రహస్య గది – 1
అది హైదరాబాద్, సమయం రాత్రి 11 గంటలు.
అనూహ్య తన కొత్త అపార్ట్మెంట్లోకి వచ్చిన మొదటి రాత్రి. హైద్రాబాద్లోని ఓ పాత భవనం, ఐదవ అంతస్తులో ఆమె అద్దెకు తీసుకుంది. లోపలికి వెళ్ళిన వెంటనే, ఇంట్లో ఏదో విచిత్రమైన వాతావరణంలా అనిపించింది. గదులు ఖాళీగా ఉన్నా, గాలి కదిలినట్లనిపించింది.
ఆమె చుట్టూ చూస్తూ, ఇంటిని పరిశీలిస్తుండగా హాలులో ఒక పాత ఫొటో ఫ్రేమ్ కింద ఓ కీ కనిపించింది. అది చూసిన అనూహ్యకు ఆశ్చర్యం వేసి, ‘ఈ కీ ఏంటి? దేనికి చెందినది? ఇక్కడ ఎందుకు ఉంది?!’ అని అనుకుంది.
అప్పటికే అర్ధరాత్రి అవటంతో ‘ఏమైనా ఉంటే ఉదయం చూసుకోవచ్చులే’ అనుకుని పడుకోవాలి అనుకుంది. కానీ, లోపల నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. గట్టిగా తలుపులు తట్టినట్టు అనిపించడంతో భయపడుతూ తలుపు దగ్గరకు వెళ్ళి, తలుపు తీసి చూస్తే ఎవ్వరూ లేరు.
తలుపులు వేసి, వెనుతిరిగిన ఆమెకు హాల్లో ఉన్న పెద్ద అల్మారాకు తాళం వేసి ఉండటం కనిపించింది. ఆమెకు ఒక్కసారిగా ఆ కీ గుర్తుకు వచ్చింది. దానిని తీసుకుని, అల్మారాను తెరవగా లోపల ఒక సీక్రెట్ డోర్ ఉంది. ఆమె ఆ డోర్ తెరిచే సమయానికి, వెనుక నుండి ఎవరో ఆమె భుజం మీద చెయ్యి వేశారు. గుండె ఆగినంత పని అయ్యింది ఆమెకు.
అనూహ్య వెంటనే వెనుదిరిగి చూసింది. ఎవ్వరూ లేరు. ఆమె గుండె దడ దడమంటూ కొట్టుకున్న సరే, లోపల ఉన్న రహస్య గదిని చూడాలని ఆత్రంతో డోర్ నెమ్మదిగా తీసింది. లోపల చిమ్మచీకటిగా ఉంది. గదిలో అడ్డదిడ్డంగా పడి ఉన్న పాత ఫర్నీచర్, చితికిపోయిన పుస్తకాలు, మట్టితో కప్పబడి ఉన్న కొన్ని ఫొటోలు కనిపించాయి ఆమెకు.
వాటిలో ఒక ఫోటో తీసుకుని చూసింది అనూహ్య. అందులో ఒక యువతి ఉంది. ఆ యువతి ఆమెకు ఎంతో తెలిసినట్లుగా అనిపించి, మరింత దగ్గరగా గమనించగా, అది తానే అని షాక్ తో వెనక్కి రెండడుగులు వేసేసరికి, గదిలో ఉన్న పురాతన గడియారం ఒక్కసారిగా గట్టిగా మోగింది. వెంటనే గదిలో ఉన్న నోట్ బుక్ లో పేజీలు వాటంతట అవే అటు ఇటు కదులుతున్నాయి. పాతదైన ఓ పెన్ ఆ నోట్ బుక్ అట్టపై అక్షరాలు రాస్తున్నట్టుగా కనిపించేసరికి వెళ్ళి చూసింది అనూహ్య.
దానిలో, “అనూహ్య! నన్ను మరిచిపోయావా?” అని రాసి ఉంది.
ఆ పదాలు చూసిన వెంటనే ఇది సాధారణ నోట్ బుక్ కాదేమో అని అనిపించింది ఆమెకు. పేజీలు నెమ్మదిగా తిరగవేసినట్లు కదులుతున్నాయి. అందులో ఇంకా తను చూడవలసినది ఏదో రహస్యం ఉన్నట్టుగా అనిపించింది.
ఇంతలో గడియారం మళ్ళీ మోగింది. ఇప్పుడు అది కేవలం సమయం చెప్పడం కోసం మాత్రం కాదు, ఏదో సిగ్నల్ ఇస్తున్నట్లు అనిపించింది.
అనూహ్యకి భయమో, ఆశ్చర్యమో తెలియని భావంతో నోట్ బుక్ లో ఉన్న అక్షరాలను మరింత శ్రద్ధగా పరిశీలించింది.
‘ఇదెవరి చేతి వ్రాత? ఇది ఎలా ఇక్కడకు వస్తుంది?’ అనుకుంటూ ఆమె మెల్లగా మరొక పేజీ తిప్పింది.
“నువ్వు ఇక్కడకు రెండోసారి వచ్చావు. మళ్ళీ తప్పు చెయ్యొద్దు!” అని ఉంది అక్కడ.
ఆమెకు ఒక్కసారిగా చలి వణుకు వచ్చింది. ‘రెండోసారి?’ అని ఆమె మనసులో అనుకుంది.
‘అయితే, నేను ఇక్కడ ఇంతకు ముందు కూడా వచ్చానా!?’ అని ఆమె ఆలోచిస్తూ ఉండగానే, వెనుక నుండి ఒక్కసారిగా తలుపు మునుపటిలానే గట్టిగా మూసుకుంది. ఆమె పరుగెత్తి తలుపు తీయబోయేలోపే, గదిలోని అద్దంలో ఆమె ప్రతిబింబం కనిపించింది. ఆ ప్రతిబింబంలో ఉన్న అనూహ్య చిరునవ్వుతో ఆమెను చూస్తోంది కానీ, అద్దం ముందు ఉన్న తను నవ్వడం లేదు.
అనూహ్య గుండె ఆగినంత పని అయ్యింది. “నా ప్రతిబింబం కదులుతుంటే, నేను కదలడం లేదు?” అంటూ ఆమె భయంతో వెనక్కి అడుగులు వేస్తుంటే, ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం మాత్రం ఆమె వైపుకు ముందుకు అడుగేస్తోంది.
ఆమె మనసులో, ‘ఇది కల కాదు కానీ, నిజమేనా?’ అనుకుంది. అంతలోనే, గదిలోని గడియారం మళ్ళీ మోగింది. అది మోగిన ప్రతీసారి గదిలో వాతావరణం మారిపోతూ ఉంది.
ఆమె వెంటనే భయంతో వెనక్కి తిరిగి తలుపును తెరవడానికి ప్రయత్నించింది కానీ, తలుపు లోపల నుంచి లాక్ అయ్యింది.
అనూహ్య గట్టిగా, “ఎవరైనా ఉన్నారా? నేను ఇక్కడి నుంచి బయటకి వెళ్ళాలి!” అని అరిచింది.
అదే సమయంలో ఆమె వెనుక నుండి ఓ గొంతు వినిపించింది..
“నువ్వు ఇక్కడి దానివే… నువ్వు ఎక్కడికీ వెళ్ళలేవు!” అని.
ఆమె వెనక్కి తిరిగే లోపే, అంతా చీకటిగా మారిపోయింది.
అంతలోనే ఒక్కసారిగా గదిలో లైట్ వెలిగింది. భయంగా చుట్టూ చూడగా ఆమె మళ్ళీ అదే అపార్ట్మెంట్లోని హాల్లో ఉంది కానీ, ఒక చిన్న తేడా ఏమిటంటే అల్మారా గానీ, రహస్య గది గానీ ఏమీ లేవు.
***
తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ అండ్ మై ప్రొఫైల్..
sp ✍️… writes
Swipe left/right or tap the sides to turn pages