రావమ్మా.. మహాలక్ష్మి – 3
అమ్మమ్మ… ఊరుకో.. నువ్వే ధైర్యం కోల్పోతే.. ఎలా?? అన్నాడు వీర్.
వీర్..ఏ ఆడదానికి అయినా తండ్రి, భర్త, కొడుకు, మనవడు ధైర్యం అవుతారు.. కానీ నేను.. వాళ్లందర్నీ కోల్పోయాను.. నా మనసు ఇంకా ఈ విషయం నమ్మలేక పోతుంది.. ఇకపై.. ఆనంద్ పిలుపు వినపడదు.. నా మనవడి మాట నా చెవికి చేరదు. నా కోడలు నీలిమ సందడిగా తిరిగేది.. ఈ ఇల్లే శూన్యం అయిపోతుంది వీర్.. అంది బాధగా అంజనీ దేవి.
అమ్మమ్మ.. జరిగింది ఘోరం.. దారుణం.. నేను.. నేను ఇదేది మార్చలేను కామోసు.. కానీ నేను ఉన్నాను అమ్మమ్మా.. నీకోసం.. నువ్వు ధైర్యం గా ఉండు.. అమ్మమ్మ.. జరగాల్సిన కార్యక్రమం జరిపించాలి.. వీడ్కోలు చెప్పక తప్పదు.. అన్నాడు వీర్.
వీర్.. ఆనంద్ ని ఆఁ స్థితిలో చూడలేకున్నాను.. వాడికెవరు లేరన్నట్టు కాదు.. నువ్వు.. నువ్వు.. వాడిని పంపించిరా వీర్.. నువ్వే.. అంత్యక్రియలు చేయాలి.. అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది అంజనీ దేవి.
అంత వరకు గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ సంభాషణ విన్న నిర్మల ఆనందంగా.. ముసల్ది వీర్ వీర్ అంటోంది… ఇక డౌట్ లేదు.. ఆనంద్ అన్నయ్య సామ్రాజ్యానికి ఇక నా కొడుకే యువరాజు.. నేను మహా రాణి.. అని సంతోషం తో చిందులేసింది.
వీర్.. వెళ్ళు.. జరగాల్సింది చూడు.. వెళ్ళు వీర్.. అంది అంజనీ దేవి.
కానీ అమ్మమ్మ నువ్వు కూడా ఉంటే.. అన్నాడు వీర్.
వద్దు వీర్.. నా గుండె తట్టుకోలేక పోతుంది.. నా ఆనంద్.. ని శాశ్వతం గా ఈ ఇంటినుండి పంపడం.. నా వల్ల అయ్యే పని కాదు.. వాడు ఏ విదేశాల్లో ఉన్నాడని అనుకుంటాను.. అంటూ చీర కొంగు నోట్లో కుక్కుకుని ఏడవసాగింది ఆమె.
ఆమె వైపు బాధగా చూసి.. అక్కడ్నించి వెళ్ళిపోయాడు వీర్.
ఆరోజు సాయంత్రం కాకముందే అత్యంత వైభవం గా ఆనంద్ కుటుంబం అంత్యక్రియలు జరిగాయి.
న్యూస్ చానెల్స్ లో వారసుడు ఎవరు.. అంటూ న్యూస్ లు వస్తూనే ఉన్నాయి.
** ** *** ** **
ఎగ్జామ్ పూర్తి కాగానే కాలేజీ నుంచి బయటికి వస్తున్న విద్యార్థుల నవ్వులతో సందడిగా ఉన్నది ఆ ప్రాంతం.
రంగు రంగుల సీతాకోక చిలుకల్లా ఉన్న అమ్మాయిలు.. గండు తుమ్మెద ల్లా ఉన్న అబ్బాయిల హడావుడి అంతా ఇంతా కాదు.
ఏమిటే ఆ ప్రశ్న.. అస్సలు ఎక్సపెక్ట్ చేయలేదు.. అది చదవనే లేదు.. ఒక్కసారి ఏం రాయాలో తెలియలేదు అనుకో.. అంటూ పక్కన ఉన్న స్నేహితురాలితో అంది మహా.
