పులి పంజా 🐯 – 1
భాగం – 1
| అది ఒక దట్టమైన అడవి ప్రాంతం |
| మెత్తటి ఎర్ర మట్టి నేల |
ముందు గానే మెత్తగా ఉండే ఆ ఎర్ర మట్టి పై రెండు రోజుల నుంచి తెరపీయకుండా కురుస్తున్న వాన వల్ల ఎర్ర మట్టి కాస్త జిగురుని పుట్టించే బురదగా మారిపోయింది.
చిక్కటి చీకటి, మబ్బుల్లో ఇరుక్కు పోయిన జాబిలమ్మ వెలుగు నేల పై కనిపించి కనిపించకుండా జాలు వారుతున్న వేళ…
నల్లటి చీకటిలో ఏది ఏ మూలన ఉందో కూడా కనిపించక చిరు జల్లులు మీద పడుతున్న పచ్చటి ఆకుల చిటపటల శబ్దాలు తప్పితే ఏ ఒక్క చిన్న ప్రాణి కీచు శబ్దం కూడా ఆ ప్రాంతంలో ప్రస్తుతం మోగటం లేదు.
చిన్న రాయి వేస్తేనే సగానికి సగం నేలలోకి కూరుకుపోయే ఆ మట్టి నేల పై కొన్ని అడుగుల లోతుకి దిగబడిన పెద్ద పెద్ద పెద్ద పులి పాదాల అడుగులని అనుసరిస్తూ వెళుతున్నాయి 8 మనిషి పాదాలు.
అంత చల్లటి రాత్రి వేళ ఒంటి పై చల్ల దనాన్ని మించిన భయం వల్ల వచ్చే బెదురుతో ఒళ్లంతా చెమటలతో నిండిపోయిన ఆ మనుషులు లైట్ గా వణుకుతున్న చేతులతో గట్టిగా బిగించి పట్టుకున్న తుపాకులతో ఆ పెద్ద పులి పాదాల అడుగులని ఒక్కొక్కటిగా అనుసరిస్తూ ముందుకు నడుస్తున్నారు.
సరిగ్గా అప్పుడే అప్పటి వరకు చిన్న కీచు శబ్దం కూడా లేని ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి దబ్బున వినిపించింది ఒక శబ్దం.
అంతే వణుకుతున్న శరీరాలతో పులి అడుగుల జాడ వైపే వెళ్తున్న ఆ మనుషులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసారు.
ఎదురుగా బురద నేలపై ఎక్కువ వర్షం దాటికి కుళ్ళిపోయిన ఒక చెట్టు కొమ్మ గాలమ్మ దయ వల్ల ఎక్కువసేపు నిలబడలేక ఫటక్కుమని విరిగి కింద పడింది.
ఆ కొమ్మని చూసి, ఉలికి పాటు వల్ల వచ్చిన గుండె బెదురుని నెమ్మదిగా శాంత పరచుకుంటూ, “ఉఫ్! కొమ్మనా ఇంకెంటో అనుకున్నామే” అనుకుంటూ వీపులని తట్టుకుంటూ మళ్లీ అటు వైపుగా తిరిగే లోపు,
పొదల్లోంచి మనుషుల అలికిడి విన్న మృగం చడీ చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వీళ్ళ వైపుగానే వస్తున్న ఒక పెద్ద పులి వాళ్లు ఇటు వైపుగా తిరగటం ఆలస్యం అమాంతం వాళ్ళ మీదకి దూకి మరి దాడి చేసింది.
ఆ పరిణామాన్ని ఊహించని ఆ నలుగురు గట్టిగా అరుస్తూ పక్కకు తప్పుకునే లోపు ముందుగా ఉండే ఒక అతని పై ఆ పులి పంజా గట్టిగా పడిపోవటంతో అతను ఎటూ కదలలేకపోయాడు.
ఆ దృశ్యాన్ని చూస్తున్న ముగ్గురికి గుండెలో దడ పుట్టటం ఆలస్యం గట్టిగా అరుస్తూ చేతిలోని తుపాకులని కింద పారేసి మరి ఒక్కొక్కరు ఒక్కో దారి గుండా పరుగు అందుకున్నారు.
చిక్కిన ఒక మానవుని శరీరం దానికి చాలదు అన్నట్టు పరిగెత్తుతున్న ముగ్గురి వైపుకి చూపులని తిప్పుతూనే మధ్య దారి గుండా పరిగెత్తిన అతనిని వెంబడించింది పెద్ద పులి.
అది అటు పోగానే పులి పంజా దాటికి గుండె దగ్గర రక్తం చిట్లుతూ కొస ఊపిరితో తన ప్రాణాన్ని అర చేతుల్లో పెట్టుకొని ఆ బురద మట్టిలోనే పాక్కుంటూ పాక్కుంటూ వెళ్లి ఒక చిన్న మట్టి గుహలో తల దాచుకున్నాడు ‘వీరయ్య.’
వీరయ్యని వదిలి తనని వెంబడిస్తుంది అని తెలుసుకున్న ‘సోమయ్య,’ ‘చచ్చాను రా దేవుడో భయంతో తుపాకిని కూడా నేల పాలు చేశాను కనీసం అది ఉన్నా దీని అంతు తేల్చేవాడిని.’
తనలో తానే అరుస్తూ మొత్తుకుంటూనే ముందుకు పరిగెడుతున్న సోమయ్య కాలు బురద మట్టిలో కూరుకుపోయి ఎలా వెళ్తున్నాడో అలానే బొక్క బోర్లా పడిపోయాడు.
పడుతూ పడుతూనే, “అమ్మ….” అంటూ అరుస్తూ వెనుకగా చూసిన తన కంటికి అతను పడినది చూసిన ఆ పులి కోపంగా అతని వైపే చూస్తూ మెల్లిగా అతని దగ్గరికి అడుగులేస్తుంది.
ఆ పులి కళ్ళల్లో క్రోధం నేరుగా అతని గుండెను తాకి అప్పటి వరకు ఒంటిలో పెరిగిన బెదురు, వణుకు వెన్నులోకి పాకి, కూరుకుపోయిన అతని పాదాన్ని వెనక్కి లాగలేక ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ బురదలో ఇరుక్కున్న పాదాన్ని గట్టిగా పక్కనే ఉన్న కొమ్మతో బురదని తొలగించి,
ఆ వెనుకగా ఉన్న ఒక చిన్న లోయలోకి దూకేశాడు సోమయ్య.
అతను దూకటం చూసి అతని వెను వెంటనే మీదకి దూకేసింది పులి.
ఇంకా ఉంది…
ఇప్పుడేం జరుగుతుంది?
సోమయ్యని కాపాడటానికి ఎవరు రారా?
మిగతావాళ్ళ పరిస్థితి ఏంటి?
నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చెయ్యండి.. కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా కథను షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ఒక చిన్ని కామెంట్ రూపంలో చెప్పమని చెప్పండి.. మీ కామెంట్స్ ఏ మా రైటర్స్ కి వచ్చే బూస్ట్ అప్ దాని ద్వారా మేము మరింత ఉత్సాహంతో కథలను రాయగలుగుతాం..
నన్ను సపోర్ట్ చేస్తారాని ఆశిస్తూ…
ఇట్లు
మీ కీర్తి💕
Swipe left/right or tap the sides to turn pages