స్వయంసిద్ధ – 2
భాగం – 2
మరుసటి రోజు వేకువ జామున సూర్యోదయం కన్నా ముందే జాహ్నవికి మెలకువ వచ్చింది. బెడ్ పై కళ్ళు తెరిచిన ఆమె, నెమ్మదిగా బెడ్ నుండి క్రిందకు దిగి కిటికీ తెరల మధ్య నుండి వస్తున్న సన్నటి వెలుతురు ని చూసింది!
ఉదయం లేవగానే నిన్నటి రోజున రాత్రి రాసుకున్న వాఖ్యాలను చదవడం ఆమె అలవాటు! అందుకని బుక్ తీసి చూసింది జాహ్నవి!
“ఒక అమ్మాయిని బలహీనురాలిగా చూసే ప్రపంచాన్ని మార్చాలంటే, ఆమె ధైర్యాన్ని ఎవరూ గుర్తించకపోయినా ముందుకు సాగడం నేర్చుకోవాలి.” అంటూ రాసిన వాఖ్యాన్ని మళ్ళీ చదివింది జాహ్నవి!
ఆమె మంచం మీద నుండి లేచి ముఖం కడుక్కున తరువాత, టవల్ తో ముఖాన్ని తుడుచుకొని అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది.
“ఈరోజు ఏం నేర్చుకుంటావు జాను?” అని తననే అడుగుతూ తన కళ్ళలోకి తను సూటిగా చూసింది!
అద్దంలో కనిపించిన అమ్మాయి సమాధానం చెప్పలేదు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఆమె సిద్ధంగా ఉంది.
హాల్లోకి వచ్చేసరికి కృష్ణ మూర్తి న్యూస్ పేపర్ చదువుతున్నారు. తల్లి వంటగదిలో అల్పాహారం సిద్ధం చేస్తుంది.
“నాన్నా! ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయా?”
“ఉన్నాయి! ఎందుకమ్మా?”
“కొన్ని వార్తలు ఎలా రాస్తారో పరిశీలించాలి. ఒకే సంఘటన గురించి వేర్వేరు పత్రికలు ఎలా రాస్తాయో చూడాలనుకుంటున్నాను.”
“అందులో కొత్తగా నేర్చుకోవాల్సింది ఏముంది? వార్తలో ఏం జరిగిందో రాస్తారు అంతే కదా!”
“అదే నాన్నా. ఏం జరిగిందో రాయడానికి, నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు, ఒక అమ్మాయి ఇంట్లో నుండి వెళ్లిపోయిందనుకో! ఒక పత్రిక ‘యువతి అదృశ్యం’ అని రాయొచ్చు. ఇంకో పత్రిక ‘ప్రేమికుడితో యువతి పరార్’ అని రాయొచ్చు. కానీ ఆమె ఎక్కడికి వెళ్లింది? ఎందుకు వెళ్లింది? దాని వెనక ఉన్న కారణాలు ఏంటి అనేది ఎవరికీ తెలియకపోవచ్చు.”
“అయితే ఆ రెండింట్లో ఒకరు తప్పు తప్పు రాసినట్టే కదా?”
“ఆమె నిజంగా ఎవరితోనైనా వెళ్లినా, ఆధారం లేకుండా అలా రాయడం తప్పే నాన్నా. వార్త రాసేవాళ్లకు అనుమానం ఉండొచ్చు. కానీ అనుమానాన్ని నిజంలా రాస్తే, ఆ అమ్మాయి తిరిగి వచ్చినప్పుడు కూడా సమాజం ఆమెను అనుమానంగానే చూస్తుంది.”
“మాట బాగానే ఉంది. కానీ నిజం ఏంటో తెలుసుకోవడం అంత సులభం కాదు కదమ్మా?”
“అందుకే నేర్చుకోవాలి నాన్నా.”
“సరే! మన ఇంట్లో ఒకే న్యూస్ పేపర్ ఉంటుంది కదా! వీధి చివరన మల్లేశం కొట్టు ఉంది కదా! నేను ఫోన్ చేసి తీసుకురమ్మని చెబుతాను!” అంటూ ఫోన్ తీసి న్యూస్ పేపర్స్ తెప్పించాడు కృష్ణ మూర్తి!
బ్రేక్ ఫాస్ట్ ని ఫాస్ట్ గా ముగించిన తరువాత మల్లేశం తీసుకొచ్చి ఇచ్చిన న్యూస్ పేపర్స్ ని పట్టుకొని తన గదిలోకి వెళ్ళింది!
ఆ రోజు మధ్యాహ్నం వరకు జాహ్నవి పాత న్యూస్ పేపర్స్ ని పరిశీలిస్తూ ఉంది!
ఒకే సంఘటనపై మూడు పత్రికల్లో వచ్చిన వార్తలను పక్కపక్కన పెట్టింది. ఒక వార్తలో పోలీసులు అనుమానిస్తున్నారని ఉంది. మరో వార్తలో కుటుంబ సభ్యుల వాదన ఉంది. మూడో వార్తలో మాత్రం ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి నిర్ధారణ లేని వ్యాఖ్యలు ఉన్నాయి.
ఆమె ఒక్కొక్క వాక్యాన్ని నోట్ బుక్ లో రాసుకుని, దాని పక్కన మూడు ప్రశ్నలు పెట్టింది.
ఈ విషయం ఎవరన్నారు? దీనికి ఆధారం ఏంటి? ఈ సమాచారాన్ని ఎవరు కన్ఫాం చేసారు?
మొదటిసారి ఆమెకు అర్థమైంది ఒక్కటే! వార్తను చదవడం ఒక పని అయితే, వార్తను ఇన్వెస్టిగేట్ చేయడం మరో పని!
ఆరోజు ఆమెకు ఒక చిన్న విషయం నేర్పింది. తన ప్రయాణం కోసం పెద్ద అవకాశాలే రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న పాత పత్రిక కూడా ఒక పాఠం నేర్పగలదు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, ప్రతి రోజూ మనమున్న ప్రదేశం ఒక కొత్త తరగతి గదే అని!
కొన్ని గంటల తర్వాత ల్యాప్ టాప్ లో ఉచితంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ వెబ్‌సైట్లు, ప్రజలకు అందుబాటులో ఉన్న నివేదికలు, అధికారిక ప్రకటనలు ఎలా వెతకాలో నేర్చుకోవడం మొదలుపెట్టింది.
సమాచార హక్కు చట్టం గురించి కూడా చదివింది. ఏ సమాచారం కావాలంటే అది అడగవచ్చని అనుకోవడం తప్పని, కొన్ని మినహాయింపులు ఉంటాయని, వ్యక్తిగత ప్రైవసీ ని గౌరవించాలని తెలుసుకుంది.
అవి తెలుసుకున్న వెంటనే తన నోట్ బుక్ ని తెరిచింది!
“నిజాన్ని వెతకడం అంటే ప్రతి తలుపునూ బలవంతంగా తెరవడం కాదు. తెరవడానికి మనకు హక్కున్న తలుపును తెలివిగా గుర్తించడం కూడా!” అని నోట్ బుక్ లో రాసుకుంది!
అదే రోజు సాయంత్రం ఆమెకు అభిరామ్ ఫోన్ చేసాడు.
“ఏం చేస్తున్నావు జాను?”
“ఉదయం నుండి ఓల్డ్ న్యూస్ పేపర్స్ తో కుస్తీ పడుతున్న రామ్!” అలసిపోయినట్టుగా అంది జాహ్నవి!
“దేనికోసం?“
“న్యూస్ ని ఎలా అర్థం చేసుకోవాలా అని! ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది.”
“అయితే ఈరోజు ఏదో కొత్త విషయం నేర్చుకున్నావన్నమాట.”
“అవును! ఒక విషయం అర్థమైంది. ఒక వార్తలో ఉన్న ప్రతి వివరాన్నీ గుడ్డిగా నమ్మకూడదు. ఒక న్యూస్ మన నచ్చనంత మాత్రానా ఆధారం లేకుండా దాన్ని అబద్ధమని అనకూడదు.”
“గుడ్ గోయింగ్ జాను!”
“అభి! ఒకవేళ నేను ఏదైనా కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు తప్పు దారిలో వెళ్తే? ఒక నిర్దోషిని అనుమానిస్తే?”
“తప్పు చేయడం అందరూ చేస్తారు జాను! కాని తప్పు చేసావని తెలుసుకున్న తరువాత ఏం చేస్తావన్నదే ముఖ్యం. అంతే కాదు! నీ నుండి వచ్చిన సమాచారం వల్ల ఎవరికైనా నష్టం జరిగితే, దాన్ని సరిదిద్దడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. తప్పులను నిజాయితీగా ఎదురుకున్నప్పుడే నువ్వు నిజం కోసం పనిచేసే సామర్హ్యాన్ని పొందుతావు!”
“నువ్వు నాకు ధైర్యం చెబుతున్నావా, లేక మరిన్ని బాధ్యతలు గుర్తు చేస్తున్నావా?” నవ్వుతూ అడిగింది జాహ్నవి.
“రెండూ! నీ మీద నమ్మకం ఉంది జాను! నువ్వు చేసే ప్రతిదీ సరైనదేనని అనుకోవడం కాదు. తప్పు చేసినా దాన్ని సరిదిద్దగలవని నమ్ముతున్నాను!” అంటూ అభిరామ్ చెప్పిన మాట జాహ్నవి మనసులో నిలిచిపోయింది.
జాహ్నవి ని ప్రోత్సాహించే అతను ఆమెను పొగడ్తలతో ముంచెత్తాలని మాత్రమే చూడడం లేదు! ఆమె తనకు తాను మెరుగుపరుచుకోవాలని కూడా కోరుకుంటున్నాడు. అది ప్రేమలోని మరో రూపం!
జాహ్నవి మరియు అభిరామ్ గత ఎనమిది నెలలుగా ప్రేమించుకుంటున్నారు! వాళ్ళిద్దరికీ తరచుగా కలిసి, పార్క్ ల చుట్టూ, సినిమాల చుట్టూ తిరగడం ఇష్టం లేదు! ఎవరు ఎంచుకున్న ప్రొఫెషన్ లో వారు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు! ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటున్నారు!
చూస్తూ ఉండగానే మూడు రోజులు కరిగిపోయాయి! ఈ మూడు రోజులు మూడు నెలల పాత న్యూస్ పేపర్స్ ని తిరగేసింది జాహ్నవి! ఆ తరువాత తన కంప్యూటర్‌లో ఒక స్థానిక న్యూస్ పోర్టల్ ని ఓపెన్ చేసి న్యూస్ చూసింది!
హైదరాబాద్ శివారులోని ఒక ప్రాంతంలో నివసించే ఇరవై రెండేళ్ల యువతి అదృశ్యమైనట్లు వార్త వచ్చింది. ఆ యువతి పేరు సౌమ్య. ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఆమె, రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాలేదని వార్తలో పేర్కొన్నారు.
వార్త చిన్నదే! కానీ చివర్లో ఉన్న ఒక వాక్యం జాహ్నవి దృష్టిని ఆకర్షించింది.
“కుటుంబ సభ్యుల ప్రకారం, సౌమ్య గత కొంత కాలంగా వ్యక్తిగత సమస్యలతో బాధపడుతుంది. ఆమె తనకు తానుగా ఇంట్లో నుండి వెళ్లిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.”
వార్తలో పోలీసులకు ఫిర్యాదు చేసిన తేదీ లేదు. చివరి సారిగా ఎక్కడ కనిపించిందో లేదు. కుటుంబ సభ్యుల ప్రకటన తప్ప మరే సమాచారం లేదు. సౌమ్య ఫొటో కూడా ప్రచురించలేదు.
జాహ్నవి వెంటనే ఏదో కుట్ర జరిగిందని అనుకోలేదు. అదృశ్యమైన ప్రతి వ్యక్తి వెనుక నేరం ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత కారణాలతో ఇంటి నుండి వెళ్లిపోయే వాళ్లు కూడా ఉంటారు.
కొందరు ప్రమాదంలో చిక్కుకోవచ్చు. మరికొందరు తమ ఇష్టానుసారం దూరంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ఆమెకు తెలిసిన సమాచారం చాలా తక్కువ. అయినా ఒక ప్రశ్న అడగాలనిపించింది.
ఒక మనిషి కనిపించకుండా పోయినప్పుడు, అతను ఎక్కడున్నాడో తెలుసుకోవడం కంటే ముందే అతను ఎందుకు వెళ్లిపోయాడో నిర్ణయించుకోవడం ఎందుకు అంత సులభం?
ఆమె వార్తకు సంబంధించిన వివరాలను నోట్ చేసుకుంది. ప్రచురించిన తేదీ, వెబ్‌సైట్ పేరు, వార్తలోని వాక్యాలు అన్నింటినీ నమోదు చేసింది.
తర్వాత సౌమ్య గురించి మరిన్ని విశ్వసనీయమైన వివరాలు ఉన్నాయేమో వెతికింది. అదే వార్తను మరికొన్ని స్థానిక వెబ్‌సైట్లు ప్రచురించాయి. వాటిలో కూడా అదే ఇన్ఫర్మేషన్! పదాల ఫర్మేషన్ కూడా ఒకేలా ఉంది!
ఒకే వార్తను అనేక వెబ్‌సైట్లు తిరిగి ప్రచురించినంత మాత్రాన, అందులోని విషయం నిజమని కన్ఫాం కాదని ఆమెకు అర్థమైంది. అందుకే ఆమె వెతకడం ఆపేసింది.
ఆ అమ్మాయి కుటుంబాన్ని సంప్రదించడానికి తనకు సరైన కారణం లేదు. జర్నలిస్టుగా గుర్తింపు లేదు. వారి బాధను తన ఆసక్తి కోసం ఉపయోగించుకునే హక్కూ లేదు.
అందుకే ఆ వార్తను నోట్ బుక్ లో నమోదు చేసి, దాని ఒక సెంటెన్స్ రాసింది!
“ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం సరిపోదు! ఊహల్లో కథలను అల్లకూడదు!” అని! అది చిన్న నిర్ణయమే. కానీ తనకు తెలియని విషయాన్ని తెలియదని అంగీకరించడం కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగమని ఆమెకు అర్థమైంది!
సౌమ్య అదృశ్యమైన విషయం నిజమేనా? ఫిర్యాదు నమోదైందా? ఆమె కుటుంబం నిజంగా ఏమని చెప్పింది? వార్తలోని వాక్యాలు ఎవరి నుండి వచ్చాయి? ఇవన్నీ తెలుసుకోవడానికి అఫీషియల్ గా అందుబాటులో ఉన్న సమాచారం ఏదైనా ఉందేమో వెతకాలని అనుకుంది!
చాలాసేపు ఆ న్యూస్ గురించి వెతకడం వలన అలసిపోయి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది! కిటికీ నుండి బయట చీకట్లో ఉన్న సిటీ కనబడుతుంది! ఆ క్షణం ఆమెలో ఎన్నో ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి!
ప్రపంచంలో ఎక్కడో ఎవరో తమ బాధను ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతూ ఉండొచ్చు!
ఎక్కడో ఒక అమ్మాయి తనపై పడిన నిందను భరించలేక సతమతమైపోతూ ఉండొచ్చు!
మరెక్కడో ఒక కుటుంబం బయటకు వెళ్ళిన తమ బిడ్డ తిరిగి వస్తుందని ఎదురుచూస్తుండవచ్చు!
ప్రతి బాధకు తానే సమాధానం కనుక్కోగలనని జాహ్నవి అనుకోవడం లేదు! కాని ఒక వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకోకుండా, నిజాన్ని తెలుసుకోకుండా ఆ వ్యక్తిని నిందించే వాళ్లలో తాను మాత్రం ఉండకూడదని అనుకుంది.
ఏదేమైనా సౌమ్య గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసుకొని, ఆ మిస్సింగ్ లో ఉన్న నిజం ఏంటో తెలుసుకోవాలని అనుకుంది!
ఆ క్షణం ఆమెకు తెలియదు! తను తీసుకున్న ఆ చిన్న నిర్ణయం, ఆమె జీవితంలో అత్యంత క్లిష్టమైన ఇన్వెస్టిగేషన్ కి తొలి అడుగు అవబోతుందని!
ఎందుకంటే ఒక అమ్మాయిని నిందించడం సమాజానికి సులభం. కాని ఆ అమ్మాయికి జరిగినదేమిటో తెలుసుకోవడానికి తమ సమయాన్ని, ముందనుకున్న అభిప్రాయాలను పక్కన పెట్టడం మాత్రం అంత సులభం కాదు.
ఆ రెండిటి మధ్య ఉన్న ఆ తేడాను అర్థం చేసుకోవడమే జాహ్నవి నేర్చుకుంటున్న మొదటి పాఠం!
మిస్ అయిన సౌమ్య గురించి జాహ్నవి ఏం తెలుసుకోబోతుంది?
:: ఇంకా ఉంది ::
‘జ్వాలా’ పోటీకి రాస్తున్న ఈ “స్వయంసిద్ధ“ ధారావాహిక లోని ఈ భాగం చదివిన తరువాత మీ విలువైన సమీక్షలను తెలుపుతారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు! – మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹‘
Swipe left/right or tap the sides to turn pages