New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నువ్వే కావాలి ❤️ – 1

నువ్వే కావాలి ❤️ – 1

“చూడు!!! ఇప్పుడు మీ నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు… పైగా కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వస్తారని ఎంత బాగా చెప్తున్నావ్… నేను అసలు నువ్వు ట్రిప్ కి వెళ్లడానికి ఒప్పుకోను” అని ఖరాఖండీగా చెప్పింది తల్లి సుమతి…
“అబ్బా!!! ఎప్పుడు ఇంతే!!! నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వవు” అని రాజి అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే “నువ్వు ఎంత ఓవరాక్షన్ చేసినా నిన్ను మాత్రం టూర్ కి పంపించే ప్రసక్తి లేదు” అని ఆవిడ మరో మాటకి అవకాశం ఇవ్వకపోవడంతో చికాకుగా వచ్చి మెట్ల మీద కూర్చుంది రాజి.. 
ఇంతలోనే సుధాకర్ గేటు తీసుకొని లోపలికి వచ్చి అలిగి కూర్చున్న కూతురిని చూసి “ఏంటమ్మా? ఎండ మండిపోతుంటే మెట్ల మీద కూర్చున్నావు” అని అడిగాడు…
“మా క్లాస్ వాళ్ళందరూ టూర్ కి వెళ్తున్నారు డాడీ… ఇదే కదా లాస్ట్ సెమిస్టర్… కాస్త మెమోరీస్ వెనకేసుకుందామని…. టూర్ కి వెళ్తాను అంటే అస్సలు అమ్మ ఊరుకోడం లేదు” అంది….
“మీ అమ్మ సంగతి మనకి తెలిసిందే కదా…. ఇంతకీ ఎంత కావాలి?” అని సుధాకర్ అడగడంతో “అది 10000” అని ఇబ్బందిగా చెప్పడంతో “పదివేలు అడుగుతున్నారా?” అని ఆయన జేబులు తడుముకుంటూ “5000 ఉంటే రెండు వేల తో మీ నాన్నమ్మకి మందులు తెచ్చి మిగిలిన వాటితో ఇంట్లో సరుకులు తెచ్చానమ్మా…. ఈసారి పండుగకి బట్టలు కొనేపరిస్థితి కూడా లేదు… ఏదో 100 500 1000 రూపాయలు అయితే నా స్నేహితులని అడిగి తీసుకువద్దాం అనుకున్నాను గాని 10000 హా” అన్నాడు…
“అసలు ఛాన్స్ లేదా డాడీ!” అని రాజీ బాధగా అడగడంతో ఆయన కూడా బాధగా చూసేసరికి వెంటనే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మార్చేసి “ఇట్స్ ఓకే… ఆ అడవుల్లో చెట్లల్లో పుట్లల్లోనే కదా మేము ఫొటోస్ దిగుదామని అనుకుంది… కావాలంటే మా ఫ్రెండ్స్ వచ్చాక ఫొటోస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను… కావాలంటే తమ్ముడు ఎండాకాలం సెలవుల్లో వచ్చినప్పుడు అందరం కలిసి తిరుపతి వెళ్దాం…” అని చెప్పింది….
“నీకు బాధగా లేదా?” అని సుధాకర్ బాధగా అడగడంతో “ఉంది కానీ ఆ టూర్ కి పోకపోతే నాకేమైనా ప్రాణం పోతుందా? ఇంక చాలా జీవితం ఉంది” అని ఆమె నవ్వుతూ తండ్రి మూడ్ లైట్ చేయడానికి ట్రై చేసింది…
“నేను వద్దని చెబితే నన్ను విలన్ చేసి మీ నాన్నగారు డబ్బులు లేవు అనగానే ఎంత తియ్యగా మాట్లాడుతున్నావే” అని సుమతి కోపంగా భర్త చేతిలో ఉన్న కవర్లు లాక్కుని లోపలికి వెళ్లిపోయింది….
