వైదేహి – 1
రామచంద్రపురం
సమయం ఉదయం ఏడు గంటల 45 నిమిషాలు. వంటగదిలో ఒకవైపు టిఫిన్ చేస్తూ, ఇంకొకవైపు పిల్లలకి, భర్తకి బాక్సులు కడుతూ ఉన్నారు 38 ఏళ్ల సుజాత గారు.
“సుజాత, నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది. త్వరగా కానివ్వు,” అంటూ భార్యని ఒకవైపు తొందర పెడుతూ తను రెడీ అవుతున్నారు కోటేశ్వరరావు గారు.
తల్లిదండ్రులు ఇలా తమ తమ హడావిడిలో ఉంటే, ఒక సైడ్‌కి ఎవరికీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మూలగా కూర్చొని బుక్ ఓపెన్ చేసి చదువుకుంటుంది 15 ఏళ్ల చిన్నారి వైదేహి.
“వైదేహి, ఇంకా చదవడం అవ్వలేదా? త్వరగా చదవడం కంప్లీట్ చేసుకుని చెల్లిని, తమ్ముడిని నిద్రలేపు,” అని సుజాత గారు అరుస్తూ ఉంటే,
“అమ్మా, ఒక్క పది నిమిషాలు. అయిపోతుంది,” అంది వైదేహి.
“అబ్బబ్బా! స్కూల్ ఆటో వాడు వచ్చేస్తాడు. కుదరదు,” అని గరిట పట్టుకొని కూతురు ముందు ప్రత్యక్షమయ్యారు సుజాత గారు.
“ఏంటి మమ్మీ! ఏ ఇంట్లో అయినా చదవకపోతే తిడతారు. కానీ మన ఇంట్లోనే అంత విడ్డూరం, చదువుతుంటే నువ్వు తిడుతున్నావ్,” అంది వైదేహి.
“వైదేహి, అలా కాదమ్మా! ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా. నువ్వు అలా చదువుకుంటూ కూర్చుంటే నాకు మిగతా పనులు ఎవరు హెల్ప్ చేస్తారు? కొంచెం నువ్వే కదా నాకు హెల్ప్ చేయాలి,” అంటూ కూతుర్ని బుజ్జగిస్తూ, బతిమాలేసరికి,
“సరే,” అని తను చదువుతున్న బుక్ క్లోజ్ చేసి బ్యాగ్‌లో పెట్టుకుని, బ్యాగ్ సర్దుకొని లేచి తనవి, చెల్లివి, తమ్ముడివి ముగ్గురివి వాటర్ బాటిల్స్ కడిగి పట్టేసి, ఎవరి బ్యాగ్స్‌లో వాళ్లవి పెట్టేసింది.
“నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను. చెల్లిని, తమ్ముడిని నిద్రలేపి, చెల్లికి జడలు వేసేయ్,” అని చెప్పడంతో చెల్లి, తమ్ముడు ఇద్దరినీ నిద్రలేపి, తమ్ముడిని స్నానానికి పంపించి, చెల్లికి దువ్వెన తీసుకొని జడలు వేయడం మొదలుపెట్టింది.
అది ఒక చిన్న ఇల్లు. ఒక పెద్ద హాల్, ఇంకా చిన్న వంటగది, బాత్రూం తప్ప వేరే గది అంటూ లేదు. అంత ఇరుకులోనే మొత్తం ఐదుగురు తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు.
కోటేశ్వరరావు గారు ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో ప్రైవేట్ ఎంప్లాయీగా క్లర్క్‌గా పని చేస్తూ ఉన్నారు.
సుజాత గారు ఇంట్లోనే పనులు చేసుకుంటూ, భర్తని, పిల్లల్ని చక్కగా చూసుకుంటూ ఉన్నారు. ఇక వైదేహి విషయానికి వస్తే, తను పదో తరగతి చదువుతోంది.
తన చెల్లి గగన ఐదవ తరగతి చదువుతుంటే, తమ్ముడు దేవా మూడవ తరగతి చదువుతూ ఉన్నాడు.
తమ్ముడు స్నానం చేసి వచ్చేసరికి చెల్లికి నీట్‌గా జడ వేసేసి, తనని కూడా స్నానానికి పంపించి, తను కూడా స్కూల్ బట్టల్లోకి మారిపోయింది.
ఇక్కడ సుజాత గారు దోసెలు వేస్తూ, అవి భర్తకి వడ్డిస్తూ ఉన్నారు.
భార్య వేసిన దోసెలు తింటూ ఉంటే, ఇంతలో వైదేహి చెల్లిని, తమ్ముడిని రెడీ చేసేసి వంటగదిలోకి వచ్చి తల్లికి కొంచెం సహాయం చేస్తూ ఉంది.
కోటేశ్వరరావు గారు కూతుర్ని మురిపెంగా చూస్తూ ఉండగా ఆయన మొబైల్ మోగింది.
“హలో, ఆ చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నారా?” అడిగారు కోటేశ్వరరావు గారు నవ్వుతూ.
“ఆ, నేను బాగున్నాను బాబు. మీరు ఎలా ఉన్నారు?” అని అవతల వాళ్లు అడగడంతో,
“నేను కూడా చాలా బాగున్నాను అండి. ఇంతకీ ఏంటి విశేషం? ఇలా ఫోన్ చేశారు?”
“అదే, మీ ఇంట్లో పెళ్లీడుకొచ్చిన అమ్మాయి ఉంది కదా. తనకు ఏమైనా సంబంధాలు చూస్తున్నారేమో అని ఫోన్ చేశాను. నాకు బాగా తెలిసిన వాళ్ల అబ్బాయి ఒకడున్నాడు. మంచిగా సంపాదిస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం. కట్నం కూడా ఏమీ ఆశించట్లేదు. అమ్మాయి చూడడానికి బాగుండి, లక్షణంగా ఇంటి పని, వంట పని వస్తే చాలు,” అన్నారు ఆయన.
ఆ మాటకి కోటేశ్వరరావు గారు వైదేహి వైపు చూశారు.
“అయ్యో, కానీ అమ్మాయి ఇంకా పదో తరగతి చదువుతుందండి,” అన్నారు కోటేశ్వరరావు గారు.
“పదో తరగతి కదా చదువుతుంది! ఎలానో ఇంకొక రెండు నెలల్లో పరీక్షలు అయిపోతాయి కదా. పరీక్షలు అవ్వగానే పెళ్లి చేసేస్తే సరిపోతుంది,” అన్నారు అవతలి వ్యక్తి.
“అంటే, అమ్మాయి ఇంకా చిన్నదే కదా,” అని అంటూ నసుగుతున్న కోటేశ్వరరావు గారిని మధ్యలోనే ఆపుతూ,
“ఇదిగోండి కోటేశ్వరరావు గారు, నేనేం చెప్పినా మీ మంచి గురించే. మళ్లీ మళ్లీ మనం వెతికినా ఇలాంటి సంబంధం రాదాయే. అబ్బాయి చూడ్డానికి సీరియల్ హీరోలాగా ఉంటాడు. చాలా అందగాడు. పైగా గవర్నమెంట్ ఉద్యోగం. తోటి కోడలు సమస్య లేదు. ఉన్నది ఒకటే ఆడపడుచు. ఆ ఆడపడుచుకి కూడా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశారు. ఆమెకి రెండు పురుళ్లు కూడా అయిపోయాయి. ఇంకా మీ కూతురు అక్కడికి వెళ్లిన అనుభవించేది రాజభోగమే. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత తను సంతోషంగా ఉండదు అనడానికి చిన్న ఆస్కారం కూడా లేదు. కోటేశ్వరరావు గారు, ఆలోచించుకోండి. మీకు ఇంకా వెనక ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు కదా,” అంటూ అతను చెప్పడంతో,
“మీరు చెప్తుంది కూడా నిజమే అనుకోండి,” అంటున్న కోటేశ్వరరావు గారిని మరొకసారి ఆపుతూ,
“నేను చెప్పడం చెప్పాను. మీరు అయితే ఒకసారి చెల్లమ్మతో కూడా మాట్లాడి ఆలోచించండి. మీరు చెప్తే వాళ్లని తీసుకొని మంచి ముహూర్తం చూసుకొని వస్తాము అమ్మాయిని చూసుకోవడానికి. పెళ్లి అంటారా, ఆ అమ్మాయి పదో తరగతి పరీక్షలు అయ్యాకే పెట్టుకుందాం. ఏముంది, ఒక రెండు నెలలు ఆగలేరా ఏంటి?” అని అంటూ మాట్లాడటంతో,
“సరే అండి, నేను ఒకసారి మా ఇంటి ఆవిడతో కూడా మాట్లాడి మీకు కబురు చేస్తాను,” అని కాల్ కట్ చేసేశారు.
ఇంతలో స్కూల్ ఆటో బయటికి రావడంతో సుజాత గారు గబగబా పిల్లలు ముగ్గురికి దోసెలు తినిపించేసి, “ఇదిగోండి, స్నాక్స్ టైంలో ఇవి తినండి. ఆల్రెడీ కట్టి పెట్టాను. ముగ్గురూ వదిలేయకండి, అస్సలు బాగోదు,” అని వాళ్లని పంపించేసి తిరిగి ఇంట్లోకి వచ్చారు.
“మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఆఫీస్‌కి వెళ్లే ఉద్దేశం లేదా ఏంటి?” అడిగారు సుజాత గారు భర్త వైపు చూస్తూ.
“అబ్బా, సుజాత! ఇలా కూర్చో,” అంటూ భార్యని తన పక్కన కూర్చోబెట్టుకొని, “అది మన వైదేహికి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం అంట. కట్నం కూడా ఏమీ వద్దు అంటున్నారు. మన వైదేహిని అడుగుతున్నారు. ఏమంటావు?” అడిగారు కోటేశ్వరరావు గారు.
“అంటే, అబ్బాయి వయసెంతో కనుక్కోండి. అయినా దీనికి ఇంకా 15 సంవత్సరాలు. ఇంకొక నెల ఆగితే 16 వస్తుంది. కానీ అప్పుడే పెళ్లి చేసేయడం కరెక్టే అంటారా?” అడిగారు సుజాత గారు.
“నేను అలాగే అనుకుంటున్నానే. కాకపోతే మనం వంక పెట్టలేని సంబంధం. అబ్బాయి బాగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడంటే మాటలా చెప్పు! మన కూతురు అక్కడికి వెళ్లిన తర్వాత సంతోషంగా బతుకుతుంది. అంతకుమించి ఇంకేం కావాలి ఒక తల్లిదండ్రులుగా మనకు?” అడిగారు కోటేశ్వరరావు గారు.
ఆ మాటకి సుజాత గారు ఆలోచనలో పడిపోయారు.
“ఏం ఆలోచిస్తున్నావ్ సుజాత?” అడిగారు కోటేశ్వరరావు గారు భార్య వైపు చూస్తూ.
“కానీ కుటుంబం ఎలాంటిదో కనుక్కోవాలి కదా. తోటి కోడలు, ఆడపడుచులు ఉంటే ఆ పోరు మన పాప తట్టుకోగలదా?” అడిగారు సుజాత గారు.
“తోటి కోడలు లేరు. అబ్బాయి ఒక్కడే. ఇంకా ఆడపడుచు ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి చేసేశారంట. ఆ అమ్మాయికి రెండు పురుళ్లు కూడా అయిపోయాయంట. ఇంకా మన అమ్మాయికి అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఆడపడుచు పురుడుకి వస్తుంది. తనకి చాకిరీ చేయాలి అన్న బాధ కూడా ఉండదు కదా! ఏమంటావ్?” అడిగారు కోటేశ్వరరావు గారు.
“సరే, ఒకసారి అబ్బాయి జాతకం అడగండి. అబ్బాయిది, అమ్మాయిది జాతకాలు నప్పితే అప్పుడు ఆలోచిద్దాం,” అన్నారు సుజాత గారు.
“సరే సుజాత, నేను ఫోన్ చేస్తాను. సరేనా?” అని, అప్పటికే టైం అయిపోతూ ఉండటంతో ఇక భార్య కట్టిన లంచ్ బాక్స్ తీసుకొని అక్కడి నుంచి ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యి వెళ్లిపోయారు కోటేశ్వరరావు గారు.
ఇక్కడ స్కూల్‌కి వచ్చిన వైదేహి చెల్లిని, తమ్ముడిని తమ తమ క్లాసుల దగ్గర వదిలేసి ఆఖరుగా తన క్లాస్‌రూమ్‌లోకి వెళ్లింది.
“హాయ్ వైడీ! ఏంటి, ఈరోజు చాలా లేట్ అయిపోయింది రావడం?” అడిగింది తన ఫ్రెండ్ పావని.
“ఏం లేదే, ఆటో అన్న లేట్ అయిపోయింది రావడం. అందుకే లేట్ అయింది,” అని చెప్తూ బుక్స్ ఓపెన్ చేసింది.
“బాబోయ్! 24 గంటలు ఆ పుస్తకాల్లోనే ఏడుస్తావ్ ఏంటి బాబు? కొంచమైనా మాతో టైం స్పెండ్ చేయవే! ఇంకొక రెండు నెలల్లో ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గరికి వెళ్లిపోతాము,” అంది పావని.
“ఏంటి, అందరం కలిసి చదివేది ఒకే కాలేజీలో మన ఊర్లో ఉన్నదే. మీరు ఇంకే కాలేజీకి పోతారు?” అడిగింది వైదేహి.
“నీకు అలాగే ఉంటుంది అమ్మా! మన క్లాస్‌రూమ్‌లో ఉన్న 20 మంది అమ్మాయిల్లో ఒక పది మందేమో హాస్టల్‌కి వెళ్లిపోతారంట. ఒక ఐదుగురు ఏమో చదువు మానేస్తారంట. నాక్కూడా ఇంట్లో పెళ్లి సంబంధం వచ్చింది. నాన్న పరీక్షలు అవ్వగానే పెళ్లి అంటున్నారు,” అంది పావని.
“ఏం మాట్లాడుతున్నావే? అప్పుడే పెళ్లెందుకు?” అడిగింది వైదేహి.
“ఈ మాట నువ్వు నన్ను కాదు, మా నాన్నను అడగాలి. నేను ఏమైనా కావాలని చేసుకుంటున్నానా ఏంటి?” అంటూ పావని మాట్లాడుతూ ఉండగానే టీచర్ రావడంతో తను సైలెంట్ అయిపోయింది.
“ఓకే స్టూడెంట్స్! ఇక మీ సిలబస్ అయితే అయిపోయింది. మీరు చదువుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడిగితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకొక రెండు నెలల్లో మీ అందరికీ ఎగ్జామ్స్ అయిపోతాయి. సో, ఒకటి చెప్పండి. మీరు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏం అవుదాం అనుకుంటున్నారు?” అడిగింది టీచర్ అందరి వైపు చూస్తూ.
అందరూ ఒకేసారి గుంపుగా ఆన్సర్ చెప్పడంతో టీచర్ చెవులు మూసుకుని, “రేయ్, అందరూ ఒకేసారి చెప్తే నేను ఎలా రా వినేది? ఒక్కొక్కళ్లూ చెప్పండి. స్టార్టింగ్ మన క్లాస్ టాపర్ వైదేహితో స్టార్ట్ చేద్దాం,” అని టీచర్ చెప్పడంతో,
వైదేహి లేచి నిలబడి, “నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను టీచర్,” అంది వైదేహి.
“ఓహో, డాక్టరా? ఏ డిపార్ట్‌మెంట్ స్పెషలైజేషన్ ఎందులో చేస్తావ్?” అడిగింది టీచర్.
“కార్డియాలజిస్ట్ అవుతాను మేడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వెదర్ కండిషన్స్‌కి, పొల్యూషన్‌కి, మనం తినే కల్తీ ఆహారానికి ఎక్కువగా జనాలు హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. అందుకే నేను మంచి కార్డియాలజిస్ట్ అయ్యి అందర్నీ కాపాడాలి అనుకుంటున్నాను మేడం,” అంది వైదేహి నవ్వుతూ.
“అందరూ తనకి క్లాప్స్ కొట్టండి,” అని అందరి చేత చప్పట్లు కొట్టించి, “నువ్వు కచ్చితంగా డాక్టర్ అవుతావురా. నాకు ఆ నమ్మకం ఉంది,” అని ఆమెను ఆశీర్వదించింది టీచర్.
——–continues…………..
ఇక్కడ వైదేహి ఏమో డాక్టర్ చదవాలి అని ఎన్నో కలలు కంటూ ఉంది. కానీ తన ఇంట్లో తన తల్లిదండ్రులు తనకి పెళ్లి చేయాలి అని చూస్తున్నారు. మరి ఈ వైదేహి జీవితం ఎటువైపు వెళుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే నన్ను ఫాలో అయిపోయి నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేసేయండి.
Swipe left/right or tap the sides to turn pages