New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
స్వయంసిద్ధ – 3

స్వయంసిద్ధ – 3

స్వయంసిద్ధ – ౩వ భాగం

 

వంటగది కిటికీ బయట పిచ్చుకలు నెమ్మదిగా అరుస్తున్నాయి! పక్కింటి ఆవిడ ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేస్తుంది.

 

దూరంగా పాలు పోసే వ్యక్తి సైకిల్‌ గంట వినిపించింది. ఆ కాలనీ లో అందరూ మేల్కొనే లోపే జాహ్నవి తన ల్యాప్‌ టాప్‌ తెరిచి కూర్చుంది.

 

తన మదిలో ఉన్నదీ ఒకే ఒక్క పేరు! సౌమ్య! ఆమెకు సంబంధించిన న్యూస్ లో ఉన్న వివరాలు చాలా తక్కువే! సౌమ్య వయసు ఇరవై రెండేళ్లు. ఒక ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తుంది. రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె వ్యక్తిగత సమస్యలతో బాధపడుతుందని చెప్పినట్లు న్యూస్ మాత్రమే ఆర్టికల్స్ లో ఉంది.

 

ఆమె ఎప్పుడు కనిపించకుండా పోయింది? చివరిసారిగా ఎక్కడ కనిపించింది? పోలీసులకు ఫిర్యాదు ఎప్పుడు చేశారు? ఆమెను వెతకడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వీటిలో ఏ ప్రశ్నకూ కూడా సమాధానం లేదు.

 

ఒక వ్యక్తి కనిపించకుండా పోయినప్పుడు, వార్తలో అన్ని వివరాలూ ఉండకపోవచ్చు. దానికి కారణాలు చాలా ఉండవచ్చు. సమాచారం ఇంకా వ్యాలిడేట్ చేసి ఉండకపోవచ్చు! పోలీసులు దర్యాప్తు కారణంగా కుటుంబ సభ్యులు కొన్ని విషయాలు బయటకు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు.

 

కాబట్టి వార్తలో సమాచారం లేకపోవడం ఒక్కటే అనుమానానికి ఆధారం కాదు. అందుకని వెంటనే నోట్ బుక్ తెరించింది జాహ్నవి!

 

“సమాచారం లేకపోవడం ఒక ప్రశ్నను కలిగించవచ్చు. కానీ అది ఒక్కటే సమాధానం కాదు.” అంటూ రాసి నోట్ బుక్ మూసేసింది ఆమె!

 

ఆమెకు ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఆసక్తి ఉంది. కానీ ఆసక్తి పేరుతో ఎవరి వ్యక్తిగత జీవితంలోనైనా ప్రవేశించడం సరైనది కాదు.

 

సౌమ్య కుటుంబాన్ని సంప్రదించడానికి తనకు సరైన కారణం లేదు. ఆమెకు జర్నలిస్టుగా గుర్తింపు లేదు. కేవలం ఒక వార్త చదివానని వెళ్లి బాధలో ఉన్న కుటుంబాన్ని ప్రశ్నించడం కూడా తగదు.

 

ముందుగా న్యూస్ లోని వివరాలు అధికారికంగా వ్యాలిడేట్ చేసారా అనేది తెలుసుకోవాలని నిర్ణయించుకుంది.

 

ఆమె ఆ వెబ్‌సైట్‌లో ప్రచురించిన మరిన్ని లోకల్ న్యూస్ పరిశీలించింది. కొన్ని వార్తల్లో పోలీసుల అధికారిక ప్రకటనలు ఉన్నాయి. మరికొన్నింటిలో పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తుల సమాచారం ఉంది.

 

ఇంకొన్ని వార్తల్లో మాత్రం ఆధారాలు ప్రస్తావించకుండా నిర్ధారణలతో కూడిన వాక్యాలు కనిపించాయి.

 

వార్త రాయడం అంటే కేవలం పదాలను వరుసగా పెట్టడం కాదని ఆమెకు తెలుసు! ప్రతి వాక్యం వెనుక ఒక బాధ్యత ఉంటుంది. ఒక చిన్న వాక్యం కూడా ఒకరి జీవితంపై ప్రభావం చూపించగలదు.

 

ఆ ఆలోచనల్లో ఆమె ఉండగానే గది బయట నుండి సుజాత పిలుపు వినిపించింది.

 

“జాను! కాఫీ తాగుతావా?”

 

“తాగుతానమ్మా!” లోపలి నుండే బెడ్ పై కూర్చొని సమాధానం ఇచ్చింది!

 

“మరి ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నావా?”

 

“ఇంకా తెలియదు. కొంచెం అయ్యాక చెబుతా!”

 

సుజాత కాఫీ తీసుకొచ్చి టేబుల్‌ మీద పెట్టింది. కూతురి ముందు ఉన్న నోట్‌ బుక్‌ ను చూసింది.

 

“ఇన్ని రాసుకుంటున్నావేంటి?”

 

“వార్తల్లో ఏది నిజమో, ఏది నిర్ధారణ కాని సమాచారమో ఎలా గుర్తించాలో నేర్చుకుంటున్నాను అమ్మా.”

 

“నువ్వు వార్తలు చదివి నేర్చుకోవడం మంచిదే. కానీ ఒకటి చెప్పనా? మన ఇంట్లో ఏదైనా జరిగితే, బయటివాళ్లు సగం విషయం తెలుసుకుని మిగతా సగం వాళ్లే ఊహించుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది?”

 

కాఫీ గ్లాసు తీసుకొని పట్టుకున్న జాహ్నవి చేయి ఆగిపోయింది.

 

“బాధగా ఉంటుంది.” సమాధానం ఇచ్చింది జాహ్నవి!

 

“మరి మనం కూడా ఎవరి గురించైనా అలా మాట్లాడకూడదు కదా!” అని చెబుతున్న తన తల్లి వైపు చూసింది జాహ్నవి!

 

ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి పుస్తకాలు చదువుతుంది. కానీ తన తల్లి మాత్రం తనకు తెలిసిన జీవిత అనుభవం నుండి అదే విషయాన్ని చాలా సులభంగా చెప్పింది.

 

“అవునమ్మా! నువ్వు చెప్పింది కరెక్ట్! నిజం తెలుసుకోవాలనే ప్రయత్నంలో కూడా ఎదుటివాళ్ల బాధను మర్చిపోకూడదు.”

 

“అయితే ముందు కాఫీ తాగు! చల్లారిపోయాక దాని నిజస్వరూపం మారిపోతుంది.”

 

“అమ్మా! కాఫీకి నిజస్వరూపం ఏముంటుంది?”

 

“చల్లారిన కాఫీని వేడి కాఫీ అని తాగలేవు కదా! ఏది ఏ సమయంలో ఎలా ఉందో అలా గుర్తించాలి! అంతే!” సుజాత నవ్వుతూ చెప్పి ఆ గది నుండి బయటకు వెళ్లిపోయింది.

 

ఆ మాట విన్న జాహ్నవి మాత్రం ఆ మాటను మరోసారి గుర్తుచేసుకుంది.

 

“ఏది ఏ సమయంలో ఎలా ఉందో అలా గుర్తించాలి! బహుశా నిజాన్ని తెలుసుకోవడంలో మొదటి అడుగు అదే.” అని మళ్ళీ అనుకుంటూ ఆలోచనలలో పడిపోయింది జాహ్నవి!

 

ఉదయం తొమ్మిది గంటలకు జాహ్నవి తన స్నేహితురాలు మానసకు ఫోన్‌ చేసింది.

 

మానస డిగ్రీ పూర్తి చేసి ఒక చిన్న సంస్థలో పనిచేస్తుంది. ఇద్దరూ కాలేజీ రోజుల నుండి స్నేహితులు. జాహ్నవి తన ఉద్యోగ ప్రయత్నాల గురించి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేర్చుకుంటున్న విషయం గురించి ఆమెకు తెలుసు.

 

“ఏమైందే? ఇంత పొద్దున్నే ఫోన్‌ చేసావు?” మానస అడిగింది.

 

“ఒక విషయం అడగాలి! నువ్వు పనిచేసే సంస్థలో ఎవరైనా న్యూస్ రాసే వాళ్లు తెలుసా?”

 

“మా సంస్థలోనా? మేము న్యూస్ రాయముగా!”

 

“అది కాదు. జర్నలిజం గురించి తెలిసినవాళ్లు ఎవరైనా ఉంటే పరిచయం చేయగలవా? నేను నేర్చుకోవాలి! ముఖ్యంగా న్యూస్ ని ఎలా వ్యాలిడేట్ చేస్తారు! ఇన్ఫర్మేషన్ ని ఎలా గ్రాబ్ చేస్తారు అని!”

 

“అబ్బా! నువ్వు నిజంగానే సీరియస్‌గా ఉన్నావే!”

 

“ఉన్నాను! ఉద్యోగం దొరికే వరకు ఖాళీగా ఉండలేను కదా!”

 

“మా అన్నయ్య స్నేహితుడు ఒకరు లోకల్ న్యూస్ పేపర్ ఆఫీస్ లో ఎడిటర్ గా పనిచేస్తున్నారు. కానీ ఆయన నీకు ఉద్యోగం ఇప్పిస్తారని మాత్రం చెప్పలేను.”

 

“ఉద్యోగం కోసం కాదు మానసా! నేర్చుకోవడానికి మాత్రమే! ఆయనకు ఇబ్బంది లేకపోతే ఒకసారి మాట్లాడతాను.”

 

“సరే! ముందు నేను ఆయనను అడుగుతాను. ఆయన ఒప్పుకుంటే నంబర్‌ ఇస్తాను.”

 

“థాంక్యూ మానస!” అంటూ ఫోన్‌ పెట్టిన జాహ్నవి మనసులో కొంత ఉత్సాహం కలిగింది. కనీసం తనకు తెలిసిన సర్కిల్ నుండి ఒక సరైన మార్గం దొరుకుతుంది అని ఆనందం కలిగింది!

 

అయితే ఆమెకు తెలియని విషయం ఏంటంటే, పరిచయాలు ఉండటం, ఎవరో చెప్పినదాన్ని గుడ్డిగా నమ్మడం రెండూ వేర్వేరు విషయాలు. ఆమెకు ఎవరైనా సహాయం చేసినా, వారు చెప్పే ప్రతి విషయాన్నీ అర్థం చేసుకోవాల్సిందే అని!

 

మానస నుండి వచ్చే రిప్లై కోసం ఎదురు చూస్తున్న జాహ్నవి కి మానస నుండి సాయంత్రం సమయంలో మెసేజ్ వచ్చింది!

 

“మా అన్నయ్య ఫ్రెండ్ మాట్లాడటానికి ఒప్పుకున్నారు. పేరు శేఖర్‌! రేపు సాయంత్రం ఆయన ఆఫీసులో ఉంటారట. నువ్వు వెళ్లి కలవచ్చు.” అంటూ వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ కి థాంక్స్ అని రిప్లే ఇచ్చింది జాహ్నవి!

 

మరుసటి రోజు సాయంత్రం జాహ్నవి ఒక లోకల్ న్యూస్ పేపర్ ఆఫీస్ కి వెళ్లింది.

 

పాత భవనం మొదటి అంతస్తులో ఉన్న ఆఫీసు అది! మెట్ల గోడలపై పాత వార్తాపత్రికల కటింగ్స్‌ ఫ్రేముల్లో అమర్చబడి ఉన్నాయి. ఒక ఫ్రేము లో వరద బాధితులకు సహాయం చేసిన స్వచ్ఛంద సంస్థ గురించి వార్త ఉంది. మరొక దానిలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన నిర్లక్ష్యంపై కథనం ఉంది. కొన్ని కటింగ్స్‌ రంగు వెలిసిపోయినా, వాటిలోని శీర్షికలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

లోపలికి వెళ్లగానే పాత కాగితాల వాసన, ప్రింటర్‌ శబ్దం, ఫోన్ల శబ్దాలు ఆమెకు స్వాగతం పలికాయి.

 

శేఖర్‌ నలభై మూడేళ్ళ వయసులో ఉన్న వ్యక్తి. సాధారణమైన చొక్కా, కళ్లజోడు, టేబుల్‌ మీద చిందరవందరగా ఉన్న కాగితాలు ఉన్నాయి! ఆయనలో ప్రత్యేకంగా కనిపించేది ఏమీ లేదు. కానీ ఆయన కళ్లలో మాత్రం ప్రతి మాటనూ జాగ్రత్తగా వినే అలవాటు కనిపించింది.

 

“నువ్వేనా జాహ్నవి? మానస చెప్పింది.” అతని ముందు కూర్చున్న జాహ్నవి ని చూస్తూ అన్నాడు శేఖర్!

 

“అవును సర్‌.”

 

“జర్నలిజం నేర్చుకోవాలనుకుంటున్నావట?”

 

“అవును సర్‌! ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం.” అంటూ జాహ్నవి చెప్పగానే ఆయన చిరునవ్వు నవ్వారు.

 

“నేరుగా పెద్ద పెద్ద విషయాలతో మొదలుపెట్టాలనుకుంటున్నావా?”

 

“లేదు సర్‌! ముందు ప్రాథమిక విషయాలు నేర్చుకోవాలి. ఒక న్యూస్ లోని సమాచారాన్ని ఎలా వ్యాలిడేట్ చెయ్యాలి? ఎవరి మాటను ఎలా అనలైజ్ చెయ్యాలి? ఆర్టికల్స్, గవర్నమెంట్ రికార్డులు ఎలా ఉపయోగించాలి? ఇవన్నీ!”

 

“మంచిదే! అయితే ఒక విషయం గుర్తుంచుకో. ఇన్వెస్టిగేట్ జర్నలిజం అంటే ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారని నిరూపించడం కాదు. నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవడం. కొన్నిసార్లు నువ్వు అనుమానించిన వ్యక్తి నిర్దోషి అని నిర్ధారణ అవ్వొచ్చు. కొన్నిసార్లు నీకు మొదట కనిపించిన విషయం పూర్తిగా తప్పు కావచ్చు.”

 

“అప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను సర్‌.”

 

“మాటల్లో చెప్పడం సులభం! నువ్వు ఎంతో కష్టపడి సేకరించిన సమాచారం నీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటే, దాన్ని అంగీకరించగలవా?”

 

“కష్టపడి సేకరించిన సమాచారం నిజమైతే, అంగీకరించాలి సర్‌. నా అభిప్రాయాన్ని కాపాడుకోవడానికి నిజాన్ని మార్చలేను.” జాహ్నవి ఆలోచించి సమాధానం చెప్పింది. శేఖర్‌ ముఖంలో సంతృప్తి కనిపించింది.

 

“సరే! ఇంకో ప్రశ్న! నీకు ఒక అమ్మాయిపై అన్యాయం జరిగిందని అనిపిస్తే, ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతావా?”

 

“ఆమెకు అన్యాయం జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాను సర్‌.”

 

“చాలా చిన్న తేడాలా అనిపిస్తాయి ఈ రెండు మాటలు. కానీ ఈ వృత్తిలో ఇవే చాలా ముఖ్యం! న్యాయం చేయాలనే ఉద్దేశం మంచిదే. అయితే ఎవరి పక్షాన అయినా నిలబడే ముందు నిజాలు ఏమిటో తెలుసుకోవాలి. బాధితురాలిగా కనిపిస్తున్న వ్యక్తి చెప్పిన ప్రతి విషయాన్నీ పరిశీలించాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి. కానీ ఈ క్రమంలో బాధితురాలి సేఫ్టీ ని, ప్రైవసీ ని నెగ్లెక్ట్ చేయకూడదు.”

 

“సర్‌, మరి ఒక అమ్మాయి గురించి సమాజం ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే?”

 

“అప్పుడు నీ పని ఆ అభిప్రాయాన్ని మరో అభిప్రాయంతో మార్చడం కాదు. ఆధారాలతో నిజాన్ని ప్రజల ముందుంచడం. ప్రజలకు ఆలోచించే అవకాశం ఇవ్వడం.” అంటూ ఆయన తన టేబుల్‌ మీద ఉన్న పాత న్యూస్ పేపర్ ని తీసుకున్నారు.

 

“ఈ న్యూస్ చూడు.” అంటూ ఆ పేపర్ ని చూయించాడు శేఖర్!

 

పేపర్ లో ఒక చిన్న పట్టణంలో ప్రభుత్వ పాఠశాల మూతపడే పరిస్థితి గురించి ఉంది. మొదట్లో తల్లిదండ్రుల నిర్లక్ష్యమే అని కారణమని స్థానికులు ఆరోపించారట. కానీ తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, భవనం రిబిల్ద్ చేయడానికి ఫండ్స్ రిలీస్ కాకపోవడం వంటి విషయాలు వెలుగు లోకి వచ్చాయి.

 

“మొదట కనిపించిన సమస్య ఒకటి! దాని వెనుక ఉన్న కారణాలు వేరు! ఒకవేళ వార్త రాసిన వ్యక్తి తల్లిదండ్రులనే నిందించి ఉంటే, అసలు సమస్య ప్రజలకు తెలిసేదా?”

 

“తెలిసేది కాదు సర్‌.”

 

“అందుకే ఇన్వెస్టిగేషన్లో ఓర్పు ముఖ్యం. నువ్వు ఒక విషయాన్ని ఎంత త్వరగా నిర్ధారిస్తావన్నది కాదు. నిర్ధారించడానికి ఎంత బాధ్యతగా పనిచేస్తావన్నదే ముఖ్యం. నువ్వు ఇంటికి వెళ్లాక ఈ పత్రికలోని ఒక వార్తను ఎంచుకో! అందులో ఉన్న వాస్తవాలు ఏవి, అభిప్రాయాలు ఏవి, నిర్ధారించని ఆరోపణలు ఏవి అని విడదీసి రాయి. తర్వాత నీకు ఏ ఆధారాలు కావాలో గుర్తించు! ఆధారాలు దొరకకపోతే ఊహించి నింపకు! దొరకలేదని రాయి.”

 

“సరే సర్‌.”

 

“ఇంకో విషయం. నువ్వు ఇంకా ఈ సంస్థలో ఉద్యోగం చేయడం లేదు. కాబట్టి మా పేరుతో ఎవరి దగ్గరికీ వెళ్లకూడదు. నీకు జర్నలిస్టుగా గుర్తింపు ఉన్నట్టు చెప్పకూడదు. నీకు తెలిసిన విషయాల పరిధిలోనే పనిచేయాలి.”

 

“అర్థమైంది సర్‌.”

 

“మంచిది! నేర్చుకోవడానికి ఆసక్తి ఉండటం మొదటి మెట్టు. బాధ్యతగా వ్యవహరించడం రెండో మెట్టు.” అంటూ ఆయన చెప్పిన విషయాలు జాహ్నవికి ఎంతో నచ్చాయి.

 

ఆమె ఆ ఆఫీస్ నుండి బయటకు వస్తున్నప్పుడు మెట్ల గోడపై ఉన్న ఒక పేపర్ కటింగ్‌ కనిపించింది. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిన రోగి గురించి ఆ కథనం ఉంది.

 

ఆ వార్త పక్కన ఇంకో కటింగ్‌! ఆసుపత్రి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడిన కుటుంబానికి న్యాయం లభించినట్లు! ఆ రెండు కటింగ్స్‌ మధ్య తేడా ఒకటే! ఒక కుటుంబం బాధపడింది. ఇంకో కుటుంబం తమకు జరిగినదాన్ని ఆధారాలతో బయటపెట్టగలిగింది. వెంటనే నోట్ బుక్ తీసి రాసింది!

 

“ప్రతి అన్యాయాన్ని ఒంటరిగా సరిచేయలేకపోవచ్చు. ప్రతి కేసులో నిజం బయటపడకపోవచ్చు. అయినా సరైన ప్రశ్న అడగడానికి, ఒక ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలించడానికి, తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా ఉండటానికి ఎవరూ అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు.” అంటూ రాసి అక్కడి నుండి బయటకు నడిచింది జాహ్నవి.

 

ఇంటికి వెళ్ళిన తరువాత ఒక వార్తను ఎంచుకుని వాస్తవాలు, అభిప్రాయాలు, ఆరోపణలు అంటూ మూడు భాగాలుగా విభజించింది.

 

పని సులభంగా అనిపించినా, ఒక్కో వాక్యాన్ని పరిశీలిస్తుంటే కొత్త ప్రశ్నలు ఎదురయ్యాయి. ఒక వార్తలో ఒక వ్యక్తి చెప్పిన మాట వాస్తవం కాదు! ఆ వ్యక్తి అలా చెప్పాడన్నదే వాస్తవం. ఆ మాట నిజమో కాదో నిర్ధారించడానికి మరో ఆధారం కావాలి.

 

ఆమె ఆ తేడాను నోట్‌బుక్‌లో స్పష్టంగా రాసుకుంది. తర్వాత సౌమ్య అదృశ్యమైన వార్తను గుర్తుచేసుకుంది.

 

ఒక అమ్మాయి కనిపించకుండా పోయినప్పుడు, ఆమె గురించి మొదట ప్రచారంలోకి వచ్చేది ఆమె ఎదుర్కొన్న పరిస్థితులా? లేక ఆమె వ్యక్తిగత జీవితం గురించిన ఊహాగానాలా?ఆమె నోట్‌బుక్‌లో రాసుకుంది!

 

“ఒక స్త్రీకి జరిగిన అన్యాయాన్ని పరిశీలించే ముందు, ఆమె జీవితం గురించి తీర్పు చెప్పాల్సిన అవసరం ఏంటి? నిజం తెలుసుకోవడానికి ఆమె మంచిదా చెడ్డదా అని నిర్ణయించడం ఎందుకు?” అంటూ రాసింది జాహ్నవి!

 

తను రాసుకున్న ఆ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఆమె ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని ఆమెకు తెలుసు. కానీ ఆమె ప్రయాణంలో మొదటి మార్పు అప్పటికే మొదలైంది.

 

ఇంతకుముందు ఆమె వార్తలు చదివి బాధపడేది. ఇప్పుడు వాటిని చదివినప్పుడు, ఏది తెలుసు, ఏది తెలియదు, ఏది నిర్ధారించాలి అని ఆలోచిస్తుంది.

 

ఇది పెద్ద విజయం కాకపోవచ్చు! కానీ నిజాన్ని వెతికే వ్యక్తికి కావాల్సిన పునాది అది.

 

ఆమె ల్యాప్‌టాప్‌ మూసేసి పడుకోవడానికి సిద్ధమైంది. రేపు ఏ వార్తను పరిశీలించాలి, ఏ పత్రాలను చదవాలి, ఎలా నేర్చుకోవాలి అనే ఆలోచనలు మనసులో తిరుగుతున్నాయి.

 

తన ప్రయాణం ఇంకా మొదటి మెట్టులోనే ఉందని ఆమెకు తెలుసు. అయినా ఒక విషయం మాత్రం స్పష్టమైంది.

 

ధైర్యం అంటే ప్రతి ఒక్కరినీ ఎదిరించడం కాదు. అందరూ నమ్ముతున్న మాటను కూడా ఆధారం లేకుండా నమ్మకుండా ఉండగలగడం. ఆ పదాలను మనసులో అనుకుంటూ నిద్రపోయింది జాహ్నవి!

 

:: ఇంకా ఉంది ::

‘జ్వాలా’ పోటీకి రాస్తున్న ఈ “స్వయంసిద్ధ“ ధారావాహిక లోని ఈ భాగం చదివిన తరువాత మీ విలువైన సమీక్షలను తెలుపుతారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు! – మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹‘