Episode 1
Episode 01: గెలుపంటే ఏంటి?
“ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికి తెలియదంటారు కానీ, ఆకర్షణ మాత్రం చెప్పే పుడుతుంది. ఎందుకంటే ఆ పని కళ్ళు చేస్తాయి. మన మనసుకి ఆకర్షణేదో ప్రేమేదో ఇట్టే తెలిసిపోతుంది. అయినా అందులోనే మునిగిపోతాం… మరి దానికి కారణం ఏంటో తెలుసా! మన మనసే… అవును, మనల్ని మోసం చేస్తూనే, తనకి తాను మోసపోయేది కూడా మనసే” అని అటు వైపుగా ఎవరో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి.
‘జీవితం అంటే ఏంటో తెలిసిన వాడికి ఈ ఫీలింగ్స్ అనేవే ఉండవు. అది ప్రేమైతే ఏంటి!? ద్వేషం అయితే ఏంటి!? ఇప్పుడు ఈ క్షణం ఎంజాయ్ చేయడమే కావాలి. ఇలాంటి మూస ఫార్ములా డైలాగ్స్ తో హిట్ కొట్టెద్ధాం అనుకుంటున్నారు వీళ్లు… వీళ్ళ కోడి బ్రెయిన్’ అని ప్యాంట్ కి అంటిన దుమ్ము దులుపుకుంటూ పైకి లేచాడు బాల అలియాస్ బాలరాజు.
ఎవడి మాట లెక్కచేయని తత్వం అతనిది. సింపుల్ గా బాలరాజు అంటే ఈ లోకం నుండి డిటాచ్మెంట్ అయిన అబ్బాయిగా ఫేమస్. నిండా ఇరవై ఏళ్లు లేవు అంటే మనోడికి 16 ఏళ్ళే… టీనేజ్ కూడా దాటని వాడికి ఉండకూడని వైరాగ్యం… పోష్ గా చెప్పాలి అంటే my life my rules… RGV లాంటి మైండ్సెట్ ఉన్నోడు.
‘ఏంటి ఆ ఏజ్ కి, వాడు చూపించే బలుపుకి ఏమైనా బ్యాలన్సింగ్ ఉందా!’ అని ఎంత మంది అడిగి ఉంటారో…! అందరికీ చిరునవ్వే సమాధానంగా ముందుకు వెళ్తుంటాడు బాలా.
‘ఒరేయ్… నీకు అసలు సంతోషం, బాధ ఏది పట్టదా!?’ అని తన ఫ్రెండ్స్ అడిగినప్పుడు కూడా, “ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకొండ్రా! అప్పుడు అందరూ నాలా బిందాస్ గా ఉండచ్చు” అని చెబుతాడు బాలా.
అతనేంటో అతని తత్వం ఏంటో అర్థం కాని మనుషులు పిచ్చివాడిని చూసినట్లు చూస్తుంటారు. సంతోషం వచ్చిన బాధ వచ్చిన చిన్న చిరునవ్వు తప్ప అతనిలో మొహంలో మరో హవభవం కనిపించడం అరుదు. బాలని చూసిన వాళ్ళు ఏడవటం తెలియని మనిషేమో అనుకుంటారు కానీ, తన కన్నీళ్లు ఎప్పుడో ఇంకిపోయాయని అతనికి మాత్రమే తెలుసు.
******
‘నేను రానురా బాబు.. నీకో దండం!’ అని బాలా చెబుతున్న వినకుండా తన షార్ట్ ఫిల్మ్ షూట్ ఉందని లాక్కుని వచ్చాడు బాలా ఫ్రెండ్ రాము.
అతన్ని తిట్టుకుంటూ ఆ డైలాగ్స్ వినలేక లోయలాంటి ప్లేస్ వైపు నడిచాడు. అక్కడ నుండి వ్యూ చూస్తూ కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయాడు బాలా.
ఇంకోపక్క ఒక సీన్ తర్వాత మరో సీన్ షూట్ చేస్తున్నారు. రాము ఒక కంట బాలాను కనిపెడుతునే తన పని తాను చేసుకుపోతున్నాడు. అతనికి తెలుసు, ఎప్పుడో ఒకసారి విసుగొస్తే కచ్చితంగా బాలా ఉన్న చోటుని వదిలేసి వెళ్ళిపోతాడు. అందుకే పక్కన ఉన్న ఫ్రెండ్స్ కి కూడా బాలాను ఒక కంట కనిపెడుతూ ఉండమని చెప్పాడు.
