అగ్నిసాక్షి 🔥 – 1
అగ్నిసాక్షిగా వివాహం జరగడం మన సాంప్రదాయం.
కానీ ఇక్కడ ఓ జంట పెళ్లికి మాత్రం హోమగుండంలోని అగ్నిజ్వాలలు కాదు… చితి మంటలే అగ్నిసాక్షిగా మారబోతున్నాయి.
ఆ మంటల సాక్షిగా ఒక్కటవుతున్న ఆ జంటను నిండు నూరేళ్లూ ఆనందంగా కలిసి జీవించమని ఆశీర్వదించబోతున్నాయి.
అసలు ఆ జంట పెళ్లి చితి మంటల సాక్షిగా ఎందుకు జరగాల్సి వచ్చింది?
వాళ్ల జీవితాల్లో ఏం జరిగింది?
తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
❤️
ఢిల్లీలో ఉదయం ఏడు గంటలకు…
హాస్టల్ గదిలో ఓ మూలన ఉన్న ఫోన్ వరుసగా మోగుతూనే ఉంది. ఆ శబ్దం చెవిన పడుతున్నా పట్టించుకోకుండా తన పనిలో తాను బిజీగా ఉన్న ఓ అమ్మాయి, బెడ్‌పై బోర్లా పడుకున్న తన స్నేహితురాలిని చూసింది.
“ఫోన్ వైపు చూడకుండానే… ఫోన్ లిఫ్ట్ చేయవే!” అంటూ బట్టలు సర్దుకుంటూ చెప్పింది.
“ఇప్పుడే షిఫ్ట్‌కి వెళ్లి వచ్చాను పూజా! ప్లీజ్… కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. ఆ కాల్ ఎవరిదో లిఫ్ట్ చేసి, నేను పడుకున్నానని చెప్పు.”
బెడ్‌పై నుంచి కదలకుండానే దిండులో ముఖం దాచుకుంటూ బదులిచ్చింది ఆ అమ్మాయి.
“హా… సరేలే!” అంటూ పూజ ఫోన్ అందుకుంది.
స్క్రీన్‌పై కనిపిస్తున్న పేరును చూడగానే ఆమె కనుబొమ్మలు పైకెగిశాయి.
“అరే! ఇది ‘మై లవ్’ అని ఉందే!” అంటూ ఆశ్చర్యంగా బెడ్ వైపు చూసింది.
ఆ మాట వినడమే ఆలస్యం…
అప్పటివరకు అలసటతో కళ్లు కూడా తెరవలేకపోయిన అమ్మాయి, ఒక్కసారిగా బెడ్‌పై నుంచి లేచి కూర్చుంది.
“ఏంటి? మై లవ్ అని ఉందా?”
అంటూ వెంటనే పూజ చేతిలోని ఫోన్ అందుకుంది.
“నువ్వు షిఫ్ట్‌కి వెళ్లాలి కదా! నువ్వు వెళ్లు… నేను కాల్ మాట్లాడతాలే!” అంటూ ఫోన్ పట్టుకుని చిరునవ్వు చిందించింది.
ఆమె ప్రవర్తన చూసి పూజ నవ్వాపుకోలేకపోయింది.
“ఇప్పుడే కదే రెస్ట్ కావాలని చెప్పావ్? మరి ఇప్పుడు రెస్ట్ అవసరం లేదా?”
“రెస్ట్ కావాలే… కానీ ఇది అంతకంటే ఇంపార్టెంట్!” అంటూ కాల్ ఆన్సర్ చేసింది ఆ అమ్మాయి.
ఫోన్ చెవికి ఆనించగానే అవతలి వైపు నుంచి ఓ ఆప్యాయమైన గొంతు వినిపించింది.
“హలో…”
ఆ గొంతు వినగానే ఆమె ముఖంలో చిరునవ్వు నెమ్మదిగా విరిసింది.
“అమ్మా! ఎలా ఉన్నావ్? ఎన్ని రోజులైంది మీరు నాకు కాల్ చేసి! కనీసం నేను కాల్ చేద్దామన్నా కుదరట్లేదు. నాకు నైట్ షిఫ్ట్ కదా… మళ్లీ మార్నింగ్ వచ్చి కాల్ చేద్దామంటే మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు.”
అంటూ చిన్నపిల్లలా అలక ప్రదర్శించింది ఆరు.
అవతలి వైపు నుంచి ఆమె తల్లి ఓ చిన్న నిట్టూర్పు విడిచింది.
“మేము బాగానే ఉన్నామే… కానీ…”
మధ్యలోనే మాట ఆపేసిందామె.
తల్లి గొంతులో ఏదో తెలియని ఆందోళన కనిపించడంతో ఆరు ముఖంలో చిరునవ్వు మాయమైంది.
“ఏమైంది అమ్మా?” అంటూ కంగారుగా అడిగింది.
“ఏం లేదే ఆరు… నువ్వు నెక్స్ట్ ఫ్లైట్‌కి హైదరాబాద్ రావాలి. అందుకే నీకు కాల్ చేశాను.”
ఆ మాట వినగానే ఆరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
“నెక్స్ట్ ఫ్లైట్‌కా? ఇప్పుడేనా అమ్మా? ఇంత సడన్‌గా అంటే ఎలా? హాస్పిటల్‌లో లీవ్ అప్లై చేయాలి కదా! ఇప్పుడే నైట్ షిఫ్ట్ నుంచి వచ్చాను. అసలు ఏం జరిగిందో కూడా చెప్పకుండా ఉన్నపళంగా రమ్మంటే ఎలా?”
తన అలసటను పక్కనపెట్టి, అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనే ఆత్రుతతో అడిగింది.
కానీ అవతలి వైపు నుంచి వచ్చిన సమాధానం మాత్రం ఆమెను మరింత అయోమయానికి గురిచేసింది.
“నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆరు. రేపు మార్నింగ్ కల్లా నువ్వు హైదరాబాద్‌లో ఉండాలి. ఇది మీ నాన్నగారు చెప్పారు.”
తల్లి మాటల్లో ఆదేశం స్పష్టంగా వినిపించింది.
“కానీ ఎందుకు అమ్మా? ఏం జరిగింది? నాన్న ఎందుకు అంత అర్జెంట్‌గా రమ్మన్నారు?”
ఆరు వరుసగా ప్రశ్నలు వేసినా అవతలి వైపు నుంచి సమాధానం రాలేదు.
“ఆరు… రీజన్ నేను చెప్పలేను. కానీ నువ్వు మాత్రం రేపు ఇక్కడ ఉండాలి.”
అంటూ ఆమె తల్లి చెప్పాల్సింది చెప్పేసి కాల్ కట్ చేయబోయింది.
“అమ్మా… ప్లీజ్! నైట్ వరకు ఆగు. ఫ్లైట్ చూసుకుని వస్తాను. ఇప్పుడే షిఫ్ట్ నుంచి వచ్చాను కదా… కొంచెం రెస్ట్ తీసుకుని బయలుదేరుతాను.”
ఆమె మాటలకు అంగీకరించినట్టుగా…
“అలాగే!” అని చెప్పి కాల్ కట్ చేసింది ఆరు తల్లి.
ఫోన్ స్క్రీన్ ఆఫ్ అవ్వగానే ఆరు కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయింది.
అసలేం జరిగింది?
ఎప్పుడూ లేనిది నాన్నగారు ఇంత అత్యవసరంగా హైదరాబాద్ రమ్మనడం వెనుక కారణమేంటి?
ఆలోచనలు మనసును చుట్టుముడుతున్నా, సమాధానం మాత్రం దొరకలేదు.
చివరికి ఫోన్ పక్కన పెట్టి, మరోసారి బెడ్‌పై బోర్లా పడుకుంది.
ప్రయాణం గురించి ఆలోచించాలన్నా… ఆలోచించలేనంతగా అలసిపోయింది.
కానీ తన జీవితంలో జరగబోయే ఓ పెద్ద మార్పు గురించి మాత్రం ఆరుకి అప్పటికి తెలియదు.
❤️
కోల్‌కతాలో…
ఓ పెద్ద కాన్ఫరెన్స్ హాల్.
అక్కడ దాదాపు యాభై మంది వరకు ఉన్నారు. అందరి చూపులూ ముందున్న స్క్రీన్‌పై, దాని పక్కనే నిలబడి ప్రెజెంటేషన్ ఇస్తున్న ఓ వ్యక్తిపై నిలిచిపోయాయి.
స్క్రీన్‌పై కనిపిస్తున్న పాయింట్స్‌ను ఒక్కొక్కటిగా వివరిస్తూ, తన ప్రాజెక్ట్ గురించి స్పష్టంగా చెబుతున్నాడతను.
అతని కళ్లలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పెదవులపై ఎప్పటిలాగే ఓ చిన్న ఆటిట్యూడ్‌తో కూడిన చిరునవ్వు.
ఎదుట ఎంతమంది ఉన్నారన్నది అతనికి ముఖ్యం కాదు. తను చెప్పాలనుకున్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించడమే అతని లక్ష్యం.
అతని బేస్ వాయిస్, ప్రతి విషయాన్ని వివరించే తీరు, మాటల్లో కనిపించే ధైర్యం… అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.
చివరి స్లైడ్‌ను చూపించిన అతను, చేతిలోని రిమోట్‌ను పక్కనపెట్టి అందరినీ ఓసారి చూశాడు.
“ఇస్ ఎనీ మోర్ డౌట్స్?”
అతని గంభీరమైన గొంతు కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రతిధ్వనించింది.
“నో మోర్ డౌట్స్, సర్!”
అక్కడున్నవారంతా సమాధానమిచ్చారు.
వెంటనే ఓ వ్యక్తి ముందుకు వచ్చి అతనితో షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.
“కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ది ప్రాజెక్ట్, సర్!”
“థాంక్యూ!”
చిరునవ్వుతో బదులిచ్చిన అతను, తన వస్తువులను తీసుకుని కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వచ్చాడు.
అతని పేరు యష్.
తన పనిని విజయవంతంగా పూర్తి చేసుకున్న సంతృప్తితో బయటకు వచ్చిన అతని ఫోన్ అప్పుడే మోగింది.
స్క్రీన్‌పై నాన్న పేరు కనిపించగానే కాల్ లిఫ్ట్ చేశాడు.
“ఏంటి నాన్నా? ఈ టైమ్‌లో కాల్ చేశారు?”
అవతలి వైపు నుంచి ఆయన గొంతు వినిపించింది.
“యష్… మీటింగ్ కంప్లీట్ అయిందా?”
“హా నాన్నా! ఇప్పుడే అయింది. అంతా బాగానే జరిగింది. మీరు ఎందుకు కాల్ చేశారు? ఏమైనా ఇంపార్టెంట్ విషయమా?”
తండ్రి గొంతులో ఏదో గంభీరత కనిపించడంతో యష్‌కు కొంచెం కంగారుగా అనిపించింది.
“ఏం లేదు యష్. మీటింగ్ అయిపోయింది కదా… వెంటనే హైదరాబాద్ బయలుదేరు.”
ఆ మాట వినగానే యష్ అడుగులు ఆగిపోయాయి.
“హైదరాబాద్‌కా? ఇప్పుడేనా నాన్నా? ఎందుకు? ఏదైనా జరిగిందా?”
అతని ప్రశ్నలకు అవతలి వైపు నుంచి వెంటనే సమాధానం రాలేదు.
“యష్… నువ్వు రేపు ఇక్కడ ఉండేలా చూసుకో. మిగతా విషయాలు వచ్చాక మాట్లాడుకుందాం.”
“కానీ నాన్నా…”
యష్ మాట పూర్తయ్యేలోపే కాల్ కట్ అయిపోయింది.
ఫోన్‌ను చెవి నుంచి తీసి స్క్రీన్ వైపు చూస్తూ కాసేపు అలాగే నిలబడిపోయాడు.
అప్పటివరకు ప్రాజెక్ట్ సక్సెస్ గురించి ఆలోచిస్తున్న అతని మనసులో ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు.
అసలు నాన్నగారు ఇంత అర్జెంట్‌గా హైదరాబాద్ ఎందుకు రమ్మంటున్నారు?
ఏదైనా ముఖ్యమైన విషయం జరిగిందా?
లేదంటే… తనకు చెప్పాల్సిన విషయం ఏదైనా ఉందా?
ఒక్కసారిగా అతని ఆలోచనలన్నీ హైదరాబాద్ వైపు మళ్లాయి.
ఫోన్ జేబులో పెట్టుకుని, వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి ముందుకు కదిలాడు.
అతనికి తెలియదు…
తన జీవితాన్ని పూర్తిగా మార్చేయబోయే ఓ పరిచయం కోసం తాను హైదరాబాద్ వెళ్తున్నాడని!
—
కొనసాగుతుంది…
ఆరు, యష్‌లకు ముందే పరిచయం ఉందా?
లేదా వాళ్లిద్దరి జీవితాలను ఒక్కటి చేయడానికి విధి ఏదైనా కొత్త కథ రాయబోతోందా?
అసలు వాళ్ల పెళ్లి చితి మంటల సాక్షిగా ఎందుకు జరగబోతోంది?
తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే!
కథ నచ్చితే మీ రేటింగ్‌తో పాటు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి, బ్యూటిఫుల్స్. ❤️
నా గత కథలన్నింటినీ ఆదరించినట్టే ఈ కొత్త కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
మీ ప్రేమ, ఆదరణే నా రచనకు ప్రోత్సాహం. ❤️
Swipe left/right or tap the sides to turn pages