మినిస్టర్ భైరవమూర్తి ఫోన్ కట్ చేయగానే కార్ లోపల భయానక నిశ్శబ్దం అలుముకుంది. రాఘవరావు ముఖం భయంతో తెల్లబడగా, కావ్య వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. తాను ఎంత పెద్ద సైకో వలయంలో చిక్కుకుందో ఆమెకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. సాహిత్య కళ్లలో మాత్రం భయం కంటే ఎక్కువగా తన స్నేహితురాలిని కాపాడుకోవాలనే కసి, కోపం స్పష్టంగా కనిపించాయి.
“బావా! ఆ మినిస్టర్ గాడు ఎంత ధైర్యంతో మన ఇంటికే మనుషులను పంపించాడు? నా ప్రాణ స్నేహితురాలికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను బావా. మనం ఇప్పుడే వాడి ఇంటికి వెళ్దాం” అంది సాహిత్య శివ పట్టుకు జరిగి.