*********
తండ్రి కొడుకుల మధ్య సీన్ షూట్ జరుగుతుంటే… వాళ్ళ డైలాగ్స్ వింటూనే లోయలోకి చూస్తూ చిన్నగా గతంలోకి జారుకున్నాడు బాలా.
మంచంలో పడుకున్న కోటేష్, తదేకంగా పుస్తకాల ముందు కూర్చున్న బాలా వంక చూస్తూ, “ఈ ప్రపంచాన్ని గెలవాలని చూస్తున్నావా బాలా!?” అని అడిగాడు.
బాలా తల ఊపుతూ, “అవును నాన్న! ఇంతకు ముందు నువ్వేగా యూనివర్సిటీ సీట్ కొట్టి ఈ లోకానికి నిన్ను నువ్వు నిరూపించుకోమని చెప్పావు. అందుకే రేయింబవళ్ళు కష్టపడుతూ చదువుతున్నాను. నేను తప్పకుండా మద్రాస్ ఐఐటీలో సీట్ కొట్టి… మనల్ని తక్కువ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికీ నా గెలుపు చూపిస్తాను” అని కసిగా అన్నాడు.
వయసు తెచ్చే ఆవేశం చూసి నవ్వుతూ, “గెలవడం ఏంటి!?” అని అడిగాడు కోటేష్.
ఇంటర్ చదువుతున్న బాలాకి… గెలుపు అంటే చదువులో గెలవడం మాత్రమే అనుకుంటున్నాడు. అది తప్ప ఇంకో అర్థం తెలియని వయసు బాలది… చదువుని గెలిస్తే ప్రపంచాన్ని గెలవచ్చూ అనే ఆలోచనే అతనిది.
ఇంతకు ముందు బాగా చదవమని ప్రోత్సహించిన తండ్రి ఇప్పుడిలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు.
రెండు సంవత్సరాల క్రితం పక్షవాతంతో మంచాన పడ్డాడు కోటేష్. అప్పటివరకు బెల్లం చుట్టూ ఈగల్లా ఉన్న బంధుత్వాలు కాస్త.. అతను మంచానా పడగానే చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు మొహం చాటేశారు.
ఇదంతా తన చేతకానితనమెమో అని లోలోన కుమిలిపోతున్నాడు కోటేష్. అందరికీ తలలో నాలుకలా తిరిగే అతనంటే ఒకప్పుడు అందరికీ గౌరవం ఉండేది. అది తన నుండి పొందుతున్న సాయానికి, తన వెనక ఉన్న డబ్బుకి, పరపతికి ఇచ్చే గౌరవం అని అర్థం అవ్వగానే నీరు గారిపోయాడు.
రెండు సంవత్సరాలుగా ట్రీట్మెంట్ చేస్తున్నా అతని శరీరంలో కొంచెం కూడా కదలిక రాలేదు కానీ, మనసు మాత్రం భూకంపం వచ్చినట్లు ఊగిపోతూనే ఉంది. ఇంకా వయసులోనే ఉన్న భార్యకి దగ్గర అవ్వలేక, ఇటు చేతికి అందొచ్చే కొడుక్కి ఆసరాగా ఉండలేక ఇలా చేవ చచ్చిన శరీరంలో ఇంకా ఎందుకు బతికున్నాననే బాధతో ఇంకా కృంగిపోతున్నాడు.
ఆలోచనలో పడ్డ కొడుకుని చూసి, ‘నీకు నా అవసరం చాలా ఉంది బాలా! కానీ, చూస్తుంటే నేను ఎక్కువ కాలం బతికేలా కనిపించడం లేదు.. ఉన్నని రోజుల్లో అయినా నీకు జీవితాంతం బతికే ధైర్యాన్ని ఇవ్వాలి’ అని అనుకుంటూ బాలా వైపు చూసాడు కోటేష్.
Swipe left/right or tap the sides to turn pages