ఆమె ఇంకా అక్కడే ఉంది… – 2
ఎవరికి వారే బిజీ బిజీ గా ఉన్న హైదరాబాద్ లో ఒక వ్యక్తి మాత్రం కాలం గడవనట్టు, తన చేతిలోని కలం కూడా కదలక బయట ప్రాంచాన్ని చూస్తూ అలా ఆలోచనల్లో మునిగిపోయాడు. అప్పుడే అతనికి వచ్చిన లేఖ అతని ప్రయాణంను, అతని ఆలోచన లను మార్చబోతుంది అనుకున్నాడు. ఇక మరొక వైపు వేలగూడెం అనే ఒక ఊరిలోని పాత బంగ్లా లో ఒక అమ్మాయి హృదయాకార వెండి లాకెట్ ను పట్టుకుని ఎవరి కోసమో ఏదురు చూస్తూ ఉంది.
***
వేలగూడెంలోని ఆ పాత బంగ్లా లో గంభీరమైన పురుష స్వరం వినగానే అప్పటి వరకు సంతోషంతో వెలిగిపోతున్న ఆమె మొఖం బాధ తో, ఆవేదనతో, కంగారుగా ఉంది..
అక్కడి నుంచి వెనుతిరిగి, రెండో అంతస్తు కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఆ అమ్మాయి…
ఎదురు చూపుతో అదే దిశగా చూస్తూనే ఉంది.
ఆమెకు తెలుసు…
ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన కథ… చివరకు మళ్లీ మొదలు కాబోతోందని..
వర్షం మొదలైంది..
“కొన్ని దారులు గమ్యానికి తీసుకెళ్తాయి… కొన్ని దారులు గతానికి.”
ఇక్కడ హైదరాబాద్ లో…
ఆద్వైత్ బ్యాగ్ లో రెండు జతల బట్టలు, ల్యాప్‌టాప్, కెమెరా, తన పాత డైరీ పెట్టుకున్నాడు.
మరోసారి ఆ లేఖను చేతిలోకి తీసుకున్నాడు.
“మీరు వెతుకుతున్న కథ… మీ కోసం వేలగూడెం లో ఎదురు చూస్తోంది.”
మళ్లీ మళ్లీ ఆ వాక్యం అతని మనసులో తిరుగుతోంది.
కానీ.. “ఇది ఎవరు పంపారు…?” అన్న ప్రశ్నకు అతనికి సమాధానం దొరకలేదు.
అయినా కానీ…
వెళ్లాలనే నిర్ణయం మాత్రం మారలేదు.
కారు స్టార్ట్ చేసి నగరాన్ని దాటాడు.
మధ్యాహ్నానికి జాతీయ రహదారి పై ప్రయాణిస్తున్నాడు.
రెండు వైపులా పచ్చని పొలాలు, దూరంగా నల్లని మేఘాలు.
కారులో మెల్లగా పాత పాట వినిపిస్తోంది..
అయినా…
ఆద్వైత్ మనసు ప్రశాంతంగా లేదు.
ప్రతి కొన్ని నిమిషాలకు ఒకసారి…
రియర్ వ్యూ మిర్రర్ లోకి చూస్తున్నాడు.
ఎందుకో అతనికి.. వెనుక సీట్లో ఎవరో కూర్చున్నట్టుగా అనిపిస్తోంది.
ఒకసారి కారు ఆపి చూసాడు.
ఎవరూ లేరు.
“ఈ లేఖ వచ్చినప్పటి నుంచి నేనే మారిపోయానా ఏంటి?…” అని నవ్వుకున్నాడు.
అప్పుడే…
మొదటి వర్షపు చినుకు కారు గ్లాస్ పై పడింది.
కొన్ని క్షణాల్లోనే భారీ వర్షం మొదలైంది.
వైపర్లు వేగంగా తిరుగుతున్నా…
ముందున్న రోడ్డు సరిగ్గా కనిపించడం లేదు.
సరిగ్గా అప్పుడే…
రోడ్డు పక్కన ఒక పాత బోర్డు కనిపించింది.
“వేలగూడెం – 12 కి.మీ.”
అది చూడగానే ఆద్వైత్ లోపల ఒక తెలియని ఉద్వేగం కలిగింది.
“ఇంకా పన్నెండు కిలోమీటర్లే…” అని మెల్లగా అనుకున్నాడు.
అదే సమయంలో…
వేలగూడెంలోని పాత బంగ్లా.
కిటికీ అద్దాలపై వర్షపు చినుకులు బలంగా తాకుతున్నాయి.
ఆ అమ్మాయి అదే కిటికీ దగ్గర నిలబడి ఉంది.
ఆమె కళ్లలో చిరునవ్వు.
“వర్షం వచ్చేసింది…” అని మెల్లగా చెప్పుకుంది.
ఆమె పక్కనే ఉన్న పాత గడియారం ఒక్కసారిగా…
టన్… టన్… టన్…
మూడు సార్లు మోగింది.
ఆ శబ్దం ముగియగానే…
పై అంతస్తు నుంచి…
గజ్జెల శబ్దం.
ఘల్…
ఘల్…
ఘల్…
ఆ శబ్దం నెమ్మదిగా మెట్ల వైపు వస్తోంది.
కానీ… ఆ అమ్మాయి మాత్రం కదల్లేదు.
ఆమె కళ్లను మూసుకుని, చాలా ప్రశాంతంగా..
“ఇంకా సమయం రాలేదు…” అంది.
ఆ మాట వినగానే…
గజ్జెల శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది.
మళ్లీ…
ఇల్లంతా నిశ్శబ్దం.
రోడ్డు మీద…
ఆద్వైత్ కారు ఒక్కసారిగా ఆగిపోయింది.
ఇంజిన్ ఆఫ్ అయింది. మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఫలితం లేదు.
బయట…
భారీ వర్షం.
మొబైల్ తీసి చూశాడు. సిగ్నల్ లేదు.
“ఇది కూడా ఇప్పుడే జరగాలా…” అని చిరాకుగా కారులో నుంచి దిగాడు.
వర్షం అతన్ని పూర్తిగా తడిపేసింది.
దూరంగా…
మెరుపు మెరిసింది.
ఆ వెలుగులో…
కొండ పై ఒక పెద్ద పాత బంగ్లా కనిపించింది.
అది కేవలం ఒక్క క్షణం మాత్రమే కనిపించింది.
మెరుపు మాయం అవగానే…
మళ్లీ చీకటి.
ఆద్వైత్ మరోసారి చూసాడు. అది అక్కడే ఉంది.
“బహుశా… అక్కడ ఎవరైనా ఉంటారేమో” అని తన బ్యాగ్ తీసుకుని నడవడం మొదలు పెట్టాడు.
వర్షం మరింత బలంగా కురుస్తోంది.
అతని ప్రతి అడుగుతో… మట్టి కాళ్లకు అంటుకుంటోంది.
గాలి గట్టిగా ఈల వేసినట్టు గా వీస్తుంది.
ఆద్వైత్ ఆ బంగ్లా దగ్గరికి చేరుకున్నాడు..
భారీ ఇనుప గేటు. దానిపై తుప్పు పట్టిన బోర్డు. ఆ బోర్డ్ మీద..
“ప్రవేశం నిషేధం.” అని రాసి ఉంది.
అతను గేటును మెల్లగా తోశాడు.
కీ.. ఈచ్…
అది తనంతట తానే తెరుచుకుంది.
అదే క్షణంలో…
ఎక్కడి నుంచో మల్లెపూల పరిమళం అతన్ని తాకింది..
ఆద్వైత్ ఒక్కసారిగా ఆగిపోయాడు.
అదే పరిమళం…
ఉదయం తన ఇంట్లో కూడా వచ్చింది.
“ఇది… యాదృచ్ఛికం కాదు.” అని మెల్లగా అనుకుంటూ…
ఆ పాత బంగ్లా మెట్ల వైపు అడుగులు వేశాడు.
