New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మహారాణా ప్రతాప్ – 3

మహారాణా ప్రతాప్ – 3

:: మూడవ భాగం ::

సింహాళ రాజ్యం: (శ్రీలంక)

సింహాల రాజ్యాన్ని గంధర్వ సేన్ పరిపాలిస్తున్నాడు . . అతని భార్య చంపావతి . . వీళ్ళిద్దరి పుత్రిక యువరాణి పద్మిని దేవి . . ఈ పద్మిని దేవి కి మరోపేరు పద్మావతి . .

అక్కడ రాజ్య ప్రజలకు ఎప్పుడు పద్మిని దేవి కనిపించిన అక్కడున్న వారందరి కళ్ళన్నీ పద్మిని దేవి పైనే ఉండేవి . . అంతటి అందం తన సొంతం . . తన పదహారవ యేట జరిగిన పుట్టినరోజు నాడు దేశంలోని వివిధ రాజ్యాల నుండి బహుమతులు లభించాయి . . అందులో ఒక మాట్లాడే చిలుక యువరాణి పద్మిని దేవికి చాలా నచ్చింది . . ఆ చిలుక కి హిరణ్య మణి అనే పేరును పెట్టింది పద్మిని దేవి . . అలా చాల రోజుల తరువాత తన కూతురికి వివాహం జరిపించాలనే ఉద్దేశంతో గంధర్వ సేన్  స్వయంవరాన్ని ఏర్పాటు చేసి వివిధ రాజ్యాల రాజులను , రాజ్ పుత్ రాజులను మరియు క్షత్రియ రాజులను ఆహ్వానించాడు . .

ఆహ్వానాన్ని స్వీకరించి రావల్ రతన్ సింగ్ ఆ స్వయంవరానికి విచ్చేసారు . . రాజులందరూ కూడా తమ వంశాన్ని పెంచుకోవడానికి అనేక వివాహాలు చేసుకునేవారు . . స్వయంవరం లో తన ప్రత్యర్థి అయిన మల్కాన్ సింగ్ ని ఓడించి విజయం సాధించాడు రావల్ రతన్ సింగ్ . . గంధర్వ సేన్ తన కూతురు అయిన పద్మిని దేవి ని రతన్ సింగ్ కి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు . . తన సంపదలో సగ భాగాన్ని కూడా వివాహ కానుకగా ఇచ్చాడు గంధర్వ సేన్ . .

చిత్తోర్ ఘర్ :

రతన్ సింగ్ లాంటి భర్త దొరకడం రాణీ పద్మిని దేవి గత జన్మ వరంగా భావించింది . . రతన్ సింగ్ కి కళ మీద మక్కువ ఎక్కువ . . అందుకే తన భవనంలో కళాకారులు ఎక్కువగా ఉండేవారు . . ఆ కళాకారులలో ఒకడు రాఘవ్ చేతన్ . . ఇతను ఒక సంగీత విద్వాంసుడు . . అతను మురళీ గానాన్ని వాయించడం మొదలు పెడితే ఎంతటి వారైనా రాఘవ్ చేతన్ ని ప్రశంసించకుండా ఉండలేరు . . రాఘవ్ చేతన్ మురళీగానం వాయించడంతో పాటు క్షుద్ర పూజలు కూడా చేస్తూ ఉంటాడు అని రాజ్య ప్రజలకు తెలిసింది . . ఆ వార్త ఆ నోటా ఈ నోటా పడి రాజు అయిన రతన్ సింగ్ చెవిన పడింది . .

ఇక రాజు అయిన రతన్ సింగ్ తన రాజ్యం నుంచి రాఘవ్ చేతన్ ని బహిష్కరించాడు . . ప్రజల అందరి ముందు అవమానాన్ని అనుభవించిన రాఘవ్ చేతన్ , రతన్ సింగ్ పై కక్షతో ఆ రాజ్యాన్ని వదిలి పెట్టాడు . . రతన్ సింగ్ ని ఎలాగైనా దెబ్బతీయాలని భావించాడు . . కాని అది అంత తేలికైన విషయం కాదు అని రాఘవ్ చేతన్ కి తెలుసు . . ఎందుకంటే రాజ్ పుత్ రాజుల శౌర్య పరాక్రమాలు ఎప్పటినుండో చూస్తున్నాడు రాఘవ్ చేతన్ . . అందువల్ల అతని కంటే పరాక్రమవంతుడు అయిన వారి కోసం వెతకడం మొదలుపెట్టాడు . . ఆ సమయంలో రాఘవ్ చేతన్ కి ఢిల్లీకి సుల్తాన్ అయిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ వీరత్వం మరియు అతని సైనిక బలం గురించి తెలిసింది . . రతన్ సింగ్ ని మట్టుపెట్టడం కేవలం ఢిల్లీ సుల్తాన్ అయిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ కే సాధ్యమని ఢిల్లీకి బయలుదేరారు . .

