ప్రణయం శరణం గచ్ఛామి – 3
ఎపిసోడ్ 3
మరునాడు ఉదయం..సైడ్ టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవ్వడంతో ప్రజ్వలకు మెలకువ వచ్చింది. కళ్లు నులుముకుంటూ స్క్రీన్ పై పేరు చూసి టక్కున కాల్ లిఫ్ట్ చేసింది.
“హా.. బాబాయ్! బాగున్నారా? అక్కడ పిన్ని, నీరూ అందరూ బాగున్నారా?” ఆత్రుతగా అడిగింది.
అవతల నుంచి బాబాయ్ గొంతు కాస్త బరువుగా వినిపించింది.
“అందరం బానే ఉన్నాం ప్రజూ.. కానీ.. ఇక్కడ హాస్పిటల్ బిల్స్ పెరిగిపోతున్నాయి తల్లీ. డాక్టర్లు అర్జెంట్‌గా అమౌంట్ కట్టమంటున్నారు. ఇంకోవైపు ఇంకో ఫిఫ్టీన్ డేస్ దాటితే మనం ఇంటి మీద తెచ్చిన లోన్ తీర్చలేమని,
వేలం పాట వేసి ఇల్లు సీజ్ చేస్తామని బ్యాంక్ వాళ్లు నోటీస్ ఇచ్చారు ప్రజూ.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. మన ఇల్లు మనకి దక్కదేమో అనిపిస్తోంది తల్లీ..” బాబాయ్ గొంతులో తీవ్రమైన ఆవేదన.
ప్రజ్వల గుండె ఒక్క క్షణం ఆగినంత పనైంది. కానీ వెంటనే తనను తాను తమాయించుకుని, ఎంతో దృఢంగా అంది.
“లేదు బాబాయ్! నేను ప్రాణాలతో ఉండగా మన ఇల్లు వేలం వేయడానికి నేనస్సలు ఒప్పుకోను.
అది నాన్న రక్తం ధారపోసి కట్టిన ఇల్లు.. మనకి దక్కకుండా పోనివ్వను.”
“ఆడపిల్లవి తల్లీ.. అందునా చిన్నదానివి.. ఇంత పెద్ద మొత్తం అరేంజ్ చేయడం నీ ఒక్కదాని వల్ల ఎలా సాధ్యమవుతుంది చెప్పు? నాకు చాలా టెన్షన్‌గా ఉంది ప్రజూ..”
“నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను బాబాయ్. మీరు ధైర్యంగా ఉండి నాన్నను చూసుకోండి చాలు.”
వాళ్లకు ధైర్యం చెప్పి కాల్ కట్ చేసినా..
ప్రజ్వల చేతులు వణికిపోయాయి. సరిగ్గా పదిహేను రోజులే టైమ్ ఉంది! ఎలా? ఎక్కడి నుంచి తేవాలి అంత డబ్బు?
లోపల రగులుతున్న టెన్షన్‌ను దిగమింగుకుని, ఫ్రష్ అయ్యీ రెడీఅయ్యి ఫైల్ చేత పట్టుకుని హాల్‌లోకి వచ్చింది ప్రజ్వల.
ఎదురుగా రాజావారి గది వైపు చూసింది.. డోర్ ఇంకా వేసే ఉంది. రోజూ ఉదయం ఐదు గంటలకే వాకింగ్ ముగించుకుని హాల్లో న్యూస్ పేపర్ తిరగేసే మనిషి, ఇంత టైమ్ అవుతున్నా ఇంకా బయటకు రాలేదు!
అప్పుడే డైనింగ్ టేబుల్ సర్దుతున్న కనకం ప్రజ్వలను చూసి దగ్గరకు వచ్చింది.
“అమ్మాయి గారూ.. బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉంది, రండి చేస్తారుగాని.”
“హా.. వస్తున్నాను కనకమ్మా. కానీ ఏమైందీరోజు? తాతయ్య ఇంకా నిద్ర లేవలేదేంటి?” అనుమానంగా అడిగింది ప్రజ్వల.
కనకం ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది.
“ఏం చెప్పమంటారమ్మా.. లోకంలో అందరూ డబ్బుంటేనే సర్వసుఖాలూ ఉన్నట్టనుకుంటారు.
కానీ ఎన్ని కోట్లు గుమ్మరించినా తీరని సమస్యలు ఈ ప్రపంచంలో చాలా ఉంటాయి.. మన రాజావారి పరిస్థితీ సరిగ్గా అలాంటిదే తల్లీ..” అంది కనకం విచారంగా.
ప్రజ్వల కనుబొమ్మలు ముడిపడ్డాయి. “అంత మాటన్నారు.. ఆయనకు కోట్ల ఆస్తి ఉంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది..
ఆయనకు తీరని సమస్య ఏముంది? నాతో కూడా చెప్పుకోలేని సీక్రెట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కనకమ్మా?”
కనకం చుట్టూ చూసింది.
