ఆమె ఇంకా అక్కడే ఉంది… – 3
ఆద్వైత్ తనకు వచ్చిన లేఖను పట్టుకుని వేలగూడెం వైపు బయలుదేరాడు. ఆ లేఖ అతని చేతిలో పడిన క్షణం నుంచి అతని చుట్టూ విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా అదే మల్లెపూల పరిమళం… క్షణం క్షణం అతన్ని వెంటాడుతున్న ఒక తెలియని అనుభూతి… అయినా, తనను ఎవరో పిలుస్తున్నారనే భావనతో అతను ప్రయాణాన్ని ఆపలేదు.
మరోవైపు… వేలగూడెంలోని ఆ పాత బంగ్లాలో, ఒక అమ్మాయి తన చేతిలోని హృదయాకార వెండి లాకెట్ ను గుండెలకు హత్తుకుని కిటికీ దగ్గర నిలబడి ఉంది. ఆమె కోసం కాలమే ఆగిపోయినట్టుంది. బయట వర్షం కురుస్తోంది… లోపల ఆ ఇంటి ప్రతి గోడ ఒక రహస్యాన్ని దాచుకుంది. ఈ ఇద్దరి దారులు కలవడానికి ఇంకొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి…
***
ఆ బంగ్లా లో ఆ అమ్మాయి అద్దంలో చూసుకుంటూ ఉండగా.. గది బయట కారిడార్ లో…
ఎవరో నెమ్మదిగా నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించింది..
టక్…
టక్…
టక్…
ఆమె ముఖం పై అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా మాయమైంది.
“మళ్లీ వచ్చావా…” అని చాలా మెల్లగా అంది.
కారిడార్ చివర…
చీకటిలో రెండు ఎర్రటి కళ్లూ మెరిశాయి.
అవి క్షణం పాటు ఆమెనే చూస్తూ నిలిచిపోయాయి.
ఆ అమ్మాయి తన చేతిలోని వెండి లాకెట్ ను గట్టిగా పట్టుకుని…
“అతను మళ్ళీ వచ్చేశాడు… ఇప్పుడైనా అతన్ని వదిలేయ్…” అని వేడుకుంది.
ఆ మాట పూర్తవగానే…
ఆ ఎర్రటి కళ్లూ చీకటిలో కలిసిపోయాయి.
కానీ…
బంగ్లా అంతా ఒక్కసారిగా మంచులా చల్లబడిపోయింది.
దూరంగా…
బయట నిలబడి ఉన్న ఆద్వైత్ కు మాత్రం…
ఎవరో తన పేరును చాలా మెల్లగా పిలిచినట్టు వినిపించింది….
“ఆది…”
అతను ఉలిక్కిపడి పై అంతస్తు కిటికీ వైపు చూసాడు.
అక్కడ ఒక తెల్లటి నీడ మాత్రమే కనిపించింది.
ఇంతలో మళ్ళీ మెరుపు మెరిసేలోపే… ఆ నీడ కూడా అదృశ్యమైంది.
“కొన్ని ఇళ్లు ఖాళీగా కనిపిస్తాయి… కానీ వాటి గోడల్లో ఇంకా ఎవరో ఊపిరి తీసుకుంటూనే ఉంటారు.”
భారీ వర్షం…
ఆకాశాన్ని చీల్చిన మెరుపు ఒక్క క్షణం ఆ పాత బంగ్లాను వెలిగించింది.
ఆ వెలుగులో అది ఇల్లులా కాకుండా… కాలమే మరచిపోయిన ఒక జ్ఞాపకంలా కనిపించింది.
భారీ వర్షాన్ని లెక్కచేయకుండా ఆద్వైత్ ఇనుప గేటు దగ్గరకు వచ్చాడు.
ప్రతి అడుగుకూ తడిసిన ఆకులు చప్పుళ్లు చేస్తున్నాయి.
మెరుపు వెలుగు పడిన ప్రతిసారి ఆ ఇల్లు మరింత భయంకరంగా కనిపిస్తోంది.
గేటు పై తుప్పు పట్టిన బోర్డు వేలాడుతోంది. దాని మీద..
“ప్రవేశం నిషేధం.” అని రాసి ఉంది.
అతను ఒక్క క్షణం ఆగాడు.
వెనక్కి వెళ్లిపోవాలా?
లేక…
ఆ లేఖ తనను ఇంత దూరం తీసుకొచ్చిన కారణం తెలుసుకోవాలా?
ఏది ఏమైనా సమాధానం వెతకాలని అతని మనసు గట్టిగా చెప్పింది..
నెమ్మదిగా గేటును తోశాడు.
ఆ శబ్దం ఆ నిశ్శబ్దంలో అసహజంగా మార్మోగింది.
ఆ క్షణమే…
మల్లెపూల పరిమళం అతని చుట్టూ వ్యాపించింది.
ఆద్వైత్ ఒక్కసారిగా ఆగిపోయాడు.
అదే పరిమళం…
ఉదయం తన బాల్కనీలో కూడా వచ్చింది.
“ఇది యాదృచ్ఛికం కాదు…” అని మెల్లగా అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాడు.
బంగ్లా ఆవరణ మొత్తం అడవి మొక్కలతో నిండిపోయింది.
విరిగిన రాతి విగ్రహాలు…
ఎండిపోయిన ఫౌంటెన్…
ముళ్ల పొదల్లో కనుమరుగైన దారి…
ప్రతి అడుగుకూ తడి ఆకులు చప్పుళ్లు చేస్తున్నాయి.
వర్షపు చినుకులు చెట్ల కొమ్మల మీద నుంచి జారిపడి అతని భుజాలపై పడుతున్నాయి.
ఆద్వైత్ మెట్ల దగ్గరకు వచ్చాడు.
