ష్…!! – 1
రేయ్ రవి… ఆ సౌండ్ తగ్గించరా బాబు..! నువ్వు నడిపే స్పీడ్‌కే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఆ స్పీకర్ సౌండ్‌కి గుండెలు అదురుతున్నాయి!”
కారు వేగానికి అటూ ఇటూ ఊగిపోతున్న తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి సీట్‌ని గట్టిగా పట్టుకుంటూ అరిచింది నిత్య.
కానీ ఆమె మాటలు ఆ కారులో మోగుతున్న మ్యూజిక్ ముందు తేలిపోయాయి.
ధమ్… ధమ్… ధమ్…!
మ్యూజిక్ సిస్టం బాస్ సౌండ్‌కి కారు డోర్లు సైతం కంపిస్తున్నాయి. కార్ వేగానికి బయట గాలి, కార్ విండోస్ని బలంగా తాకుతుంటే, ఇంజిన్ చేసే గాండ్రింపు ఆ మ్యూజిక్‌కి తోడైంది.
వ్రూమ్… వ్రూమ్… వ్రాఆఆమ్…!
రోడ్డుపై దూసుకెళ్తున్న స్పోర్ట్స్ కార్ స్పీడోమీటర్‌లో ముల్లు అంతకంతకూ పైకి వెళ్తోంది.
“అరేయ్ రవి బ్రో! ముందు రోడ్డు చూడు రా! స్పీడోమీటర్ చూస్తుంటే నా గుండె ఆగిపోయేలా ఉంది!” వెనుక సీట్‌లో కూర్చున్న అఖిల్ నవ్వుతూ అరిచాడు.
“నీ గుండె ఆగిపోతే నాకు చెప్పరా… కార్డియాలజిస్ట్‌కి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ ఇప్పిస్తా!” స్టీరింగ్ తిప్పుతూ వెటకారంగా అన్నాడు రవి.
“హాహాహా…! వీడికి రోడ్డుమీద రేసింగ్ చేయడం, మనల్ని చంపడం రెండూ ఒకటే రా!” పక్కనే ఉన్న కార్తీక్ నవ్వాడు.
“చంపడమేంటి బే! మీ లాంటి పిరికిపందల్ని తీసుకొచ్చి నా గర్ల్‌ఫ్రెండ్‌కి పరిచయం చేయడమే నేను చేసిన తప్పు!” నవ్వుతూ అన్నాడు రవి.
“ఒరేయ్… ఎవడ్రా నీ గర్ల్‌ఫ్రెండ్? ముందు ఆ కారుని నెమ్మదిగా నడుపు. తర్వాత నీ లవ్ స్టోరీ వింటాం!” అఖిల్ వెంటనే కౌంటర్ ఇచ్చాడు.
వాళ్ళ మాటలు వింటున్న రమ్య ఒక్కసారిగా ముందుకు వంగి, నిత్య చెవిలో అరిచింది.
“ఏయ్ నిత్యా…! ఏంటే అలా బిగుసుకుపోయి కూర్చున్నావ్? రిలాక్స్ బేబీ! ఇది మన కాలేజీ ట్రిప్. ఎగ్జామ్స్ అయిపోయాయి, అసైన్‌మెంట్స్ అయిపోయాయి, లెక్చరర్ల టార్చర్ అయిపోయింది. ఇంకో వారం రోజుల పాటు మనకి ఎలాంటి టెన్షన్లు లేవు. వుయ్ ఆర్ ఫ్రీ బర్డ్స్!”
“ఫ్రీ బర్డ్స్ కాదు… ఫ్లయింగ్ డెడ్ బాడీస్‌లా ఉన్నాం!” నిత్య చిరాకుగా అంది.
“హే…! డోంట్ బీ సో డ్రామాటిక్!” రమ్య నవ్వింది.
“డ్రామానా? ఒక్కసారి బయట చూడు. చెట్లన్నీ వెనక్కి పరుగెడుతున్నాయా, మనమే ముందుకు వెళ్తున్నామా అర్థం కావడం లేదు. ఇంకొంచెం స్పీడ్ పెంచితే మనం కారులో కాదు, యముడి బండిలో ఉంటాం!” బెదురుతు అంది నిత్య.
“అబ్బా… నిత్యా! నువ్వు ఎప్పుడూ ఇంతే. ఏదైనా కొత్తగా ఎంజాయ్ చేద్దామంటే నీకు అన్ని భయాలే!” అంది రమ్య.
“కొత్తగా ఎంజాయ్ చేయడానికి ప్రపంచంలో చాలా మార్గాలున్నాయి. కారుని విమానంలా నడపడం ఒక్కటే మార్గం కాదు!” రోషంగా అంది నిత్య.
ఆ మాటకి వెనుక కూర్చున్న అఖిల్ పగలబడి నవ్వాడు.