1296 సంవత్సరంలో సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ తన మామ అయిన జలాలుద్దీన్ ని దారుణంగా హతమార్చి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు . . అతనికి అమితమైన రాజ్యకాంక్ష మరియు అధికార దాహం ఉండేది . . అసంఖ్యాకమైన ఏనుగులు , 70 వేల అశ్వాల తో గొప్ప సైనిక బలం తోడు కావడంతో , తను అడుగు పెట్టిన ప్రతీ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి , కనిపించిన ప్రతీ సంపదను దోచుకోవాలి అనే పేరాశ అతనిలో పెరిగిపోయింది . .

తన రాజ్యాన్ని విస్తరిస్తూ చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలను ఓడించి తన రాజ్యంలో కలుపుకున్నాడు . .

అలాంటి బలగం ఉన్న అల్లా ఉద్దీన్ ఖిల్జీని రతన్ సింగ్ పైకి ఉసిగొలిపితే తన కక్ష తీరుతుందని పన్నాగం పన్నాడు రాఘవ చేతన్ . . కానీ లక్షల మంది సైన్యం , కోట్ల కొద్దీ సంపద అల్లాఉద్దీన్ ఖిల్జీ సొంతం . . అంతటి రాజు ని కలవడం రాఘవ్ చేతన్ కి అంత సులభం కాదని అర్థమైంది . . కాని ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్నాడు రాఘవ్ చేతన్ . .

అల్లాఉద్దీన్ ఖిల్జీ తరచుగా వేటకు అరణ్యం లో కి వెళ్తాడు . . ఆ విషయం తెలిసి , తనని కలవడానికి అరణ్యమే సరైన మార్గం అని భావించిన రాఘవ చేతన్ , ఆ అరణ్యం లో ఎదురు చూస్తున్నాడు . . ఎప్పటిలాగే అల్లా వుద్దీన్ ఖిల్జీ అడవికి రావడం , అదే సమయంలో రాఘవ్ చేతన్ తన మురళీగానం మొదలుపెట్టడం , ఆ మురళి గానానికి అల్లా ఉద్దీన్ ఖిల్జీ దాసోహం అవ్వడం , రాఘవ్ చేతన్ ని తన రాజ్యానికి ఆహ్వానించడం జరిగింది . .

అల్లా ఉద్దీన్ ఖిల్జీ కోటకు చేరినప్పటి నుంచి రతన్ సింగ్ ని ఎలా అయినా దెబ్బ కొట్టాలి అనే విషయం పైనే ఆలోచించసాగాడు రాఘవ్ చేతన్ . . అందుకు రతన్ సింగ్ భార్య అయిన రాణీ పద్మిని దేవి అందచందాల గురించి అల్లా ఉద్దీన్ ఖిల్జీ కి చెప్పడం మొదలు పెట్టాడు . .

రాణీ పద్మిని దేవి సౌందర్యం గురించి ప్రతి రాజ్యం చెప్పుకునే అంత అందంగా ఉంటుంది . . నీరు తాగినా గొంతులో కనిపించేంత లేత బంగారు మేనిఛాయ కలిగి , ఆమె సుమనోహర సుందర రూపాన్ని తిలకించడానికి సూర్యచంద్రులు సైతం క్షణం ఆగి వెళ్తారు . . ఆమె సౌందర్యం గురించి చాలామంది కవులు చాలా గొప్పగా చెబుతూ ఉండేవారు . .

ప్రతిరోజు , ప్రతి మాట రాణి పద్మిని దేవి గురించి చెబుతూ ఉండేవాడు రాఘవ్ చేతన్ . . రాణీ పద్మిని దేవి అందం గురించి విన్న అల్లా ఉద్దీన్ ఖిల్జీ , మాటలలోనే ఇంత అందం ఉందంటే , ఆ రాణి ని ఎదురుగా చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో అని , తన సొంతం చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో అని ఆలోచించి , ఎలాగైనా రాణీ పద్మిని దేవిని తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు . .

◆ ◆ ◆ ◆ ◆ ఇంకా ఉంది ◆ ◆ ◆ ◆ ◆

ఈ భాగం చదివిన తరువాత మీ విలువైన సమీక్షలతో నన్ను ప్రోత్సాహించి , సబ్స్క్రయిబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు! మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹’