New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ 2

మిస్టర్ మాన్స్టర్ 2

ప్రదేశం:: వైజాగ్

సమయం ఉదయం 6:30. 

 

సూర్య కిరణాలు కిటికీలోంచి గదిలో మంచం మీద పడుకున్నా ఒక అమ్మాయి ముఖం మీద పడుతున్నాయి. 

 

ఆ గదిలో ఉన్న గోడల మీద తను ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫోటోలు, ఎంబీఏ సబ్జెక్టుల నోట్స్ పేపర్లు అంటించి ఉన్నాయి. 

 

ఆ అమ్మాయి  గాఢ నిద్రలో ఉంది. అప్పుడే ఆమె తల్లి పద్మ వంటగదిలో గిన్నెలతో చేసే శబ్దం, దేవుడి గదిలో నాన్న రామకృష్ణ చదివే శ్లోకాలు ఆ ఇంటికి ఒక జీవం పోస్తున్నాయి.

 

మైరా లేవమ్మా ఇక నీ నిద్ర చాలు. ఆదిత్య అప్పుడే రెడీ అయిపోయాడు. నువ్వు ఇలాగే ఉంటే ఇక నిన్ను చదువు మాన్పించేయమని మీ నాన్నకు చెపుతాను అని పద్మ కేక వేసింది.

 

మైరా కళ్లు నలుపుకుంటూ లేచింది. పక్కనే తన తమ్ముడు ఆదిత్య తన కాలేజీ బ్యాగ్ సర్దుకుంటూ, అక్కను చూసి ఒక వెటకారపు నవ్వు నవ్వాడు.

 

అక్కా నువ్వు ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అవుతావో లేదో తెలీదు కానీ, కుంభకర్ణ అవార్డు మాత్రం నీకే వస్తుంది అన్నాడు ఆదిత్య.

 

మైరా తలగడ తీసి వాడి మీదకు విసిరింది. ఒరేయ్ చిన్నోడా నీ పనులు నువ్వు చూసుకో. ఈరోజు మా గ్యాంగ్ కి చాలా ఇంపార్టెంట్ డే.. 

 

ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది అంటూ బెడ్ మీద నుంచి ఒక్క ఉదుటున మంచం మించి దూకింది.అరగంటలో రెడీ అయిపోయి మైరా హాల్‌లోకి వచ్చింది. 

 

ఆమె తండ్రి రామకృష్ణ వార్తాపత్రిక చదువుతున్నారు. మైరా వెళ్లి ఆయన పక్కనే కూర్చుని, ఆయన చేతిలో ఉన్న టీ కప్పుని లాక్కుని ఒక సిప్ వేసింది.

 

ఏమ్మా నీకంటూ విడిగా టీ కావాలా అని రామకృష్ణ ప్రేమగా అడిగారు.నాన్న టీ లో ఉండే ఆ కిక్కే వేరు నాన్న అని నవ్వింది మైరా.

 

నాన్న ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ కోసం మేము సిటీకి వెళ్లాలి. కొంచెం ఎక్స్‌ట్రా పాకెట్ మనీ ఇస్తారా అని అడిగింది.

రామకృష్ణ తన పాత పర్స్ తీసి, అందులో ఉన్న వంద రూపాయల నోట్లను లెక్కపెట్టి ఆమెకు ఇచ్చారు.

 

జాగ్రత్తమ్మా.. సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అల్లరి గురించి నాకు తెలిసిందే, రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఫోన్లు చూడకండి అని హెచ్చరించారు.

 

ఆ వంద రూపాయల వెనుక తండ్రి పడే కష్టం, కూతురు మీద ఉన్న నమ్మకం రెండూ మైరాకి తెలుసు. అందుకే ఆమె ఆ డబ్బుని చాలా భద్రంగా తన బ్యాగులో పెట్టుకుంది.

 

స్కూటీ బయటకి తీయగానే, ఇంటి ముందు హారన్ల గోల మొదలైంది. కీర్తి, స్నేహ, శ్రీధర్, వంశీ.. ఈ నలుగురూ మైరా ప్రాణ స్నేహితులు. 

