New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
🔥స్త్రీ శక్తి 🔥 – 1

🔥స్త్రీ శక్తి 🔥 – 1

“అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఓ యువతి మృతి!
ఆమెను కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు కూడా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు!”
టీవీ ఛానళ్లలో ఇదే వార్త హాట్‌టాపిక్‌గా మారింది. న్యూస్ రిపోర్టర్లు అదే పనిగా ఆ ఘటన గురించి చర్చించుకుంటున్నారు. ఆ ప్రమాదం ఎలా జరిగింది? అసలు అక్కడ ఏం జరిగింది? అంటూ రకరకాల కథనాలు ప్రసారం చేస్తున్నారు.
కానీ…
ఏమైందో తెలియదు. ఒక్కసారిగా ఆ వార్తలన్నీ ఆగిపోయాయి.
టీవీలో వస్తున్న ఆ వార్త స్థానంలో మరో వార్త ప్రత్యక్షమైంది.
ఆ రోజు ఆ కథ అక్కడితో ముగిసిపోయింది… అందరి జీవితాల్లో!
కానీ…
ఒక అమ్మాయి జీవితంలో మాత్రం ఆ రోజు ఓ ఆరని జ్వాలగా మిగిలిపోయింది.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఓ ఇరవైమూడేళ్ల యువతి…
తన అక్క శవం ముందు ఓ రాయిలా కూర్చుని ఉంది.
ఆమె కళ్లలో కన్నీళ్లు లేవు. మనసు స్పందించడం లేదు. మెదడు మొద్దుబారిపోయింది.
తనకు అక్క కంటే ఎక్కువగా తల్లిలా ప్రేమను పంచిన తన అక్క… ఈరోజు నిర్జీవంగా తన కళ్లముందు పడి ఉంది.
ఎప్పుడూ తనను గుండెలకు హత్తుకునే ఆ చేతులు ఇప్పుడు చలనం లేకుండా ఉన్నాయి.
తనను గారాబంగా చూసుకునే ఆ గొంతు ఇప్పుడు మూగబోయింది.
తనతో ప్రతి క్షణం తోడుగా ఉండే ఆ ప్రాణం… తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది.
తన అక్కతో ఉన్న ప్రతి జ్ఞాపకం, ప్రతి సంఘటన జ్వాల మనసును దహించేస్తున్నాయి.
“జ్వాలా… నీ మనసులో ఉన్న బాధను ఏడ్చి బయటపెట్టు తల్లీ. ఇలా మనసులోనే దాచుకోకు…”
అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు జ్వాల తండ్రి మాధవరావు.
కానీ జ్వాల మాత్రం ఆయన మాటలు విన్నా విననట్టుగానే తన అక్క ముఖం వైపు చూస్తూ ఉంటుంది.
“నాన్నా…”
అంటూ మెల్లగా పిలుస్తుంది.
“చెప్పమ్మా…”
“అక్క ఎందుకు అలా పడుకుంది నాన్నా? తనని అందరూ అలా ఎందుకు చూస్తున్నారు?”
అంటూ అమాయకంగా ప్రశ్నిస్తుంది.
“అవును… అక్కకు చిన్నగా మంటలు అంటుకున్నాయి కదా నాన్నా! దానికి బర్నాల్ రాస్తే సరిపోతుంది కదా!
మరి అందరూ ఎందుకు అలా ఏడుస్తున్నారు?”
అంటూ తన అక్కను చూస్తుంది.
అక్కడున్న వాళ్ల కళ్లలో కన్నీళ్లు మరింత ఎక్కువవుతాయి.
“అక్కా… లేవే!
ఇలా బయట పడుకున్నావేంటి? పదా… మన గదిలోకి తీసుకెళ్తాను.”
అంటూ తన అక్కను పట్టుకుని లేపడానికి ప్రయత్నిస్తుంది జ్వాల.
కానీ ఎంత ప్రయత్నించినా ఆద్య శరీరంలో ఎలాంటి కదలికా ఉండదు.
తన పెద్ద కూతురిని కోల్పోయిన బాధలో తల్లడిల్లుతున్న ఆ తల్లిదండ్రులకు… చిన్న కూతురు ఇలా మాట్లాడుతుండటం చూసి గుండె పగిలిపోతున్నట్లు అనిపిస్తుంది.
జ్వాల పరిస్థితిని చూసి అక్కడున్నవారంతా కన్నీళ్లు పెట్టుకుంటారు.
అప్పుడే ఆద్యను ప్రేమించిన హర్ష ముందుకు వస్తాడు.
“జ్వాలా… నీ అక్క చనిపోయింది. ఆద్య మనందరినీ వదిలేసి వెళ్లిపోయింది…”
అంటూ కన్నీళ్లు ఆపుకోలేక చెబుతాడు.
ఆ మాటలు విన్న జ్వాల వెంటనే అతని వైపు తిరుగుతుంది.
“బావా… ఏం మాట్లాడుతున్నావు?
అక్క మనందరినీ ఎలా వదిలేసి వెళ్తుంది? అసలు మనల్ని వదిలి వెళ్లాలనుకుంటే… మనల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లాలి కదా!
మరి నన్ను ఒక్కదాన్నే ఇక్కడ ఎందుకు వదిలేసింది బావా?”
అంటూ ప్రశ్నిస్తుంది.
ఆ మాటలు విన్న జ్వాల తల్లి నర్మద గారు ఒక్కసారిగా కోపంతో, బాధతో జ్వాల చెంపపై కొడతారు.
“ఏంటే నువ్వు మాట్లాడుతున్నది?
ఒకపక్క అది పోయిన బాధలో మేము చచ్చిపోతుంటే… నువ్వు కూడా మమ్మల్ని ఇంకా ఏడిపిస్తున్నావేంటి?
ఏ జన్మలో ఏ పాపం చేశానో… నా కూతురిని నాకు దూరం చేశాడు ఆ దేవుడు!
కనీసం దాని ముఖాన్ని ఆఖరిసారైనా చూసుకుంటానని అనుకున్నాను. కానీ ఇలా నిర్జీవంగా చూడాల్సి వస్తుందని అనుకోలేదు.
అయ్యో… అమ్ములూ!
లేవే తల్లీ… ఈ అమ్మను ఒక్కసారి చూడవే!
నీ కోసం ఈ అమ్మ ఎంతలా ఏడుస్తుందో చూడవే!”
అంటూ ఆద్యను పట్టుకుని గుండెలవిసేలా ఏడుస్తారు నర్మద గారు.
ఆమె రోదన అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది.
కానీ జ్వాల మాత్రం ఇంకా ఆ నిజాన్ని అంగీకరించలేకపోతోంది.
“అక్కా… అమ్మ లేవమని చెబుతోంది కదా!
ప్లీజ్ అక్కా… ఒక్కసారి లేవే!
నీకు తెలుసా అక్కా… ఈరోజు నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను.
కానీ నువ్వేమో నా మాట వినడానికి కూడా సిద్ధంగా లేవు.
ఎప్పుడూ నా మాటలు వినకుండా ఉండేదానివి కాదుగా అక్కా!
మరి ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నావు?
లేవే అక్కా… ప్లీజ్!”
అంటూ ఆద్య చేతిని పట్టుకుని ఏడవడానికి ప్రయత్నిస్తుంది. కానీ కన్నీళ్లు రావడం లేదు. గుండెల్లో బాధ ఉంది… కానీ ఆ బాధను బయటపెట్టే శక్తి కూడా తనలో మిగల్లేదు.
“నీకు ఇష్టమే కదా అక్కా… నేను చీర కట్టుకుంటే!
చెప్పు అక్కా… చీర కట్టుకోనా?
నువ్వు లేచి చూస్తావు కదా… ప్లీజ్ అక్కా!”
అంటూ తన అక్కను బతిమాలుకుంటుంది.
అప్పుడే హర్ష ఆమె దగ్గరకు వచ్చి బాధగా అంటాడు.
“జ్వాలా… ప్లీజ్! నిజాన్ని అంగీకరించు.”
వెంటనే జ్వాల అతని చేతిని పట్టుకుంటుంది.
“బావా… నువ్వంటే అక్కకు చాలా ఇష్టం కదా!
నువ్వు పిలువు బావా… నువ్వు పిలిస్తే అక్క కచ్చితంగా లేస్తుంది.
అక్కా… నీ బావ వచ్చాడు చూడు!”
అంటూ హర్ష వైపు చూస్తుంది.
ఆ మాటలు విన్న హర్ష గుండె ముక్కలవుతుంది.
