New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 2

Episode 2

Episode 02: చేయకూడని తప్పు 
రెండు సంవత్సరాలుగా ట్రీట్మెంట్ చేస్తున్నా అతని శరీరంలో కొంచెం కూడా కదలిక రాలేదు కానీ, మనసు మాత్రం భూకంపం వచ్చినట్లు ఊగిపోతూనే ఉంది. ఇంకా వయసులోనే ఉన్న భార్యకి దగ్గర అవ్వలేక, ఇటు చేతికి అందొచ్చే కొడుక్కి ఆసరాగా ఉండలేక ఇలా చేవ చచ్చిన శరీరంలో ఇంకా ఎందుకు బతికున్నాననే బాధతో ఇంకా కృంగిపోతున్నాడు. 
ఆలోచనలో పడ్డ కొడుకుని చూసి, ‘నీకు నా అవసరం చాలా ఉంది బాలా! కానీ, చూస్తుంటే నేను ఎక్కువ కాలం బతికేలా కనిపించడం లేదు.. ఉన్నని రోజుల్లో అయినా నీకు జీవితాంతం బతికే ధైర్యాన్ని ఇవ్వాలి’ అని అనుకుంటూ బాలా వైపు చూసాడు కోటేష్. 
తండ్రి కళ్ళలో కనిపిస్తున్న బాధని చూసిన బాలా, “నువ్వేం బాధ పడకు నాన్నా! నీకు తొందరలోనే తగ్గిపోతుంది” అని భరోసా ఇస్తూ అన్నాడు. 
కొటేష్ విరక్తిగా నవ్వుతూ, “నేను అడిగిన దానికి జవాబివ్వు, గెలవడం అంటే చదువులో ఫస్ట్ ర్యాంక్ రావడమా!?” అని మళ్ళీ అడిగాడు. 
“అంతే కదా నాన్న! నాతో చదువుతున్న వాళ్లంతా నాతో పోటీ పడి గెలవాలి అని అంటున్నారు… మరి అదే కదా గెలుపంటే” అని అమాయకంగా అడిగాడు బాలా. 
కోటేష్ నవ్వుతూ, “గెలుపు అంటే ప్రపంచానికి మనం ఏంటో తెలియజెప్పేదే, కాదనడం లేదు కానీ దాని వల్ల నువ్వెంత సంతోషంగా ఉండగలుగుతావు అనేది చాలా ముఖ్యం” అని అన్నాడు. 
బాలాకి అర్థం అయ్యి అవ్వనట్లుగా అనిపించాయి ఆ మాటలు. 
బాలా వెంటనే, “కానీ నాన్నా! నేను ఐఐటీ సీట్ సంపాదిస్తే ఆనందమే కదా!?” అని అడిగాడు. 
“ఆ ఆనందం ఎన్ని రోజులు ఉంటుంది!? ఎంత మంది నిన్ను ర్యాంకర్ గా గుర్తు పెట్టుకుంటారు” అని మళ్ళీ అడిగాడు కోటేష్. బాలా ఆలోచనలో పడ్డాడు. 
“గెలవడం ముఖ్యమే… కానీ ఆ గెలుపు ఎలా ఉండాలి అంటే ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూనే సాధించుకోవాలి… అదిగో అటు చూడు” అని టీవీలో వస్తున్న న్యూస్ వైపు చూడమని అన్నాడు కోటేష్. 
‘చదువును మాత్రమే గెలుపు అనుకున్న పరాజితుడి కథ… కన్నీటి వ్యథ…’ అని స్క్రోల్ అవుతున్న అందులో ఐఐటీ నుండి గోల్డ్ మెడలిస్ట్ అందుకున్న అబ్బాయి ఇప్పుడు పిచ్చివాడిలా ఎలా మారిపోయాడో చెబుతున్నారు. 
“న్యూస్ చూశావు కదా! నీకేం అర్థం అయ్యింది” అని అడిగాడు కోటేష్. 
“అంత పిచ్చిగా చదవటం కూడా తప్పే అవుతుంది” అని అన్నాడు బాలా. 
“ఉహూ చదవటం తప్పు కాదు, గెలుపు చదువులో మాత్రమే ఉందనుకున్నాడు. పగలు రాత్రి అందుకోసమే కష్టపడ్డాడు. చివరికి అనుకున్నది సాధించాడు కానీ, తర్వాత ఏంటి అనేది అతను ఊహించలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా!?” అని అడిగాడు కోటేష్. 