‘ఈ ఇంట్లో రాజావారి మనసును కుదుటపరచగలిగేది ఈ అమ్మాయి ఒక్కతే.. ఆయన మనసులో గూడుకట్టుకున్న కోరికను బయటపెట్టడానికి ఇదే రైట్ టైమ్’ అని మనసులో అనుకుంది.
“అదీ.. అమ్మాయిగారూ.. మన రాజావారు లేరూ.. ఆయనకిప్పుడు ఆస్తిపాస్తులు కాదు కావాల్సింది.. ఆయన మనసుని తొలిచేస్తున్నది ఏంటంటే..” అంటూ కనకం నోరు విప్పబోయింది.
సరిగ్గా అదే సమయానికి గది తలుపులు తెరుచుకున్నాయి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఫ్రెషప్ అయి బయటకు అడుగుపెట్టారు.
“హా.. రెడీ అయ్యావా తల్లీ.. గుడ్! టైమ్ మెయింటెనెన్స్ అంటే నీదే!” ముఖంపై బలవంతపు నవ్వును పులుముకుంటూ అన్నారు రాజావారు.
ప్రజ్వల చిన్నగా నవ్వి, “అదేం లేదు తాతయ్యా, నాకంటే మీరే గ్రేట్! రోజూ మార్నింగ్ నాకంటే ముందే లేచి పేపర్ చదువుతూ కనిపిస్తారు. కానీ ఈరోజు ఏంటి ఇంత లేట్? మీరేనా లేచింది?” కొంటెగా అడిగింది.
“ఏం లేదమ్మా.. రాత్రి కాస్త నిద్ర పట్టక లేట్ గా పడుకున్నాను.. అంతే,” అంటూ భారంగా ఊపిరి పీల్చుకున్నారు ఆయన. ఆయన కళ్ల కింద నల్లటి చారలు, నిద్రలేని రాత్రిని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ప్రజ్వల ఆయన దగ్గరకు అడుగులు వేసింది. ఆమె కళ్లల్లో స్వచ్ఛమైన ఆందోళన.
“అదేంటి తాతయ్యా.. రాత్రి నిద్ర పట్టలేదా? ఇందాకే కనకమ్మ ఏదో ప్రాబ్లమ్ ఉందని అనబోయింది. అంత పెద్ద సమస్య ఏంటో నాతో షేర్ చేసుకోకూడదా?
చెబితే నా చేతనైన సాయం నేను చేస్తాను కదా.. ఒకవేళ నా వల్ల కాకపోయినా, అది సాల్వ్ అవ్వడానికి నా వంతుగా ఆలోచిస్తాను కదా తాతయ్యా!” ఎంతో భరోసాగా, ఆప్యాయంగా అంది.
ఆ మాటలకు రాజావారు ఒక్కసారిగా తలఎత్తి ప్రజ్వల కళ్లల్లోకి చూశారు.
ఒకవైపు తనకు ఎంతో అవసరమైన జాబ్ కోసం వెళుతూ, నాకు ధైర్యం చెబుతుంది ఈ అమ్మాయి.. వొచ్చినప్పటి నుండి నీ సమస్య ఏంటని అడిగితే తను మాత్రం చెప్పదు..
ఇరవై ఐదేళ్ళున్న తనేమో చూస్కుంటుందంట.. ఇంత వయసున్న నాకు భరోసా ఇస్తుంది..అని మనసులో నవ్వుకున్నారు ఆయన..
అయినా తన బాధను ఏమాత్రం బయటపడనీయకుండా, నన్ను కనిపెట్టుకుని, తన సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉన్న ఆ కళ్లలోని ధైర్యం,
ఆత్మవిశ్వాసం, నిష్కల్మషమైన ప్రేమాభిమానాలను చూసి రాజావారి మనసు ఒక్కసారిగా బరువెక్కింది.
ఎంతటి మనసున్న పిల్ల! రెక్కలు రాగానే కన్నవాళ్లే బరువనుకునే ఈ రోజుల్లో.. ఒక్క నెత్తురు చుక్క సంబంధం లేకపోయినా,
ఈ పిల్లకు తనపై ఎంతటి అభిమానం!
కానీ.. ఆయన గుండెను పిండేస్తున్న ఆ సమస్య ఆమెతో ఎలా చెప్పగలరు? ఇప్పటికే తన ప్రాణాలు కాపాడి ప్రజ్వలకు రుణపడి ఉన్నాడు.. ఇప్పుడు మళ్ళీ ఎలా ఆమెను సాయం అడుగుతాడు..
ఇంతకీ కనకం ఏం చెప్పబోయింది? రాజావారు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ప్రజ్వల తన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తుంది?? తెలుసుకోవడానికి తర్వాత ఎపిసోడ్ చదవండి..
ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా Follow చేయండి, మీ Rating ఇవ్వండి అలాగే మీకు ఎలా అనిపించిందో Comment లో నాతో పంచుకోండి ప్లీజ్.. థ్యాంక్యూ!
Swipe left/right or tap the sides to turn pages