తన ప్రేమను, తన భవిష్యత్తును, తన జీవితాన్ని పంచుకోవాలనుకున్న అమ్మాయి ఇప్పుడు తన కళ్లముందు నిర్జీవంగా పడి ఉంది.
అతను గట్టిగా పిడికిలి బిగిస్తాడు.
“జ్వాలా… ఆ శక్తే నాకు ఉంటే… నీ అక్క బదులు నేను ఆ మంటల్లో ఆహుతైపోయేవాడిని!
తను లేకుండా నేను ఎలా బతకాలి జ్వాలా?”
అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ఆ మాటలు విన్న జ్వాల మరింతగా కుంగిపోతుంది.
అక్కడే కూర్చుని తన అక్క ముఖాన్ని చూస్తూ ఉండిపోతుంది.
“అమ్ములూ… ఇది నీకు న్యాయంగా ఉందా తల్లీ?
ఈ తండ్రిని వదిలి వెళ్లే ముందు ఒక్కసారైనా ఆలోచించలేదా బంగారం?
నువ్వు లేకుండా మేమెలా బతకాలి?”
అంటూ మాధవరావు గారు గుండెలవిసేలా ఏడుస్తారు.
అప్పుడే కేశవ రావు ఆయన దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేస్తారు.
“మాధవరావు… నువ్వే ఇలా అయిపోతే ఎలా?
నీ చిన్న కూతురి గురించి ఆలోచించు. అక్క అంటే తనకు ప్రాణం కదా! ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో చూడు.
నువ్వే తనకు ధైర్యం చెప్పాలి.”
ఆ మాటలకు మాధవరావు గారు కన్నీళ్లతో ఆయన వైపు చూస్తారు.
“ఏమని చెప్పాలి కేశవా?
రోజూ నవ్వుతూ ఎదురొచ్చి, ‘జాగ్రత్త బంగారం’ అని చెప్పే తన అక్క ఇక లేదని చెప్పనా?
ఎప్పుడూ తన చెల్లిని వెనకేసుకుని వచ్చి, తనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడే తోడు ఇక ఉండదని చెప్పనా?
ఏమని చెప్పాలి కేశవా?
నా అమ్ములు లేకుండా బతకడం మాకు తెలియదురా…”
అంటూ గుండెల్లో దాచుకున్న బాధను కన్నీళ్ల రూపంలో బయటపెడతారు.
అక్కడున్నవారెవరికీ వారిని ఓదార్చే మాటలు దొరకడం లేదు.
ఎందుకంటే…
కొన్ని బాధలకు ఓదార్పు ఉండదు.
కొన్ని లోటులను ఎవరూ పూడ్చలేరు.
కొన్ని జ్ఞాపకాలు జీవితాంతం మనసును వెంటాడుతూనే ఉంటాయి.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
చివరికి ఆద్యను తీసుకెళ్లే సమయం వస్తుంది.
అందరూ గుండెను రాయి చేసుకుని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లడానికి సిద్ధమవుతారు.
అప్పటివరకు రాని కన్నీళ్లు… తన అక్క ఇక కనిపించదనే నిజం కళ్లముందు నిలబడగానే జ్వాల కళ్ల నుంచి ధారగా కారుతాయి.
ఒక్కసారిగా ఆద్యను గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతుంది.
“వద్దు! నా అక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
వదలండి! నా అక్కను వదలండి!
తను లేకుండా నేను ఉండలేను. మీకు దండం పెడతాను… నా అక్కను తీసుకెళ్లకండి!”
అంటూ అక్కడున్నవారిని బతిమాలుకుంటుంది.
“అక్కా… వీళ్లందరూ మనల్ని విడదీయాలని చూస్తున్నారు అక్కా!
నువ్వు లేచి చెప్పు అక్కా… మనల్ని ఎవరూ విడదీయలేరని చెప్పు!
ప్లీజ్ అక్కా… ఒక్కసారి లేవే!”
అంటూ ఉదృతంగా ఏడుస్తుంది.
అందరూ జ్వాలను పక్కకు లాగడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె మాత్రం ఆద్యను వదలడానికి సిద్ధంగా ఉండదు.
చివరికి హర్ష ఆమెను గట్టిగా పట్టుకుని పక్కకు లాగుతాడు.
“జ్వాలా…!”
అంటూ గట్టిగా పిలుస్తాడు.