తండ్రి మాటలు శ్రద్ధగా వింటున్నాడు బాలా. 
“ఒకప్పుడు నువ్వు గెలిచినా, ఓడిన వెన్నుదన్నుగా నిలవడానికి నేనునంటాననే ధైర్యం నాకు ఉండేది కానీ, ఇప్పుడు రోజులు, వారాలు లెక్క పెట్టుకుంటున్న నాకు నువ్వెలా బతుకుతావో అన్న భయం పట్టుకుంది నాని” అని బేలగా అన్నాడు కోటేష్.
తండ్రి కళ్ళలో కనిపిస్తున్న తడిని చూసి వయసుకి మించిన ధైర్యం చూపిస్తూ, “నీకేం అవ్వదు నాన్నా! నువ్వే ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నువ్వే అంటావు కదా, ధైర్యం మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుందని… నువ్వు ధైర్యంగా ఉంటే తొందరగా నయం అయిపోతుంది.. నా మాట విను” అని లాలనగా అన్నాడు బాలా. 
ఫిజియథెరపీ చేయడానికి వచ్చిన ముకుందం, “చూసావా కోటి… చిన్నవాడైన ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో! వాడి కోసం అయినా నువ్వు లేని శక్తి కూడగట్టుకుంటే చాలు. పక్షవాతం నిన్నేం చేయలేదు. ఇలానే ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక్క సంవత్సరంలో నడుస్తావు” అని అన్నాడు. 
ముకుందం మాటలు విన్న బాలా చాలా ఆనందపడ్డాడు. 
“నువ్వు చెప్పేది నిజమా బాబాయ్!” అని ఆతృతగా అడిగాడు బాలా.
“అవునురా! మీ నాన్నకేం కాదు… నువ్వెల్లి చదువుకో” అని బాలాని అక్కడ నుండి పంపించేసి ఫిజియోథెరపీ చేస్తూ, “చూడు కోటి… ఏ వయసులో ఎలాంటి ఆలోచనలు ఉండాలో అలాంటి ఆలోచనలే ఉండనివ్వాలి. అలా కాదని పెద్ద పెద్ద ఆలోచనలు వాడిలో నాటకు. స్నేహితునిగా చెబుతున్నాను, నువ్విలా చేస్తే తరానికి విరుద్ధంగా నడుస్తాడు వాడు. వయసుకి మించిన వైరాగ్యం అనేది విషం లాంటిది” అని మెత్తగా మందలిచడం మొదలెట్టాడు. 
కోటేష్ నిరాసక్తిగా చూస్తూ, “ఇప్పుడు వాడిని అలా మలుచుకోకుంటే వాడు గెలుపును తప్ప ఓటమిని ఒప్పుకోలేక పిచ్చివాడు అవుతాడు.. అది చూసి నా ఆత్మ ఏ లోకంలో ఉన్న సంతోషించదు రా” అని అన్నాడు. 
ముకుందం కోపంగా చూస్తూ, “నీకున్న వైరాగ్యంతో ఇప్పుడే చావుని ఆహ్వానిస్తున్నావు” అని కసురుకుంటు అన్నాడు. 
కోటేష్ నవ్వుతూ, “నేను చచ్చిన ఆలోచనల రూపంలో నా కొడుకులో బతికే ఉంటాను” అని నిక్కచ్చిగా అన్నాడు. 
కోటేష్ తనకి వీలు కుదిరినప్పుడల్లా బాలాని దగ్గరికి పిలిచి జీవితం ఏంటో అర్థం అయ్యేలా చెప్పడం మొదలు పెట్టాడు. జీవితాన్ని ఎలా గడపాలో చెబుతూ ధైర్యాన్ని నూరి పోస్తూనే ఉన్నాడు. చివరికి తండ్రి మాటలు విని చావు పుట్టుకలకు స్పందించని వాడిలా తయారయ్యాడు బాలా. 
అది ఎంత వరకి దారి తీసిందంటే… చేయకూడని తప్పు చేసాడు. అవును, లోకంలో ఏ కొడుకు చేయని పని తాను చేసాడు బాలా. తన తండ్రిని తన చేతులతో తానే చంపుకున్నాడు. 
తర్వాత ఏం అయిందో తెలుసుకోవాలంటే.. చెలీ చెలీ నిన్నే కోరి వలచా… నెక్స్ట్ ఎపిసోడ్ చదివేయండి