తలుపు మూసి ఉంది.
ఎత్తైన చెక్క తలుపు.
కాలం రంగు తినేసిన కలప.
ఇద్దరు మనుషులు కలిసి తోస్తేనే తెరుచుకునేంత బరువుగా కనిపిస్తోంది.
ఆద్వైత్ తన బలాన్ని ఉపయోగించిన చేయి ఎత్తి తట్టబోతుండగానే…
కీ.. ఈచ్… శబ్దం చేస్తూ తలుపు తనంతట తానే నెమ్మదిగా తెరుచుకుంది.
ఆద్వైత్ చేతి వేళ్లు గాలిలోనే ఆగిపోయాయి.
లోపల నుంచి చల్లటి గాలి ఒకేసారి బయటకు వచ్చింది.
అది వర్షపు చల్లదనం కాదు…
చాలా సంవత్సరాలుగా వెలుతురు చూడని గదిలోని చలి.
అతని గుండె ఒక్కసారి బలంగా కొట్టుకుంది.
“హలో… ఎవరైనా ఉన్నారా?” అని పిలిచాడు.
అతని గొంతు ఆ విశాలమైన హాల్లో ప్రతిధ్వనించింది.
సమాధానం లేదు. కేవలం దూరంగా కురుస్తున్న వర్షం శబ్దం మాత్రమే వినిపిస్తుంది.
అతను జాగ్రత్తగా లోపలికి అడుగు పెట్టాడు.
ఆద్వైత్ చుట్టూ చూస్తూ మరో అడుగు లోపలికి వెళ్లాడు.
హాల్ లో పాత సోఫాలు, దుమ్ము పట్టిన టేబుళ్లు, గోడలకు వేలాడుతున్న చిత్రాలు.
కొన్ని చిత్రాల్లోని కళ్లూ…
తన ప్రతి కదలికను గమనిస్తున్నట్టుగా అనిపించాయి.
“పాత ఇళ్లలో ఇలానే అనిపిస్తుంది…”
అని తనను తాను సమాధాన పర్చుకున్నాడు ఆద్వైత్.
అప్పుడే…
పై అంతస్తు నుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది.
“మీరు అలసిపోయి ఉంటారు… ముందు లోపలికి రండి.”
ఆ స్వరం భయ పెట్టలేదు. కానీ
అది విచిత్రంగా అనిపించింది అతనికి.. తనను తాను ప్రశాంతంగా ఉంచుకుని ఆద్వైత్ తల పైకెత్తి చూశాడు.
మెట్ల చివర చీకటి మాత్రమే కనిపించింది.
కొన్ని క్షణాలు ఆలోచించాడు.
తర్వాత…
ఆద్వైత్ నెమ్మదిగా మెట్లెక్కడం ప్రారంభించాడు..
ప్రతి మెట్టు…
కీచ్… కీచ్…
అని శబ్దం చేస్తోంది.
ఆ శబ్దం అతని అడుగుల కంటే గట్టిగా వినిపిస్తోంది.
మెట్ల చివరకు చేరుకున్నాడు.
పొడవైన కారిడార్.. రెండు వైపులా మూసి ఉన్న గదులు.
కారిడార్ చివర ఒక కిటికీ.
ఆ కిటికీ దగ్గర…
వెనక్కి తిరిగి నిలబడి ఉంది ఒక అమ్మాయి.
ఆమె నడుం వరకు ఉన్న నల్లని జుట్టు గాలికి మెల్లగా కదులుతోంది.
ఆమె చేతిలో చిన్న పిత్తల లాంతరు.
ఆ వెలుతురు ఆమె చుట్టూ మాత్రమే ఉంది.
మిగతా కారిడార్ అంతా చీకటిలోనే ఉంది.
తెల్లటి చీర అంచులు లాంతరు వెలుతురులో చిన్నగా మెరుస్తున్నాయి.
కొన్ని క్షణాలు…
ఆమె కదల్లేదు.
ఆద్వైత్ కూడా కదల్లేదు.
ఆ నిశ్శబ్దంలో…
వర్షం మాత్రమే మాట్లాడుతోంది.
ఆ తర్వాత…
ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది.
ఆ క్షణంలో…
ఆద్వైత్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.
చందమామలాంటి ముఖం…
నుదుటి పై చిన్న నల్లని బొట్టు…
పెద్ద పెద్ద కళ్లు…
ఆ కళ్లలో…
ఎన్నో ఏళ్లుగా ముగియని ఎదురు చూపు.
ఆమె అతని వైపు చూసి…
ఆమె చిన్నగా నవ్వింది.
ఆ నవ్వు…
చీకటిలో ఒక్కసారిగా వెలిగిన దీపంలా అనిపించింది.
ఆమె పెదవులు నెమ్మదిగా కదిలాయి..
“చివరికి… వచ్చారు”
అని మెల్లగా అంది.
ఆ ఒక్క మాటతో…
ఆద్వైత్ మనసులోని వంద ప్రశ్నలు ఒక్కసారిగా మేల్కొన్నాయి.
ఆమె చెప్పిన ఒక్క మాట…
“చివరికి… ఈ ఇల్లు మిమ్మల్ని మళ్లీ తీసుకొచ్చింది.”
***
ఆద్వైత్ ను వేలగూడెంకు పిలిచింది ఆ లేఖనా…?
లేక… అతని కోసం ఎదురు చూస్తున్న ఆ అమ్మాయా…?
ఆ బంగ్లాలో దాగి ఉన్న నిజం ఏమిటి…?
తెలుసుకోవాలంటే… “ఆమె ఇంకా అక్కడే ఉంది…” కథను తప్పకుండా ఫాలో అవ్వండి.
sp ✍️… writes
Swipe left/right or tap the sides to turn pages