అయితే రాయకుండా వదిలేసావా మహా.. అంది ఆ స్నేహితురాలు.
హా.. మహా ఇక్కడ.. రాయకుండా వదిలేయడం ఏంటి.. రాసాను.. అంది నడుస్తూనే మహా.
ఒక్క అడుగు.. ఆగి, రాసావా… రాదు అన్నావ్ కదే.. అంది ఆ స్నేహితురాలు.
ఆగిపోకూడదు.. ఆగిపోకూడదు కదే.. అందుకే ఆ ప్రశ్న కి సమాధానం రాకున్నా.. నాకు తెలిసిన ఆన్సర్ రాసేశా..అంది మహే నవ్వుతూ.
గుర్రుగా ఆమె వైపు చూస్తూ.. నిజంగా నీకు ఆ ప్రశ్నకి మార్కులు వేశారు అంటే నా బాయ్ ఫ్రెండ్ కి గుండు కొట్టిస్తా..అంది ఆ స్నేహితురాలు.
ఎందుకె పాపం.. అసలేముంది పాపం మీవాడి నెత్తిమీద.. మిగలనీ… పాపం.. అంటూ ముందు వెళ్తున్న జనం మధ్యలోంచి తొంగి చూస్తూ..
అరె.. విష్ణు వచ్చినట్టున్నాడు.. రానన్నాడు గా.. పని ఉంది.. అదీ ఇది అన్నాడు.. అనుకుంది స్వగతం గానే.
అవునే మహా..డిగ్రీ అయిపోయింది కదా.. ఇక మీ బావ ని పెళ్లిచేసుకుని సెటిల్ అయిపోతావా.. అంది స్నేహితురాలు.
ఏంటి.. విష్ణు నా.. చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫేసే కదా.. ఇక నా జీవితం లో ఒక థ్రిల్ కూడా వద్దా.. నాకోసం ఎక్కడో ఒక రాజకుమారుడు వేచి చూస్తూ ఉంటాడు.. వస్తాడు.. ఏదో రోజు వస్తాడు.. అంది మహ.
ఆఁ.. వస్తాడు వస్తాడు.. అప్పటికి నీకు తొoభై వస్తాయి.. వేరే లోకానికి తీసుకుపోవడానికి వస్తాడు.. మీ బావ కళ్ళల్లో నీ మీద అంతులేనంత ప్రేమ చూసానే.. వదులుకోకు.. అంది ఆఁ స్నేహితురాలు.
చాల్లే ఆపవే.. విష్ణు ని నేను చేసుకుంటాను అంటే మా సుప్రజత్త టకీ మని పోతుంది పైకి. మా ప్రణతి పెళ్లికి మావయ్య చేసిన అప్పు.. విష్ణు ద్వారా తీర్చాలని చూస్తుంది.. అర్ధం అయిందా.. విష్ణుని కట్నం పేరుతో ఏ పిల్లో కొనుక్కుంటే కానీ గిట్టుబాటు కాదు.. అంది మహాలక్ష్మి.
ఇవన్నీ కాదు మహ.. మీ బావంటే నీకు ఇష్టం లేదా..?? అంది ఆ స్నేహితురాలు.
ఇష్టం అయితే ఉంది కానీ అది ప్రేమ మాత్రం కాదు.. అభిమానం మాత్రమే.. విష్ణు వచ్చాడు.. నువ్వు ఆటో లో వెళ్ళు.. నేను బైక్ మీద వెళ్ళిపోతా.. అని హడావుడిగా వెళ్తున్న ఆమెని చూసి..
ఏదో రోజు నువ్వు మీ బావ విలువ తెలుసుకుంటావ్ మహా.. బహుశా అప్పటికి ఆలస్యం అయిపోవొచ్చు.. అనుకుంది ఆ స్నేహితురాలు.
బైక్ మీద కూర్చుని కాలేజీ గేట్ కి కాస్త దూరం గా ఎదురు చూస్తున్నాడు ఒక అందగాడు. సింపుల్ గా ఉన్న అతడి మందహాసం అతివల మనసు ని ఇట్టే ఆకట్టుకుంటుంది. అతడే విష్ణు.
మహాలక్ష్మి స్నేహితురాళ్లు చాలా మందికి విష్ణు ఎంతో నచ్చుతాడు.. కానీ అతడి కళ్ళల్లో మహా ని చూస్తే వచ్చే వెలుగు ని చూసి వాళ్లు ముఖాలు ముడుచుకుంటూ వెళ్ళిపోతారు.
హే.. విష్ణు.. పనుందన్నావ్.. మరెందుకు వచ్చావ్.. అంది హుషారుగా వెళ్లి మహా.
చిన్నగా నవ్వి.. పని వాయిదా పడింది మహా.. అందులోను ఈరోజు కాలేజీ చివరి రోజు.. కదా.. నిన్ను సరదాగా ఎక్కడికి అయినా తీసుకెళ్దాం అని.. అన్నాడు విష్ణు.
హే.. నిజం గానా.. ఎక్కడికి వెళ్దాం..?? అంది మహా హుషారుగా.
నేను ఆఫీస్ లో లీవ్ పెట్టి వచ్చాను.. నువ్వే చెప్పు.. అన్నాడు అతడు.
పవన్ సినిమా వచ్చిందిగా వెళ్దాం.. అంది మహ.
సరే పద.. ఇంతకీ ఎగ్జామ్స్ బాగా రాసినట్టే నా.. అన్నాడు విష్ణు.
ఆఁ.. నట్టే.. నట్టే.. అంది అతడి వెనుక బైక్ మీద కూర్చుంటూ.
మంచి పర్సన్టెజ్ వస్తుంది అంటేనే నేను చెప్పిన ఉద్యోగం సిఫారసు లేదంటే ఇంట్లో జాకెట్లు కుట్టుకోవడమే.. అన్నాడు విష్ణు.
విష్ణు సరదాగా అలా అనగానే మహా వెనుక నుంచి వాడి భుజంపై గట్టిగా కొట్టింది. “ఏంట్రా నీ జోకులు.. నా టాలెంట్ మీద నీకు నమ్మకం లేదా? నాకు మంచి పర్సంటేజ్ రాకపోతే నీకు పెళ్లికి అమ్మాయిని దొరకకుండా చేస్తా!” అంటూ నవ్వింది.
విష్ణు చిరునవ్వుతో బైక్ స్టార్ట్ చేశాడు. కాలేజీ గేటు దాటి బండ్ల రద్దీలో నుంచి వారి బైక్ ముందుకు కదిలింది. చిన్నప్పటి నుంచి ఒకరినొకరు చూసుకుంటూ, అలకలు, కోపాలు, అల్లరితో సాగిపోతున్న వీళ్ళ ప్రయాణం చూసేవారికి ముచ్చటగా అనిపిస్తుంది. కానీ మహా మనసులో మాత్రం ఏదో తెలియని అల్లకల్లోలం, ఏదో కోల్పోతున్నామన్న భావన మెదులుతూనే ఉంది.
చిన్నప్పటి నుండి ఆమె డబ్బు లేమి తో మావయ్య కుటుంబం దయాదక్షిణ్యాలతో పెరిగింది. సుప్రజ అనే సూటి పోటీ మాటలు పడుతూ.. ఒంటరి తల్లి పెంపకం లో పెరిగింది. ఎప్పటికైనా బాగా డబ్బు సంపాదించాలి మంచి జీవితం అనుభవించాలన్న కోరిక ఆమె మనసులో బలం గా ఉంది. విష్ణు అంటే అభిమానం ఉన్న.. అది ప్రేమగా మాత్రం మారలేదు ఆమె మనసులో. కానీ విష్ణు కి మాత్రం తన మరదలే తన ప్రాణం.. ఆమెని పెళ్లిచేసుకుని ఆమె కష్టాలని దూరం చేయాలన్నది అతడి సంకల్పం.
వాళ్ళిద్దరి జీవితం లో ఏ మలుపు వస్తుందో తదుపరి భాగంలో చూద్దాం.
ఇంకా ఉంది
Swipe left/right or tap the sides to turn pages