రాజీ మూతి తిప్పుకుంటూ ఉంటే సుధాకర్ నవ్వుతూ ఇంట్లోకి వెళ్లిపోవడంతో గట్టిగా ఏదో నిర్ణయించుకున్నట్టుగా స్థిరంగా ఫోన్ బయటికి తీసింది…
రాజి వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం… తండ్రి ఏదో ప్రైవేట్ ఆఫీసులో పాతికేళ్ల నుంచి గుమస్తాగా పనిచేస్తూనే ఈ కుటుంబాన్ని లాగుతున్నాడు…. పైగా అదృష్టమో దురదృష్టమో గాని తాత ఒక రెండు రూముల ఇల్లు కట్టించి చనిపోవడంతో అద్దే బాధ నిలువ నీడ లేదు అనే బాధ లేకుండా సొంతిల్లు మాత్రం ఉంది కానీ తండ్రి జీతంతో తన ఫీజు తమ్ముడు ఫీజు నాన్నమ్మ మందులు ఇంట్లో అవసరాలు తీరడమే కష్టంగా ఉంది….
అప్పటికి ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేసినా ఒక 500 అయినా నెల చివరిలో అప్పు చేయాల్సి వస్తుంది…. దాంతో తన స్నేహితురాలికి ఫోన్ చేసింది….
ఆ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేసి “ఏంటే?” అంది…
“లాస్ట్ టైం మీ అక్క ఎదో కంపెనీలో జాయిన్ అయిందని… అక్కడ వేకెన్సీలు ఉన్నాయి ట్రై చేయండి…క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీద నమ్మకం పెట్టుకుంటే ఎటు కాకుండా పోతారని చెప్పింది కదా… ఇంకా ఆ వేకెన్సీస్ ఉన్నాయేమో అడుగుతావా… నాకు జాబ్ కావాలి” అంది రాజి….
“ఇప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావు అని టెన్షన్ పడి జాబ్ లో జాయిన్ అయితే లాస్ట్ సెమిస్టర్ గోవిందా అవుతుందని తర్వాత చూద్దామని అన్నావు కదా… ఇప్పటికి ఇప్పుడు జాబ్ ఏంటి పైగా ఎలాగైనా టూర్ కి పంపించడానికి ఒప్పిస్తానని చెప్పి ఇప్పుడు ఏంటి సంబంధం లేని టాపిక్ మాట్లాడుతున్నావ్ ఫోన్ చేసి?” అంది ఆమె….
“టూర్ లేదు ఏమీ లేదు… ఏ పని పాట లేదనుకున్నారా… అయినా అడవుల్లో చెట్లు చేమలు చూడడానికి నాకేమీ అంత ఇంట్రెస్ట్ లేదు గాని నోరు మూసుకొని ఒకసారి అక్కని కనుక్కో” అని చెప్పి ఫోన్ కట్ చేసింది రాజి….
ఆరోజు సాయంత్రానికి రాజీ స్నేహితురాలు అక్క ఫోన్ చేసి “ప్రస్తుతానికి వేకెన్సీస్ ఏమీ లేవు… బట్ మూడు రోజుల క్రితం అకౌంటెంట్ రిటైర్ అవ్వడంతో ఆయన పోస్ట్ ఖాళీగా ఉందని మాత్రం తెలుసు…. ట్రై చేస్తానంటే నీకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను” అనగానే “పర్వాలేదు అక్క… ఏ పోస్ట్ అయినా నేను ట్రై చేసి రాకపోతే నేర్చుకుంటాను” అంది….
ఆ మాటకి అవుతల ఆ అమ్మాయి మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ చెప్పి “ఇంటర్వ్యూ డేట్ వచ్చాక చెప్పు…. ఇక్కడ హెచ్ ఆర్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన ఒక సీనియర్ అన్నయ్య ఉన్నాడు… ఆ అన్నయ్యకి చెప్పి నీకు హెల్ప్ చేయమని అడుగుతాను… అతను ఒప్పుకున్నాడు అంటే నువ్వు చాలా లక్కీ” అంది…
కంటిన్యూస్!!!!!