పది నెలల తరువాత!

 

జూన్ నెల! చివరి రోజు! ఉదయం తొమ్మిది గంటల సమయం! హైదరాబాద్ నగరానికి పది కిలో మీటర్ల దూరం లో ఉన్న ఊరు అది!

 

రాత్రంతా కురిసిన వర్షం తర్వాత ఆకాశం నెమ్మదిగా తేలికపడుతోంది. తెల్లటి మేఘాల మధ్య నుంచి సూర్యుడు తొంగి చూస్తున్నాడు. తడి నేల నుంచి వస్తున్న మట్టి వాసన గాలిలో కలిసిపోయింది.

 

వైశాలి ఇంజినీరింగ్ కాలేజ్ అనే బోర్డు పెద్ద అక్షరాలాతో ఉంది!

 

సుమారు మూడు వేల మంది విద్యార్థులతో ఎప్పుడూ సందడిగా ఉండే ఆ క్యాంపస్, ఈరోజు మాత్రం అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది.

 

దానికి కారణం బి.టెక్ మూడో సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్ష ఈరోజే ఉండడం!

 

కాలేజ్ ప్రధాన గేటు ముందు విద్యార్థులు చిన్న చిన్న గుంపులుగా నిలబడి చివరి నిమిషంలో పుస్తకాలు తిరగేస్తున్నారు.

 

“ ఏయ్! ఫోర్త్ యూనిట్ చూసావా ? ఎంత చదివినా అర్థం కావడం లేదు నాకు! “ అంది ఒక అమ్మాయి పుస్తకం పట్టుకొని!

 

“ క్లాస్ విన్నాక చెప్పాల్సింది, ఎగ్జాం కి ముందు చెబుతున్నావు! “ నవ్వింది ఆమె ఫ్రెండ్.

 

“ నాకు అవన్నీ తెలియదు! ఎగ్జాం గంటలో అవగోట్టేసి వచ్చేస్తాను! నేను వచ్చేవరకు నువ్వు లైన్ లో ఉండు! అసలే బాస్ సినిమా! టికెట్స్ దొరకవు! “ అంటూ ఫోన్ లో మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు ఒకడు!

 

“ ఆ ఫార్ములా ఒక్కసారి గుర్తు చేయు! “ ఆ పక్కనే చెట్టు క్రింద ఉన్న గుంపులో నుండి ఒకడు అన్నాడు.

 

ఆ క్యాంపస్ లోని ప్రతి మూలలో ఇదే హడావిడి వినబడుతుంది! కొందరి ముఖాల్లో ఆత్మవిశ్వాసం, మరికొందరి ముఖాల్లో భయం! ఇంకొందరు మాత్రం పాస్ అయితే చాలు అనే భావంతో నవ్వుకుంటున్నారు.

 

కాలేజ్ భవనం రెండో అంతస్తులో, హాల్ నంబర్ టు జీరో ఫోర్ లోని విద్యార్థులు ఒక్కొక్కరిగా తమ తమ సీట్లలో కూర్చుంటున్నారు.

 

ఇన్‌విజిలేటర్ గంభీరంగా నిలబడి వాళ్ళను చూస్తున్నాడు!

 

“ అందరూ హాల్ టికెట్లు డెస్క్ మీద పెట్టండి. క్విక్! “ అంటూ కళ్ళజోడు పెట్టుకున్న ఆ ఇన్విజిలేటర్ అనగానే చుట్టూ కుర్చీలు కదిలే శబ్దాలు, పేపర్లు తిప్పే శబ్దాలు, ఫ్యాన్లు తిరిగే మోత, మొత్తం హాల్‌ లో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది.

 

అప్పుడే హాల్‌ లోకి నవ్వుకుంటూ ఏడుగురు కలిసి వచ్చారు. వాళ్లను చూసిన వెంటనే కొందరు చిరునవ్వు నవ్వుకున్నారు.

 

“ వచ్చేశారు! మన సెవెన్ వండర్స్! “ అంటూ వెనక నుండి ఎవరో అన్నారు!

 

ఆ మాట వినగానే వాళ్ళ వైపుగా చూసాడు ఆ ఇన్విజిలేటర్!

 

“ సెవెన్ వండర్స్ ఆ ? తోడ కొడితే వచ్చే థండర్స్ ఏం కాదు! అయినా ఎగ్జాం కి ఆలస్యంగా వస్తే నేను అలో చేయను! ఎవర్ని తీసుకొస్తారో తీసుకురండి! “

 

“ మీలాంటి గట్స్ ఉన్న ఇన్విజిలేటర్ కి ఎదురుగా గేట్స్ దాటుకొని ఎవరైనా వస్తారా సర్! “ ఆ గ్యాంగ్ నుండి రెండు అడుగులు ముందుకు వేసి వచ్చాడు ఒకతను! అతనే ధృవ్!

 

ఎత్తుగా, ప్రశాంతమైన చిరునవ్వుతో, ఎలాంటి పరిస్థితిలోనైనా కూల్‌గా ఉండే వ్యక్తి.

 

“ ఓహో! “ ధృవ్ చెప్పిన మాటలు వినగానే సంబరపడిపోయాడు ఆ ఇన్విజిలేటర్!

 

“ సరే సరే! వెళ్లి కూర్చోండి! టైం అవుతుంది! “ అంటూ అతను అనగానే ఏడుగురు చిన్నగా నవ్వుకొని తమ చైర్స్ లో తాము కూర్చున్నారు! కాని వారి మధ్యలో ఒక చైర్ మాత్రం ఖాళీగా ఉంది!

 

ఇన్విజిలేటర్ క్వషణ్ పేపర్స్ ఇవ్వగానే మిగిలిన ఆరుగురి చూపులు మధ్యలో కూర్చున్న అమ్మాయి పైన పడ్డాయి! ఆమె పేరే మోక్ష!

 

చలాకీగా నవ్వుతూ అందరినీ ఆటపట్టించే అమ్మాయి. చదువులో అందరికన్నా ఒక మెట్టు పైనే ఉంటుంది! అప్పుడప్పుడు తనలో ఉన్న మాస్ యాంగిల్ బయటకు వస్తుంది! ఆ టైం లో ఆమెను ఫైర్ బ్రాండ్ అని తమాషాకి అంటాడు ధృవ్!

 

“ చూడండి! ఒకరి దాంట్లో ఒకరు చూసి రాసే ఆలోచన పెట్టుకోకండి! ఎందుకంటే మీకు ఇచ్చినవి త్రీ సెట్స్! ఏ, బి, సి! వెనక, ముందు వేరు వేరు సెట్స్ ఉంటాయి! దెబ్బడిపోతారు! “ అంటూ ఇన్విజిలేటర్ అనగానే మోక్ష చిన్నగా నవ్వింది!

 

“ సర్! ఇది మా ఫస్ట్ ఎగ్జాం కాదు! లాస్ట్ ఎగ్జాం! అవన్నీ మాకు తెలుసు! “ వెనక నుండి ఎవరో అరిచారు!

 

“ మావా! మొదలుపెట్టు! “ అంటూ అతని పక్కనే కూర్చున్న వ్యక్తి ని చూసాడు ధృవ్!

 

“ అడిషనల్! “ అంటూ చెయ్యి ఎత్తాడు ఆ ఏడుగురిలో ఒకడైన వంశీ!

 

ఎప్పుడూ ఏదో ఒక ప్లాన్‌తో ఉండే తెలివైన కుర్రాడు వంశీ. అతను అడిషనల్ అనగానే ఇన్విజిలేటర్ తో పాటుగా అందరూ వంశీ ని అదోరకంగా చూసారు!

 

“ అడిషనల్ ఏందిరా! నీకు బుక్ లేట్ ఇచ్చాను కదా. పది నిమిషాలలో పంచాంగం రాసావా ఏంది! “ అంటూ అతని బుక్లెట్ ని తీసుకొని చూస్తున్నాడు ఇన్విజిలేటర్!

 

అదే సమయంలో అన్విత బి అన్నట్టుగా గాలిలో రాసింది! ధృవ్ ఏ అన్నట్టుగా సైగ చేసాడు! అతనితో పాటుగా వచ్చిన మిగిలిన వారు కూడా తమ సెట్స్ ని గాలిలో రాసి చెప్పారు!

 

“ మొదటి పేజి ఒకటే రాసావు! పేజీలు  తిప్పాలని తెలియదా! “ అంటూ ఆ బుక్ లేట్ ని వంశీ కి ఇచ్చేసాడు అతను.

 

“ అవునా సర్! చిన్న పిల్లాడిని! మీరు నేర్పించారు కదా! నేర్చుకుంటాను! “ అమాయకంగా అన్నాడు వంశీ!

 

ఆ సమయంలో మిగిలిన ఆరుగురు తమ బుక్లెట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు!

 

ఇంకో వైపు తన కాలి కింద దాచిన చిన్న చిట్టి ని చెప్పు లోపల నుంచి కొద్దిగా బయటికి లాగి చూసి, వెంటనే మళ్లీ దాచేశాడు సంజయ్.

 

చివరి నిమిషంలో కష్టపడి పాస్ అయ్యే టాలెంట్ ఉన్నవాడు. అంటే చిట్టీలు రాయడంలో పడే కష్టం అది!

 

వాళ్ళతో పాటుగా తేజ, అఖిల్ మరియు మేఘన ముగ్గురు కూడా ఆ ఎగ్జాం తో కుస్తీ పడుతున్నారు!

 

ధృవ్, మోక్ష, వంశీ, సంజయ్, తేజ, అఖిల్ మరియు మేఘన ఈ ఏడుగురి గ్యాంగ్ కి ఉన్న పేరు ది సెవెన్ వండర్స్! ఆ పేరు మొత్తం కాలేజ్‌లో ఫేమస్!

 

చివరి పది నిమిషాల సమయం ఉంది అనగా వంశీ తన చైర్ నుండి పైకి లేచి,  “ ఐ ఫినిష్డ్ మై థర్డ్ ఇయర్ సర్! “ అంటూ బిగ్గరగా అరిచాడు! బెదిరిపోయినట్టుగా చూసిన ఇన్విజిలేటర్ అతని దగ్గరకు వచ్చాడు!

 

“ ఎందుకురా అలా అరిచావు ? “

 

“ థర్డ్ ఇయర్ ఫినిష్ చేసాను అన్న గర్వం సర్! “

 

“ ఎగ్జాం రాస్తే ఫినిష్ అవ్వదు! ఎగ్జాం లో పాస్ అయితే ఫినిష్ అవుతుంది! ఆ పేపర్ ఇలా ఇచ్చి బయటకు చావు! “ అంటూ అతని చేతిలోని బుక్లెట్ ని తీసుకున్నాడు ఇన్విజిలేటర్! ఆ సమయంలో ఎవరి బుక్లెట్స్ వాళ్ళు మార్చుకున్నారు.

 

అదే సమయంలో ఆ కాలేజి గేటు దగ్గర నిలబడిన వాచ్ మెన్ తన చేతికి ఉన్న వాచ్ లో సమయం చూసుకుంటున్నాడు!

 

సరిగ్గా రెండు గంటల యాభై నిమిషాలు! ఇంకో పది నిమిషాలలో స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్స్ నుండి బయటకు వస్తారు అని, క్లోస్ చేసిన గెట్ ని తెరిచే పనిలో ఉన్నాడు అతను!

 

అప్పుడే అక్కడికి ఒక డెలివరీ బాయ్ బైక్ పైన వచ్చి ఆగాడు! ఆ బైక్ కి వెనక భాగం లో ఒక పెద్ద బ్యాగ్ ఉంది!

 

అతను బైక్ ని ఆ కాలేజీ  గేటు ముందు ఆపి, క్రిందకు దిగి, వెనక బ్యాగ్ నుండి ఒక పెద్ద బాక్స్ తీసి పట్టుకున్నాడు!

 

“ ఏంటయ్యా! అమెజాన్ ఆ ? లేక పోస్ట్ ఆ ? “ అడిగాడు వాచ్ మెన్!

 

“ లేదు తాత! ఇది కొరియర్ సర్విస్! ఒక బాక్స్ పార్సిల్ వచ్చింది! “ అంటూ అన్నాడు డెలివరీ బాయ్!

 

“ ఇన్ని వందల మంది ఉన్న ఈ కాలేజి లో ఎవరి పేరని గుర్తు ఉంటుంది నాకు! “

 

“ టు ది సెవెన్ వండర్స్ అని ఉంది తాత! “

 

“ సెవెన్ వండర్స్ ఆ! అయితే ఇలా ఇవ్వు! వాళ్ళు నాకు బాగా తెలుసు! నాకేంటి కాలేజి మొత్తానికి తెలుసు! “ అంటూ అతను అనగానే ఆ బాక్స్ ని ఇచ్చాడు డెలివరీ అతను.

 

“ ఇక్కడ సంతకం పెట్టు తాత! “

 

“ ఇక్కడనా! “ అంటూ సంతకం పెట్టాడు వాచ్ మెన్! ఆ పేపర్ తీసుకొని బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి!

 

చతురస్రాకారం లో ఉన్న బాక్స్ పొడవు ఎత్తు ఒక ఫీట్ సైజు లో ఉంటుంది! ఆ బాక్స్ అంతగా బరువుగా లేదు!

 

“ ఏమై ఉంటుంది ఇది! “ అంటూ ఆ బాక్స్ ని ఊపి చూసాడు! లోపల ఏవో ఊగుతున్నట్టు అనిపించింది! ఆ బాక్స్ ని గేటు పక్కనే ఉన్న చిన్న కిటికీ దగ్గర ఉంచాడు వాచ్ మెన్!

 

ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏముంది ?

తరువాయి భాగం లో చదవండి!

 

“చిత్రగుప్త!“ అనే ధారావాహిక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రాస్తున్నాను! ఈ కథ చదివిన తరువాత మీ అభిప్రాయాలను సమీక్షల రూపం లో తెలియజెయ్యండి! ధన్యవాదాలు!

– మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹’