New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రాసలీల – 3
రాసలీల 3 min read

రాసలీల – 3

“నాదొకటే కోరిక ప్రియనేస్తం..

ఇరువురి ప్రపంచాలు వేరే అయినా..

తోడై నిలవాలి కలకాలం..

కలిసిన మన బంధం..

కావాలి ఎన్నో ఆనంద తీరాల సంగమం..”

 

 

ఆమె తలంపులన్నీ ఎంతో వేగం గా సాగిపోయాయి గతకాలానికి…

 

 

    ******

 

హేమంత ఋతువు చివరి దశలో ఉందేమో?? పుడమి తల్లి మీద తెల్లని మంచు దుప్పటి పరుచుకుంది..

 

ఆ చలి పరదాలో  తాకుతున్న నులివెచ్చని సూర్య కిరణాల స్పర్శ కి  మరింత ముద్దుగా  పరవశిస్తుంది ప్రకృతి.. ఆమెలో అందం మరింత ద్విగుణీకృతం కావడానికి అవే ప్రేరకాలు మరి!… 

 

 

“ఓయ్! ఏంటి? అంతలా చూస్తున్నావ్? ముద్దొస్తున్నానా?”  మురిపెంగా నవ్వుతూ అడుగుతుంది ఆమె..

 

……….

 

“నాకైతే  నువ్వు భలే ముద్దొస్తున్నావ్!” తన చిట్టి గులాబీ రంగు పెదాలను గుండ్రం గా చేసి ముందుకు వంగి “ఉమ్మ్మ్మ.! గాఢంగా ముద్దు పెట్టుకుంది ఆమె..

 

“నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పనా?” అడుగుతూనే..

 

 

“నీ రంగు భలే ఉంటుంది.. నిన్ను చూస్తే చాలు నాకు తెలియకుండానే నా పెదాలపైకి చిరునవ్వు వచ్చేస్తుంది.. నువ్వు నా ఎదురుగా ఉంటే ఈ ప్రపంచంలో ఇంకెవరూ కనిపించరు.!

 

నువ్వు నమ్మవేమో?? కానీ ఉదయాన్నే నాకో కల వచ్చిందోయ్!.. చెప్పింది…

 

 

“మరి నువ్వు నవ్వను అంటే చెప్తాను!” ముందర కాళ్ళకి బంధం వేసి  గడ్డం కింద చేతిని ఉంచుకుని, కళ్ళు మూసుకుని కల ను గుర్తు చేసుకుంటూ చెప్పడం మొదలుపెట్టింది…

 

 

“సంగీతంలా  వినిపిస్తున్న సముద్రపు హోరు..

చల్లగా మేను తాకి వెళ్ళిపోతున్న చిరుగాలి..

 

ఇసుక తిప్ప మీద అందమైన చక్కని ఊయల, అందులో నేను నా ఒడిలో నువ్వు.. 

 

అరుణోదయ సూర్యుడు మెల్లిగా సాగరం మధ్యలో నుంచి పైకి వస్తున్నాడు..

 

లేత  భానుడి  వెలుగు రేఖలు చూస్తూ మనమిద్దరం..

 

 

ఉయ్యాల ముందుకు సాగుతుంది.. 

ఆ సముద్రపు అలలు నా  పాదాలను ముద్దాడుతున్నాయి..

 

నిన్ను గట్టిగా చుట్టుకుని నేను..

 

 

 

ఇద్దరం కలిసి సముద్రం మధ్యదాకా వెళ్లి.. వెనక్కి వచ్చి మరలా ముందుకు వెళ్ళి విహరిస్తూ…

 

అబ్బా! ఎంత బాగుందో కదా! నా కల!” కళ్ళు తెరిచి కిలకిల నవ్వేసింది..

 

 

 

ఆమె కళ్ళల్లో మెరుపు ఆమె  మేని రంగుతూ పోటీ పడుతున్నట్టుగా ఉంది..

మాట్లాడుతున్నప్పుడు ఊగుతున్న  ఆమె చెవి ఝుంకాలు, కింద పెదవి కి పక్కన ఉన్న పుట్టుమచ్చ, నేరేడు రంగు కళ్ళు, చిట్టి ముక్కు, తేనెలూరుతున్న  పెదవులు ఇవన్నీ ఆమెను మరింత ముద్దుగా ప్రతిబింబింప చేస్తున్నాయి…

 

ఆమె రూపం ఇప్పుడు ఏ కవి కంటికి చిక్కినా..

 

“విధాత తలపున వికసించిన కమలం” అని వర్ణించేవారేమో??..

 

ఎవరైనా ఆమెను  అలా చూస్తూ ఉండిపోవాల్సిందే..  కానీ ఆమె ఆగదు, 

ఆమె మాటల ప్రవాహం ఆగలేదు…

 

 

“నీకు కూడా నచ్చింది కదా?” తిరిగి అడిగింది….

 

 

………

 

 

“రోజురోజుకి నీ మీద ఇష్టం  పెరిగిపోతుందబ్బా ఏంటో???”  మొహం అంతా చిన్నబుచ్చుకుని ముద్దుగా చెప్పింది..

 

 

…….. 

 

 

“మా నానమ్మ  నుండి నిన్ను కాపాడలేక నేనెన్ని తిప్పలు పడుతున్నానో తెలుసా?” విచారం వ్యక్తం చేసింది..

 

“ఆవిడ కానీ నిన్ను, నన్ను  ఇలా చూసిందంటే?  ఎక్కడ నీ మెడ విరిచి,  నీ రెక్కలు  తుంచి నిన్ను నిర్జీవం చేసేస్తుందో అని నా భయం!” అప్పటికప్పుడే ముభావంగా మారిపోయింది ఆమె..

 

 

అంతలోనే  మామూలుగా మారిపోయి… 

“భయపడకు. నేనుండగా నీకేం కానివ్వను!”. ముందుకు వంగి తన్మయత్వంగా మరొక ముద్దు పెట్టుకుంది…

 

 

 

అప్పుడే గదిలో నుండి బయటకు వస్తున్న భానుమతి గారు దూరం నుండి ఇదంతా చూసి…

 

ముందు తల కొట్టుకుంది..

 

అటు ఇటు చూస్తూ ఎవరు చూడలేదని కన్ఫర్మ్ చేసుకుని గబ గబ మనవరాలి దగ్గర కొచ్చి నెత్తి మీద మొట్టి కాయ వేసింది…

 

 

“అమ్మ! నొప్పి!” బిక్క మొహం వేసుకుని చెప్పి…  “నాన్నమ్మ ఎందుకు కొట్టావ్?” అమాయకంగా అడిగింది..

 

“కొట్టాలా..? కొయ్యాలా..?”

 

“ఏంటే? నువ్విక్కడ  చేసే పనులు?” ఆవిడ మొహం మరింత ఎర్రబడి పోయింది…

 

 

“నేనేం చేస్తున్నాను? నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను!” అదే  అమాయకత్వాన్ని  కొనసాగించింది…

 

 

“ఏంటి మాట్లాడేది? రామయ్య పూజకి పువ్వులు కోసుకు రావే అంటే..?? ఈ మందారాలతో మంతనాలేమిటే  నీకు?”  మందారాన్ని చుట్టుకున్న మనవరాలి  చేతులను వెనక్కి లాగుతూ అంది.

 

 

“అరె! అది నా ఫ్రెండ్! దానితో మాట్లాడడం నాకిష్టం!” టకటకా చెప్పింది…

 

“అబ్బా!” తల పట్టుకుంది ఆవిడ..

 

 

“మొక్కలతో మాట్లాడటం. పువ్వుల్ని ముద్దు పెట్టుకోవడం ఇదేం పిచ్చే బాబు.!” తిక్క లేచింది ఆవిడకి..

 

 

“ఇంకా నయం ఎవరు చూడలేదు. ఎవరైనా చూస్తే.. నువ్వో తింగరి మేలమనుకుంటారే తిక్కల దాన?” బుగ్గల నొక్కుకుంటూ వాపోయింది ఆవిడ..

 

 

“అయ్యో! పాపం. అలా అనకు నానమ్మ!  ఇవి ఫీల్ అవుతాయి!” భానుమతి కి సర్ది చెప్పి 

 

“ఇవి చూడు ఎంత ముద్దొస్తున్నాయో??”  తన ఎదురుగా ఉన్న ముద్ద మందారాన్ని మళ్లీ  చేతిల్లోకి  తీసుకుంది…

 

“చంపేస్తాను! ఇంకోసారి పువ్వు మీద చెయ్యి వేసావంటే?” మనవరాలి చేతి మీద చురుక్కమనేలా ఒకటి వేసింది…

 

 

“మళ్ళీ  దానికి ముద్దు పెట్టావా?  మూతి మీద అట్లకాడతో వాత పెడతాను! అర్థమైందా??”  గద్దించింది…

 

తను ఎన్ని తిట్టినా ఎదురు మాట్లాడకుండా  తల దించుకున్న  మనవరాలిని చూస్తూ…

 

“అయినా! ఇందులో  నీదేం తప్పు లేదు లేవే?..

నువ్వు  రోజు ఇలాగే చేస్తున్న సరే…  నిన్ను పువ్వులు కోసుకురమ్మన్నాను చూడు నాది తప్పు.!”  లెంపలు వేసుకుంటూ… 

 

“నువ్వు లోపలికి పో!   నేను  కోసుకుంటాను!” మందారాన్ని చేతిలోకి తీసుకుంది ఆవిడ…

 

“అయ్యయ్యో! నాన్నమ్మ!” గట్టిగా అరిచింది…

 

ఆ అరుపుకి జడుసుకుని గుండెల మీద చిన్నగా తట్టుకుంది భానుమతి…

 

 

  £££

మన హీరోయిన్ ఎలా అనిపించింది? కామెంట్ చేసేయండి.

నెక్స్ట్ అప్డేట్ లో హీరో గారి ఎంట్రీ ఉంటుంది మరి.