New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రహస్య గది – 2

రహస్య గది – 2

అనూహ్య భయం భయంగా చుట్టూ చూసింది. ఏదీ మారిపోయినట్లు లేదు. ‘ఇదంతా ఒక కలా?!’ అనుకుంది.

 

కానీ, టేబుల్ మీద ఉన్న ఆ పాత నోట్ బుక్, దానిపై రాసి ఉన్న వాక్యం మాత్రం నిజమే..

 

“నువ్వు మళ్ళీ వచ్చావు. ఈసారి తప్పు చెయ్యద్దు!” అని ఉన్న ఆ మాట అర్థం చేసుకునేలోపే, హాల్లోని పెద్ద అద్దంలో ఆమె ప్రతిబింబం మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది!

 

అనూహ్య శరీరం చెమటతో తడిసిపోయింది. ఆమె ఒక్క నిమిషం కూడా ఆ అపార్ట్మెంట్‌లో ఉండాలనుకోలేదు. వెంటనే తన ఫోన్ తీసుకుని ఫ్రెండ్ నీహాకు కాల్ చేసి,

 

“నీహా! నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఏదో చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఏదో జరుగుతోంది!” అని చెప్పింది.

 

వెంటనే నీహా, “అనూ, ఇప్పుడే అక్కడ్నుంచి బయటకి రా! కానీ… ఒక్కటి!…” అని ఏదో చెపుతూ ఆగిపోయింది.

 

“ఏమిటది?” అని అనూహ్య అడిగే లోపే కాల్ కట్ అయిపోయింది.

 

అయితే కాల్ కట్ అయింది కానీ, నీహా చివరి మాట అనూహ్య ఫోన్‌లో రికార్డు అయింది. అందులో స్పష్టంగా వినిపించింది. అది ఏమిటంటే,

“ఆ అద్దంలోకి చూడొద్దు!” అని.

 

ఈ మాట విన్న వెంటనే అనూహ్య వెనక్కి తిరిగింది. హాల్లో ఉన్న పెద్ద అద్దంలో తన ప్రతిబింబం ఇంకా నవ్వుతూనే ఉంది కానీ, ఇప్పుడు అది కదులుతోంది!

 

అనూహ్య మాత్రం కదలకుండా నిలుచుంది. ప్రతిబింబం ముందుకు వచ్చి ఆమె వైపు చూస్తూ నెమ్మదిగా తన చేతిని అద్దంపై ఉంచగానే, అనూహ్య కూడా అలానే చేసింది.

 

అప్పుడే…

 

ఒక్కసారిగా ఆమెను లోపలికి లాగేసింది!

ఆమె ఇప్పుడు అద్దం లోపల బంధించి ఉంది. బయట ఉన్న ఆమె రూపం నెమ్మదిగా ఫ్లాట్ నుంచి బయటకు వెళ్ళిపోయింది.

 

“నో! ఇది నిజం కాకూడదు!” అని అనూహ్య అరుస్తూ అద్దం తట్టింది కానీ, ఏ శబ్దం బయటకు వెళ్ళలేదు. అద్దం అర్థంకాకుండా పొడవుగా మారిపోయింది.

 

మరోవైపు, అద్దం వెలుపల ఉన్న ఆమె రూపం అనూహ్య మిత్రురాలు నీహా ఇంటికి వెళ్ళి, తలుపు తట్టింది.

 

నీహా తలుపు తీయగానే, ఎదుట కనిపించిన అనూహ్యను చూసి ఒక్కసారిగా కంగారు పడి,

 

“నువ్వు… నువ్వు… కాస్త వెనక్కి వెళ్ళు!” అని నీహా చెప్పేలోపే, ఆ రూపం భయంకరంగా నవ్వుతూ,

 

“నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు నీహా. ఇప్పుడు నువ్వు నా వలలో పడాల్సిందే” అంటూ ఒక్కసారిగా అద్దం అనూహ్య చేతులు నీహాను తాకాయి. ఆమె కళ్ళు వెడల్పయ్యాయి… నెమ్మదిగా… నీహా రూపం కూడా మారిపోసాగింది.

