నువ్వే కావాలి ❤️ – 1
“ప్లీజ్ అమ్మ!! ఈ ఒక్క ట్రిప్… మళ్లీ ఇంకెక్కడికి వెళ్తాను అని అడగను” అని బ్రతిమాలుతుంది రాజి..
“వద్దంటే వినిపించుకోవేంటి? మగ పిల్లలు ఆడపిల్లలు అందరూ కలిసి ఒకే బస్సులో ట్రిప్ కి వెళ్తారు అట… పోనీ అక్కడ ఏదైనా బస ఏర్పాటు చేస్తారంటే అక్కడ మీరందరూ క్యాంపులు వేసుకుంటారా క్యాంపులు. చూడమ్మా ఈ కాలం అబ్బాయిలని నమ్మేంత ధైర్యం నేను చేయలేను” అంది తల్లి సుజాత.
“అబ్బా!!! నన్ను ఇబ్బంది పెట్టడం తప్ప వాళ్ళకి వేరే పని లేదు అనుకున్నావా ఏంటి? నేనే కాదు మరొక 30 మంది మా క్లాస్మేట్స్ అమ్మాయిలు కూడా వస్తున్నారు. అమ్మాయిలందరూ ఒకవైపు అబ్బాయిలందరూ ఒకవైపు క్యాంపింగ్ టెంట్స్ వేసుకుంటారు… ఇటు మాకు లేడీ లెక్చరర్స్ అటు వాళ్లకి సార్ వాళ్ళు అందరు కాపలా కాస్తూనే ఉంటారని” అంది రాజు.
“ఏం లెక్చరర్స్ మాత్రం మనుషులు కాదా? వాళ్లకి మాత్రం ఎంతసేపని కాపలా కాయడానికి ఓపిక ఉంటుంది? వాళ్లు కూడా ఏదో ఒక టైంలో కన్ను మలిగి నిద్రపోతారు. నాకు ధైర్యం లేదు అంటున్నాను కదా” అని సుజాత గట్టిగా చెప్పడంతో ఏడుస్తూ బయటికి వచ్చి కూర్చుంది రాజి.
అప్పుడే లోపలికి వచ్చిన సుధాకర్ గారు ఏడుస్తూ మెట్ల మీద కూర్చున్న కూతుర్ని చూసి “ఏమైందమ్మా?” అన్నాడు.
“కాలేజ్ అందరికీ ఫారెస్ట్ ట్రిప్ ఉంది డాడీ… నేను కూడా వెళ్తాను అంటే అబ్బాయిలు ఉంటారు…వాళ్ల మీద నాకు నమ్మకం లేదు…నువ్వు వెళ్ళొద్దని అమ్మ ఒప్పుకోవడం లేదు” అంది.
“ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు” అని సుధాకర్ గారు అడగడంతో “30 మంది అమ్మాయిలు 15 మంది అబ్బాయిలు. పైగా వాళ్లందరూ నాకు త్రీ ఇయర్స్ నుంచి తెలిసిన క్లాస్మేట్స్. అందరం ఫ్రెండ్లీగా ఉంటాం డాడీ” అంది రాజి…
“అయితే మిమ్మల్ని చూసి అబ్బాయిలు బాధపడాలి కానీ మీ అమ్మ భయం ఏంటంట?” అని సుధాకర్ గారు నవ్వి “ఇంతకీ ట్రిప్ ఫీజ్ ఎంత?” అని అడిగాడు…
“అంటే డాడీ” అని సంశయిస్తుంటే “చెప్పమ్మా” అంటూ ఉంటే “పదివేలు డాడీ” అని చెప్పింది.
“పదివేలు ఎందుకే నీకు?” అని మళ్లీ సుజాత అరుచుకుంటూ బయటికి వచ్చి “వాళ్ళు ఏమైనా లగ్జరీ హోటల్ కి తీసుకొని వెళ్తున్నారా? లేదా మూడు పూటలు పంచభక్ష్య పరమాన్నాలు పెడుతున్నారా? పైగా మీరే వండుకుని తినాలి….దానికి ఎందుకే 10000 ఇవ్వాలి” అంది.
“అంటే మేం వెళ్లాలనుకుంటున్న ఫారెస్ట్ చాలా దూరం…పెట్రోల్ కి చాలా ఖర్చు అవుతుంది. పైగా క్యాంపింగ్ టెంట్, కుకింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ తీసుకోవాలి కదా” అనగానే “ఇన్ని కొన్నా కూడా ఇంకా మీరు ఇచ్చే ఫీజులు వాళ్ళకి చాలా మిగిలిపోతాయి… ఎంతసేపు మనవల్ల అవతల వాడు బాగుపడడమే గాని మనకి రూపాయి ఉపయోగం ఉండదు కదా” అంది ఆవిడ వెటకారంగా….
“అబ్బా మమ్మీ” అని మొండి పట్టు పడుతుంటే “పదివేలు నా దగ్గర కూడా లేవమ్మా… 5000 ఉంటే అందులో 2000 పెట్టి మీ నాన్నమ్మకి మందులు ఇంట్లో సరుకులు మిగిలిన డబ్బులతో తీసుకొచ్చాను” అని చెప్పాడు సుధాకర్ బాధగా….
రాజి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం… అయితే బాగా ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టాలి లేదంటే ఏమీ లేని వాళ్ళ ఇంట్లో పుట్టాలి ఇలా మధ్యతరగతి జీవితం మాత్రం ఉండకూడదని ఏదో సినిమాలో విన్నది తను.. తనకి అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది…తన తల్లిదండ్రులు తనకి కావాల్సినది ఇవ్వడం లేదని కాదు… ఏదో తప్పు చేసినట్టుగా తండ్రి తన ముందు నిలబడడం ఆమెకి నచ్చక….
అప్పటివరకు మొండి చేసిన తను నెమ్మదిగా లేచి “పర్వాలేదులే డాడీ… మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఫొటోస్ తీసుకుంటారు కదా…. అవన్నీ చూస్తాను…. పైగా అడవుల్లో ఏముంటాయి చెట్లు చేమలు తప్ప… పర్వాలేదులే” అంది నవ్వుతూ….
అప్పటివరకు మొండి పట్టుపడుతోందని కోపం చూపించిన సుజాత ఒక్కసారిగా కూతురి వైఖరికి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే “మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మరి నేను ఎందుకు వెళ్లాలనుకుంటాను డాడీ…. అప్పుడు ఏదో అలా అనిపించింది కానీ ఈసారి మనమే మంచి ట్రిప్ తిరుపతికి వేద్దాం” అని చెప్పింది రాజి…
“సరిపోయింది… మీ కూతురు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు… ఇప్పుడే గోల గోల చేసి అప్పుడే మిమ్మల్ని చూసి కరిగిపోయిందని” సుజాత లోపలికి వెళ్ళిపోయింది….
తను ఇప్పుడు ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతోంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి ఇంకా ఆరు నెలలు టైం పడుతుంది. ఇటు కుటుంబంలో చూస్తే తండ్రికి వయసు మీద పడుతుంది. తన ఫీజులు నాన్నమ్మ మందుల ఖర్చులు ఇంట్లో అవసరాలు ఇవన్నీ తీర్చడానికి తండ్రి బాగా కష్టపడుతున్నాడు. అది సరిపోదు అన్నట్టు హాస్టల్లో జాయిన్ చేసిన తమ్ముడు ఫీజు మరొక బరువు. అందుకే ఏదో నిశ్చయించుకున్నట్టుగా తన ఫ్రెండ్ కావేరికి ఫోన్ చేసింది.
“ఏంటే ట్రిప్ కి వస్తున్నావా?” అనగానే “ట్రిప్పు లేదు కప్పు లేదు… నాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదు కానీ లాస్ట్ మంత్ మీ అక్క ఏదో కంపెనీలో జాబ్ జాయిన్ అయింది. ఇంకా వేకెన్సీలు ఉన్నాయి వీలైతే నిన్ను నన్ను కూడా ట్రై చేయమని చెప్పింది కదా. నేను ఇప్పుడు ట్రై చేయాలనుకుంటున్నాను. వీలవుతుందేమో మీ అక్కని అడుగుతావా?” అంది.
కంటిన్యూస్!!!
ఇది నా మొదటి కథ… చదివి ఎలా ఉందో చెప్పండి..
Swipe left/right or tap the sides to turn pages