ప్రేమకు పరీక్ష💕 – 1
| మర్రిపాలెం, డిసెంబర్ 31,
సమయం రాత్రి 10:00 |
“ఏమైంది అవి ఇంత లేటు?” కంగారుగా అడిగాడు అభినవ్.
“అమ్మో! ఇంట్లో అందరూ ఉండగా త్వరగా రమ్మంటే ఎలా అభి” అంతకంటే కంగారుగా చెప్పింది అవంతిక.
“సరే సరే ఏదైనా ఆలోచించావా? ఏం చేద్దాం అంటావు?”
“నాకేం అర్థం కావట్లేదు అభి. చిన్నప్పుడు ఊర్లో స్ప్రెడ్ అయ్యే రూమర్స్ పెద్దయ్యాక తగ్గిపోతాయి అనుకున్నాను. కానీ, ఇప్పటికీ ఇంకా ఎక్కువ అయ్యాయి. వీళ్ళందరినీ ఎదిరించి మనం అసలు బ్రతకగలమా?” భయం భయంగా అడిగింది అవంతిక.
తన భయానికి తన వైపే సూటిగా చూస్తూ, “దీనికి ఒకే ఒక్క మార్గం ఉంది.”
“ఏంటది?”
“మనిద్దరం కలిసి ఈ రాత్రి ఆ గుడి లోపలికి వెళ్ళాలి.”
అభి ఆ మాట చెప్పగానే ఒక్క క్షణం ఉలిక్కిపడి, “అభి నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ గుడి ఎలాంటిదో తెలిసి కూడా అక్కడికి వెళ్దామంటున్నావు ఏంటి” భయంతో గట్టిగా అరిచేసింది అవంతిక.
“తప్పదు అవి, ఇదొక్కటే మనకి మార్గం. అసలు ఆ గుడిలో ఏముందో కనుక్కొని మన ప్రేమని మనమే నిలబెట్టుకోవాలి. ఇది కాక మన వాళ్ళని ఎదిరించో లేదా వాళ్ళకి దూరంగా వెళ్ళో మనం అయితే ఉండలేము కదా. అందుకే కష్టమో నష్టమో సమస్య ఉన్న చోటనే సమాధాన్ని వెతికి ఈ కొత్త సంవత్సరం మనకు అనుగ్రహం ఉంటే కొత్త జీవితాన్ని మొదలుపెడతాము. లేదా ఈ రాత్రికే గాలిలో గాలిలా కలిసిపోతాము” కాస్త స్థిరంగా, బాధగా చెప్పాడు అభినవ్.
“వేరే మార్గమే లేదంటావా?” కంటనీరుతో అడిగింది అవి.
ప్రేమగా తన కళ్ళల్లోకే చూస్తూ, “లేదు రా” అని తన చేతిలో చెయ్యేసి గుడి వైపు కదిలాడు అభి.
‘మర్రిపాలెం’ ఈ ఊరిలో పసిపిల్లాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు భయపడే ఒకే ఒక్క భయం ‘కాళీకామాత గుడి.’
చాలా యుగాల క్రితం ఆ గుడిలో పెళ్ళి చేసుకోవాలి అని వెళ్ళిన ఒక ప్రేమ జంటని అందులోని దుష్టశక్తులు అతి ఘోరంగా చంపేశాయి అన్నది ఒక రూమర్.
వారి చావుకి ఎవరో మనుషులే కారణం అయ్యుంటారు అనేసి మొదట కొట్టి పారేశారు ఆ ఊరిజనం. కానీ, అలా ఆగకుండా ఆ గుడిలోకి వెళ్ళిన ప్రతి ఒక్క ప్రేమజంట బయటికి శవాలుగా తిరిగి వస్తున్నారు.
విషయం తెలుసుకున్న పూజారులు, పండితులు ఏవేవో యాగాలు, యజ్ఞాలు చేసినా ఆ దుష్టశక్తి ఏంటో కనుక్కోలేక విఫలమయ్యారు. ఇక అప్పటి నుంచి ఆ గుడిని పూర్తిగా మూసేసి దాని చుట్టుపక్కల ఉండే ప్రజలు కూడా దూరంగా వెళ్ళి నివసించటం మొదలుపెట్టారు.
