మై ఫస్ట్ కాంట్రాక్ట్ – 1
మై ఫస్ట్ కాంట్రాక్ట్
నల్లని ఆకాశంలో చంద్రుడు ఎంతో అందంగా కనిపిస్తుంటే, అలానే చూస్తుండిపోయాడు అజయ్.
ఇంద్రభవనాన్ని తలపించే బంగ్లాలోని ఓ గది బాల్కనీ దగ్గర నిల్చొని ఆకాశాన్ని చూస్తున్నాడు. బాల్కనీకి కొంతదూరంలో ఉన్న చెట్టు చిటారు కొమ్మపై కట్టుకున్న గూడులోంచి చిన్నపాటి శబ్దం వినిపించడంతో అటువైపు దృష్టి మళ్లించాడు అజయ్.
గూడులోని పిల్ల పక్షులు గాలికి చిక్కకుండా తల్లిపక్షి రెక్కల కింద దాక్కుని ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు అజయ్. పిల్ల పక్షుల మీద తల్లిపక్షికి ఉన్న ప్రేమను మురిపెంగా చూస్తున్నాడు.
తల్లిపక్షి తన పిల్లలను ఎంతో ప్రేమగా కాపాడుకుంటుంది. మరి తల్లిపక్షి సంగతేంటి? తనకు కూడా చలి వేస్తుంది కదా! ఈ సృష్టిలో తల్లి ప్రేమ ఇలాగే ఉంటుందా? తాను కష్టపడుతూనే పిల్లల సుఖం కోరుకునే వ్యక్తే తల్లి అనుకుంటా! అని మనసులో అనుకున్నాడు అజయ్.
మరి నా తల్లిదండ్రులేంటి? నన్ను, నా తమ్ముడిని కష్టాల్లో పడేసి వెళ్లిపోయారు? అని ఆలోచిస్తుండగా ఫోన్ వైబ్రేట్ అవడంతో చేతిలోకి తీసుకుని చూశాడు.
స్క్రీన్‌పై విజ్జు అనే పేరు కనిపించడంతో అప్పటివరకు మనసులో మెదులుతున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాడు.
ఇంకా నిద్రపోలేదా వీడు? అనుకుంటూ నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు.
“చెప్పు విజ్జు!” అన్నాడు అజయ్.
“అన్నా!” అన్నాడు అజయ్ తమ్ముడు విజ్జు.
“తిన్నావా విజ్జు?” బాగా రాత్రయిపోతోంది. తిన్నాడో లేదోనని అడిగాడు.
“అన్నయ్యా! అదీ…” అని చెప్తున్నవాడల్లా ఒక్కసారిగా ఆగిపోయాడు విజ్జు. తమ ఆర్థిక పరిస్థితి గురించి తెలిసిన అతను, ఏం చెప్పాలో అర్థంకాక ఆలోచనలో పడ్డాడు.
తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏదో చెప్పడానికి సతమతమవుతున్నాడని అజయ్‌కి అర్థమైంది.
“అది… కాలేజ్ మేనేజ్మెంట్ ఫీజు అడుగుతున్నారు…” అని చెప్పడానికి సంకోచిస్తున్న విజ్జును గమనించి, విషయం అర్థం చేసుకున్నాడు అజయ్.
“అర్థమైందిలే! రేపు కాలేజ్ ఫీజు కట్టేస్తాను, సరేనా?” అన్నాడు లేని నవ్వును ముఖంపై తెచ్చుకుంటూ.
తన అన్నయ్య సమాధానం విన్న విజ్జు సంతోషంగా, “థాంక్యూ అన్నా!” అన్నాడు.
తమ్ముడు సంతోషంగా ఉండటం గమనించిన అజయ్, “మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు?” అన్నాడు.
“ఓ అదా! తినేశాను…” అంటూ నవ్వాడు విజ్జు.
“గుడ్ బాయ్!” అంటూ తమ్ముడిని మెచ్చుకున్నాడు అజయ్.
“విజ్జు! ఒక విషయం చెప్పాలి రా…” అన్నాడు కొంచెం గంభీరంగా.
“ఏంటి అన్నా?” సందేహంగా అడిగాడు విజ్జు. ఏనాడూ తనతో ఇలా మాట్లాడని అన్నయ్య అలా మాట్లాడేసరికి అతనికి కొంచెం భయం వేసింది.
విజ్జు టెన్షన్ పడటం గమనించిన అజయ్ నవ్వుతూ, “అమ్మ ఉన్నప్పుడు మనకు కావాల్సినవన్నీ చూసుకునేది రా! మనం చెప్పకపోయినా మన అవసరాలు తెలుసుకుని మరీ అన్నీ తెచ్చిపెట్టేది…” అంటూ చెప్తుండగా విజ్జు మధ్యలో కలగజేసుకున్నాడు.
“అమ్మలా చూసుకునే నువ్వు ఉన్నావు కదా అన్నా! ఇంకా కోరికలు అంటావేంటి? అప్పుడప్పుడూ మనం కూడా భూమ్మీద ఉన్నామని తెలియాలి కదా అన్నా!” అన్నాడు మనస్ఫూర్తిగా నవ్వుతూ.
తమ్ముడి సమాధానం విని సంతోషపడ్డాడు అజయ్.
ఎంత ఎదిగిపోయావురా! అనుకున్నాడు మనసులో.
“తలుపులన్నీ సరిగ్గా లాక్ చేసుకుని జాగ్రత్తగా పడుకో. ఫీజు గురించి ఆలోచించకుండా బాగా చదువుకో. పరీక్షలు కూడా ఉన్నాయి కదా!” అని గుర్తుచేశాడు అజయ్.
“అలాగే అన్నయ్యా! మన ఇంటికి ఎప్పుడు వస్తావు? చాలా రోజులైంది కదా!” అని ఆశగా అడిగాడు విజ్జు.
తమ్ముడు అలా ఆశగా అడిగేసరికి ఒక్కసారిగా బాధ కలిగింది అజయ్‌కి.
నాకు మాత్రం ఏం తెలుసురా? అని మనసులో అనుకుంటూ, “ఇక్కడ చాలా వర్క్ ఉందిరా! ఒకరకంగా నేను లేకపోతే ఇక్కడ ఏ పనీ అవ్వదు అనుకో!” అన్నాడు ఉత్సాహంగా నటిస్తూ.
“ఓ అలాగా? ఓకే అన్నయ్యా! వీలు చూసుకుని రా!” అన్నాడు నింపాదిగా విజ్జు.
“వస్తానులే!” అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అజయ్.
ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు.
నేను ఇంకా అసలు విషయం చెప్పలేదు. ఒకవేళ చెప్తే మరింత టెన్షన్ పడతాడు. ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ఎగ్జామ్స్ ఉన్నాయి. ముందు బాగా చదువుకోనివ్వాలి. తర్వాత నింపాదిగా చెప్తాను… అని అనుకున్నాడు.
తాను ఫోన్ చేసిన ప్రతిసారీ అబద్ధాలను మూటగట్టి చెప్తున్నందుకు అజయ్‌కి ఎంతో బాధ కలిగింది.
చిన్నగా నిట్టూర్చి గోడకు ఉన్న గడియారాన్ని ఓసారి చూశాడు. అనుకున్నదానికంటే ఎక్కువ సమయమే అయింది.
తను వేసుకున్న బట్టలను మరోసారి సరిచూసుకుంటుండగా గది లైటు వెలుగులో ఓ ఉంగరం ముత్యంలా మెరిసింది.
దాన్ని చూస్తూ, “అరే! ఇదెలా మర్చిపోయాను! వాడు చూస్తే కచ్చితంగా తిడతాడు…” అనుకుంటూ వెంటనే ఉంగరాన్ని తీసుకుని ఉంగరం వేలికి పెట్టుకున్నాడు అజయ్.
ఏమైంది ఇతనికి? సాయంత్రం వెళ్లాడు… అని ఆలోచిస్తుండగానే తలుపు చప్పుడు వినిపించింది.
వెంటనే వెళ్లి తలుపు తీశాడు అజయ్.
గదిలోకి వస్తున్న ఆ వ్యక్తిని చూసి కష్టంగా నవ్వాడు.
అజయ్ స్వాగతం పలుకుతున్నట్టుగా నవ్వితే, ఆ వ్యక్తి కూడా ఓ చిన్న నవ్వు నవ్వి వెంటనే సీరియస్ అయ్యాడు.
“తిన్నావా?” అని ముందుకు నడుస్తూనే అడిగాడు.
తలుపులు వేసి ఆ వ్యక్తి వెనకాలే అనుసరిస్తున్న అజయ్ ఆ మాటను సరిగ్గా వినిపించుకోలేదు.
అజయ్ నుంచి సమాధానం రాకపోయేసరికి, “నేను అడుగుతున్నది నిన్నే! తిన్నావా లేదా?” అని మరోసారి గట్టిగా అడిగాడు ఆ వ్యక్తి.
ఆలోచనల్లో ఉన్న అజయ్ అతని అరుపుకు భయపడుతూ, “మ్… తిన్నాను సార్!” అన్నాడు తలదించుకుని.
వచ్చిన కోపాన్ని అదుపు చేసుకుంటూ “మ్!” అని బదులిచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లాడు ఆ వ్యక్తి.
అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్లాడని అర్థమై, హమ్మయ్యా! అనుకుంటూ బెడ్‌పై కూర్చున్నాడు అజయ్.
కాలేజ్ ఫీజు అంటే ఇప్పుడెలా? కాలేజ్ ఫీజు లక్షల్లో ఉంటుంది. నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. మళ్లీ ఇతన్ని సహాయం అడిగితే ఏమంటారో! ఆల్రెడీ కాలేజ్‌లో సీటు కోసం సహాయం అడిగాను… అని ఆలోచిస్తుండగా ఫోన్లో ఓ మెసేజ్ వచ్చింది.
వెంటనే ఫోన్ తీసుకుని మెసేజ్ చూశాడు.
తన అకౌంట్లో కాలేజ్ ఫీజు కట్టడానికి సరిపడా డబ్బు జమ అయింది!
ఆశ్చర్యంగా చూస్తూ ఆ డబ్బు ఎవరు పంపించారో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. పంపించిన వ్యక్తి పేరు రామకృష్ణ అని ఉంది.
కనుబొమ్మలు ముడివేసి ఆలోచనలో పడ్డాడు అజయ్. ఆ పేరుతో తనకు దగ్గరి బంధువులు గానీ, సన్నిహితులు గానీ ఎవరూ లేరని అతనికి తెలుసు. మరి ఆ వ్యక్తి ఎవరై ఉంటారా? అని ఆలోచిస్తూ ఉండిపోయాడు.
కాసేపటి తర్వాత బాత్రూమ్లో నుంచి బయటకు వస్తున్న ఆ వ్యక్తి బెడ్‌పై ఉన్న అజయ్‌ని చూసి, “ఓ షిట్! ఇది మర్చిపోయాను!” అనుకున్నాడు.
వెంటనే మళ్లీ బాత్రూమ్లోకి వెళ్లి మరో టవల్ తీసుకొచ్చి తన శరీరంపై కప్పుకున్నాడు.
బాత్రూమ్లో నుంచి వస్తున్న ఆ అర్థనగ్న వ్యక్తిని చూసి ఇబ్బందిగా కిటికీ వైపు నడిచాడు అజయ్.
అంత పెద్ద బాత్రూమ్ ఉంది కదా! బట్టలు వేసుకోవడానికి కూడా పనికిరాదా? అనుకున్నాడు మనసులో.
బట్టలు వేసుకుంటూనే, “అకౌంట్లో డబ్బులు వచ్చాయా?” అని ప్రశ్నించాడు అర్జున్.
అంటే… నా అకౌంట్లో డబ్బులు వేసింది అర్జున్ సారేనా? అనుకుని అర్జున్ వైపు తిరిగాడు అజయ్.
అప్పటికే అర్జున్ బట్టలు వేసుకోవడం చూసి, ఇబ్బందిగా మళ్లీ కిటికీ వైపు తిరిగాడు.
“అర్జున్ సార్…” అన్నాడు అజయ్ కిటికీలోంచి బయటకు చూస్తూ.
వేసుకున్న డ్రెస్ చివరి బటన్ పెడుతూ, “నన్ను అర్జున్ అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాలి?” అని కసిరాడు అర్జున్.
“అర్జున్ గారు…” అంటూ అతని వైపు తిరిగి చూశాడు అజయ్.
తనను అంత గౌరవంగా పిలుస్తున్న అజయ్ వైపు కనుబొమ్మలు ఎత్తి చూశాడు అర్జున్.
ఆ చురుకైన చూపులకు భయపడిపోయి, “ఆ… అదీ… అర్జున్!” అన్నాడు ఇబ్బందిగానే.
ఇందాక కోపంతో ఉన్న అర్జున్ అజయ్‌ని సరిగ్గా గమనించలేదు. ఇప్పుడు మాత్రం నిశితంగా చూస్తున్నాడు.
ఆకాశవీధిలో విహరించే అందాల జాబిలి దారితప్పి తన ఇంటికి వచ్చాడేమో అనిపించింది అర్జున్‌కి.
తననే మైమరచి చూస్తున్న అర్జున్‌ని కొంచెం గట్టిగా పిలిచాడు అజయ్.
“హా… చెప్పు!” అంటూ తేరుకున్నాడు అర్జున్.
“థాంక్యూ అర్జున్…” అన్నాడు పదాలు కూడదీసుకుంటూ అజయ్.
ఇందాకటి నుంచి ఏదో ఆలోచిస్తున్నాడని అనుకున్న అర్జున్‌కి, ఇప్పుడు మాత్రం తన తమ్ముడి ఫీజు గురించే ఆలోచిస్తున్నాడని అర్థమైంది.
“మా తమ్ముడు మంచి కాలేజ్‌లో చదువుతున్నాడంటే అదంతా మీ సహాయం వల్లే! కాలేజ్‌లో సీటు ఇవ్వమంటే ఇప్పించారు. తమ్ముడి విషయంలో మీ సహాయం లేనిదే ఏ పనీ అవ్వట్లేదు. అందుకు థాంక్స్!” అన్నాడు కృతజ్ఞతాభావంతో చూస్తూ.
“మరీ ఎక్కువగా థాంక్స్ చెప్పకు!” అంటూ కిటికీ దగ్గరగా ఉన్న అజయ్‌ని తనవైపుకు లాక్కున్నాడు అర్జున్.
“థాంక్స్ ఎందుకు చెప్తున్నావ్? ఇదంతా చేసింది కేవలం అగ్రిమెంట్ ప్రకారమే కదా!” అంటూ అజయ్ నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుని, అతని కళ్లలోకి చూస్తూ అన్నాడు.
అజయ్ మాత్రం బాధగా చూపులను నేలవైపు మళ్లించాడు.
“నువ్వు నాకు థాంక్స్ చెప్తున్నావంటే మనిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ మర్చిపోయావేమో అనుకున్నాను!” అంటూ నేలను చూస్తున్న అజయ్ గడ్డాన్ని పట్టుకుని తనవైపు తిప్పుకున్నాడు.
అజయ్ కళ్లలో నుంచి పాలబుగ్గల మీదుగా జారుతున్న కన్నీటిని చూస్తూ, “అయితే అగ్రిమెంట్ గుర్తుందన్నమాట! నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీ తమ్ముడి జీవితం కోసం నిన్ను నువ్వు అమ్ముకుంటావని అనుకోలేదు అజయ్! నీ జీవితంపై రాత రాసిన దేవుడికి కూడా హక్కు లేదు. కేవలం నాకు మాత్రమే హక్కుంది!” అన్నాడు వినిపించేటట్టుగా.
అజయ్ మెడ వంపుల్లో ముద్దులు పెడుతున్న అర్జున్‌కి, అతని శరీరం నుంచి వెలువడే సహజమైన పరిమళం తన కోరికలకు నిప్పుకు ఆజ్యం పోసినట్టుగా అనిపించింది.
అర్జున్ అలా ముద్దులు పెడుతుంటే అజయ్ ఒళ్లంతా జలదరించినట్టయింది. అయిష్టంగా చేతులతో అర్జున్‌ని తోసే ప్రయత్నం చేశాడు.
అర్జున్‌కి ఒక్కసారిగా కోపం వచ్చింది.
“మన మధ్య ఈ రాత్రి కూడా ఊహించలేని ఎన్నో మొదటి రాత్రులు అయ్యాయి కదా!” అంటూ గొంతెత్తి అరిచాడు అర్జున్.
అజయ్ జీవం లేని మనిషిలా తన ముందు నిలబడిపోయాడు.
“అగ్రిమెంట్ మర్చిపోయావా ఏంటి?” అన్నాడు కోపంతో ఊగిపోతూ. అతని ప్రవర్తన చూస్తుంటే అగ్నిపర్వతం పేలడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపించింది.
అజయ్ తనను కొడతాడేమోనని భయపడి ముఖంపై చేతులు అడ్డంగా పెట్టుకున్నాడు.
అజయ్‌ని కొట్టడానికి చేయి ఎత్తిన అర్జున్, అతని ప్రవర్తనను చూసి గతంలోని ఓ సంఘటనను గుర్తుచేసుకున్నాడు.
ఓ చిన్న గది… చుట్టూ చీకటి… మధ్యలో ఓ పదిహేనేళ్ల అబ్బాయి.
ఎవరో అతన్ని కొట్టడానికి చేయి ఎత్తగానే, అజయ్లాగే తన చేతులను రక్షణగా ముఖం ముందు అడ్డుపెట్టుకున్నాడు ఆ అబ్బాయి.
ఏడ్చుకుంటూ ఆ గది ద్వారం వైపే ఎదురుచూస్తున్నాడు.
ఆ సంఘటన గుర్తుకు రాగానే కోపంతో ఊగిపోతున్న అర్జున్ ఒక్కసారిగా సాధారణ స్థితికి వచ్చాడు. అప్పటికే పైకెత్తిన చేతిని నెమ్మదిగా కిందకు దించేశాడు.
అజయ్ ఏడుస్తూ నేలపైనే కూలబడిపోయాడు. రెండు మోకాళ్ల మధ్య తల దాచుకుని బాధపడుతున్నాడు.
మనసు అలసిపోయి నిద్రను కోరుకుంటోంది. కానీ నిద్ర మాత్రం రావడం లేదు. మనసులోని బాధ నిద్రపై పెత్తనం చేస్తోంది.
కోపంతో వెళ్లిన అర్జున్ ఐదు నిమిషాలకే నిద్రపోయాడు.
ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన అర్జున్, ఇంట్లో అమ్మ లేకపోవడాన్ని గమనించాడు. ఇల్లంతా అమ్మ కోసం వెతుకుతుండగా ఎదురుగా కుర్చీలో కూర్చున్న ఓ వ్యక్తిని చూసి భయంతో కేకలు వేస్తూ హాల్ మొత్తం పరుగులు పెట్టాడు.
తన వెనకాలే వచ్చిన ఆ వ్యక్తి అర్జున్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. చివరికి వెకిలిగా నవ్వుతూ అతన్ని పట్టుకున్నాడు.
ఆ నవ్వు ఇప్పటికీ అర్జున్ చెవిలో గంట శబ్దంలా మోగుతూనే ఉంది.
ఆ జ్ఞాపకంతో నిద్రపోతున్న అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు.
ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. నీళ్లు నములుతూ చుట్టూ చూశాడు. తాను సురక్షితంగానే ఉన్నానని అర్థమయ్యాక మనసు కొంత కుదుటపడింది.
కిటికీ గోడకు ఆనుకుని పడుకున్న అజయ్‌కి కూడా చిన్నగా మెలకువ వచ్చినట్టుంది. బెడ్‌పై అర్జున్ లేచి కూర్చోవడం గమనించాడు.
అతను టెన్షన్ పడుతుండటం గమనించిన అజయ్ వెంటనే తన దగ్గరకు వెళ్లి, “ఏమైంది అర్జున్?” అంటూ అడిగాడు.
“ఏమీ లేదు… పీడకల వచ్చినట్టుంది!” అంటూ తలను పట్టుకుని అన్నాడు అర్జున్.
“వాటర్ తెస్తాను…” అని చెప్పి పక్కనున్న పరుపు మీద నుంచి లేవబోతున్న అజయ్ చేయిని అర్జున్ పట్టుకున్నాడు.
“అవసరం లేదు!” అన్నాడు అర్జున్ చిరుకోపంగా.
“కొంచెం నీళ్లు తాగండి అర్జున్. మనసు నిబ్బరంగా ఉంటుంది…” అంటూ అర్జున్ పట్టుకున్న చేయిని విడిపించుకునే ప్రయత్నం చేశాడు అజయ్.
“వాటర్ అవసరం లేదని చెప్తే అర్థం కాదా?” అని కసిరాడు అర్జున్.
భయంతో తలదించుకున్నాడు అజయ్.
ఇందాక తాను అన్న మాటలకు అజయ్ ఇంకా బాధపడుతున్నాడని అర్థమైంది అర్జున్‌కి. అతన్ని మరింత బాధపెట్టాలని ఇప్పుడు అనిపించలేదు.
మౌనంగా తననే చూస్తున్న అజయ్‌ని చూసి, బెడ్‌పై పడుకుని తన పక్కనే పడుకోమన్నట్టుగా చూశాడు అర్జున్.
అర్జున్ తన పక్కన పడుకోమంటున్నాడని అర్థమై ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు అజయ్.
కంటిన్యూ ఉంది…
Swipe left/right or tap the sides to turn pages