దరిచేరిన స్వప్నం – 1
‘నిశీధి నిశ్శబ్దంలో జారే వెన్నెలలా నీలో నిశ్చలంగా నిలిచిపోవాలని ఉంది,
నీ హృదయం తలుపులు తెరిచిన ప్రతిసారీ మొదటగా తాకే గాలిలా మారాలని ఉంది.
నా ప్రపంచంలోకి వచ్చిన జ్ఞాపకంలా కాదు… అక్కడి నుంచి విడిచిపెట్టలేని అనుభూతిగా మిగిలిపోవాలని ఉంది’
అంతవరకూ రాసిన కలం అక్కడే ఆగిపోయింది.
ఆమె వేళ్లు మాత్రం ఇంకా ఆ పేపర్ పైనే ఉన్నాయి. అక్షరాల మీదుగా నెమ్మదిగా జారుతున్న చూపుల్లో ఏదో చెప్పలేని మైకం.
కొద్దిసేపటికి తను రాసుకున్న మాటల్ని మరోసారి చదువుకుంది.
పెదవుల చివర చిన్న నవ్వు మెరిసింది.
“ఇంత పిచ్చిగా ఎలా ప్రేమించగలుగుతున్నాను నేను…” అని తనలో తానే అనుకుని, వెంటనే పిచ్చి అయితేనేం ?
అతని విషయంలో తనకి నచ్చినది అంత పిచ్చే. ఇష్టంగా మోసే పిచ్చి.
అతని ఆలోచనల్లో మునిగిపోయే రాత్రులంటే నాకు చాలా పిచ్చి. అతని కోసం ఎదురుచూస్తూ గడిచిపోయే క్షణాలంటే ఇంకా పిచ్చి. అతను లేడన్న నిజాన్ని మరిచిపోయి, తన ఊహల్లో అతనితోనే మాట్లాడుకుంటూ నవ్వుకోవడం… అంటే ఇంకా పిచ్చి.
బైట ప్రపంచం ఆమెని ఎంత అలసిపోయేలా చేసిన చివరికి అతని పంచన చేరి ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్పుకోవడం ఆమెకి ఓ వింతైన ప్రశాంతతని ఇస్తుంది.
మళ్ళీ పెన్ తీసుకుంది.
ఈసారి మాత్రం అక్షరాలు మొదలయ్యేలోపే కళ్లలో ఏదో తడి చేరింది.
“నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు ఎప్పుడైనా తెలుస్తుందా?”
అని రాసి ఇంకా చేతిని ముందుకి కదల్చలేక అక్కడే ఆగిపోయింది.
ఆ ప్రశ్నకు సమాధానం తనకి తెలుసు. ఇక్కడ తనకోసం ఓ పిచ్చిది తపించిపోతుందని అతనికి ఏ మాత్రం తెలియదు. తెలిస్తే ఇంతటి ప్రేమ మూర్తి కోసం రెక్కలు కట్టుకుంటూ వచ్చేవాడేమో….
అది ప్రేమో, ఆరాటంలో, తన జీవితంలో అతనికున్న స్థానం ఏంటో కూడా ఆమెకు తెలియదు.
తనకు తెలిసిందల్లా ఒక్కటే.
“నేను” అనే పదానికి అర్ధం తనతో పాటు తన అణువణులో కలిసిపోయిన అతను కూడా అని.
ఆమె ఆ డైరీ మూసేసింది…
*****
రాత్రంతా వెలుగుల్ని ఒడిసిపట్టుకున్న ఆ నగరం, తెల్లవారుజామున మాత్రం మరో రూపం దాల్చింది. తూర్పు దిక్కున ఆకాశం మెల్లగా నీలిరంగును విడిచిపెట్టి, లేత గులాబీ వర్ణాన్ని అద్దుకుంటుండగా,
ఆకాశం అంచున సూర్యుడు నెమ్మదిగా పైకి లేచాడు. అతని బంగారు కిరణాలు ఎత్తైన భవనాల మధ్యన దారి వెతుక్కుంటూ, నిన్నటి అలసటతో నిద్రిస్తున్న నగరాన్ని నిద్రలేపుతోంది.
ఉద్యోగం కోసం మళ్ళీ అందరి కాళ్ళు పరిగెడుతున్నాయి.
నగరానికి నడిబొడ్డున ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్ లో రూం నెంబర్ 301 లో మాత్రం ఓ అమ్మాయి ఇంకా నిద్రపోతూనే ఉంది. బైట నుంచి తన ఫ్రెండ్ చిత్ర డోర్ ని బాదుతోంది.
భూకంపమే వచ్చినా మెలుకువ రాకుండా నిద్రపోయే ప్రార్ధన వేద శ్రీ మాత్రం ఎప్పటిలానే ప్రశాంతంగా నిద్రపోతుంది. కొట్టి కొట్టి అలిసిపోయిన చిత్ర. తనకి ఒక మెసేజ్ పెట్టేసి స్నానం చేయడానికి వెళ్ళిపోతుంది.
తను స్నానం చేసి వచ్చేసిన మెసేజ్ కి ఇంకా సింగిల్ టిక్ ఏ పడి ఉండడం కనిపిస్తుంది.
తను మాత్రం రెడీ అయ్యి తొమ్మిది దాటితే హాస్టల్ లో బ్రేక్ఫాస్ట్ పెట్టరని ఫ్రెండ్ కోసం కొద్దిగా బాక్స్ లో తీసి పెట్టి తను తినేసి ఆఫీస్ కి వెళ్ళిపోతుంది.
ఎప్పుడో పది గంటల ప్రాంతంలో మెలుకువ వచ్చిన తను ఆవులిస్తూ లేస్తుంది. గది మొత్తం ఇంకా చీకటిగానే ఉంది.
కళ్ళు నులుముకుంటూ ఫోన్ తీసుకుని అందులో టైమ్ చూడగా కళ్ళు పెద్దవి అయిపోతాయి.
దేవుడా….!! ఏంటయ్యా నాకు ఇంత మొద్దు నిద్రని ఇచ్చావు. ఇప్పుడు ఎలా బాబు ఆలస్యం అయిపోయింది. ఆ సైకో గాడు నన్ను కాల్చుకు తింటాడు. ఇప్పుడు వెళ్లలేను ఎంత కాదు అనుకున్న ఈజీగా గంట పట్టేస్తుంది అని ఆరోజుకి సిక్ లీవ్ పెట్టేసి చిత్ర లేపలేదు అనుకుని ఆమెని నాలుగు తిట్టుకుని ఫ్రెష్ అయి వస్తుంది.
ఫుడ్ ఎలాగో ఉండదు కాబట్టి ఆర్డర్ చేసుకోవడానికి అన్నట్టు నెట్ ఆన్ చేయగా వెంటనే వస్తుంది చిత్ర మెసేజ్.
అది ఎప్పుడో ఏడు గంటలకే పెట్టినట్టు టైమ్ చూపిస్తుంటే అయ్యో చేసావా చోరీ అని మనసులోనే ముద్దుగా చెప్పుకుని తనకోసం తీసిపెట్టిన బ్రేక్ఫాస్ట్ చక్కగా తినేసి వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది.
కూతురి మొద్దు నిద్ర తెలిసిన వేద వాళ్ళ అమ్మ అయిన వాణి గారు ఇది మారదు అని చిన్నగా తల విదిలించి కాల్ లిఫ్ట్ చేస్తుంది.
“ఏం చేస్తున్నావు అమ్మ”
“మహారాణి లాగ ఇంత పొద్దెక్కే దాకా పడుకున్నా సాగే అదృష్టం నాకెక్కడ ఉందమ్మా…. అందుకే ఇంట్లో పని చేసుకుంటున్నా ” అని వెటకారంగా అంటుంది.
“మా నాన్న ఏమన్నా నిన్ను రాచి రంపాన పెడుతున్నాడా ??? లేట్ గా లేస్తే, లేదు కదా. మరి నిన్ను ఎవరు ఆపారు పడుకోవచ్చు కదా ఇలా నా మీద పడి ఏడవకుంటే ” అని పళ్ళు నూరుకుంటూ అంటుంది వేద.
“మాకు తెలీదులే మరి ఆ విషయం” అంటుంది వాణి.
“పొద్దు పొద్దున్నే నీ నోటికి వచ్చాను చూడు నన్ను నేను అనుకోవాలిలే” అని విసుగ్గా అంటుంది వేద.
” మరి ఫోన్ ఎందుకు చేసావు నాకు”
“ఆ… బుద్దిలేక చేశాను. ఒక్కసారి అయినా చేసినప్పుడు చక్కగా మాట్లాడవా అమ్మా.. ఎప్పుడూ చూడు నన్ను రోస్ట్ చేస్తూనే ఉంటావు అసలు అలుపనేది రాదా నీకు” అని రకరకాలుగా మొహం పెట్టుకుని అడుగుతుంది వేద.
తన భావాలు ఎలా ఉంటాయో ఇట్టే కనిపెట్టేసిన వాణి చిన్నగా నవ్వుకుంటుంది.
“దానికి నీకో మార్గం చెప్పనా??? అలా చేస్తే ఖచ్చితంగా నేను సైలెంట్ అయిపోతాను. ఏం మాట్లాడను ” అని చల్లగా చెప్తుంది వాణి.
ఏంటో అనుకుని ఆత్రంగా చెవులు ఇంకొంచం పెద్దవిగా చేసుకుని చెవిలోనే పెట్టుకున్న ఫోన్ లో నుంచి తల్లి ఏం చెప్తుందా అని వింటుంది.
“పెళ్ళి చేసుకో…. నా నోరు ఆటోమేటిక్ గా మూతపడిపోతుంది ” అని వినిపించిన మాటలకి గాలి తీసిన బుడగలా అయిపోతుంది ఆమె పరిస్థితి.
కొనసాగుతుంది.
Swipe left/right or tap the sides to turn pages