అక్కడ ఎవరు చేసిన పాపమో మన ఊరికి ఈ శాపం వచ్చింది అనేసి అప్పటినుంచి ఎవరు ప్రేమ అంటూ మొదలెట్టినా ఊరుకోము అంటూ ఊరి వాళ్ళు అందరికి ఆంక్షలు విధించారు.
అభినవ్, అవంతిక చిన్ననాటి స్నేహితులు. ఈ రూమర్స్ ని వింటూనే పెరిగారు. కానీ, వారి మధ్య ఏర్పడే ప్రేమని మాత్రం తుంచుకోలేకపోయారు. పెద్దయ్యాక ఇవన్నీ తొలగిపోతాయిలే వారి ప్రేమకు ఎటువంటి అడ్డు ఉండదు అనే నమ్మారు. కానీ, ఇప్పటికీ ఆ అడ్డుపోలేదు. అలా అని కుటుంబాలను ఎదిరించటం వారికి ఇష్టం లేదు. అందుకనే వారి ప్రేమకు పరీక్ష పెట్టుకోవడానికే కాకా, అసలు ఆ గుడిలోని సమస్య ఏంటో కూడా తెలుసుకోవడానికే గుడి లోపలికి అడుగేశారు.
“భయపడొద్దు అవి, మనం భయపడితే మన ప్రేమకు అర్థం లేకుండాపోతుంది. నువ్వు నిజంగా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఈ ఒక్కరోజు ధైర్యంగా ఇక్కడ ఏది వచ్చినా ఎదిరించు.”
ధైర్యాన్ని ఇచ్చేలా చెప్తున్న అభి మాటలని మెల్లిగా వింటూనే తలాడించింది అవంతిక.
ఇద్దరూ ఎవరికి తెలియకుండా వెనుక ద్వారం నుంచి లోపల అడుగుపెట్టగానే చిత్రవిచిత్రమైన శబ్దాలు రావటం మొదలయ్యాయి.
ఆ శబ్దాలకి వణికిపోతున్న అవిని బలంగా హత్తుకొని తనలోని ధైర్యాన్ని తనకందచేశాడు అభి.
గుడి అంతా చిన్న దీపం కూడా లేక పాడుపడ్డ భూతాల బంగ్లాలెక్క ఉంది.
ఎక్కడి నుంచి ఏ చిన్న శబ్దం వినిపించినా చాలా భయంకరంగానే ఉన్నా, ఇద్దరూ అలానే లోపలికి నడిచారు.
సరిగ్గా గుడి మధ్య ప్రాంగణంలోకి రాగానే ఒక్కసారిగా వీరిద్దరి మధ్య ఏదో తెలియని ఒక ఇన్విజిబుల్ గోడ ఏర్పడినట్టుగా ఇద్దరు రెండు వైపులకు చీలిపోయారు.
అది చూడగానే గుండె పగిలి, “అభి అభి…” అంటూ అవంతిక,
“అవి అవి” అంటూ అభినవ్ అరవటం మొదలు పెట్టారు.
వీళ్ళ అరుపులు ఇలా ఉండగానే, “హహహ” అంటూ ఎవరివో హాహాకారాలు చాలా ఘోరంగా వినిపించాయి.
“మీకు నిజంగా ఎంత ధైర్యం, ఇక్కడికి వచ్చిన ప్రేమికులందరూ చనిపోతారు అని తెలిసి కూడా ఇంత ధైర్యం చేశారంటే మీ చావు మామూలుగా ఉండకూడదు.”
“హే! ఎవరు నువ్వు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? మాకు తెలుసు ఇక్కడ ఎటువంటి దుష్టశక్తి లేదు అని. నువ్వు ఎవరో కావాలనే ఇలా ప్రజలని లోపలికి రానీకుండా భయపెట్టి చంపుతున్నావు. ఎవరు అసలు నువ్వు? ఏం కావాలి నీకు?” అంటూ భయం వేస్తున్నా ధైర్యంగా అరిచాడు అభినవ్.
“ఆహా! నేను దుష్టశక్తినో కాదో ఇప్పుడే చూపిస్తాను కదా.”
అనగానే ఏం జరుగుతుందో ఏమో అని కాస్త భయంగా అవంతిక కోసమే అటూ ఇటూ తిరుగుతూ చూశాడు అభినవ్.
ఇంతలో, “అభి అభి” అంటూ ఆర్తనాదాలు వినిపించాయి అవంతిక దగ్గర నుంచి.
అవి వినగానే గుండె పగిలి, “అవి ఏమైంది నీకు” అంటూ పిచ్చోడిలా ఏడుస్తూ తన కోసం వెతుకుతుంటే,
“నేను దుష్టశక్తిని కాదు అనేసి నాపైనే నోరు తెరిచావు కదా ఇప్పుడు నువ్వు ప్రేమించాను అనుకుంటున్న ఈ అమ్మాయి ప్రాణాలు నా చేతుల్లో చిక్కాయి.”
అనగానే కళ్ళని ఎర్రగా చేసుకొని, “హే! నువ్వెవరో నాకు తెలియదు ఇలా అమాయకురాలైన తన జోలికి వెళ్ళటం కాదు ధైర్యం ఉంటే నా మీదకు రా. తనకు ఏదైనా జరగాలి, నువ్వు ఎవరనేది కనిపెట్టి మరి నిన్ను చంపుతా గుర్తుపెట్టుకో.”
కన్నీళ్ళ మధ్యలో ఎంతో క్రోధంగా వచ్చిన అతని మాటలకి ఆ మాయాశక్తి ఒక్కక్షణం ఆగి, “ఓహో! అయితే మీరు నిజమైన ప్రేమికులు అంటారు.”
“మాటలు చాలించి నా మీదకు రా రా నేనేంటో చూపిస్తా” ఇందాకటి కంటే రెట్టింపు ఉక్రోషంతో అరిచాడు అభి.
అతని మాటల్లోని నిజమైన ప్రేమని చవిచూసిన ఆ మాయాశక్తి, “సరే! మీరు నిజమైన ప్రేమికులు అంటున్నారు కదా మీ ఇద్దరికీ ఒక్కటే ఒక్క పరీక్ష పెడతాను. అందులో మీరు నెగ్గితే నేను మీ ఇద్దరినీ ప్రాణాలతో వదిలేస్తా” అనిందో లేదో,
“ఏంటి ఆ పరీక్ష?” ఇద్దరూ ఒకేసారి అడిగారు.
“నేను పెట్టే పరీక్షలు చెప్పి చేయను. అది ఏంటో దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి.”
ఆ వింత శబ్దపు మాటలు పూర్తి అవ్వగానే ఉన్నపాటుగా అభి చేతిలోకి ఒక దీపం ప్రమిద లేకుండా వచ్చి చేరింది.
అది చూడగానే మంటతో దాన్ని కింద పడేయబోతుంటే, “అది కింద పడితే ఇక్కడ నీ ప్రేమ చచ్చిపోద్ది. ఇదే నీకు నేను పెడుతున్న పరీక్ష, ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఈ దీపాన్ని నీ ఎదురుగా కనిపిస్తున్న ఆ పెద్ద హోమగుండంలోకి పడవేయాలి. అప్పటివరకు నీ చేతిలోని దీపం కొద్దిగా జారిన ఇక్కడ దీని ప్రాణాలు పోయినట్టే.”
అని చెప్పగానే దీపాన్ని భద్రంగా పట్టుకొని చేయి కాలుతున్నా కూడా తన ప్రేమ కోసం కష్టంగా ఓర్చుకుంటూ, “చేస్తాను ఖచ్ఛితంగా చేస్తాను” మొండిగా అంటూ ముందుకు కదిలాడు అభి.
సరిగ్గా ఆ హోమగుండం దగ్గరికి వెళ్ళిపోయాడు అనగా ఒక్కసారిగా ఆ హోమగుండం తనకి ఇంకాస్త దూరం జరిగింది. అది చూసి మొదట ఆశ్చర్యపోయినా, ‘అంత త్వరగా ముగిసిపోతే ఇది పరీక్ష ఎలా అవుతుంది?’ తనలో తానే అనుకుని మళ్ళీ అడుగులు ముందుకు వేశాడు.
అతని అంతర్మదనాన్ని గ్రహిస్తూ గట్టిగా నవ్వుతూ, “సరిగ్గా గ్రహించావు” అంది ఆ మాయాశక్తి.
అవతలి వైపు అభి ఎక్కడున్నాడో అర్థం కాక ఏవేవో వింత శబ్దాలు విని భయంతో చూస్తున్న అవంతికకి ఎదురుగా ఒక్కసారిగా ఎవరో ఒక బలిష్టమైన మగ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు.
అతన్ని చూస్తేనే గుండె ఝల్లుమంది అవికి. అతనేమో తన వైపే క్రూరంగా చూస్తూ దగ్గరికి రాసాగాడు.
అతను దగ్గరకు వచ్చే కొద్ది, “అభి అభి” అంటూ భయంతో అరుస్తుంది అవంతిక.
“హహ ఇది నీకు నేను పెట్టబోయే పరీక్ష. నీ ముందర ఉండే బలిష్టమైన మగాడి నుంచి నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. అప్పుడు నీ ప్రేమ గొప్పదని నేను ఒప్పుకుంటా.”
చెప్పిన ఆ మాయశక్తి మాటలకి ఆశ్చర్యపోతూ, అప్పటికే తనకి దగ్గరగా వచ్చేసిన ఆ వ్యక్తి నుంచి దూరంగా పారిపోవటం మొదలుపెట్టింది అవంతిక.
అటుపక్క అభి హోమగుండం దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనగా కావాలనే దాన్ని దూరంగా జరిపేస్తున్నాడు ఆ మాయశక్తి. అయినా తన ప్రేమని ఫలింపచేసుకోవడం కోసం తన పట్టును వదలడం లేదు.
ఇటుపక్క ఆ బలిష్టమైన వ్యక్తి చేతుల్లో అవి చిక్కుకుపోయింది. తన నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నా తన పట్టు వదల్లేదు అభి.
“ధైర్యం తెచ్చుకో అవి, ఇది మన ప్రేమకు పరీక్ష. ఇందులో మనం ఖచ్ఛితంగా నెగ్గితీరాలి” తన గమ్యం వైపు నడుస్తూనే గట్టిగా అరిచాడు.
ఆ మాటలని లీలగా విన్న అవంతిక తన మీదకి వస్తున్న ఆ వ్యక్తిని పక్కకి నెడుతూ ఎలాగోలా తప్పించుకోవాలని చూసినా, అతను తన పట్టును వదలటం లేదు.
అతను తన మీద పడి రక్కుతుంటే ఆ గాయాలకి ముల్లోకాలు కనిపించి గొంతుపోయేలా అరుస్తున్నా ఎవరూ చెలించలేదు.
తన శక్తి ఉన్నంతవరకు అతనిని అడ్డుకుంది. కానీ, ఇక తన వల్ల కాక నిరసించిన శరీరాన్ని పూర్తిగా అతనికి అప్పజెప్పేసే సమయాన, మూసుకుపోతున్న కళ్ళు మాటున, ‘ఐ లవ్ యు అవి’ అని చెప్పిన అభి మాటలు ఒక్కసారిగా గుర్తుకొచ్చి, లేని శక్తిని కూడబలుక్కొని మరీ చేతితో అటూ ఇటూ పాకుతూ చేతికి దొరికిన దీపపు స్టాండ్ తో ఒక్కసారిగా ఆ వ్యక్తి కంఠంలో పొడిచింది.
అంతే ఆ మరుక్షణమే తన ఎదురుగా తన మీద పడి తనని నాశనం చేయబోతున్న ఆకారం మాయమైపోయింది.
ఇక్కడ ఇది మాయం అవ్వగానే అక్కడ తనకు దూరంగా జరగబోతున్న హోమగుండం అభికి దగ్గరగా వచ్చేసింది.
అది రావటంతోనే అప్పటివరకు అణుచుకున్న అభి ఒక్కసారిగా ఆ దీపాన్ని హోమగుండంలోకి పడవేశాడు.
ఆ మరుక్షణమే ఆ గుడి తలుపులు మొత్తం తెరుచుకుని, చీకటితో అలుముకున్న గుడి ప్రాంగణం అంతా వెలుగులతో నిండిపోయింది.
ఉన్నపాటుగా ప్రకాశిస్తున్న ఆ గుడిని చూసిన ఊరి జనమంతా తరలి వచ్చేశారు గుడి దగ్గరికి.
చూస్తే ఒకపక్క ఒంటినిండా గాయాలతో భారంగా శ్వాస పీలుస్తూ అవంతిక పడి ఉంటే, ఇంకొక పక్క తన చుట్టూ అలుముకున్న వెలుగు వైపే చప్పరిల్లిన కళ్ళతో చూస్తూ కనిపించాడు అభినవ్.