 

అంతలోపల…

 

అద్దం లోపల ఉన్న అసలైన అనూహ్య గట్టిగా అరుస్తూ తన చేతులను గోడకు తట్టి, “నేను ఇక్కడ నుండి బయటకి రావాలి!” అని అంది.

 

ఆమె వెనక్కి తిరిగి ఇక్కడి నుంచి ఎలా అయినా బయట పడాలి అని గదిని మొత్తం గమనించింది. అనుకోకుండా హాల్లో ఉండవలసిన ఆ పాత నోట్ బుక్ ఇప్పుడు ఆమె చేతుల్లో ఉంది.

 

దానిని ఓపెన్ చేయగానే కొత్త వాక్యం కనిపించింది—

 

“నువ్వు ఒంటరి కాదు, ఇదే మొదలు. తప్పించుకోవాలంటే… నీ గతాన్ని గుర్తించు!” అని అక్షరాలు ఉన్న పేపర్ తెరుచుకుని ఉంది.

 

అనూహ్య నోరు తెరిచి “నా గతమా!? ఇక్కడికి వచ్చేముందు… నేను ఏం మర్చిపోయాను?” అంటూ ఆ నోట్ బుక్ లోని వాక్యాన్ని చూస్తూ, “నా గతం గుర్తించు? అంటే ఏంటి?” అని జుట్టు పీక్కుంటూ మళ్ళీ గదిలోని గోడల్ని చూసింది. ఒక్కసారిగా గోడలపై పాత ఫొటోలు కనిపించాయి. ఆ ఫొటోలలో చిన్న పిల్లలు, ఒక ముసలావిడ, ఒక యువతి ఉన్నారు. ఆ యువతి అనూహ్యనే!

 

“ఇది ఎలా సాధ్యం? ఈ ఫొటోలు ఇక్కడికి ఎలా వచ్చాయి?” అంటూ ఆమె ఒక్కొక్కటి పరిశీలించసాగింది. ఒక ఫోటోలో చిన్న పిల్లలు నవ్వుతూ ఉన్నారు. వారి వెనుక ఒక పెద్ద చెట్టు ఉంది. కానీ, మరొక ఫోటోలో… అదే పిల్లలు కనిపిస్తున్నారు కానీ, వారి ముఖాలు చెరిపేసిఉన్నాయి.

 

ఆమె గుండె వేగం పెరిగింది. సరిగ్గా అప్పుడే గదిలో గట్టిగా ఓ అరుపు వినిపించింది!

 

“నీ వల్లే ఇది జరిగింది!” అంటూ.

 

వెంటనే అనూహ్య వెనక్కి తిరిగి చూసేసరికి, అక్కడ ఒక భయంకరమైన వృద్ధురాలు నిల్చుంది. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి.

 

“నీ వల్లే… నువ్వు మర్చిపోయావు కానీ, నేను మర్చిపోలేను!” అని అంది ఆమె.

 

అనూహ్య భయంతో, “నువ్వెవరు?” అని అడిగింది.

 

వృద్ధురాలు చిరునవ్వుతో ముందుకు వచ్చి, “నీ మిత్రురాలు నీహా నిన్ను ఎందుకు చూడగానే భయపడిందో తెలుసా? ఎందుకంటే… నువ్వు ఇక్కడ రెండోసారి వచ్చినప్పుడు మారిపోయావు” అని అనగానే,

 

“అంటే?” అని అడిగింది అనూహ్య.

 

అప్పుడు ఆ వృద్ధురాలు, “నువ్వు నిజమైన అనూహ్యవు కాదు” అని అనగానే,

 

అనూహ్య గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. “ఏ? ఎందుకని?” అని అడిగింది.

 

“నువ్వు నిజమైన అనూహ్య అయితే… బయట ఇంకో అనూహ్య ఎలా ఉంది?” అని అడిగింది ఆమె.

 

***

 

కొనసాగుతుంది..

 

                  sp ✍️… writes