New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
జ్వాల W/O శక్తి – 2

జ్వాల W/O శక్తి – 2

జ్వాల ప్రయాణిస్తున్న లగ్జరీ సెడాన్ కారు జాతీయ రహదారి 45 మీద అత్యంత వేగంగా దూసుకు పోతోంది. తెల్లవారు జామున కురిసిన వర్షం వల్ల రోడ్డు  మొత్తం తడిగా ఉంది, దానికి తోడు దట్టమైన పొగమంచు అలుముకోవడంతో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. డ్రైవర్ సురేష్ కారును వేగంగా పోనిస్తున్నప్పటికీ, జ్వాల మనసు  లోని ఆలోచనలు     అంత కంటే వేగంగా ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుంది. ఆమె కళ్లు కారు కిటికీ గుండా బయటకు చూస్తున్నా, మనసంతా తన భర్త  అయిన   శక్తి ఆఖరి చూపు మీదే ఉంది. ఆమె చేతులు తెల్లటి చీర కొంగును గట్టిగా పట్టుకుని ఉన్నాయి. గుండెల్లో ఏదో ఒక మూల ఇంకా చిన్న ఆశ – విక్రమ్ చెప్పింది అబద్ధం అయితే బాగుండు, తన  భర్త  శక్తి ప్రాణాలతో ఉంటే బాగుండు అని. కానీ ప్రాణాధారమైన భర్త దూరం అయిపోయాడనే చేదు నిజం ఆమెను లోపల నిలువునా దహించివేస్తోంది.

 

 

దాదాపు రెండు గంటల నిరంతర ప్రయాణం తర్వాత, ఉదయం 6:45 గంటల ప్రాంతంలో కారు ప్రమాదం జరిగిన స్పాట్‌కు  జ్వాల చేరుకుంది. జాతీయ రహదారిపై ఒక వైపు ట్రాఫిక్‌ను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. దూరంగా రెండు ఫైర్ ఇంజన్లు, మూడు పోలీస్ వాహనాలు, క్లూస్ టీమ్ కి సంబంధించిన వ్యాన్ అక్కడ ఆగి ఉన్నాయి. హైవేకి ఎడమ వైపున ఉన్న ప్రొటెక్షన్ వాల్ పూర్తిగా బద్దలై ఉంది. కారు ఢీకొట్టిన వేగానికి సిమెంట్ ముక్కలు రోడ్డుపై చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. వందలాది మంది స్థానికులు, ఇతర వాహన దారులు రోడ్డు పక్కన నిలబడి లోయ వైపు చూస్తున్నారు.

జ్వాల కారు ఆగగానే, ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోర్ తెరుచుకుని కిందకు దిగింది. సెక్యురిటీ హెడ్ విక్రమ్ కళ్ల నిండా నీళ్లతో, షర్ట్‌పై నల్లటి మసి మరకలతో జ్వాల వైపు పరుగెత్తుకుంటూ వచ్చాడు.

“మేడం…” అంటూ విక్రమ్ మళ్లీ ఏడ్వబోయాడు.

 

 

 

జ్వాల అతనిని చేతి సైగతో వారించింది. “ఏడవడం వల్ల పోయిన ప్రాణం తిరిగి రాదు విక్రమ్. నాకు ఆ ప్రదేశం చూపించు” అంది గంభీరంగా. ఆమె గొంతులోని దృఢత్వం చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. భర్త చనిపోతే ఏడ్చి స్పృహ తప్పిపోవాల్సిన స్త్రీ, ఇంత ధైర్యంగా ఎలా నిలబడగలిగింది అని అక్కడ ఉన్నవారంతా అనుకున్నారు. కానీ జ్వాల లోపల ఏడుపు లేదు, కేవలం నిప్పులు చెరుగుతున్న ఒక కసి మాత్రమే ఉంది.

విక్రమ్ జ్వాలను రోడ్డు పక్కన ఉన్న లోయ లాంటి గుంత వైపు తీసుకెళ్లాడు. దాదాపు యాభై అడుగుల లోతులో, ఒక పెద్ద చెట్టును ఢీకొట్టి ఆగిపోయిన జె.ఎస్. కారు అవశేషాలు కనిపించాయి. కోట్లు ఖరీదు చేసే ఆ జర్మన్ లగ్జరీ కారు, ఇప్పుడు కేవలం ఒక నల్లటి ఇనుప అస్థిపంజరంలా (Skeleton) మారిపోయింది. కారుపై ఉన్న రంగు, లోపల ఉన్న లగ్జరీ సీట్లు, లెదర్ ఇంటీరియర్… అంతా కాలి బూడిదైపోయింది. కారులోంచి ఇంకా సన్నగా పొగలు వస్తూనే ఉన్నాయి. గాలిలో కాలిపోయిన ఇనుము, ప్లాస్టిక్, మరియు మానవ మాంసం కలిసిన ఒక భయంకరమైన దుర్వాసన వస్తోంది. ఆ వాసన చూడగానే ఎవరికైనా కడుపులో తిప్పేస్తుంది, కానీ జ్వాల కనురెప్ప కూడా వేయకుండా ఆ కారు వంక చూస్తూ కిందకు దిగడం ప్రారంభించింది.

 

 

పోలీస్ అధికారులు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. “మేడం, లోపల అంతా చాలా ఘోరంగా ఉంది. ఫోరెన్సిక్ టీమ్ ఇంకా ఇక్కడ అంతా ఇన్వెస్టిగేషన్  చేస్తోంది, దయచేసి మీరు ఇక్కడే ఉండండి” అన్నారు లోకల్ సీఐ నారాయణ.

“ఆ కాలిపోయిన కారులో ఉన్నది నా భర్త. నన్ను ఎవరూ ఆపలేరు” అంటూ జ్వాల వారిని పక్కకు నెట్టేసి, ఆ తడి మట్టిలో నడుస్తూ నేరుగా కారు దగ్గరకు వెళ్ళింది.

కారు డ్రైవింగ్ సీటు వైపు చూసిన జ్వాల గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. సీటు పూర్తిగా కాలిపోయి ఇనుప రాడ్ బయటికి వచ్చింది. ఆ సీటుపై మనిషి ఆకారం లేదు. కేవలం ముద్దగా మారిన నల్లటి బూడిద, పాక్షికంగా కాలిన కొన్ని ఎముకల ముక్కలు మాత్రమే మిగిలాయి. స్టీరింగ్ వీల్ కరిగిపోయి డ్యాష్ బోర్డ్‌కు అంటుకుపోయింది. జె.ఎస్. చేతికి ఎప్పుడూ ఉండే ప్లాటినం వాచ్ కరిగిపోయి ఆ బూడిదలో కలిసిపోయింది. తనను ఎంతో ప్రేమగా కౌగిలించుకునే ఆ శరీరం, బిజినెస్ ప్రపంచాన్ని శాసించిన ఆ మేధస్సు… ఇప్పుడు కేవలం కొన్ని గ్రాముల బూడిదగా మారిపోయాయా? జ్వాల కళ్లలోంచి కన్నీరు ఉబికి వచ్చింది. ఆమె మోకాళ్లపై ఆ బురదలోనే కూర్చుండిపోయింది. ఆ కాలిపోయిన కారు బాడీని తాకబోయింది.

 

మేడం! ముట్టుకోవద్దు… ప్లీజ్” అంటూ క్లూస్ టీమ్ ఇన్-చార్జ్ డాక్టర్ వర్మ ఆమెను వారించారు. “ఇది క్రిటికల్ క్రైమ్ సీన్ కావచ్చు. సాక్ష్యాలు దెబ్బతింటాయి.”

జ్వాల తన చేతిని వెనక్కి తీసుకుని, నెమ్మదిగా లేచి నిలబడింది. తన కన్నీళ్లను చీర కొంగుతో తూడ్చుకుని డాక్టర్ వర్మ వైపు తిరిగింది.

“డాక్టర్ వర్మ, మీ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలింది? ఇది ప్రమాదమేనా?” అని అడిగింది.

డాక్టర్ వర్మ తన చేతికి ఉన్న గ్లౌవ్స్ సర్దుకుంటూ, చుట్టూ ఉన్న పోలీసులను చూసి, జ్వాలను కొంచెం పక్కకు తీసుకెళ్లారు. “మేడం, ప్రాథమికంగా చూస్తే కారు హై స్పీడ్‌లో డివైడర్‌ను ఢీకొట్టి, ఇక్కడ పడగానే ఫ్యూయల్ ట్యాంక్ పేలిపోయి మంటలు అంటుకున్నట్లు కనిపిస్తోంది. లగ్జరీ కార్లలో షార్ట్ సర్క్యూట్ జరిగితే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లాక్ అయిపోవడం సహజం. సార్ లోపల చిక్కుకుని చనిపోయారు.”

 

సహజం కాదు డాక్టర్!” జ్వాల గొంతు కరుకుగా మారింది. “ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కారు. ప్రమాదం జరిగితే ఆటోమేటిక్‌గా డోర్స్ అన్‌లాక్ అయ్యే టెక్నాలజీ ఇందులో ఉంది. క్రాష్ సెన్సార్స్ పనిచేస్తే ఫ్యూయల్ సప్లై కట్ అయిపోతుంది. అలాంటిది కారు పడగానే వంద అడుగుల ఎత్తున మంటలు ఎలా వస్తాయి? డోర్స్ ఎందుకు లాక్ అవుతాయి?”

జ్వాల వేసిన ప్రశ్నలకు డాక్టర్ వర్మ దగ్గర సమాధానం లేదు. ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయారు.

సరిగ్గా అదే సమయంలో, కారు డ్రైవింగ్ సీటు కింద బూడిదను జల్లెడ పడుతున్న క్లూస్ టీమ్ సిబ్బంది ఒకరు గట్టిగా అరిచారు. “సార్! ఇక్కడ ఏదో వింత వస్తువు దొరికింది. ఇది కారు పార్ట్ లా లేదు.”

 

డాక్టర్ వర్మ, జ్వాల, సీఐ నారాయణ వెంటనే కారు దగ్గరకు పరుగెత్తారు. ఆ సిబ్బంది తన చేతిలో ఉన్న ఫోర్సెప్స్ (ట్వీజర్స్) సహాయంతో బూడిదలోంచి ఒక చిన్న లోహపు ముక్కను బయటకు తీశాడు. అది కాలిపోయినప్పటికీ, దాని ఆకారం స్పష్టంగా తెలుస్తోంది. అది ఒక చిన్న ‘ఎలక్ట్రానిక్ డెటోనేటర్’ (Electronic Detonator) ముక్క. సాధారణంగా రిమోట్ సహాయంతో బాంబులను లేదా చిన్నపాటి పేలుడు పదార్థాలను పేల్చడానికి దీనిని ఉపయోగిస్తారు.

ఆ వస్తువును చూడగానే డాక్టర్ వర్మ ముఖం తెల్లబోయింది. ఆయన సీఐ నారాయణ వైపు చూశారు.

జ్వాల ఆ ముక్కను తీక్షణంగా చూసింది. ఆమె ఊహ నిజమైంది. ఇది ప్రమాదం కాదు… పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘోర  మయిన హత్య! ఎవరో జె.ఎస్. కారులో ముందే పేలుడు పదార్థాన్ని అమర్చారు. కారు డివైడర్‌ను ఢీకొట్టేలా బ్రేకులు ఫెయిల్ చేయడం లేదా రిమోట్ ద్వారా కారును నియంత్రించడం చేసి, కారు కింద పడగానే ఈ డెటోనేటర్ ద్వారా ఫ్యూయల్ ట్యాంక్‌ను పేల్చేశారు. అందుకే కారు క్షణాల్లో బూడిదైపోయింది. భర్త శరీరాన్ని బుగ్గి చేసిన ఆ ద్రోహి ఎవరో కళ్లముందే ఆధారంతో దొరికాడు కానీ తనకి దొరికితే సరిపోదు కదా,చట్టానికి కూడా దొరకాలి కదా.

 

సీఐ గారు…” జ్వాల గొంతులో ఇప్పుడు ఒక రకమైన గాంభీర్యం, క్రూరత్వం మిశ్రమంగా ఉన్నాయి. “ఇప్పుడు చెప్పండి, ఇది యాక్సిడెంటా? లేక మర్డరా?”అని అడుగుతుంది.

సీఐ నారాయణ నోట మాట రాలేదు. “మేడం, ఈ విషయాన్ని మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చేవరకు దీనిని సీక్రెట్‌గా ఉంచాలి. లేకపోతే మీడియాలో పెద్ద అలజడి రేగుతుంది, స్టాక్ మార్కెట్ కూడా అతలాకుతలం అవుతుంది అని అన్నాడు భయం గా.

“మీడియాకు ఏం చెప్పాలో మీరు చూసుకోండి. కానీ నాకు మాత్రం 24 గంటల్లో అసలు నిజం తెలియాలి. ఈ డెటోనేటర్ ముక్కను అధికారిక రికార్డుల్లో చేర్చండి. దీనిని మాయం చేయాలని చూస్తే, ఎవరి ఉద్యోగాలు ఉండవు” అని జ్వాల హెచ్చరించింది.

 

అక్కడే ఉన్న ఎముకల అవశేషాలను, బూడిదను ఫోరెన్సిక్ సిబ్బంది ప్రత్యేక ప్లాస్టిక్ కంటైనర్లలో సేకరించారు. డిఎన్ఏ (DNA) పరీక్ష కోసం వాటిని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించనున్నారు. జ్వాల ఆ కంటైనర్ల వైపు చూస్తూ, మనసులోనే నీకు  ఒక ప్రమాణం చేస్తున్నాను శక్తి. నిన్ను ఇంత దారుణంగా చంపిన ఆ హంతకుడిని, వాడి వెనుక ఉన్న శక్తులను నేను వదిలిపెట్టను. నిన్ను బూడిద చేసిన ఈ మంటలే… రేపు మన శత్రువుల సామ్రాజ్యాలను బూడిద చేసే ‘జ్వాల’గా మారుతాయి అని ఆమె శపథం చేసుకుంది మనసులోనే తన భర్త శక్తి కి.

ఆమె నెమ్మదిగా లోయ పైకి నడుచుకుంటూ వచ్చింది. దూరం నుండి శక్తి బంధువులు, కంపెనీ బోర్డ్ మెంబర్స్ కొందరు కార్లలో అక్కడికి చేరుకోవడం జ్వాల గమనించింది. వారిలో కొందరి ముఖాల్లో కపట ప్రేమా, మరికొందరి ముఖాల్లో లోపల దాచుకున్న ఆనందం ఆమెకు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా జె.ఎస్. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రుద్రప్ప కారు దిగి, కళ్లజోడు తీసి తుడుచుకుంటూ నటిస్తున్న వైనం జ్వాల కంట పడింది.

 

యుద్ధం ఇప్పుడే మొదలైంది. జ్వాల తన తెల్లటి చీరను సర్దుకుని, శత్రువుల వైపు ఒక సింహంలా అడుగులు వేసింది.

 

ఇంకా ఉంది.

ప్లీస్ ఇగ్నోర్ మిస్టేక్స్.

ప్లీస్ ఫాలో మీ ♥️.