మై ఫస్ట్ కాంట్రాక్ట్ – 2
ఆశ్చర్యంగా చూస్తున్నాడు అజయ్.
శిల్పంలా తననే చూస్తున్న అజయ్ వైపు చూస్తూ, “అగ్రిమెంట్ మర్చిపోయావా?” అని కసిరాడు అర్జున్.
చేసేదేమీ లేక బెడ్‌పై అటువైపు పడుకున్నాడు అజయ్.
అర్జున్ తనకు కొంచెం దూరంలో పడుకున్న అజయ్‌ని దగ్గరికి లాక్కుని వెనక నుంచి కౌగిలించుకున్నాడు.
కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు అజయ్. తనను పట్టుకుని కౌగిలించుకున్న అర్జున్‌పై అసహ్యం కలుగుతోంది. తన జీవితంపై తనకే జాలేసింది ఓ క్షణం. అర్జున్ మాత్రం చిన్నపిల్లాడిలా అమ్మను పట్టుకున్నట్టుగా అజయ్‌ని గట్టిగా పట్టుకుని నిద్రపోతున్నాడు.
కిటికీలోంచి చల్లటి గాలి వీస్తుండటంతో అర్జున్ మరింత దగ్గరగా కౌగిలించుకున్నాడు. ఏంటి వీడు? ఊపిరి కూడా ఆడనివ్వడం లేదు! అనుకుంటూ తనకు ఎదురుగా తిరిగాడు అజయ్.
బాగా టెన్షన్ పడటం వల్ల అర్జున్ ముఖంపై చిరు చెమటలు అలుముకున్నాయి. వాటిని చేత్తో తుడుస్తూ, క్షణాల్లో మారిపోయే నీ వ్యక్తిత్వం నాకు అర్థం కావడం లేదు అర్జున్! అనుకున్నాడు.
ఎప్పుడూ నిప్పులు చిమ్ముతున్నట్టుండే అర్జున్, ఇప్పుడు చంటిపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. అసలు ఆ పీడకల ఏమై ఉంటుందో? అని ఆలోచిస్తున్నాడు.
తనను మరింతగా కౌగిలించుకుంటున్న అర్జున్‌లోని పసితనం ఆకాశంలో నిండుగా వెలుగుతున్న చందమామలా కనిపించింది అజయ్‌కి. చిన్నగా నవ్వుకున్నాడు.
‘మీ తమ్ముడి కోసం నిన్ను నువ్వు అమ్ముకుంటావని అనుకోలేదు…’ అంటూ తనను గుచ్చిగుచ్చి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని అనుకోలేదు అజయ్.
ఏదేమైనా తన తమ్ముడి జీవితం బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ అగ్రిమెంట్‌కి ఒప్పుకున్నాడు. అంతకు మించి ఆలోచించడానికి కూడా అతనికి ఏమీ మిగల్లేదు.
మెల్లగా కళ్లు మూసుకున్నాడు. తన జీవితంపై మెల్లమెల్లగా ఆశలు సన్నగిల్లుతున్నాయని అతనికి బాగానే అర్థమవుతోంది.
చివరికి కళ్లు పూర్తిగా మూసుకున్నాడు.
—
ఉదయభానుడు మేఘాలను దాటుకుంటూ అర్జున్ గదిలోకి ఎలాంటి అనుమతి లేకుండానే వచ్చేశాడు.
కిటికీలోంచి వచ్చిన సూర్యకిరణాలు అర్జున్ ముఖంపై పడటంతో చిరాగ్గా నిద్రలేచాడు.
అజయ్ మాత్రం అర్జున్ కౌగిట్లో ఆకాశంలోని జాబిలిలా ఒదిగిపోయి ఉన్నాడు.
జాగ్రత్తగా అజయ్‌కి నిద్రాభంగం కలగకుండా లేచాడు అర్జున్.
బాత్రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యాడు. బయటకు వచ్చి చూసేసరికి అజయ్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు.
అసహనంగా బ్లూటూత్ చెవిలో పెట్టుకుని పాటలు వింటూ, ఆఫీస్‌కు సంబంధించిన ఈ-మెయిల్స్ చదువుకుంటున్నాడు అర్జున్.
కొంతసేపటికి అజయ్‌కి మెలకువ వచ్చి లేచాడు. ఎదురుగా కూర్చుని ఉన్న అర్జున్‌ని చూశాడు.
“లేచావా! నాకు కాఫీ కావాలి!” అని బాస్ వాయిస్‌తో ఆర్డర్ చేస్తున్న అర్జున్‌ని చూసి కళ్లు చిన్నవి చేశాడు అజయ్.
‘ల్యాప్‌టాప్‌లో చూస్తున్నాడు కదా! మరి నన్నెప్పుడు చూశాడు?’ అనుకుంటూ ఆశ్చర్యపోయాడు.
ఆలోచనల్లో ఉన్న అజయ్‌ని గమనించి, “కాఫీ!” అని మరోసారి కసిరాడు అర్జున్.
“హా… అర్థమైంది!” అంటూ బాత్రూమ్‌లోకి వెళ్లి త్వరగా ఫ్రెష్ అయ్యి కిచెన్‌లోకి వెళ్లాడు అజయ్.
‘ఏ పాపం చేసానో! వీడి దగ్గర ఇరుక్కుపోయాను. ఇంత పెద్ద బంగ్లా ఉంచుకుని పనివాళ్లను కూడా పెట్టుకోడా? అయినా నేను ఉండగా పనివాళ్లు ఎందుకులే!’ అనుకుంటూ గ్యాస్ స్టవ్ వెలిగించి, గిన్నె పెట్టి పాలు పోసి కాఫీ తయారు చేయడం మొదలుపెట్టాడు.
ఐదు నిమిషాల్లో కాఫీ సిద్ధం చేసి అర్జున్‌కి ఇచ్చాడు.
సీరియస్‌గా కాఫీ తీసుకుని తాగుతున్నాడు అర్జున్.
‘వీడి తలరాతలో నవ్వు అనే పదం రాసినట్టే లేదు!’ అనుకుంటూ కిందనున్న కిచెన్‌లోకి వెళ్లాడు అజయ్.
‘విజ్జు కాలేజ్‌కి వెళ్లి ఫీజు కట్టాలి. అడిగితే ఏమంటాడో ఏంటో?’ అని ఆలోచిస్తూ మళ్లీ పైకి వెళ్లి అర్జున్ ముందు నిల్చున్నాడు.
“అర్జున్…” అన్నాడు భయంగా.
“ఏంటి?” అంటూనే తాగిన కాఫీ కప్పును అతని చేతికిచ్చాడు అర్జున్.
“అదీ… తమ్ముడి కాలేజ్ ఫీజు కట్టాలి. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి కాలేజ్‌కి వెళ్తాను…” అన్నాడు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా.
“నువ్వెందుకు? ఆన్‌లైన్ ఆప్షన్ ఉంది కదా!” అన్నాడు అర్థం కానట్టుగా.
కాలేజ్‌కి వెళ్తే ఒకసారి తమ్ముడిని చూసినట్టుంటుందని, వాడిని చూసి చాలా రోజులైందని చెప్పాడు అజయ్.
ల్యాప్‌టాప్‌ను చూస్తున్న అర్జున్ దాన్ని క్లోజ్ చేసి, “ఓకే! బట్ పీఏ కూడా వస్తాడు!” అన్నాడు.
“మ్? పీఏ ఎందుకు?” అన్నాడు అర్థంకాని ముఖం పెట్టుకుని.
“మరి! నిన్ను ఎలా బయటికి ఒంటరిగా పంపిస్తాననుకున్నావ్? అదీకాక, నువ్వు ఏం చేస్తున్నావో నాకెలా తెలుస్తుంది?” అన్నాడు విషయం ముగిసినట్టుగా. మళ్లీ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి మధ్యలో ఆపిన పనిని కొనసాగించాడు.
ఇక తాను ఏం చెప్పినా వినడని అర్థమై, “ఓకే అర్జున్! మీ ఇష్టం!” అని చెప్పేసి కిచెన్‌లోకి వెళ్లాడు అజయ్.
అర్జున్ తాగిన కప్పును కడుగుతూ…
‘నేనేమైనా గూఢచారినా? ఎక్కడికి వెళ్లినా ఎవరో ఒకరిని నాతో పంపిస్తాడు. లేకపోతే తానే వస్తాడు. నాపై స్పై పెట్టడం తప్ప మరేమీ తెలియదా? మళ్లీ వెధవ కవరింగ్ ఒకటి! నిన్ను ఎలా బయటికి ఒంటరిగా పంపిస్తాను అనుకున్నావ్ అంటా! ఏదో వీడే నన్ను అరిసెల మీద నడిపించినట్టు!’ అని వెటకారంగా అనుకుంటూనే కప్పును కడిగి సెల్ఫ్‌లో పెట్టాడు.
తర్వాత టిఫిన్ తయారు చేయడం మొదలుపెట్టాడు అజయ్.
‘నా తమ్ముడికి కూడా ఇన్ని సార్లు వండి పెట్టలేదు. పాపం! వాడు తింటున్నాడో లేదో? తినే ఉంటాడులే! అసలే ఆకలికి రోకలి కూడా మింగేసే రకం!’ అని అనుకుంటూ టిఫిన్ సిద్ధం చేశాడు.
“టిఫిన్ రెడీ అయిందా?” అంటూ వస్తూనే అడిగాడు అర్జున్.
పరధ్యానంలో ఉన్న అజయ్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి, “అయింది అర్జున్!” అన్నాడు.
లంచ్ బాక్స్‌లో టిఫిన్ సర్ది, అప్పటికే రెడీగా కూర్చున్న అర్జున్ ముందు డైనింగ్ టేబుల్‌పై పెట్టాడు.
అర్జున్‌కి టిఫిన్ వడ్డించడంతో అతను తినడం మొదలుపెట్టాడు.
“నువ్వు కూర్చో! ప్రతిసారీ బొట్టు పెట్టి చెప్పాలా?” అన్నాడు పక్కనే నిల్చున్న అజయ్‌ని చూసి.
‘కూర్చోమంటే కూర్చుంటాం కదా! దానికి బొట్టు ఎందుకు?’ అనుకుంటూ మౌనంగా కూర్చున్నాడు అజయ్.
అర్జున్ ప్లేట్‌లో టిఫిన్ వడ్డించడానికి చూస్తున్న అజయ్‌కి, తన ముందున్న ప్లేట్‌లో కూడా టిఫిన్ వడ్డించాడు అర్జున్.
“బాగా తిను! ప్లీజ్… మళ్లీ నువ్వు నీరసించిపోతే ఇంట్లో పనులు చేయడానికి ఎవరూ ఉండరు!” అన్నాడు అర్జున్.
టిఫిన్ వడ్డిస్తుంటే తనపై కాస్త కేరింగ్ చూపిస్తున్నాడనుకున్నాడు అజయ్.
‘అదా నీ బాధ!’ అనుకుంటూ టిఫిన్ తినడం మొదలుపెట్టాడు.
అజయ్ టిఫిన్ ఎక్కువగా, వేగంగా తినడం చూసి, “మధ్యాహ్నం ఇంటికి రావా ఏంటి? అలా తినేస్తున్నావ్?” అని సందేహంగా అడిగాడు అర్జున్.
“వస్తాను… నిన్న నైట్ తినలేదు!” అన్నాడు టిఫిన్ తింటున్నవాడల్లా ఒక్కసారిగా ఆగిపోయి.
ప్లేట్‌లో సున్నాలు చుడుతున్నాడు అజయ్.
అజయ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మెల్లగా తల ఎత్తి చూశాడు.
అర్జున్ అగ్గిమీద గుగ్గిలంలా ఉన్నాడు.
“నిన్న రాత్రి తినలేదా? తినకుండా ఎందుకు ‘తిన్నాను’ అన్నావ్?” అని అరిచాడు.
“మీకోసం వెయిట్ చేశాను. నాకు ఒంటరిగా తినడం అలవాటు లేదు…” అన్నాడు తడబడుతూ.
“నోరు మూయ్! నాకోసం ఎందుకు వెయిట్ చేశావ్? అనుకున్న టైంకి నేను రాలేదంటే లేట్ అవుతుందని కదా అర్థం!” అంటూ కోపంగా చెప్పడం మొదలుపెట్టాడు అర్జున్.
అప్పటికే అజయ్ బాధగా ముఖం పెట్టేశాడు.
అర్జున్ తిట్ల దండకం చదవడం ఆపేశాడు.
తన ముందున్న గ్లాసును అజయ్ ప్లేట్ దగ్గరికి జరుపుతూ, “ఇదిగో వాటర్! నీళ్లు తాగు. మళ్లీ పొలమారతావ్! తింటున్నప్పుడు కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వు!” అని చెప్పేసి టిఫిన్ తినడం ముగించి చేతులు కడుక్కోవడానికి కిచెన్‌లోకి వెళ్లాడు.
అజయ్ బాధపడటం ఇందాక గమనించిన అర్జున్…
‘ఎక్కువగా తిట్టేశానా? నేను రాలేదని భోజనం మానేయడం ఏంటి? పిచ్చి పని కాకపోతే! అయినా నా తప్పే కదా! చిన్న మెసేజ్ పెట్టేయాల్సింది. తిట్టడం వల్ల ఫీల్ అవుతున్నాడేమో?’ అనుకుంటూ చేతులు టవల్‌తో తుడుచుకుని అజయ్ వైపు చూశాడు.
అజయ్ మాత్రం ఆపకుండా యుద్ధం చేస్తున్నట్టుగా తింటున్నాడు.
‘బాధపడితే ఫీల్ అయ్యాడనుకున్నాను. కానీ చూస్తే అలా లేడే!’ అనుకున్నాడు అర్జున్.
అజయ్ అదే పనిగా తింటూ, బయట మూడో ప్రపంచ యుద్ధం జరుగుతున్నా తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా కనిపించాడు.
అతన్ని ఓ నిమిషం అలాగే చూసిన అర్జున్, వెంటనే పీఏకి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు.
అజయ్ తినడం ముగించి కిచెన్‌లోకి వెళ్లి చేతులు కడుగుతుండగా ఆ మాటలు విన్నాడు.
అర్జున్ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మనడంతో ఆఘమేఘాల మీద వచ్చేశాడు పీఏ.
అర్జున్ ఉండే బంగ్లాను చూస్తూ…
‘ఈ జన్మలో ఈ బంగ్లా దర్శనం అవుతుందని అనుకోలేదు. ఈరోజుతో ఈ బంగ్లా దర్శనం అవుతుంది మాట!’ అనుకున్నాడు పీఏ.
ఆఫీస్ ఫైల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా? ఏ ఫైల్లో ఏ టాపిక్ ఉంది? దేనికి సంబంధించింది? ఇలా అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని తలుపు దగ్గర నిల్చున్నాడు పీఏ.
కాలింగ్ బెల్ నొక్కాడు.
ఎందుకైనా మంచిదని మరోసారి చేతిలో ఉన్న ఫైల్స్ చూసుకుంటున్నాడు.
తలుపు తీస్తున్న చప్పుడు వినిపించడంతో అలర్ట్ అయ్యి, “గుడ్ మార్నింగ్ సార్!” అన్నాడు వినయంగా.
తలుపు తీసిన అజయ్‌ని చూసి ఆశ్చర్యపోయాడు పీఏ.
అర్జున్ సారే వచ్చి తలుపు తీస్తారని అనుకుంటే, తెలియని వ్యక్తి ఎదురయ్యాడేంటి? అనుకుంటూ…
“ఎవరు మీరు? అర్జున్ సార్ లేరా?” అంటూనే లోపలికి వచ్చాడు పీఏ.
“లోపలే ఉన్నారు!” అన్నాడు అజయ్. లోపలికి వెళ్తున్న పీఏ వెనకాలే అనుసరిస్తూ.
“ఓకే! మీరు ఎవరనేది చెప్పలేదు!” అన్నాడు పీఏ నడుస్తున్నవాడల్లా ఆగిపోయి, అనుమానంగా చూస్తూ.
తనని అనుమానంగా చూస్తున్న పీఏని చూసి చిరునవ్వుతో, “సార్! కాఫీ ఆర్ టీ… ఏది కావాలి మీకు?” అన్నాడు వినయంగా.
మాటలకు చిరునవ్వు జత చేస్తే ఆ మాటలకే అందం వస్తుందన్నది నిజమే అనుకుంటూ అజయ్‌ని చూస్తున్నాడు పీఏ.
“హో! అర్థమైంది. వర్కరా నువ్వు! నీ పేరేంటి అబ్బాయి?” అని అడిగాడు కింద నుంచి పైవరకు చూస్తూ.
‘చిన్నపిల్లాడిలా ఉన్నాడు!’ అనుకున్నాడు.
“నా పేరు అజయ్ సార్!” అన్నాడు వినయంగా చేతులు కట్టుకుంటూ.
“భలేవాడివే అజయ్! నేను ఇలాంటివి పట్టించుకోను. నార్మల్‌గా ఉండు!” అన్నాడు సరదాగా అతని భుజం తడుతూ.
నవ్వాడు అజయ్.
పీఏ చేతిలో ఎక్కువ ఫైల్స్ ఉండటంతో, “సార్! నాకివ్వండి. పట్టుకుంటాను!” అంటూ చనువుగా తీసుకోబోయాడు అజయ్.
“వద్దు అజయ్! అర్జున్ సార్ చూస్తే తిడతారు. తీసుకున్నందుకు నీకు, ఇచ్చినందుకు నాకు… ఇద్దరికీ వాయిస్తారు!” అంటూ వారించాడు పీఏ.
అర్జున్ కోపాన్ని చవిచూసిన అజయ్, నిజమే అనుకుని…
“ఓకే సార్! మీరు ఇలా కూర్చోండి. రెండు నిమిషాల్లో కాఫీ తెస్తాను!” అని చెప్పేసి గిర్రున వెళ్లిపోయాడు.
అజయ్ వెళ్లడం చూసి మంచివాడే అనుకున్నాడు పీఏ.
‘చిన్నపిల్లాడిలా ఉన్నాడు. పనివాడేనా? నన్ను అడిగితే ఫైవ్ స్టార్ హోటల్‌లో మంచి చెఫ్‌ని పనిలో పెట్టమని చెప్తాను కదా! అర్జున్ సారే ఇతన్ని పనిలో పెట్టుకున్నారంటే ఆలోచించాల్సిన విషయమే!’ అనుకుంటూ చేతిలో ఉన్న ఫైల్స్‌ను సోఫా ముందున్న టేబుల్ మీద పెట్టి సోఫాలో వాలాడు.
చెప్పినట్టుగానే రెండు నిమిషాల్లో కాఫీ సిద్ధం చేసి, ట్రేలో మూడు కప్పుల్లో పోసి పీఏకి ఒక కప్పు ఇచ్చాడు అజయ్.
“థాంక్స్ అజయ్!” అన్నాడు కాఫీ తీసుకుంటూ.
కాఫీ రుచి చూశాడు పీఏ.
అజయ్ చేతిలో ఉన్న ట్రేలో మిగిలిన రెండు కాఫీ కప్పులను చూస్తూ…
‘సార్‌తో ఎవరైనా పైన మాట్లాడుతున్నారా?’ అనుకున్నాడు పీఏ.
అజయ్ ట్రేను టేబుల్ మీద పెట్టి అర్జున్ కోసం ఎదురుచూస్తుండగా, అర్జున్ పైనుంచి కిందికి వస్తున్నాడు.
పీఏ అర్జున్ రావడం గమనించి వెంటనే లేచి, “గుడ్ మార్నింగ్ సార్!” అంటూ అభివాదం చేశాడు.
తాగుతున్న కాఫీతో సహా ఒక్కసారిగా లేచిపోయాడు.
“సార్… సార్… అవి ఫైల్స్ సార్! చైర్మన్ సార్ చెప్పారు. మీరు ఆఫీస్‌కు తీసుకెళ్లమన్నారు!” అన్నాడు పీఏ.
అర్జెంటుగా రమ్మనడంతో ఆఫీస్‌కు సంబంధించిన పని ఏదో ఉంటుందని అనుకున్నానని చెప్తూ, తాగిన కప్పును చేతిలోనే పట్టుకున్నాడు పీఏ.
అది చూసిన అజయ్, “సార్!” అంటూ కప్పు ఇటు ఇవ్వండని చనువుగా తీసుకున్నాడు. మిగిలిన కప్పులను కూడా ట్రేలో పట్టుకుని కిచెన్‌లోకి వెళ్లాడు.
అజయ్, పీఏ చేతిలో నుంచి కప్పును అంత చనువుగా తీసుకోవడం గమనించిన అర్జున్, సీరియస్‌గా పీఏ వైపు చూశాడు.
కంటిన్యూ ఉంది…
Swipe left/right or tap the sides to turn pages