చిత్రగుప్త – 2
ఆ ఇంటి బయట పడుతున్న వర్షం. ఆ వర్షంతో పాటుగా ఉరుములు మెరుపుల శబ్దాలు ఆ ప్రాంతాన్ని నింపేసాయి!
ఆ ఇంట్లో ఒక గదిలో భాధగా మరియు భయంగా నిలబడి ఉన్న ఆ అమ్మాయి చెవులకు ఆ ఉరుముల శబ్దాలు వినబడ్డాయి!
ఆమె తన గది తలుపు నెమ్మదిగా తెరిచింది. మెట్లపై నుంచి వేగంగా కిందికి పరుగెడుతూ వెళ్లి హాల్ లో నిలబడింది!
ఆ క్షణం ఆమె చూపులు హాల్ లోని టీవి సెట్ దగ్గర ఉన్న ఫోటో ఆల్బం పైన పడ్డాయి!
ఆ ఫోటో ఆల్బం లో తల్లి మరియు తండ్రి మధ్యలో వాళ్ళ భుజాలపై చెయ్యి వేసి నవ్వుతూ నిలబడింది ఆ అమ్మాయి! ఆ క్షణం తన తండ్రి మాటలు ఆమె మదిలో వినబడ్డాయి!
“ ఛీ! నీలాంటి కూతురు నాకు పుట్టకపోయి ఉంటే బావుండేది! ఎందులో అయినా పడి చావు! “
“ నన్ను క్షమించండి నాన్న! బ్రతికి ఉండి మీకు చెడ్డపేరు వచ్చేలా చేయడం కన్నా చనిపోయి నేను ఉన్నాను అని అందరూ మర్చిపోవడం మంచిది! “ అంటూ దీర్ఘంగా శ్వాస తీసుకొని ఆ ఇంటి గుమ్మం తెరిచింది ఆ అమ్మాయి!
ఆకాశం లో మెరిసిన మెరుపు ఆమె ముఖంపై వెలుగులను పంచింది! ఆ ఇంటి నుండి బయటకు అడుగులు అడుగులు వేస్తూ, నెమ్మదిగా ఆ అడుగుల వేగాన్ని పెంచుతూ పరిగెత్తడం మొదలుపెట్టింది ఆమె!
చల్లని గాలి ఆమె ముఖాన్ని బలంగా తాకుతుంది. వర్షపు చినుకులు జుట్టును తడిపేస్తున్నాయి. అయినా ఆమె అడుగులు ఆగలేదు.
ఆ రాత్రి రోడ్లు దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి. అక్కడక్కడా వీధి దీపాల వెలుగు మాత్రమే తడి రోడ్డుపై పసుపురంగు చారల్లా పరుచుకుంది. దూరంగా ఒక కుక్క మొరుగుతుంది.
ఆమె కళ్లలో కన్నీళ్లు, ముఖంపై వర్షపు నీళ్లు! ఏది ఏంటో తేల్చలేనంతగా కలిసిపోయాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది.
ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ, ఆమె మనసులోని బాధ మరింత భారంగా మారుతుంది.
కొన్ని కార్లు వేగంగా దూసుకెళ్తూ నీటిని చిమ్ముకుంటూ వెళ్లిపోయాయి. సరిగ్గా పది నిమిషాల పాటుగా ఆగకుండా పరిగెత్తిన ఆమెకు, చివరి మజిలీగా ఆ ఊరి చివరలో ఉన్న పాత వంతెన కనిపించింది.
ఆ వంతెన చివరన నిలబడి క్రింద పారుతున్న నీటిని చూసింది ఆమె!
కానీ గాలి మాత్రం మరింత వేగంగా వీస్తుంది. వంతెన కింద నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నీరు రాళ్లను ఢీకొడుతూ చేస్తున్న శబ్దం అక్కడున్న నిశ్శబ్దాన్ని చీల్చేస్తుంది.
వర్షం లో తడుస్తున్న ఆమె తన రెండు చేతులను బలంగా బిగించి, కళ్ళను గట్టిగా మూసుకుంది!
కొన్ని క్షణాలలోనే గాలిలో తేలుతున్న అనుభూతి ఆమెను తాకింది! అప్పటికే ఆమె వంతెన నుండి ముప్పై అడుగుల దిగువన ఉన్న నీటిలో దూకేసింది!
వేగంగా ఆమె శరీరం నీటిని తాకగానే నీరు ఎగిసిపడింది. అలలు కొద్దిసేపు ఉధృతంగా ఉప్పొంగాయి! ఆమె శరీరం నీటిలో మునిగిపోయింది!