ఆ పిలుపుతో ఒక్కసారిగా ఆద్య వైపు చూస్తుంది జ్వాల.
“అక్కా…!”
అంటూ పెద్దగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
జ్వాలను గదిలో పడుకోబెట్టి, ఆద్యను అంత్యక్రియల కోసం తీసుకెళ్తారు.
“అమ్ములూ… నా బంగారమా!”
అంటూ నర్మద గారు గట్టిగా ఏడుస్తూనే ఉంటారు.
ఆ తల్లి బాధకు ఎవరూ ఉపశమనం ఇవ్వలేకపోతారు.
కూతురిని కోల్పోయిన ఆవేదనలో ఆమె గుండె ముక్కలవుతుంటే… తండ్రిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత మాధవరావు గారిపై ఉంటుంది.
గుండె నిండా బాధను దాచుకుని, కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేస్తూ తన కూతురికి తుది వీడ్కోలు పలకడానికి సిద్ధమవుతారు.
తన కళ్లముందే పెరిగిన తన బంగారు తల్లిని… ఇక ఎప్పటికీ చూడలేననే నిజాన్ని అంగీకరించడానికి ఆయన మనసు ఒప్పుకోవడం లేదు.
కానీ తప్పదు.
ఆద్య ప్రయాణం అక్కడితో ముగిసింది.
కానీ ఆమె మరణం మిగిల్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇంకా దొరకలేదు.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
మరోవైపు…
“రేయ్… ఆ న్యూస్ ఆపించేశావు కదా?”
అని అడుగుతాడు దయానంద్.
“హా సార్! అందరికీ వార్నింగ్ ఇచ్చాం. ఇకపై ఆ విషయం గురించి ఎవరూ మాట్లాడరు.”
అని సమాధానమిస్తాడు అతని మనిషి.
దయానంద్ వెంటనే తన ఫోన్ తీసుకుని ఒక వ్యక్తికి కాల్ చేస్తాడు.
అవతలి వ్యక్తి చాలా సేపటి తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.
“సార్…”
అంటూ కొంచెం భయంగా మాట్లాడతాడు దయానంద్.
“న్యూస్ మొత్తం ఆపించేశాం సార్. మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది.
ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాం. ఇకముందు కూడా మీరు చెప్పినట్టే చాలా జాగ్రత్తగా ఉంటాం సార్.”
అవతలి వ్యక్తి ఏం చెప్పాడో తెలియదు.
కానీ అతని మాటలు విన్న దయానంద్ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది.
“సరే సార్… అలాగే చేస్తాను.”
అంటూ ఫోన్ కట్ చేస్తాడు.
ఆ అవతలి వ్యక్తి ఎవరు?
అతని మాటలకే దయానంద్ లాంటి వ్యక్తి భయపడుతున్నాడంటే… అతని వెనుక ఎంతటి శక్తి ఉంది?
ఆ వ్యక్తి ఎవరో తెలిసే వరకు అతనికి ఒక పేరు పెట్టుకుందాం…
మిస్టర్ X!
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
రెండు సంవత్సరాల తర్వాత…
ఆద్య లేని ఆ ఇల్లు శూన్యంగా మారిపోయింది.
ఆద్య మరణించిన రోజు నుంచి జ్వాల నవ్వడం మర్చిపోయింది.
కానీ తన తల్లిదండ్రుల కోసం, తన అక్క జ్ఞాపకాల కోసం… ఆమె జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.
ఆద్య ఒక జర్నలిస్ట్‌గా పనిచేసేది.
తన అక్క మరణం తర్వాత, అక్క అడుగుజాడల్లో నడవాలనే కోరికతో జ్వాల కూడా ఎంతో కష్టపడి జర్నలిస్ట్ ఉద్యోగాన్ని సంపాదించుకుంది.
తన అక్క లేని లోటును పూడ్చలేకపోయినా… తనలో ఆద్యను చూసుకునేలా తల్లిదండ్రులకు అండగా నిలిచింది.
జ్వాల రూపంలో తమ పెద్ద కూతురిని చూసుకుంటూ మాధవరావు గారు, నర్మద గారు కొంతవరకు తమ బాధను మరిచిపోవడానికి ప్రయత్నించేవారు.
కానీ…
జ్వాల ఎంతగా ఆద్యను గుర్తు చేసినా, ఆద్య స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు.
రెండు కళ్లలో ఒక కన్ను కోల్పోతే… మిగిలిన కన్నుతో ప్రపంచాన్ని చూడగలిగినా, కోల్పోయిన కన్ను లేని లోటు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది కదా!
వారి జీవితాల్లో కూడా ఆద్య లేని లోటు అలాగే మిగిలిపోయింది.
ఆ బాధ… ఆరని మంటలా వారి గుండెల్లో రగులుతూనే ఉంది.
ఇక హర్ష విషయానికి వస్తే…
ఆద్యపై ఉన్న ప్రేమతో అతను ఒంటరిగా మిగిలిపోయాడు.
ఎంతమంది చెప్పినా మరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతన్ని ఒప్పించే ప్రయత్నాలు మానేశారు.
కానీ మాధవరావు గారికి మాత్రం హర్ష అలా ఒంటరిగా ఉండిపోవడం నచ్చలేదు.
అందుకే జ్వాలను హర్షకు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించుకుంటారు.
అయితే హర్ష మాత్రం మొదట ఈ పెళ్లికి నిరాకరిస్తాడు.
“జ్వాలా… నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేయ్.
నిన్ను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి?
నేను ఆద్యను నా భార్యగా ఊహించుకున్నాను. నా జీవితాంతం తన జ్ఞాపకాలతోనే బతుకుతాను.
నువ్వు కూడా నీ జీవితాన్ని ఇలా త్యాగం చేయాల్సిన అవసరం లేదు.”
అంటూ బాధగా చెబుతాడు.
జ్వాల అతని మాటలు ప్రశాంతంగా వింటుంది.
“బావా… నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది.
అక్క అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. తనను మర్చిపోవడం నీకు సాధ్యం కాదని కూడా తెలుసు.
కానీ బావా… నా వల్ల కాకపోయినా, నువ్వు ముందుకు సాగాలి కదా!
నీకంటూ ఒక జీవితం ఉండాలి కదా!”
అంటుంది జ్వాల.
“నా వల్ల కాదు జ్వాలా… ఆద్యను మర్చిపోవడం నా వల్ల కాదు.”
అంటాడు హర్ష.
“నిజమే బావా… నా వల్ల కూడా కావడం లేదు.
అక్కను మర్చిపోవాలని నేను చెప్పడం లేదు. తను మన జీవితాల్లో లేదనే నిజాన్ని అంగీకరించడం కూడా చాలా కష్టం.
కానీ బావా… మనం ఇలా బాధలోనే ఉండిపోతే అక్క సంతోషిస్తుందా?
తనకు మన మౌనం, మన కన్నీళ్లు కావాలని అనుకుంటుందా?
తనకు నచ్చినట్టుగా మనం జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటుంది కదా!
నేను చాలా ఆలోచించాను బావా.
అక్క జ్ఞాపకాలను మనసులో దాచుకుని, మన జీవితాలను ముందుకు తీసుకెళ్లడమే తనకు మనం ఇచ్చే నిజమైన ప్రేమ అనిపిస్తోంది.”
అంటూ చెబుతుంది జ్వాల.
“జ్వాలా…”
అంటూ ఆమె వైపు చూస్తాడు హర్ష.
“అవును బావా! నాకు ఈ పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదు.
కానీ నీకు ఇష్టం లేకపోతే మాత్రం నువ్వు ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేయ్.
నేను నిన్ను ఎలాంటి ఇబ్బందీ పెట్టను.”
అంటుంది జ్వాల.
హర్ష కొంతసేపు మౌనంగా ఉండిపోతాడు.
ఒకవైపు ఆద్యపై ఉన్న ప్రేమ… మరోవైపు తన కుటుంబం.
అతని తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే తాము బతకలేమని బెదిరించడంతో, చివరికి హర్ష వారి నిర్ణయానికి తలవంచక తప్పదు.
అలా హర్ష, జ్వాలల పెళ్లికి నాంది పలుకుతారు.
జ్వాల పెళ్లికి సిద్ధపడింది.
కానీ అది తన మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం కాదు.
తన తల్లిదండ్రుల కోసం…
తన అక్క కోసం…
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఆద్య గదిలో…
పెళ్లికి సిద్ధమవుతున్న జ్వాల నెమ్మదిగా తన అక్క గదిలోకి వెళ్లి కూర్చుంటుంది.