పై అంతస్తు కిటికీ వెనుక… ఒక జత పెద్ద కళ్ళు…
నిశ్శబ్దంగా అతన్ని చూస్తున్నాయి.
కానీ ఆద్వైత్‌కు తెలియదు…
పై అంతస్తు కిటికీ వెనుక నుంచి తనను చూస్తున్న ఆ కళ్లలో… ఎన్నో సంవత్సరాల ఎదురు చూపు దాగి ఉందని.
ఆ అమ్మాయి నెమ్మదిగా కిటికీ తెరను పక్కకు జరిపింది.
వర్షపు చినుకులు గాలితో పాటు లోపలికి ఎగిరి వచ్చి ఆమె ముఖాన్ని తాకాయి.
ఆమె చేతిలో ఉన్న హృదయాకార వెండి లాకెట్ ను గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఆ లాకెట్ ను చూసి ఆమె పెదవుల పై చిన్న నవ్వు మెరిసింది.
“చివరికి… వచ్చారు…” అని చాలా మెల్లగా అంది.
ఆ మాటలు వర్షం శబ్దంలో కలిసిపోయాయి.
ఆమె నెమ్మదిగా కిటికీ నుంచి వెనక్కి తిరిగింది.
ఆ గదిలో ఒక మూలలో… దుమ్ము పట్టిన పాత వీణ.
మరో మూలలో… ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన గడియారం.
గోడపై… మంటల్లో కాలిపోయిన ఒక కుటుంబ ఫోటో.
ఆ ఫోటోలో మిగిలి ఉన్న ఒక యువకుడి ముఖం వైపు ఆమె కాసేపు చూసింది.
ఆమె పెదవులపై చిన్న నవ్వు మెరిసింది.
“ఈసారి… నన్ను గుర్తుపడతారా?” అని తనలో తానే మెల్లగా చెప్పుకుంది.
కానీ…
ఆ ఫోటోలో ఉన్న ఒక అమ్మాయి ముఖం మాత్రం ఉద్దేశపూర్వకంగా చింపివేయబడింది. ఆమె ఆ ఫోటో దగ్గరకు వెళ్లి, వేళ్లతో దానిపై పేరుకున్న దుమ్మును మెల్లగా తుడిచింది.
‘ఇంకొన్ని రోజులు మాత్రమే..’ అని తనలో తానే చెప్పుకుంది.
సరిగ్గా అప్పుడే… ఆ గదిలోని అద్దంలో…
ఆమె ప్రతిబింబం కనిపించలేదు.
కిటికీ…
వీణ…
పాత గడియారం…
అన్నీ కనిపిస్తున్నాయి.
కానీ…
ఆమె మాత్రం లేదు.
ఆమె మాత్రం దాన్ని చూసి ఏ మాత్రం ఆశ్చర్యపడలేదు.
అది ఆమెకు కొత్త కాదు.
ఎన్నో సంవత్సరాలుగా… ఆ అద్దం ఆమె ప్రతిబింబాన్ని చూపడం మానేసింది.
ఆమె ఒకప్పుడు దానికి బాధపడేది కానీ రాను రాను ఇప్పుడు అందుకు అలవాటు పడిపోయింది.
అప్పుడే…
గది బయట కారిడార్ లో…
ఎవరో నెమ్మదిగా నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించింది..
“కొన్ని ఇళ్లు మనుషుల కోసం ఎదురు చూడవు… కానీ కొన్ని ఇళ్లు ఒకే ఒక్క మనిషి కోసం సంవత్సరాల తరబడి తలుపులు తెరిచి ఉంచుతాయి.”
***
కథను వెతుకుతూ రచయిత ఆ బంగ్లాకు వచ్చాడా??
లేదా ఆ బంగ్లాలో ఉన్న ఏదైనా శక్తీ అతన్ని అక్కడకు వచ్చేలా చేసిందా??
ఏమై ఉంటుందో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ ఫాలో ది స్టోరీ.. “ఆమె ఇంకా అక్కడే ఉంది…”
sp ✍️… writes
Swipe left/right or tap the sides to turn pages