రహస్య గది – 3
అప్పుడే, అనూహ్యకు ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వచ్చింది.
ఒక సంవత్సరం క్రితం…
అనూహ్య ఇదే అపార్ట్మెంట్లో నివసించేది కానీ, ఆమె ఎప్పుడూ రహస్య గదిని తెరవలేదు. ఒక రోజు రాత్రి, ఉత్సాహంతో ఆ తలుపును తీయగానే… ఆమె మాయమైపోయింది.
ఆ గదిలో ఉన్న అద్దం ఆమెను లోపలికి లాగేసి, అద్దం లోపల ఉన్న అనూహ్య… బయటకు వచ్చేసింది!
అదే ఇప్పుడు బయట ఉన్న అనూహ్య!
“నువ్వు ఒక ప్రతిబింబం! అసలైన అనూహ్య ఇప్పటికే గాడితప్పిపోయింది!” అని వృద్ధురాలు గట్టిగా అరిచింది.
అనూహ్యకు ఆ మాటలు అర్థమయ్యాయి. నిజమైన అనూహ్య ఇక్కడే ఉంది కానీ, ఇప్పుడు బయట ఉన్నది… అద్దం అనూహ్య!
‘అంటే, ఇప్పుడు బయట ఉన్న అనూహ్య తన మిత్రురాలు నీహాను కూడా ఆక్రమించేస్తుందా? అది జరిగేలోపు నేను ఏదైనా చేయాలి’ అని అనుకుని, ఆమె వెంటనే గదిలో ఉన్న గడియారం వైపు పరుగెత్తింది.
‘ఆ గడియారం మోగినప్పుడే ఏదో మారుతుంది! గడియారం ముల్లును తిప్పితే’ అనుకుని దాని పైన చేయి వేసింది అంతే ఒక్కసారిగా గది చీకటిగా మారిపోయింది. లోపల ఆరు చేతులున్న భయంకరమైన ఆకృతి కనబడింది.
“ఇదే నిన్ను లోపలికి లాగింది కానీ, ఇప్పుడు ఇదే నిన్ను బయటకు పంపగలదు!” అని వృద్ధురాలు చెప్పి, మళ్ళీ ఆమెనే మాట్లాడుతూ, “నిజమైన అనూహ్య ఎవరో గుర్తుపట్టాలి. నువ్వా? బయట ఉన్నదా?” అని అనగానే, అనూహ్య ఒక్క క్షణం ఆలోచనలో పడింది.
అనూహ్య ఆశ్చర్యంగా, “నేనా ఎలా?!” అని అడిగింది.
అద్దంలో ఉన్న ప్రతిబింబం తన వైపు చూస్తోంది. వెంటనే అనూహ్య గట్టిగా కళ్ళు మూసుకుంది. నిజమైన అనూహ్య ఎవరనేది అర్థమయ్యి, ఒక్కసారిగా గడియారాన్ని గట్టిగా కొట్టేసరికి గడియారం మోగింది.
కాసేపటికి అనూహ్య కళ్ళు తెరిచి చూసేసరికి హాల్లో ఉంది. అక్కడ అల్మరా లేదు, గదిలో ఉన్న అద్దం కూడా లేదు.
ఫోన్ మోగుతోంది. స్క్రీన్ పై “నీహా కాలింగ్…”
వెంటనే అనూహ్య ఫోన్ ఎత్తి, “హలో?” అనగానే,
నీహా, “హే! నువ్వు సేఫ్గా అపార్ట్మెంట్కు చేరుకున్నావా?” అని అడిగింది.
అనూహ్య ఆశ్చర్యంగా, “ఏం? నేను ఇక్కడకు కొత్తగా వచ్చానా?!” అని అడిగింది.
“అవును అనూ, ఈరోజే కదా నువ్వు కొత్త అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయిన రోజు?” అని నీహా అనగానే,
‘కాని… నిన్నా ఇదే జరిగింది కదా?!’ తనలో తాను అనుకుంటూ, అద్దం వైపు చూసింది. అక్కడ కేవలం తన ప్రతిబింబమే ఉంది. కదలని, నవ్వని మారనిది.
ఇంతలో మళ్ళీ హాల్లోని గడియారం మెల్లగా మోగింది.
ఆమె నిశ్చయించుకుంది—ఇక ఆ రహస్య గదిని, ఆ అద్దాన్ని, ఆ గడియారాన్ని ఎప్పటికీ తాకకూడదని.
అనూహ్య గడియారం వైపు చూసింది. అది మెల్లగా మోగడం ఆగిపోయింది. అంతా ఎప్పటిలానే కనిపించింది.
ఆమె గట్టిగా ఊపిరి తీసుకుని, ‘ఇది నిజమేనా? నేను ఇప్పుడు సురక్షితమేనా?’ అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఫోన్ మళ్ళీ మోగింది. నీహా కాలింగ్…
అనూహ్య ఫోన్ ఎత్తి, “హలో?” అనగానే,
నీహా, “హే! నువ్వు సేఫ్గా అపార్ట్మెంట్కి చేరుకున్నావా?” అని అడిగింది.
అనూహ్యకి ఏమి జరుగుతుందో అర్థంకాక, “ఏంటే? నువ్వు ఇదే ప్రశ్న ఎన్ని సార్లు అడుగుతావు?” అని అంది.
నీహా ఆశ్చర్యంగా, “నేను అడగటం ఏంటి? నేను ఇప్పుడే ఫస్ట్ టైమ్ కాల్ చేస్తున్నాను కదా?!” అని అంది.
అనూహ్యకు అనుమానం మొదలైంది. నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళి, అద్దం వైపు చూసింది. అద్దంలో తన ప్రతిబింబం స్పష్టంగా ఉంది. అది కదలదడం లేదు, నవ్వడం లేదు.
“హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకుని, ఒక్క క్షణం ఆగి మళ్ళీ చూసేసరికి..
అద్దం మీద చిన్నగా పగుళ్ళు రావడం మొదలయ్యింది.
అయితే, ఆ పగుళ్ళు మెల్లగా పెరుగుతూ ఓ ఆకారాన్ని ఏర్పరచుకున్నాయి.
అది ఆమె ముఖానికి ఒక అద్దంలో మిగిలిపోయిన ప్రతిబింబంలాగా కాకుండా… ఇంకెవరినో పోలి ఉంది!
ఒక రకమైన కాంతివంతమైన కళ్ళు, మందమైన నలుపు జుట్టు… అది… నీహా ముఖం!
అనూహ్య భయంతో అద్దం దగ్గరికి వచ్చి, “నీహా?” అని పిలిచేసరికి అప్పుడే, ఫోన్ మళ్ళీ మోగింది. కానీ, ఈసారి స్క్రీన్ పై పేరు నీహా కాదు.
“అజ్ఞాత సంఖ్య”
అనూహ్య చేతులు వణికిపోతున్నాయి, అలానే కాల్ ఎత్తింది.
ఫోన్ లోపల నుండి ఒక తీయటి, కానీ విపరీతమైన స్వరం, “ఇది నిజమైన ముగింపు అనుకున్నావా అనూహ్య?” అని వచ్చింది.
అనూహ్య గట్టిగా, “ఎవరది?” అని అడిగింది.
అటు వైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.
తను అర్థం చేసుకునే లోపు ఆమె ముందుంది ఒక కొత్త తలుపు. ఇంకో రహస్య గది.
గది లోపల ప్రవేశించగానే, ఈ గది చాలా పరిచయమైనట్లు అనిపించింది. గోడలపై చిన్న చిన్న గీతలు, మట్టిలో పాతిపెట్టిన పాత కుర్చీలు… ఇవన్నీ ఆమె ఎక్కడో చూసినట్లున్నాయి.
అయితే, గదిలో ఒక పాత కప్పబడిన అద్దం కనిపించింది.
ఆమె దాని మీద ఉన్న దుమ్మును తుడిచేసరికి, ఆ అద్దంలో ఒక చిన్న పాప కనిపించింది.
ఆ పాప ఏడుస్తూ,”నీకు గుర్తుందా అనూ? నువ్వే నేను. నేనే నువ్వు” అని అంది.
అనూహ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అప్పుడే మళ్ళీ గదిలోని గడియారం మోగడంతో ఆమె భయంతో నిశ్శబ్దంగా వెనక్కి తిరిగింది.
అప్పటి నుండి ఆమె తన ఇంట్లోని ఏ అద్దాన్ని తిరిగి చూడలేదు.
ఎందుకంటే… కొన్ని ప్రతిబింబాలు అసలు మనవి కానే కావు కాబట్టి!!
సమాప్తం
Sp ✍🏻… Writes
Swipe left/right or tap the sides to turn pages