 

వీరంతా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఒకరి కష్టసుఖాలు ఒకరికి తెలుసు.ఏంటే లేట్ అని కీర్తి అడిగింది.

 

మా తమ్ముడితో యుద్ధం చేసి వచ్చేసరికి లేట్ అయిందిరా అని మైరా తన స్కూటీ ఎక్కింది.అందరూ కలిసి కాలేజీకి బయలుదేరారు.

 

దారిలో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న హోటల్ దగ్గర ఆగారు. అది వాళ్ళ రెగ్యులర్ అడ్డా. అక్కడ వేడి వేడి ఇడ్లీలు, చట్నీ తింటూ ముచ్చట్లు మొదలుపెట్టారు.

 

అరేయ్.. ఈరోజు మన ప్రాజెక్ట్ ఓకే అయితే, నెక్స్ట్ మంత్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి. మీ ప్లాన్స్ ఏంటి అని వంశీ అడిగాడు.

 

శ్రీధర్ గంభీరంగా అన్నాడు.నేను ఏదైనా పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాలేదు.

 

మైరా కళ్ళలో ఒక మెరుపు మెరిసింది. నేను మాత్రం ఏదైనా పెద్ద సామ్రాజ్యాన్ని ఏలాలి రా. అంటే ఒక కంపెనీకి సీఈఓ అవ్వాలి.

 

ఎవరి కిందో పనిచేయడం నాకు నచ్చదు. ముఖ్యంగా గర్వంగా ఉండే మగవాళ్ళ కింద అస్సలు చేయను అని తన అభిప్రాయాన్ని చెప్పింది.

 

ఆమెకి తెలీదు, తన జీవితం త్వరలోనే ఒక మహా సామ్రాజ్యానికి అధిపతి అయిన, అత్యంత గర్విష్టి కోపిష్టి అయినా ఇశాంత్ తో తన జీవితం ముడిపడబోతోందని.

 

కాలేజీకి చేరుకున్నాక ఆ ఐదుగురి అల్లరి మామూలుగా లేదు. లైబ్రరీలో సైలెంట్‌గా ఉండాల్సిన చోట కూడా జోకులు వేసుకుంటూ అందరినీ నవ్విస్తుంటారు. 

 

మైరా చదువులో టాప్, కానీ అల్లరిలో కూడా టాప్.

మైరా.. నీకు భయం అంటే తెలీదా.అని ఒకసారి స్నేహ అడిగింది.

 

భయం ఎందుకు స్నేహ,తప్పు చేస్తే భయపడాలి. మనం ఎవరినీ ఏమీ అనడం లేదు కదా. ఒకవేళ ఎవరైనా మనల్ని అంటే.. వాళ్లకి తిరిగి ఇచ్చేయడమే నా పద్ధతి అని మైరా ధైర్యంగా చెప్పింది.

 

కాలేజీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేశాక, మైరా గ్యాంగ్ అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక చాలు రా బాబు. ఈ బుక్స్, ఈ అసైన్‌మెంట్స్ పదండి మాల్‌కి వెళ్దాం అని వంశీ కేక వేశాడు. 

 

అందరూ కలిసి సిటీలో ఉన్న ఒక పెద్ద షాపింగ్ మాల్‌కి చేరుకున్నారు.మాల్ లోపల అడుగుపెట్టగానే కీర్తి, స్నేహ డ్రెస్సుల సెక్షన్ వైపు పరుగెత్తారు. మైరా మాత్రం వాళ్ళని ఆపుతూ ముందు విండో షాపింగ్ చేద్దాం రండి అని వేరే వైపు తీసుకు వెళ్తుంది. 

 

                     కొనసాగుతుంది…….

 

ఇదండీ మన హీరోయిన్ ఇంట్రడక్షన్. మన హీరోయిన్ స్కూల్ నుండి చదువులో టాపర్ అండ్ చలాకీ అమ్మాయి మరి ఈ అమ్మాయికి మన హీరో  ఎదురైతే పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం……