నీ ప్రేమకై ❤️…… పరితపించే నేను – 2
అది వింటున్న మహికి కంపరంగా అనిపించింది… మరిగిన టీ గ్లాస్ లో పోసి చేతికి కూడా ఇవ్వకుండా పక్కనే సౌండ్ వచ్చేలా పెట్టీ బయటికి వెళ్లిపోయింది..
ఆమె ఫేస్ లో అతని మీద అసహ్యం అంతగా కనిపిస్తున్న అది రాజేష్ లెక్కచేయలేదు… టీ తాగుతూ పెరటి గుమ్మం దగ్గరకు వచ్చి ఆమెనే చూస్తూ ఉన్నాడు….
అబ్బా… ఇంత అందాన్ని ఇన్ని రోజుల నుంచి చూస్తూ కూడా అనుభవించలేకపోతున్నాను. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఛాన్స్ దొరకడం లేదు. కళ్ల ముందే పెట్టుకుని అందనంత దూరంలో ఉన్నట్టు తిరుగుతుంటే… నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టంగా ఉందో నాకు మాత్రమే తెలుసు అని మనసులో అనుకున్నాడు రాజేశ్.
అక్కడే నిలబడి కొంతసేపు మహేశ్వరినే చూస్తూ ఉన్నాడు. అతని చూపుల్లోని భావాలు మహేశ్వరికి స్పష్టంగా అర్థమవుతున్నా, ఆమె మాత్రం వాటిని పట్టించుకోకుండా మామూలుగానే అక్కడ కూర్చుంది. ఇలాంటి చూపులు ఆమెకు కొత్తేమీ కాదు.
రాజేశ్ లోపల నుంచి పిలవడంతో, మహేశ్వరి బావ అంటూ లేచి ఇంట్లోకి వెళ్లిపోయింది.
అదే సమయంలో బాల్కనీలో టీ తాగుతూ నిలబడి ఉన్న దేవాంశ్, మహేశ్వరి వాళ్ల ఇంటి వైపు చూశాడు. ఆమె అప్పటికే ఇంట్లోకి వెళ్లిపోతుండటాన్ని గమనించాడు.
ఆమె నడుస్తూ వెళ్తున్న తీరు, వెనక్కి వాలుతూ ఊగుతున్న పొడవాటి జుట్టు అతని దృష్టిని ఆకర్షించాయి.
ఓ గాడ్… ఈ రోజుల్లో కూడా ఇంత పొడవాటి జుట్టున్న అమ్మాయిలు ఉన్నారా అని అనుకుంటూ ఆమె వైపే కాసేపు చూస్తూ ఉండిపోయాడు.
మహేశ్వరి ఇంట్లోకి వెళ్లిపోయిన తర్వాత, దేవాంశ్ మళ్లీ తన కప్పులోని టీని సిప్ చేస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ నిలబడ్డాడు.
సిటీలో ఇన్నాళ్లు ఉండి బోర్ కొట్టేసిన అతనికి… ఇప్పుడు దొరికిన ఈ ఇల్లు, చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, పచ్చని పొలాలు అన్నీ ఎంతో నచ్చేశాయి.
వాళ్లు కొత్తగా కొనుకున్న ఇల్లు చిన్నదే అయినా చాలా అందంగా ఉంది.
కింద రెండు గదులు, ఒక పెద్ద హాల్, దానికి పక్కనే కిచెన్ ఉన్నాయి. రెండు బెడ్‌రూమ్‌లకూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇంటి లోపల నుంచే పైకి వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి.
పై అంతస్తులో దేవాంశ్‌కి ఒక పెద్ద బెడ్‌రూమ్ ఉంది. దానికి అటాచ్డ్ బాత్రూమ్‌తో పాటు వెనక వైపు కొంచెం విశాలమైన బాల్కనీ కూడా ఉంది.
ఇంటి ముందు పెద్దగా స్థలం లేకపోయినా, ఒక కారుకు సరిపడేంత స్థలంతో పాటు చిన్న షెడ్, కొన్ని పూల మొక్కలు ఉన్నాయి.
ఇక ఇంటి వెనక వైపు మాత్రం చాలా విశాలమైన ప్రదేశం ఉంది. అక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి. కొంచెం దూరం వెళ్తే వెనక వైపు ఉన్న గేట్ కనిపిస్తుంది. ఆ గుమ్మం దాటి బయటికి వెళ్తే ఒక మట్టి రోడ్డు ఉంటుంది.
ఆ రోడ్డు అవతల అంతా పచ్చని పంట పొలాలే.
సిటీలోని హడావుడికి దూరంగా, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం దేవాంశ్‌కి చాలా హాయిగా అనిపించింది.
అతని జీవితంలోకి ఈ ప్రశాంతత రావడానికి ముందు మాత్రం చాలా కథే ఉంది.
దేవాంశ్‌కి ఇరవైమూడు సంవత్సరాల వయసులోనే వాళ్ల అమ్మ రాజేశ్వరి బలవంతంగా చంద్రికను ఇచ్చి పెళ్లి చేసింది.
చంద్రిక, రాజేశ్వరి స్నేహితురాలి కూతురు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కావడంతో… ఎప్పుడో ఒకసారి తమ పిల్లలకు పెళ్లి చేయాలని ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు.
ఆ మాట కోసమే దేవాంశ్, చంద్రికలకు పెళ్లి జరిగింది.
కానీ చంద్రిక మాత్రం దేవాంశ్ కుటుంబంతో కలవలేకపోయింది.
ఆమెకు పార్టీలు, ఫ్రెండ్స్, బయట తిరగడం, లైఫ్‌ని తనకు నచ్చినట్లు ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. దేవాంశ్‌ని మాత్రం ఆమె పెద్దగా పట్టించుకునేది కాదు.
తిన్నావా అని అడగడం కూడా ఆమెకు అవసరం అనిపించేది కాదు.
పెళ్లి తన ఇష్టంతో జరగకపోవడంతో దేవాంశ్ కూడా ఆమెను తన జీవితంలోకి పూర్తిగా ఆహ్వానించలేక పోయాడు. భార్యాభర్తలుగా ఒకే రూమ్‌లో ఉన్నా… వాళ్ల మధ్య మాత్రం ఎలాంటి అనుబంధం ఏర్పడలేదు.
రోజులు గడిచే కొద్దీ చంద్రిక ప్రవర్తన రాజేశ్వరికి మరింత బాధ కలిగించింది.
నా కొడుక్కి ఇష్టం లేకపోయినా చంద్రికను ఇచ్చి పెళ్లి చేసి తప్పు చేశానేమో అని ఆమె తరచూ బాధపడేది.
కొడుకు జీవితంలో అయినా సంతోషం ఉండాలని కోరుకున్న రాజేశ్వరి, చంద్రికను పలుమార్లు నచ్చజెప్పింది.
దేవాంశ్‌ని అర్థం చేసుకో. అతనితో సంతోషంగా ఉండు. మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం బలంగా ఉండాలి అని ఎన్నోసార్లు చెప్పింది.
చంద్రిక కూడా సరేనని చెప్పేది. కానీ ఆ మాటలను ఆచరణలో పెట్టేది కాదు.
రాజేశ్వరి రెండు మూడు సార్లు గట్టిగా చెప్పిన తర్వాత… ఆమె ఒత్తిడి మీదే దేవాంశ్, చంద్రికలు భార్యాభర్తలుగా ఒక్కటయ్యారు.
కొన్ని రోజులకే చంద్రిక కన్సీవ్ అయింది.
అయితే ఆమెకు ప్రెగ్నెన్సీ మీద కానీ, పుట్టబోయే బిడ్డ మీద కానీ పెద్దగా ఆసక్తి లేదు.
పైగా తన ప్రెగ్నెన్సీ వల్ల పార్టీలు, ఫ్రెండ్స్‌తో బయట తిరగడం తగ్గిపోవడంతో… అది తనకు అడ్డుగా మారిందని భావించేది.
బేబీ పుట్టిన తర్వాత వాళ్లు బిడ్డతోనే బిజీగా ఉంటారు. అప్పుడు నా మీద ఎవరూ ఎక్కువగా దృష్టి పెట్టరు అని అనుకుంటూ… ఇష్టం లేకపోయినా కష్టంగా ప్రెగ్నెన్సీని మోసింది.
కానీ డెలివరీ సమయంలో అనుకోని కొన్ని సమస్యలు తలెత్తడంతో చంద్రిక ప్రాణాలు కోల్పోయింది.
చంద్రిక మీద దేవాంశ్‌కి పెద్దగా ప్రేమ లేకపోయినా… ఆమె కడుపులో పుట్టిన బిడ్డ తన రక్తం. అందుకే బిడ్డను చూసిన క్షణం నుంచే అతని మనసులో ఒక కొత్త అనుబంధం ఏర్పడింది.
ఆ బాబుకి దీపక్ అని పేరు పెట్టుకున్నాడు.
రాజేశ్వరి కూడా మనవడిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. కొడుకుకి ఇష్టం లేకుండా పెళ్లి చేశాను. వాడి జీవితంలో సంతోషం లేకుండా చేశాను. ఇప్పుడు ఈ బాధ్యత కూడా వాడిపైనే పడింది అని ప్రతిరోజూ తనలో తాను బాధపడేది.
అలా రోజులు గడిచేకొద్దీ దేవాంశ్‌కి సిటీ లైఫ్ మీదే విరక్తి కలిగింది.
హడావుడి లేని, ప్రశాంతమైన… ప్రకృతికి దగ్గరగా ఉండే ఏదైనా ప్రదేశానికి వెళ్లి తన పని తాను చేసుకుంటూ ప్రశాంతంగా జీవించాలని ఎప్పటినుంచో అనుకునేవాడు.
అతని జీవితంలో దీపక్ వచ్చిన తర్వాత మాత్రం అతను మరింతగా మారిపోయాడు. దీపక్ అతని జీవితంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అతని జీవితంలో సంతోషం మొదలైంది.
ఉదయం లేచి జాబ్‌కి వెళ్లడం.. వర్క్ ముగించుకుని ఇంటికి రావడం… రాగానే తన కొడుకు దీపక్‌తో కొంతసేపు ఆడుకోవడం… అతనికి అవసరమైనవి చూసుకోవడం… తర్వాత తిని పడుకోవడం…ఇదే దేవాంశ్‌కి రోజువారీ జీవితంగా మారిపోయింది.
అతని ప్రపంచం ఇప్పుడు చాలా చిన్నదైపోయింది.
ఆ ప్రపంచంలో అతనికి అత్యంత ముఖ్యమైన వ్యక్తి మాత్రం ఒక్కరే…
అతని కొడుకు దీపక్.
అయితే దేవాంశ్‌కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో విజయనగరంలోని ఒక చిన్న గ్రామానికి వచ్చాడు. అప్పటికే దీపక్‌కి పది నెలలు వచ్చాయి.
అక్కడికి వచ్చి రెండు రోజులు మాత్రమే అవుతోంది. ఆ రెండు రోజుల్లో తన ప్యాకింగ్ మొత్తం క్లియర్ చేసి, ఇల్లు అంతా నీట్‌గా సర్దుకోవడంలోనే దేవాంశ్ బిజీ అయిపోయాడు.
ఇక రాజేశ్వరి మాత్రం రోజూ ఒకటే మాట చెబుతూనే ఉంది. మళ్లీ పెళ్లి చేసుకోరా… ఇలానే ఒంటరిగా ఉండిపోకు. అసలు నువ్వు మొదటి పెళ్లి చేసుకుని ఏం సుఖంగా ఉన్నావు. ఇప్పుడు అయినా మళ్లీ పెళ్లి చేసుకో అని పదేపదే చెబుతూనే ఉంది.
ఆ మాట వినగానే దేవాంశ్ కోపంగా ఆమె వైపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు.
ఒకసారి తన జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చి, తన జీవితాన్నే గందరగోళంగా మార్చి వెళ్లిపోయింది.
చంద్రిక కనీసం తనతో మాట్లాడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించేది కాదు. తనతో ప్రేమగా ఉండాలని ప్రయత్నించినా, ఆమె ఎప్పుడూ ఫ్రెండ్స్, పార్టీలు అంటూ బయటకు వెళ్లిపోతుండేది.
కొన్ని రోజులకు ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన దేవాంశ్ కూడా ఆమెను పట్టించుకోవడం మానేశాడు.
కనీసం తాను ప్రేమగా ఆమె దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించినా, ఆమె ఎప్పుడూ తనపై ఆసక్తి చూపించేది కాదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆమెతో తన జీవితం ఎలా సాగుతుందో అనే ఆలోచనలతోనే దేవాంశ్ ఎన్నో రోజులు గడిపేశాడు.
కానీ అనుకోకుండా చంద్రిక చనిపోయింది.
ఆమెతో కలిసి జీవితాన్ని కొనసాగించాలనే కోరిక కూడా అతనిలో లేకపోయినా, ఆమె చనిపోయిన తర్వాత మాత్రం ఆ అధ్యాయం పూర్తిగా ముగిసి పోయింది.
ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన దేవాంశ్‌కి అసలు లేదు.
బాబు నిద్రపోవడంతో రాజేశ్వరి ఏదో పనిలో ఉండిపోయింది. దేవాంశ్ మాత్రం తాగిన కాఫీ కప్పును పక్కన పెట్టి బాల్కనీలో నిలబడి ఎదురుగా కనిపిస్తున్న పచ్చని పంట పొలాలను చూస్తూ ఉన్నాడు.
అదే సమయంలో…
పిన్ని, ఈ సమ్ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయవా అని విశ్వంత్ అడిగాడు.
సరే, ఇటు ఇవ్వు అని చెప్పి మహేశ్వరి అతని పుస్తకం తీసుకుని, అతనికి అర్థమయ్యేలా వివరించింది.
మళ్లీ తన పుస్తకం తీసుకుని చదువుకోవడంలో మునిగిపోయింది.
విశ్వంత్ , శ్రయ ఇద్దరూ హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత, వాళ్లిద్దరికీ నీళ్లు తోడిపెట్టింది. ఇద్దరూ స్నానం చేసి లోపలికి వెళ్లిపోయారు.
అప్పటికే సరిత ఇంటికి వచ్చేసింది.
ఏంటి, మీ బావ ఇంకా ఇంటికి రాలేదా అని బ్యాగ్ పక్కన పెట్టుకుంటూ అడిగింది సరిత.
వచ్చాడు అక్కా. టీ అడిగితే పెట్టించాను. తాగేసి వెళ్లిపోయాడు అని మహేశ్వరి చెప్పింది.
మళ్లీ ఏమైనా తిక్కగా బిహేవ్ చేశాడా అని సరిత అడిగింది.
అదంతా ఎప్పుడూ ఉండే గోలే అక్కా. నువ్వు వెళ్లి ఫ్రెష్ అవ్వు అని చెప్పి సరితను లోపలికి పంపించింది మహేశ్వరి.
ఆ తర్వాత వచ్చి టీవీ దగ్గర కూర్చుంది మహేశ్వరి.
మహేశ్వరి మెలోడీ సాంగ్స్ వింటూ హామ్ చేస్తూ టీవీ ముందు కూర్చుంది.
కొంతసేపటి తర్వాత సరిత కిచెన్‌లోకి వెళ్తూ, నువ్వు కూడా త్వరగా స్నానం చేసిరా. త్వరగా తినేద్దాం అని చెప్పింది.
సరే అని రిమోట్ పక్కన పెట్టిన మహేశ్వరి తన రూమ్‌లోకి వెళ్లి బట్టలు తీసుకుని పెరట్లో ఉన్న బాత్రూమ్‌లోకి వెళ్లింది.
స్నానం చేసి బయటకు వస్తుండగా పక్కింటి వైపు నుంచి ఒక ఆడగొంతు వినిపించింది.
అమ్మా… నీ పేరేంటి తల్లి అని రాజేశ్వరి అడిగింది.
చీకట్లో సరిగ్గా కనిపించక మహేశ్వరి అటూ ఇటూ చూసింది.
ఇటేప్పమ్మా అని రాజేశ్వరి అనడంతో ఆవిడ వైపు చూసింది మహేశ్వరి.
మేము ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చాం తల్లి. నా పేరు రాజేశ్వరి. నీ పేరు ఏంటి అని ఆవిడ అడిగింది.
నా పేరు మహేశ్వరి ఆంటీ అని బదులిచ్చింది మహి.
ఓ అవునా… చక్కగా ఉంది పేరు. ఇంతకుముందు ఈ ఇంట్లో వేరే అమ్మాయిని చూసాను అని రాజేశ్వరి అంది.
తను మా అక్క ఆంటీ అని మహేశ్వరి చెప్పింది.
ఓ అవునా… అప్పుడప్పుడు పిలుస్తూ మాట్లాడుతుంటాను అని రాజేశ్వరి అనడంతో, సరే ఆంటీ, అందులో ఏం ఇబ్బంది లేదులేండి అని మహేశ్వరి అంది.
మీ ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని విన్నాను. నీకు ఏం ఇబ్బంది లేకపోతే అప్పుడప్పుడు మా ఇంటికి పంపిస్తావా తల్లి? మా ఇంట్లో మా మనవడు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటాడు. వాడికి ఆడుకోవడానికి ఎవరూ లేరు అని రాజేశ్వరి అడిగింది.
అయ్యో ఆంటీ… వాళ్లు ఎక్కువగా బయటికి వెళ్లి ఆడుకోరు. అలవాటు లేదు అని మహేశ్వరి చెప్పింది.
పరవాలేదమ్మా. మా బాబు కూడా చిన్నోడే కదా. బయట తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చుని ఆడుకుంటారు అని రాజేశ్వరి నవ్వుతూ చెప్పింది.
కథ కొనసాగుతోంది….
Swipe left/right or tap the sides to turn pages