ఆ గది నిండా ఆద్య జ్ఞాపకాలే!
ఎన్నోసార్లు అక్కా అంటూ ఏడుస్తూ ఆ గదిలోకి వచ్చిన రోజులు…
తన సంతోషాన్ని అక్కతో పంచుకున్న క్షణాలు…
అక్క పక్కనే పడుకుని కబుర్లు చెప్పుకున్న రాత్రులు…
ఇద్దరూ కలిసి నవ్వుకున్న సందర్భాలు…
అన్నీ ఒక్కొక్కటిగా జ్వాల కళ్లముందు కదలాడతాయి.
తన అక్కతో గడిపిన ప్రతి క్షణం గుర్తొచ్చేసరికి గుండె బరువెక్కుతుంది.
“అక్కా…”
అంటూ మెల్లగా పిలుస్తుంది.
సమాధానం లేదు.
ఎప్పుడూ తన పిలుపుకు వెంటనే స్పందించే ఆద్య… ఇప్పుడు ఎక్కడా లేదు.
జ్వాల కళ్లలో కన్నీళ్లు తిరుగుతాయి.
అప్పుడే…
ఒక్కసారిగా గదిలోకి బలంగా గాలి వీస్తుంది.
ఆ గాలికి అక్కడున్న కొన్ని వస్తువులు కింద పడిపోతాయి.
అవి ఆద్యకు సంబంధించిన వస్తువులు.
జ్వాల వాటిని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెడుతూ ఉంటుంది.
అప్పుడే…
తన చూపు ఓ వస్తువుపై ఆగిపోతుంది.
అది…
ఆద్య డైరీ!
ఆ డైరీని చూసిన జ్వాలకు ఒక్కసారిగా పాత జ్ఞాపకం గుర్తుకొస్తుంది.
ఆద్య తన డైరీని ఎప్పుడూ ఎవరికీ ముట్టుకోనిచ్చేది కాదు.
చెల్లెలైన జ్వాలను కూడా దాని దగ్గరకు రానిచ్చేది కాదు.
ఆ విషయం గుర్తొచ్చి, తన కళ్లలో తిరుగుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ డైరీని తిరిగి అక్కడే పెట్టబోతుంది.
కానీ…
అనుకోకుండా డైరీ తన చేతిలో నుంచి జారి కింద పడిపోతుంది.
జ్వాల వెంటనే కిందకు వంగి దాన్ని చేతిలోకి తీసుకుంటుంది.
అప్పుడే…
డైరీలో కనిపించిన కొన్ని అక్షరాలపై తన చూపు పడుతుంది.
ఆ అక్షరాలను చదువుతున్న కొద్దీ జ్వాల ముఖంలో మార్పు మొదలవుతుంది.
ఆమె చేతులు వణకడం మొదలవుతుంది.
గుండె వేగంగా కొట్టుకుంటుంది.
కాసేపటి క్రితం వరకు కన్నీళ్లతో నిండిన ఆమె కళ్లలో ఇప్పుడు మరో భావం కనిపిస్తుంది.
ఆశ్చర్యం…
అనుమానం…
ఆవేదన…
చివరికి…
ఆమె కళ్లలో అగ్ని జ్వాలలు రగులుతాయి!
ఆద్య మరణం వెనుక ఏదో రహస్యం ఉంది!
అది ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచన జ్వాల మనసులో మొదటిసారి ఓ కొత్త సంకల్పానికి నాంది పలుకుతుంది.
ఆమె చేతిలో ఉన్న ఆద్య డైరీ… తన జీవితాన్నే మార్చబోతోందని ఆమెకు అప్పటికి తెలియదు.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఇంకా ఉంది…
మిస్టర్ X ఎవరు?
అసలు ఆద్య మరణం నిజంగానే అగ్ని ప్రమాదమా?
లేక ఎవరో కావాలనే ఆమె మరణాన్ని అగ్ని ప్రమాదంగా మార్చారా?
ఆద్య డైరీలో జ్వాల ఏం చూసింది?
ఆద్య మరణం వెనుక దాగిన నిజం ఏమిటి?
తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి!
❤️🔥 “స్త్రీ శక్తి” కథ మీకు నచ్చితే ఫాలో చేసి, ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి, మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి.
మీ ఆదరణే నాకు ప్రోత్సాహం!
థాంక్యూ ఫర్ రీడింగ్! 😊❤️