“బ్రో… రవి! విన్నావా? మన నిత్యకి స్పీడ్ అంటే భయమట. ఈమెని మనం హాలిడేకి తీసుకెళ్తున్నామా, లేక స్కూల్ పిక్నిక్‌కి తీసుకెళ్తున్నామా?”
“అఖిల్… నీ నోరు మూసుకోరా! నువ్వు కూడా వాడికి సపోర్ట్ చేస్తే నేను ఈ కారులో నుంచి దూకేస్తాను!” నిత్య కోపంగా అంది.
“దూకేయ్ బేబీ… కానీ ముందు కార్ డోర్ లాక్ తీసేయ్!” అఖిల్ వెటకారంగా అన్నాడు.
“ఛీ… మీరసలు మనుషులేనా?”
అప్పటికే రవి స్పీడ్ మరింత పెంచాడు.
వ్రాఆఆఆమ్…!
ఇంజిన్ గర్జనతో పాటు టైర్లు రోడ్డుమీద రాపిడి చేస్తూ శబ్దం చేశాయి.
“రవి! ఐ యామ్ సీరియస్! స్పీడ్ తగ్గించు!” నిత్య గొంతులో ఈసారి నవ్వు లేదు.
“ఓకే మేడమ్! జస్ట్ రిలాక్స్. ఇంకో టెన్ మినిట్స్‌లో మనం డెస్టినేషన్‌కి చేరిపోతాం.”
“అవును నిత్యా! నువ్వు ఇలా భయపడుతూ ఉంటే అక్కడికి వెళ్లాక దెయ్యాలు కూడా నిన్ను చూసి భయపడతాయి!” రమ్య ఆటపట్టించింది.
“దెయ్యాలా? వాటి పేరు ఎత్తకే! నాకు ఆ పేరు వింటేనే చిరాకు!” నిత్య వెంటనే అంది.
“ఓహో…! అంటే దెయ్యాలంటే భయమన్నమాట!” అఖిల్ గొంతు మార్చి, దెయ్యంలా నటిస్తూ అన్నాడు.
“నిత్యా… నిత్యా… నీ వెనకే ఒక దెయ్యం ఉంది…!”
“అఖిల్! నిన్ను చంపేస్తాను… నోరు మూయ్!” ఇర్రిటేట్ అయింది నిత్య.
కారులో నవ్వులు మిన్నంటాయి.
ఆ నవ్వుల మధ్య నిత్య మాత్రం కళ్ళు మూసుకుని మనసులో దుర్గమ్మని తలుచుకుంది.
‘అమ్మా తల్లి దుర్గమ్మా… వీళ్ళతో హాలిడేకి వచ్చి పెద్ద తప్పే చేశాను. వీళ్ళందరికీ బుద్ధి వచ్చేలా చూడు తల్లీ. కనీసం నా ప్రాణాలైనా కాపాడు!’
ఆమె ప్రార్థన దేవుడికి వినిపించిందో, ప్రకృతికి వినిపించిందో తెలియదు.
కానీ…
ఒక్కసారిగా…
కీచ్ఛ్ఛ్ఛ్ఛ్ఛ్…!
టైర్లు రోడ్డుపై రాపిడి చేస్తూ భయంకరమైన శబ్దంతో అరిచాయి.
కారు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది..
“అమ్మోఓఓఓ…!”
“ఏయ్… ఏం చేస్తున్నావ్ రా!”
“రవీ… బ్రేక్! బ్రేక్ రా!”
అప్పటివరకు రవి స్పీడ్‌కి ఫుల్ సపోర్ట్ చేసిన మిత్రబృందం ఒక్కసారిగా సీట్లను పట్టుకుని కేకలు పెట్టింది.
ధడేల్…!
కారు రోడ్డుకు అడ్డంగా ఆగిపోయింది.
కొన్ని క్షణాల పాటు కారులో నిశ్శబ్దం.
స్పీకర్‌లో పాట మాత్రం ఇంకా మోగుతూనే ఉంది.
ధమ్… ధమ్… ధమ్…
“రేయ్… రవి…!” అఖిల్ వణుకుతున్న గొంతుతో పిలిచాడు.
“ఏమైందిరా…?” రవి కూడా షాక్‌లోనే ఉన్నాడు.
“ఏమైందా? ఇంకో రెండు సెకన్లు లేటైతే మనందరం పైన టికెట్లు బుక్ చేసుకునేవాళ్ళం!” కార్తీక్ అరిచాడు.
“సడెన్గా రోడ్డు మధ్యలో ఏదో వచ్చింది రా!” రవి ముందున్న చీకటివైపు చూస్తూ అన్నాడు.
“ఏమొచ్చింది?” రమ్య అడిగింది.
“తెలీదు… ఏదో నల్లటి ఆకారం. ఒక్కసారిగా ఎదురొచ్చింది.”
“నల్లటి ఆకారమా?” నిత్య నెమ్మదిగా అడిగింది.
Swipe left/right or tap the sides to turn pages