మరుసటి రోజు ఉదయం! ఉదయం ఆరు గంటల సమయం!
వర్షం పూర్తిగా ఆగిపోయింది. మేఘాల మధ్య నుంచి సూర్యకిరణాలు బయటకు తొంగిచూస్తున్నాయి.
నది ఒడ్డున ఇద్దరు జాలర్లు తమ వలలను సిద్ధం చేసుకుంటున్నారు.
“ రాత్రి వర్షానికి కొట్టుకొచ్చిన ఒక్క చేప అయిన పడడం లేదురా సామి! “ అంటూ నిరాశగా అన్నాడు ఒకతను!
అతని మాటలు వింటూ ఉన్న మరోకతని చూపులు ఎడమ వైపుగా ఉన్న ఒడ్డున మనిషి ఆకారం పైన పడ్డాయి!
“ అరే! అక్కడ ఏదో ఉన్నట్టుంది! శవమా ఏంటి కొంపతీసి ? “ కంగారుగా అన్నాడు అతను.
ఇద్దరూ జాగ్రత్తగా ఆ ఒడ్డు భాగానికి దగ్గరకు వెళ్లారు.
ఆ నీటి ఒడ్డున సగం వరకు నీళ్ళలో ఉన్న శరీరం నెమ్మదిగా కదులుతూ ఉంది!
“ ఎవరో అమ్మాయి! “ అంటూ భయంగా దూరంగా చూస్తూ, ఒడ్డున దూరంలో ఉన్న కొందరిని పిలిచారు వారిద్దరు!
కొద్ది నిమిషాల్లో అక్కడ జనాలు గుమికూడారు. ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు.
పదిహేను నిమిషాల తర్వాత రెండు పోలీస్ జీపులు సైరన్ మోగిస్తూ అక్కడికి చేరుకున్నాయి.
ఆ జీబుల నుండి క్రిందకు దిగిన కానిస్టేబుళ్లు జనాన్ని పక్కకు నెట్టుకుంటూ ఒడ్డుకు వెళ్లి చూసారు!
“ ఏయ్! వెనక్కి జరగండి! ఎవరూ కూడా దగ్గరకు రావద్దు! వస్తే మాములుగా ఉండదు చెబుతున్న! “ కోపంగా అన్నాడు కానిస్తేబుల్ భద్రం!
వాళ్ళ మధ్యలో నుండి నడుస్తూ అక్కడికి వచ్చాడు ఆ ఏరియా ఎస్. ఐ రత్నం!
నీటిలో గంటల తరబడి ఉండటంతో శరీరం పూర్తిగా ఉబ్బిపోయింది. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
అక్కడున్న వారిలో చాలా మంది చూపు తిప్పుకున్నారు. కొంతమంది మౌనంగా నిలబడ్డారు.
ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు మరియు చెవులకు ఉన్న జూకాలు, కాళ్ళకు ఉన్న పట్టగొలుసులు చూస్తూ అక్కడ చుట్టూరా పరిశీలించాడు రత్నం!
“ నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది సర్ ఈ అమ్మాయి! ఇందులో అంత ఆలోచించేది ఏముంది ? “ అన్నాడు భద్రం!
“ నువ్వు చెప్పేది నిజమే భద్రం! కాని నాకు ఏ కేసు అయినా మర్డర్ కేసు లాగే అనిపిస్తుంది! సరే హాస్పిటల్ కి తరలించండి! పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక చూద్దాం! “
“ అలాగే సర్! “
“ దానితో పాటుగా ఈ చుట్టు ప్రక్కల ఉన్న స్టేషన్స్ లో ఎవరైనా అమ్మాయి మిస్ అయినట్టుగా కంప్లేంట్ వచ్చిందేమో చూడండి! “ అంటూ రత్నం అనగానే సరే అన్నట్టుగా తలూపాడు భద్రం!
చనిపోయిన అమ్మాయి ఎవరు ? ఆమె చావుకు గల కారణం ఏంటి ?
మిగిలిన కథ తరువాయి భాగం లో చదవండి!
“ చిత్రగుప్త! “ అనే ధారావాహిక ఈ కథావర్ణిక లో నేను రాస్తున్న మొదటి ధారావాహిక! క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రాస్తున్న ఈ కథ చదివిన తరువాత మీ అభిప్రాయాలను సమీక్షల రూపం లో తెలియజెయ్యండి! ధన్యవాదాలు!
– మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹’
Swipe left/right or tap the sides to turn pages