వాళ్ళని అలా చూసి దగ్గరికి వచ్చేలోపు ఒక్కసారిగా వారందరినీ ఆపేసింది ఆ మాయాశక్తి.
తెలియని ఏదో శక్తి వారిని ఆపేసింది అని గ్రహించి తెగ భయపడిపోయారు ఊరి జనమంతా.
వారి భయాలు చూసి, “భయపడకండి మొదటగా వారి స్వచ్ఛమైన ప్రేమతో ఈ గుడికి పట్టిన శాపాన్ని తొలగించిన అభినవ్ అలాగే అవంతికలను అభినందిస్తున్నాను. నా పేరు భైరవుడు నేను కాళికామాతకు అపార ప్రాణభక్తుడిని. చాలా యుగాల క్రితం ఎంతో పవిత్రమైన నా తల్లి గర్భగుడిలో ఒక నీచమైన జంట ప్రేమ, పెళ్ళి పేరుతో నీచపు పనులు చేయడం మొదలుపెట్టారు.
వారికి తగిన గుణపాఠం నేర్పించడం కోసమే తల్లి కాళికామాత నన్ను తన గుడికి కాపలాగా ఉంచి నాలోని దైవశక్తులతో అటువంటివారిని హతమార్చడం మొదలుపెట్టింది. ఆ అపవిత్రమైన జంట వల్ల పూర్తిగా అపవిత్రం అయిపోయిన తన గుడిని తనకు తానుగానే శాపం విధించుకుని మూసి వేసుకుంది.
ఇక అప్పటినుంచి ఇందులోకి ఏ ఒక్క ప్రేమజంట అడుగుపెట్టినా వారికి పరీక్షలు పెట్టడం అందులో ఓడిపోతే వారి ప్రాణాలు తీయడం పరిపాటి అయిపోయింది.
మళ్ళీ ఎన్నో యుగాల తర్వాత ఒక స్వచ్ఛమైన ప్రేమ జంట గొప్ప ప్రేమ వల్ల ఈ గుడికి విధించిన శాపవిముక్తి చెంది వారి ప్రేమ ఫలించటంతో పాటు ఆ దేవి అనుగ్రహం కూడా మీకు లభించింది.”
ఆ భైరవుడు చెప్పిన మాటలన్నీ ప్రజలంతా ఆశ్చర్యంగా వింటుంటే, అప్పటివరకు వారిద్దరి మధ్య అడ్డుగోడగా నిలిచిన ఆ అదృశ్య గోడ మాయం అయిపోవడంతో గాయాలతో పడి ఉన్న ప్రేయసి దగ్గరికి కిందా మీదా పడుతూనే పరుగులు తీసి తన దగ్గరికి చేరి బలంగా తనని హత్తుకున్నాడు అభి.
వారిని చిరునవ్వుతో చూస్తూ ఇద్దరి శరీరాలపై అయిన గాయాలని వెంటనే మటుమాయం చేసేశాడు భైరవుడు.
అది చూసి కంటనీరుతో ఇద్దరూ ఆ భైరవుడి ఆకారానికి చేతులు ఎత్తి మొక్కారు.
“సుఖీభవ” అంటూ ఇద్దరి తలలపై తన అనుగ్రహాన్ని కురిపించి ఆ మరుక్షణమే అదృశ్యమైపోయాడు భైరవుడు.
వారి గొప్ప ప్రేమతో వారి ప్రేమని కాపాడుకోవడమే కాక, వారి ఊరికి విధించిన శాపాన్ని కూడా తొలగించినందున, ఊరి జనం అంతా ఇద్దరినీ ఆనంద సత్కారాలతో సత్కరించి, అంగరంగ వైభవంగా వారి పెళ్ళి జరిపించారు అదే గుడిలో.
చావుని సైతం లెక్క చేయక చావుకి ఎదురెళ్ళి మరి ప్రేమను గెలుచుకొని వారికి మాత్రమే కాక ఆ ఊరి ప్రజలందరికీ ఒక కొత్త జీవితాన్ని, కొత్త ఆశయాలను ప్రసాదించారు అభినవ్ మరియు అవంతికలు..
…కథ సుఖాంతం…
Swipe left/right or tap the sides to turn pages