ధీర సమీరే గంగా తీరే – 1
చందన్‌నగర్, పశ్చిమ బెంగాల్.
సమయం సాయంత్రం 6:30 గంటలు. దక్షిణేశ్వర్ కాళీమాత గుడి ప్రాంగణం నిశ్శబ్దంగా ఉంది. చిరుజల్లులు పడుతున్నాయి. గుడి గంటల శబ్దం గాలిలో మెల్లగా కలిసిపోతోంది. అంతా చిన్న చిన్న చిరుజల్లుతో తడిసిపోతుంది.
కోనేటి మెట్ల మీద ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చుని ఉంది.
ఆమె చూపు కోనేటి నీటిపైనే ఉంది. నీటిపై పడుతున్న వాన చినుకుల్ని చూస్తూ, తన గతాన్ని గుర్తుచేసుకుంటోంది.
ఆమె మనసులో ఎన్నో జ్ఞాపకాలు…
కొన్ని నవ్విస్తున్నాయి.మరికొన్ని కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి.
అప్పుడే గుడిలో పూజ ముగించుకుని బయటకు వచ్చిన పంతులుగారు, కోనేటి దగ్గర కూర్చున్న ఆమెను చూశారు.
ఆమె ఎవరో ఆయనకు బాగా తెలుసు.
ప్రతిరోజూ కాకపోయినా, అప్పుడప్పుడు గుడికి వస్తుంటుంది. కానీ ఈరోజు ఆమె ముఖంలో కనిపిస్తున్న బాధ ఆయనను ఆలోచింపజేసింది.
ఆయన మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లారు.
“ఓ మా, తుమి ఏఖానే ఏకా బోషే ఆఛో?
ఆ గొంతు వినగానే ఆమె ఉలిక్కిపడి తల పైకెత్తింది.
పంతులుగారిని చూసి చిన్నగా నవ్వడానికి ప్రయత్నించింది.
“ఓమోన్ కిచ్ఛు నా, ఠాకూర్‌మోషాయ్…”అని చెప్పి మళ్లీ కోనేటి వైపు తిరిగింది.
పంతులుగారు ఆమె పక్కనే కూర్చున్నారు. కాసేపు ఆమెతో పాటు కోనేటి నీటిని చూస్తూ ఉండిపోయారు.
తర్వాత ఏదో గుర్తొచ్చినట్టుగా చుట్టూ చూసి అడిగారు.
“ఓ మా… తోమార్ షాథే జే ఛేలేటా ఆసతో, షే కోథాయ్?”
ఆ మాట వినగానే ఆమె చూపు ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆమె చేతులు కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి.
కోనేటి నీటిలో పడుతున్న చినుకుల్ని చూస్తున్న ఆమె చూపు మసకబారింది.
ఆయన అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది.
ఆ మౌనంలోనే ఎన్నో సమాధానాలు వెతుక్కుంటున్న ఆమెను చూస్తూ పంతులుగారు మళ్లీ అడిగారు.
“కీ హోలో మా? ఆమి కిఛు భూల్ బోల్లామ్?”
(ఏమైంది అమ్మా? నేను ఏమైనా తప్పుగా అడిగానా?)
ఆమె వెంటనే తల అడ్డంగా ఊపింది.
“నా ఠాకూర్‌మోషాయ్… ఆప్ని కిఛు భూల్ బోలెన్ ని.” (“లేదు పంతులుగారూ… మీరు ఏమీ తప్పుగా మాట్లాడలేదు.”)
అంటూ చిన్నగా నవ్వింది.
కానీ ఆ నవ్వు ఆమె పెదవుల వరకే పరిమితమైంది. కళ్లలో మాత్రం ఏదో తెలియని వెలితి.
“మరి ఆ అబ్బాయి ఎక్కడమ్మా? ఇంతకుముందు నువ్వు గుడికి వచ్చినప్పుడల్లా నీ వెనకాలే తిరిగేవాడు కదా! ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ నిన్ను నవ్విస్తూ ఉండేవాడు.”
ఆ మాటలకు ఆమాటలకు ఆమె పెదవులపై అప్రయత్నంగా చిరునవ్వు మెరిసింది.
అవును…
అతను అంతే!
తనకు నిశ్శబ్దమంటే ఇష్టం.
అతనికి ఆ నిశ్శబ్దాన్ని చెడగొట్టడమంటే ఇంకా ఇష్టం.
తను గుడికి వస్తే ప్రశాంతంగా వెళ్లాలనుకునేది.
కానీ అతను మాత్రం గుడికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూ తనని విసిగించేవాడు.
అలా అనుకుంటుండగానే ఆమె కళ్ల ముందు జ్ఞాపకాలు కదలాడాయి.
గతం లోకి వెళదాం వచ్చేయండి.
హైదరాబాద్.
రాత్రి 9:30 గంటలు.
అప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన అతను సోఫాలో కూర్చుంటూ కళ్లు మూసుకున్నాడు.
రోజంతా పేషెంట్లతో గడపడంతో కాస్త అలసటగా అనిపిస్తోంది.
“అమ్మా…!”
వంటగదిలో నుంచి వేదవతి దేవి గొంతు వినిపించింది.
“వచ్చావా నాన్నా! ఉండు, భోజనం తీసుకొస్తాను.”
“ముందు కొంచెం మంచినీళ్లు ఇవ్వమ్మా!”
“అక్కడే టేబుల్ మీద ఉన్నాయి. తీసుకుని తాగు.”
“అబ్బా! నీ చేత్తో ఇస్తేనే తాగుతాను.”
“నీకు పెళ్లయితే నీ పెళ్లాం కూడా ఇలాగే అన్నీ అందించాలేమో!”
“అందుకే కదమ్మా నాకు పెళ్లి వద్దంటున్నా. నువ్వు ఉండగా ఇంకొకరు ఎందుకు?”
“చాల్లే నీ మాటలు!”
అంటూ నవ్వుకుంటూ మంచినీళ్లు తీసుకొచ్చింది.
అతను నీళ్లు తాగి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు.
అప్పుడే ఓ మెయిల్ నోటిఫికేషన్ కనిపించింది.
మామూలుగానే ఓపెన్ చేసిన అతను అందులోని మొదటి రెండు లైన్లు చదివి ఒక్కసారిగా నిటారుగా కూర్చున్నాడు.
సబ్జెక్ట్ : సెలక్షన్ కన్ఫర్మేషన్ స్పెషల్ మెడికల్ ఫెలోషిప్ కోల్కతా
డియర్ డాక్టర్
వీ ఆర్ ప్లీజ్డ్ టు ఇన్‌ఫార్మ్ యూ దట్ యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది వన్-ఇయర్ స్పెషల్ మెడికల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అట్ అవర్ కోల్‌కతా హాస్పిటల్.
ఒక్క క్షణం అతనికి తన కళ్లను తానే నమ్మలేనట్టనిపించింది.
మూడు నెలల క్రితం అప్లై చేసిన ఫెలోషిప్!
ఎంతోమంది అభ్యర్థులు పోటీపడిన అవకాశం!
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ శుభవార్త చివరికి తనను చేరుకుంది.
మెయిల్‌ను మరోసారి చదివాడు.
అతని ముఖంలో అలసట స్థానంలో ఆనందం కనిపించింది.
“అమ్మా… అమ్మా…!”
అంటూ గట్టిగా పిలిచాడు.
“ఏంట్రా! ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావ్?”
అంటూ వంటగదిలో నుంచి కంగారుగా బయటకు వచ్చింది వేదవతి దేవి.
అతను సోఫాలో నుంచి లేచి ఆమె రెండు చేతులూ పట్టుకున్నాడు.
“అమ్మా! నీ కొడుకు కోల్‌కతా వెళ్తున్నాడు!”
“ఎక్కడికి?”
“కోల్‌కతా అమ్మా! వెస్ట్ బెంగాల్!”
“అక్కడికి ఎందుకురా?”
“నేను అప్లై చేసిన ఫెలోషిప్ గుర్తుందా? దానికి సెలెక్ట్ అయ్యానమ్మా!”
“నిజంగానా నాన్నా?”
“నిజమమ్మా! ఇదిగో చూడు.”
అంటూ ఫోన్‌లోని మెయిల్ ఆమెకు చూపించాడు.
ఇంగ్లీషులో ఉన్న మెయిల్ పూర్తిగా అర్థం కాకపోయినా కొడుకు ముఖంలో కనిపిస్తున్న ఆనందం ఆమెకు విషయం చెప్పేసింది.
“చాలా సంతోషంగా ఉంది నాన్నా!”
అంటూ అతని తల నిమిరింది.
“మరి ఎన్ని రోజులు అక్కడ ఉండాలి?”
“ఏడాది అమ్మా!”
ఆ మాట వినగానే ఆమె ముఖంలో చిరునవ్వు కాస్త తగ్గింది.
“ఏడాదా?”
“అవునమ్మా!”
“అంటే అన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉండవా?”
“అమ్మా! అక్కడే ఉండి పనిచేయాలి కదా!”
వేదవతి దేవి కాసేపు మౌనంగా ఉండిపోయింది.
“ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు కదరా. అంత దూరం వెళ్లడం ఎందుకు?”
అతను ఆమె దగ్గరకు వచ్చి భుజాల చుట్టూ చేతులు వేశాడు.
“అమ్మా! నువ్వే కదా ఎప్పుడూ చెప్పేది… మనం చేసే పనిలో ఇంకా పైకి ఎదగాలని. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. వదులుకోమంటావా?”
“వద్దని చెప్పడం లేదురా. నువ్వు లేకుండా ఇల్లంతా బోసిపోతుందేమో అని…”
“అబ్బా! ఏడాదే కదమ్మా. జీవితాంతం వెళ్లిపోవట్లేదు.”
“నీకు ఏడాది చిన్న విషయమే. నాకు మాత్రం ఒక్కరోజు కూడా నువ్వు కనిపించకపోతే ఇల్లంతా వెలితిగా ఉంటుంది.”
ఆ మాటకు అతను నవ్వడం ఆపి అమ్మను దగ్గరకు తీసుకున్నాడు.
“రోజూ వీడియో కాల్ చేస్తానమ్మా. సరేనా?”
“ముందు సమయానికి తినడం నేర్చుకో. ఆ తర్వాత వీడియో కాల్స్ గురించి ఆలోచిద్దాం.”
“అదేంటి అమ్మా! ఇంత ఎమోషనల్ సీన్‌లో కూడా నీకు నా తిండి గురించేనా?”
“అమ్మని కదరా!”
అంటూ అతని తలపై ప్రేమగా చేయి వేసింది.
అతను నవ్వుతూ ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు.
కాసేపటి తర్వాత…
“అమ్మా… అక్కడ రసగుల్లాలు చాలా ఫేమస్ అంట కదా?”
“అవును. అయితే?”
“వచ్చేటప్పుడు నీకు తీసుకొస్తా!”
“నాకు రసగుల్లాలు వద్దు. నువ్వు క్షేమంగా తిరిగొస్తే చాలు.”
“అలాగే మేడమ్!”
అంటూ సరదాగా సెల్యూట్ చేశాడు.
“సరే కానీ, ఎప్పుడు వెళ్లాలి నాన్నా?”
“వచ్చే సోమవారం రిపోర్ట్ చేయాలమ్మా. ఇంకా నాలుగు రోజులే ఉన్నాయి.”
“అప్పుడేనా?”
“అవునమ్మా! రేపటి నుంచే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలి.”
“సరే నాన్నా. ముందు వెళ్లి స్నానం చేసి రా. భోజనం వడ్డిస్తాను.”
“అమ్మా! ఈరోజు నాకు స్పెషల్‌గా ఏమైనా చేసి పెట్టవా?”
“ఏం కావాలి నా బంగారానికి?”
“నీ చేతి గుత్తివంకాయ కూర!”
“సరే! రేపు చేస్తాను. ఇప్పుడు ఉన్నది తిను.”
“అబ్బా! సెలెక్ట్ అయిన రోజు కూడా స్పెషల్ ట్రీట్‌మెంట్ లేదా?”
“లేదు డాక్టర్ గారూ!”
అంటూ నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది.
అతను కూడా నవ్వుతూ తన గదివైపు నడిచాడు.
కానీ వంటగదిలోకి వెళ్లిన వేదవతి దేవి మాత్రం ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయింది.
కొడుకు సాధించిన విజయానికి మనసంతా సంతోషంగా ఉంది.
అయినా…
ఇన్నాళ్లూ తన కళ్ల ముందే తిరిగిన కొడుకు ఇక ఏడాది పాటు దూరంగా ఉంటాడనే ఆలోచన ఆమె మనసును చిన్నగా కలిచివేసింది.
కళ్ల చివర చేరిన నీటిని చీరకొంగుతో తుడుచుకుంది.
“వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి…”
అనుకుంటూ మళ్లీ తన పనిలో నిమగ్నమైంది.
మరుసటి రోజు…
ఉదయం 5:30 గంటలు.
“నాన్నా… లేచావా?”
అంటూ గది తలుపు తట్టింది వేదవతి దేవి.
“లేచానమ్మా! ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తా.”
“సరే నాన్నా! కిందకి వచ్చేముందు పూజ గదిలోకి వచ్చి దేవుడికి దండం పెట్టుకో.”
“అలాగే అమ్మా!”
అంటూ తన లగేజ్ బ్యాగ్ జిప్ మూసి ఒక్కసారి గదంతా కలియజూశాడు.
ఇన్నాళ్లూ తనకు అలవాటైన గది. ఉదయాన్నే అమ్మ పిలుపులు, నాన్నతో చిన్న చిన్న వాదనలు, హాస్పిటల్ నుంచి ఎంత ఆలస్యంగా వచ్చినా తన కోసం ఎదురుచూసే అమ్మ…
ఇవన్నీ వదిలి ఏడాది పాటు మరో నగరంలో ఉండాలంటే మనసులో ఎక్కడో చిన్న బాధ.
అయినా తన కలల కోసం కొన్ని ప్రయాణాలు తప్పవు కదా!
కిందకు వచ్చేసరికి వేదవతి దేవి పూజ గదిలో హారతి ఇస్తోంది.
అతన్ని చూడగానే దగ్గరకు పిలిచింది.
“రా నాన్నా!”
హారతి కళ్లకు అద్దుకుని అమ్మ కాళ్లకు నమస్కరించాడు.
“నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాన్నా!”
అంటూ అతని తలపై అక్షింతలు వేసింది.
“అమ్మా! నేను వెళ్తున్నది కోల్‌కతాకి. యుద్ధానికి కాదు!”
“నోర్ముయ్! శుభమా అని బయలుదేరే సమయంలో అవేం మాటలు?”
అంటూ చిన్నగా అతని చెవి మెలిపెట్టింది.
“అబ్బా! సరే సరే… సారీ మాతాశ్రీ!”
అతని అల్లరికి ఆమె నవ్వకుండా ఉండలేకపోయింది.
కాసేపటికి ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు.
అక్కడ అప్పటికే అతనికి ఇష్టమైన టిఫిన్ సిద్ధంగా ఉంది.
“అమ్మా! ఇవన్నీ నేనొక్కడినే తినాలా?”
“ప్రయాణంలో మళ్లీ ఎప్పుడు తింటావో ఏమో! కడుపునిండా తిను.”
“అక్కడ కూడా హోటల్స్ ఉంటాయమ్మా!”
“ఉంటాయి. కానీ ఇంటి భోజనం ఉండదు కదరా!”
ఆ మాటకు అతను మరో మాట మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాడు.
కొన్ని గంటల తర్వాత…
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.
వేదవతి దేవి అప్పటికే నాలుగోసారి అతని లగేజ్ గురించి అడిగింది.
“టికెట్ పెట్టుకున్నావా?”
“పెట్టుకున్నా”….
“ఆధార్ కార్డు?”….
“ఉంది..
“ఛార్జర్?”
“ఉందమ్మా!”
“మందులు?”
“అమ్మా! నేనే డాక్టర్‌ని!”
“అయితే డాక్టర్లకు జ్వరం రాదా?”
ఆమె ప్రశ్నకు అతను నవ్వేశాడు.
“నీతో వాదించడం నా వల్ల కాదు తల్లీ!”
విమానాశ్రయంలోకి వెళ్లే సమయం కావడంతో అమ్మ దగ్గరకు వచ్చాడు.
“వెళ్లొస్తానమ్మా!”
అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన వేదవతి దేవి కళ్లు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి.
అతను అది గమనించి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
“ఏంటమ్మా ఇది? నేను వెళ్లేలోపు ఏడిపించేస్తావా?”
“జాగ్రత్త నాన్నా!”
“అలాగే
చేరుకున్న వెంటనే ఫోన్ చెయ్.”
“చేస్తాను.”
“భోజనం మానేయకు.”
“అలాగే!”
“ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు.”
ఆ మాట వినగానే అతను చిన్నగా నవ్వాడు.
“అది మాత్రం ఎదుటివాళ్ల మీద ఆధారపడి ఉంటుంది అమ్మా!”
“ఒరేయ్!”
అంటూ అతని భుజంపై చిన్నగా కొట్టింది.
అమ్మకు మరోసారి బై చెప్పి లోపలికి నడిచాడు.
కొన్నసాగుతుంది…
Swipe left/right or tap the sides to turn pages