New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పులి పంజా 🐯 – 1

పులి పంజా 🐯 – 1

అది ఒక దట్టమైన అడవి ప్రాంతం…

మెత్తటి ఎర్ర మట్టి నేల…
ముందు గానే మెత్తగా ఉండే ఆ ఎర్ర మట్టి పై రెండు రోజుల నుంచి తెరపీయకుండా కురుస్తున్న వాన వల్ల ఎర్ర మట్టి కాస్త జిగురుని పుట్టించే బురద అయిపోయింది. 
చిక్కటి చీకటి, మబ్బుల్లో ఇరుక్కు పోయిన జాబిలమ్మ వెలుగు నేల పై కనిపించి కనిపించకుండా జాలు వారుతున్న వేళ…
నల్లటి చీకటిలో ఏది ఏ మూలన ఉందో కూడా కనిపించక చిరు జల్లులు మీద పడుతున్న పచ్చటి ఆకుల చిట పటల శబ్దాలు తప్పితే ఏ ఒక్క చిన్న ప్రాణి కీచు శబ్దం కూడా ఆ ప్రాంతంలో ప్రస్తుతం మోగటం లేదు. 
చిన్న రాయి వేస్తేనే సగానికి సగం నేల లోకి కూరుకుపోయే ఆ మట్టి నేల పై కొన్ని అడుగుల లోతుకి దిగబడిన పెద్ద పెద్ద పెద్ద పులి పాదాల అడుగులని అనుసరిస్తూ వెళుతున్నాయి 8 మనిషి పాదాలు. 
అంత చల్లటి రాత్రి వేళ ఒంటి పై చల్ల దనాన్ని మించిన భయం వల్ల వచ్చే బెదురుతో ఒళ్లంతా చెమటలతో నిండిపోయిన ఆ మనుషులు లైట్ గా వణుకుతున్న చేతులతో గట్టిగా బిగించి పట్టుకున్న తుపాకులతో ఆ పెద్ద పులి పాదాల అడుగులని ఒక్కొక్కటిగా అనుసరిస్తూ ముందుకు నడుస్తున్న వేళ…
అప్పటి వరకు చిన్న కీచు శబ్దం కూడా లేని ఆ ప్రాంతంలో ఒక్క సారిగా ఉన్నట్టుండి దబ్బున వినిపించిన ఒక శబ్దానికి, 
వణుకుతున్న శరీరాలతో పులి అడుగుల జాడ వైపే వెళ్తున్న ఆ మనుషులంతా ఒక్క సారిగా ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసిన వాళ్ళ కంటికి, 
ఎక్కువ వర్షం దాటికి కుళ్ళి పోయిన ఒక చెట్టు కొమ్మ గాలమ్మ దాటికి నిలబడలేక ఫటక్కుమని విరిగి పడిపోయిన ఆ కొమ్మని చూసి, 
ఉలికి పాటు వల్ల వచ్చిన గుండె బెదురుని నెమ్మదిగా శాంత పరచుకుంటూ మళ్లీ అటు వైపుగా తిరిగే లోపు మనుషుల అలికిడి విన్న మృగం చడి చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వీళ్ళ వైపు గానే వస్తున్న ఒక పెద్ద పులి వాళ్లు ఇటు వైపుగా తిరగటం ఆలస్యం అమాంతం మీదకి దూకి మరి దాడి చేసేసింది.
దాని ప్రక్రియను ఊహించని ఆ నలుగురు గట్టిగా అరుస్తూ పక్కకు తప్పుకునే లోపు ముందుగా ఉండే ఒక అతని పై ఆ పులి పంజా గట్టిగా పడిపోవటంతో అతను ఎటు కదల లేకపోయాడు. 
ఆ దృశ్యాన్ని చూస్తున్న ముగ్గురికి గుండెలో దడ పుట్టటం ఆలస్యం గట్టిగా అరుస్తూ చేతిలోని తుపాకులని కింద పారేసి మరి ఒక్కొక్కరు ఒక్కో దారి గుండా పరుగు అందుకున్నారు. 
చిక్కిన ఒక మానవుని శరీరం దానికి చాలదు అన్నట్టు పరిగెత్తుతున్న ముగ్గురి వైపుకి చూపులని తిప్పుతూనే మధ్య దారి గుండా పరిగెత్తిన అతనిని వెంబడించింది. 
అది అటు పోగానే పులి పంజా దాటికి గుండె దగ్గర రక్తం చిట్లుతూ కొస ఊపిరితో తన ప్రాణాన్ని అర చేతుల్లో పెట్టుకొని ఆ బురద మట్టి లోనే పాక్కుంటూ పాక్కుంటూ వెళ్లి ఒక చిన్న మట్టి గుహలో తల దాచుకున్నాడు వీరయ్య. 
వీరయ్య ని వదిలి తనని వెంబడిస్తుంది అని తెలుసుకున్న సోమయ్య, “చచ్చాను రా దేవుడో భయం తో తుపాకిని కూడా నేల పాలు చేశాను కనీసం అది ఉన్నా దీని అంతు తేల్చేవాడిని.”
తనలో తానే అరుస్తూ మొత్తుకుంటూనే ముందుకు పరిగెడుతున్న సోమయ్య కాలు బురద మట్టిలో కూరుకుపోయి ఎలా వెళ్తున్నాడో అలానే బొక్క బోర్లా పడిపోయాడు. 
పడుతూ పడుతూనే, “అమ్మ….” అంటూ అరుస్తూ వెనుకగా చూసిన తన కంటికి అతను పడినది చూసిన ఆ పులి కోపంగా అతని వైపే చూస్తూ మెల్లిగా అతని దగ్గరికి అడుగులేస్తుంది. 
ఆ పులి కళ్ళలోని క్రోధం నేరుగా అతని గుండెను తాకి అప్పటి వరకు ఒంటిలో పెరిగిన బెదురు, వణుకు వెన్ను లోకి పాకి, కూరుకు పోయిన అతని పాదాన్ని వెనక్కి లాగలేక ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ బురదలో ఇరుక్కున్న పాదాన్ని గట్టిగా పక్కనే ఉన్న కొమ్మతో బురదని తొలగించి, 
ఆ వెనుకగా ఉన్న ఒక చిన్న లోయలోకి దూకేశాడు సోమయ్య. 
అతను దూకటం చూసి అతని వెను వెంటనే మీదకి దూకేసింది పులి. 
గాలిలో కింద సోమయ్య అయితే అతని పైనే పులి తన పంజాలని తన వైపే చూపిస్తూ రౌద్రంగా గర్జిస్తూ మీదకి వచ్చేస్తుంది. 
ఆ పులి గర్జనకి దాని రౌద్రపు రూపానికే వెన్ను వరకు పాకిన ఆ వణుకు వీక్ గా ఉన్న అతని గుండెకి తగిన బలాన్ని చేకూర్చలేక గాలిలో ఉండగానే అతని గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. 
దానితో పాటే అతని ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. 
ప్రాణం పైకి లేచిన మరు క్షణం లోయ లోకి దూకిన అతని శరీరం దబ్బున కింద పడిపోతే, 
దాని వెనకే దూకిన పులి అమాంతం అతని శరీరం పై దాడి చేసి తనకి ఉన్న ఆకలినంత అతని పై తీర్చేసుకుంది.
మరో రెండు దిక్కుల వైపుగా పారిపోయిన సుబ్బడు, రంగయ్య వారి వెనుక ఎటు వంటి పులి రాక కనిపించక ఎవరికి కానరానంత దూరానికి పరిగెత్తుతూనే బెదురు నిండిన గుండెల నిండా ఊపిరి పీల్చేసుకున్నారు. 
గుహలో దాగున్న వీరయ్య, సేఫ్టీ గా అతని వెంట తెచ్చుకున్న ఒక చిన్న మొబైల్ అల్లారంతో భారమవుతున్న ఊపిరితోనే అతి కష్టం మీద సిగ్నల్ పంపించేశాడు ఎవరికో. 
ఆ సిగ్నల్ అందిన సుబ్బడు, రంగయ్య అది ఎవరు పంపించారో తెలుసుకొని తిరిగి వీరయ్య దగ్గరికి వెంటనే వెళ్లాలని ఉన్నా, అక్కడ పులి ఉంటదేమో అన్న భయంతో తిరిగి వెళ్లలేక పోయారు. 
కానీ ఈ దట్టమైన అడవిలో మోగించిన వీరయ్య అల్లారం నేరుగా వాళ్ళ ప్రాంతం వాళ్లకి చేరుకొని ప్రశాంతంగా బజ్జొని ఉన్న ఆ ఊరి జనాన్ని అంతటినీ నిద్ర లేపేసింది. 
మనసిచ్చిన ప్రియురాలిని కనులారా చూసుకుంటూనే నిద్రలోకి జారుకున్న రాము ఉలిక్కి పడి లేచాడు తండ్రి పిలుపుకి… 
ఇంకా ఉంది…
నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేయరా.
ఇట్లు
మీ కీర్తి💕