వైదేహి – 2
కార్డియాలజిస్ట్ అవుతాను మేడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వెదర్ కండిషన్స్‌కి, పొల్యూషన్‌కి, మనం తినే కల్తీ ఆహారానికి ఎక్కువగా జనాలు హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. అందుకే నేను మంచి కార్డియాలజిస్ట్ అయ్యి అందర్నీ కాపాడాలి అనుకుంటున్నాను మేడం అంది వైదేహి నవ్వుతూ.
“అందరూ తనకి క్లాప్స్ కొట్టండి” అని అందరి చేత క్లాప్స్ కొట్టించి, “నువ్వు కచ్చితంగా డాక్టర్ అవుతావురా. నాకు ఆ నమ్మకం ఉంది” అని తనని బ్లెస్ చేసింది టీచర్.
“గుడ్ వైదేహి! నువ్వు ఎప్పుడూ ఇదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే కచ్చితంగా నువ్వు అనుకున్న నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి” అంది టీచర్.
“థాంక్యూ టీచర్” అని నవ్వుతూ కూర్చుంది. ఆ తర్వాత ఒక్కొక్కరిని అడగడం, వాళ్లు తాము ఏమవ్వాలనుకుంటున్నది చెప్పడం మొదలైంది. కొంతమంది అయితే పెళ్లి చేసేస్తామన్నారు, పెళ్లి చేసుకుని వెళ్లిపోతాము అని చెప్పారు. ఇలా విధమైన ఆన్సర్స్ చెప్తూ ఉన్నారు.
అందరి ఆన్సర్స్ విన్న తర్వాత టీచర్ అందరి వైపు చూస్తూ, “ఒకటే చెప్తాను. ఎప్పుడూ కూడా మీ కాళ్ల మీద మీరు నిలబడాలి. ముఖ్యంగా అమ్మాయిలు, మీరు పెళ్లి చేసేసుకుని వెళ్లిపోతాము అన్నది వద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు. మీ దగ్గర సరైన చదువు లేక, సరైన ఉద్యోగం లేక, మీరు ఏమీ చేయకుండా ఇంట్లో ఉంటే, మీకు రూపాయి కావాలన్నా లేదా ఏదైనా వస్తువు కావాలన్నా, మీరు పెళ్లికి ముందు మీ అమ్మానాన్నల మీద డిపెండ్ అయినట్టు, పెళ్లి తర్వాత మీ భర్త మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? అలా ఎప్పుడూ ఉండకూడదు. మీరు బాగా చదువుకుని, మీకు దేనిలో ఇష్టమైతే ఆ రంగంలో రాణించాలి” అని టీచర్ మోటివేషన్ ఇస్తూ ఉంటే, ఆవిడ మాటలన్నీ వైదేహి మెదడులో, మనసులో బలంగా నాటుకుపోయాయి.
ఇక సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత చెల్లిని, తమ్ముడిని జాగ్రత్తగా తీసుకుని బయటికి వచ్చింది వైదేహి.
ఆటో అన్న అప్పటికే వచ్చేసి ఉండటంతో ఆటో ఎక్కేసి తిరిగి ఇంటికి వచ్చేశారు వీళ్లు.
రాగానే ముగ్గురు స్కూల్ డ్రెస్ మార్చుకుని, వేరే బట్టలు వేసుకుని, కాళ్లు చేతులు కడుక్కొని వచ్చేసరికి సుజాత గారు పిల్లలు తినడానికి స్నాక్స్ చేసి పెట్టడంతో అవి తినేశారు. తమ్ముడు, చెల్లి ఆడుకుంటూ ఉంటే వైదేహి మాత్రం చాలా శ్రద్ధగా పుస్తకాలు ఓపెన్ చేసి చదువుకుంటూ ఉంది.
సాయంత్రం ఆరోజు కొంచెం లేటుగానే ఇంటికి వచ్చారు కోటేశ్వరరావు గారు.
వస్తూ వస్తూ పిల్లలకి ఇష్టమని జిలేబీలు, సమోసాలు తీసుకుని రావడంతో పిల్లలు తెగ ఆనందపడిపోయారు.
“ముగ్గురు కొట్టుకోకుండా తినాలి” అని చెప్పడంతో వైదేహి ముందుగా తీసుకుని ఒక సమోసా, ఒక జిలేబీ తల్లిదండ్రులకి కూడా ఇచ్చింది. వాళ్లు తీసుకున్న తర్వాతే తను తీసుకుని తినడం మొదలుపెట్టింది.
“నీకు చెప్పానా సుజాత, నా పెద్ద కూతురు మా అమ్మే అని! చూసావా, అది తినకుండా ముందు నాకు పెట్టింది” అన్నారు కోటేశ్వరరావు గారు మురిసిపోతూ.
“అవునండి” అని నవ్వుతూ భర్త పక్కన కూర్చున్నారు సుజాత గారు.
“అవును, ఇంతకీ విషయం ఏమైంది? వాళ్లతో ఏమైనా మాట్లాడారా?” అడిగారు సుజాత గారు.
“ఆ, మాట్లాడాను. వాళ్లు మన అమ్మాయి జాతకం అడిగితే మన అమ్మాయి నక్షత్రం, రాశి చెప్పాను. వాళ్లు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లి చూస్తే అబ్బాయిది, అమ్మాయిది చాలా బాగా కలిశాయి అని చెప్పారు” అన్నారు కోటేశ్వరరావు గారు.
“అవునా? మరి ఇంకెందుకు? అయితే వాళ్లని ఏదో ఒక మంచి ఆదివారం చూసుకుని ఇంటికి రమ్మని చెప్పండి పెళ్లిచూపులకి” అన్నారు సుజాత గారు.
ఆ మాటలు విన్న వైదేహి తల్లిదండ్రుల వైపు అనుమానంగా చూస్తూ, “ఏంటి మమ్మీ, ఎవరికి పెళ్లిచూపులు?” అని కొంచెం భయపడుతూ అడిగింది.
“నీకే చిట్టి తల్లి” అన్నారు సుజాత గారు, కోటేశ్వరరావు గారు ఇద్దరూ ఒకేసారి.
“అదేంటి? నాకు పెళ్లిచూపులు ఏంటి? నాకు అప్పుడే పెళ్లిచూపులు వద్దు” అంది వైదేహి.
“అమ్మా, అలా కాదురా” అని కూతుర్ని తమ మధ్యన కూర్చోబెట్టుకుని, “అబ్బాయి వాళ్లు చాలా మంచివాళ్లు. గవర్నమెంట్ ఉద్యోగం, బాగా డబ్బులు ఉన్నవాళ్లు. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు రా. నీకు ఇంకేం కావాలి చెప్పు? ఇంకా నాకు చెల్లి, తమ్ముడు కూడా ఉన్నారు కదా! నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే, ఇక అప్పుడు చెల్లిని, తమ్ముడిని కూడా నేను చదివించాలి, వాళ్లని పెద్ద చేయాలి” అంటూ కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉంటే…
“కానీ నాన్న, నేను ఇంకా పెద్ద చదువులు చదవాలి అనుకుంటున్నాను” అంది వైదేహి. అప్పటికే తన గొంతు జీరబోయింది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే, పెళ్లి అంటే సహజంగా ఉండే భయం అనుకున్నారు వాళ్లు. కూతురికి ధైర్యం చెబుతూ ఉన్నారు.
వైదేహి మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తన ప్లేస్‌కి వెళ్లిపోయి చదువుకోవడం మొదలుపెట్టింది.
“ఏమే, నా కూతురు నన్ను ఏమైనా తప్పు పడుతుందా?” అడిగారు కోటేశ్వరరావు గారు భయంగా.
“అయ్యో, అలాంటిదేం లేదు. మీరు అలా ఏం ఆలోచించకండి. అయినా మీరు ఆలోచించేది కూడా దాని మంచి గురించే కదా! ఇప్పుడు దానికి అలాగే ఉంటుంది. అయినా పెళ్లి అంటే ఏంటో ఇప్పుడిప్పుడే కదా దానికి అర్థమయ్యే వయసు వస్తుంది. పెళ్లి చేస్తాము అంటే మనందరినీ వదిలి వెళ్లాలి అని భయపడుతుంది. ఒక్కసారి పెళ్లయిపోతే, ఆ ఇల్లు, ఆ మనుషుల్ని, భర్త ప్రేమని చూస్తే తనే ఇక్కడికి రావడానికి కూడా ఆలోచిస్తుంది” అన్నారు సుజాత గారు.
ఆ మాటకి కోటేశ్వరరావు గారు, “ఒక్కసారి నువ్వు వెళ్లి దాంతో మాట్లాడవే. నేను పిల్లలిద్దరినీ తీసుకుని అలా బయటికి వెళ్తాను” అన్నారు.
చిన్న కూతుర్ని, కొడుకుని తీసుకుని కోటేశ్వరరావు గారు బయటికి వెళ్తే, కూతురు పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని అది పక్కన పెట్టి కూతురు వైపు చూస్తూ, “అమ్మా, నీతో కొన్ని విషయాలు మాట్లాడుతుంది. ఆ తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో” అన్నారు సుజాత గారు.
“ఏంటి అమ్మా అది?” అని అడిగింది వైదేహి ముభావంగా.
“ఇప్పుడు ఎందుకిలా ఉన్నావ్?” అడిగారు సుజాత గారు.
“నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా” అంది వైదేహి.
“ఇదిగో, ఆ అబ్బాయికి మంచి సంబంధం. రూపాయి కట్నం అడగట్లేదు. అయినా ముందు వాళ్లకి నువ్వు నచ్చాలి కదా! వాళ్లు వచ్చి నిన్ను చూసుకోవాలి. నీకు అబ్బాయి నచ్చాలి, అబ్బాయికి నువ్వు నచ్చాలి. అప్పుడే కదా మిగతా విషయాలన్నీ మాట్లాడుకునేది? నువ్వు ఇప్పుడే ఇలా ఏడ్చిపోతే మీ నాన్నగారు ఎంత బాధపడతారో ఆలోచించావా? తమ్ముడు, చెల్లి… మీ నాన్నగారు ఎంత సంపాదిస్తున్నారో నీకు తెలుసు. అన్నీ తెలిసి నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలాగమ్మా? మళ్లీ మళ్లీ మనం కావాలనుకుంటే ఇలాంటి సంబంధం వస్తుందా చెప్పు?” అంటూ సుజాత గారు చెప్పడంతో…
“కానీ అమ్మా…” అంటున్న తన మాటలని మధ్యలోనే ఆపుతూ,
“ఇదిగో, మేము ఏం ఆలోచించినా, ఏం చేసినా అది నీ మంచి గురించే అని నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అబ్బాయి వాళ్లు ఎప్పుడొస్తారో తెలియదు. వచ్చినప్పుడు చెప్తాను. చక్కగా చీర కట్టుకుని కూర్చుంటే బాగుంటుంది. అంతేగాని నీ పిచ్చి పిచ్చి తెలివితేటలు వాడి నువ్వు మా పరువు తీయకు, సరేనా?” అన్నారు సుజాత గారు.
ఏం చెప్పలేక వైదేహి ఉండిపోతే, ఇక సుజాత గారు కిచెన్‌లోకి వెళ్లిపోయి వంటకి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు.
కొడుకుని, కూతుర్ని తీసుకుని బయటికి వెళ్లిన కోటేశ్వరరావు గారు ఒక అరగంటకి ఇంటికి వచ్చారు.
కూతురు ముభావంగా ఉండటం చూసి, తనకోసం కొన్న చాక్లెట్ తీసుకొచ్చి కూతురి ముందు పెట్టారు.
“నా చిట్టి తల్లి నామీద ఇంకా కోపంగా ఉందా?” అడిగారు కోటేశ్వరరావు గారు వైదేహి వైపు చూస్తూ.
“అమ్మా, నాన్న ఏం ఆలోచించినా అది నీ గురించే తల్లి. నిన్ను వదిలి మేము మాత్రం దూరంగా ఉండటం మాకు సరదాగా ఉంటుంది అనుకుంటున్నావా? కానీ తప్పదు కదా! ఎప్పటికైనా నువ్వు ఇంకొక ఇంటికి వెళ్లాల్సిన ఆడపిల్లవే” అన్నారు ఆయన.
ఇక అలా వాళ్ల మాటలతోనే ఆరోజు గడిచిపోయింది.
మరుసటి రోజు ఆ పెళ్లిళ్ల పేరయ్య మళ్లీ కోటేశ్వరరావు గారికి ఫోన్ చేసి, “అబ్బాయి వాళ్లు ఈ ఆదివారం వస్తామంటున్నారు బాబు. మీరు ఖాళీగానే ఉన్నారు కదా ఆ రోజు?” అంటూ కోటేశ్వరరావు గారిని అడగడంతో…
“ఆరోజు ఖాళీగానే ఉన్నాము” అన్నారు కోటేశ్వరరావు గారు.
“సరే, అయితే టైమ్ అది ఫిక్స్ అయిన తర్వాత నేను మళ్లీ చెప్తాను” అని చెప్పడంతో, అదే విషయం కోటేశ్వరరావు గారు భార్యకి చెప్పారు.
“సరే, దానికి సెట్ అయ్యే బ్లౌజ్ ఉంది. ఆ చీర కట్టేద్దాం లెండి” అన్నారు సుజాత గారు.
“అలాగే, అమ్మాయికి మనం మూడు తులాల బంగారం పెడదామనుకున్నాం కదా! అదే చెబుదాము. అంతకుమించి మన దగ్గర స్థాయి లేదు అని చెప్పేద్దాము. వాళ్ల దగ్గర దాపరికాలు మంచిది కాదు. మళ్లీ మన దగ్గర ఏదో ఉంది అనుకుంటారు. అందుకే ముందే ఉన్నది ఉన్నట్టు, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తే బాగుంటుంది” అన్నారు కోటేశ్వరరావు గారు.
“ఆ, నేను ఇంకా మీతో అదే విషయం చెబుదాం అనుకున్నానండి. ఇంతలో మీరు అదే విషయం చెప్పారు” అన్నారు సుజాత గారు.
“అమ్మాయికి ముందు రోజు చెప్తాము. ఎప్పటినుంచి చెప్తే మనసు పాడు చేసుకుంటుంది” అన్నారు సుజాత గారు.
“అలాగే సుజాత, ఇక నేను ఆఫీస్‌కి వెళ్తాను” అని ఆయన ఆఫీస్‌కి వెళ్లిపోతే, పెళ్లిచూపులు రెండు రోజుల్లోనే ఉండటంతో కూతురికి చీర, అలాగే ఆరోజు పెట్టుకోవడానికి కొన్ని నగలు అన్నీ తీసి రెడీ చేసి పెట్టే పనిలో పడ్డారు సుజాత గారు.
——–continues……….
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ
ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతుంది పెళ్లి వాళ్లు వచ్చి తనని పెళ్లి చేసుకుంటారా అసలు ముందు వైదేహి పెళ్లికి ఒప్పుకుంటుందా ఒకవేళ తను పెళ్లి చేసుకుంటే మరి తన డాక్టర్ డ్రీమ్ ఏమవుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో
Swipe left/right or tap the sides to turn pages