New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రాసలీల – 1
రాసలీల 5 min read

రాసలీల – 1

విశాలమైన భవనం. డబ్బు దర్పం చూపించే హంగులు. ఇంటి దర్జా నిలపడానికి  బయట పార్క్ చేసి ఉన్న రకరకాల కార్లు…  అవన్నీ ఒక ఎత్తయితే.

 

అంతకు ముందే ఆ ఇంట్లో పెళ్లి పండుగ  జరిగిందనడానికి   నిదర్శనంగా గేట్ నుండి గడప వరకు అలంకరించిన పువ్వుల డెకరేషన్ 

గుమ్మానికి మెరుస్తున్న  పచ్చని మామిడి తోరణాలు ఇంకా మెరుస్తూ…  ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి…

 

 

  ****

 

“అరెరే త్వరగా  తెమల్చండర్రా! ముహూర్తం టైం అయిపోతుంది ఎక్కడివారు అక్కడే  కూర్చున్నారేంటి?” అప్పుడే  గదిలోకి వస్తూ… అందర్నీ  కంగారు పెట్టేస్తుంది డబ్బై ఏళ్ళ బామ్మ భానుమతి…

 

“అంత కంగారు పడకండి మామ్మ గారు.  మీ మనవరాలిని మేమెప్పుడో రెడీ చేసేసాం!”. చెప్పింది ఒక ముత్తైదువు..

 

“మామ్మ ఫస్ట్ నైట్ నీకా? నీ మవరాలికా? అంత కంగారు పడిపోతున్నావ్!”  నవ్వుల జల్లు కురిపించింది ఒక పడుచుపిల్ల… 

 

ఆ మాటతో అందరూ కిల కిలమని నవ్వేశారు…

 

“ఓసిని! నీ అసాధ్యం కూల నన్నే ఆట పట్టిస్తున్నావేంటే?” ఆ పిల్ల చెవి భానుమతి గారి చేతిలో నలిగిపోయింది… 

 

“ఆవ్! బామ్మ! సారీ! సారీ!  చెవి నొప్పి వదిలేయ్ దణ్ణం పెడతాను!”  చేతులు జోడించింది  ఆ పిల్ల….

 

“అద్గది అలా రా నా దారికి!.. నేను  పైటేసినప్పుడు పుట్టుంటాదే నీ అమ్మ నాతో పెట్టుకోకు!”  ఆ పడుచు పిల్ల బుగ్గల్లో పొడిచి… 

 

“అయినా పెళ్లి కాని పిల్లకి ఈ గదిలో పనేంటి?  బయటికి పో!” తరిమేయాలని చూసింది… 

 

 

“నీ మనవరాలు నా ఫ్రెండ్!” ఉక్రోషం గా అంది…

 

 

“అదంతా తర్వాత ముందు ఇంటికి వెళ్ళు.!” తిట్టింది..

 

 

“ఏ ఎందుకు వెళ్ళాలి? నీ మనవడు నన్ను చూసి  పడిపోతాడనా?” చెవి నొప్పి తగ్గడం తో మళ్లీ సెటైర్ వేసింది…

 

 

“హవ్వ! హవ్వ!” నోరు నొక్కుకుంది భానుమతి…

 

“ఈ కాలం పిల్లలు ఇలా తయారయ్యారేంటో?… మా కాలం లో అయితే అసలు శోభనం గది ఛాయలకు కూడా రానిచ్చేవారు కాదు!” భానుమతి గారు చెప్తుంటే… ఆవిడ తన  పురాణం ఎక్కడ  మొడలుపెట్టేస్తుందేమో అని భయపడి పారిపోయింది  తను..

 

అక్కడ ఉన్న  ఆడవాళ్ళందరూ ఒకటే నవ్వులు… 

 

“ఇదిగోండి మీ ముద్దుల మనవరాలు!”…  నవవధువుని తీసుకెళ్ళి  భానుమతి గారి ముందు   నిలబెట్టారు..

 

పాల మీగడ  రంగు, గుండ్రటి కళ్ళు, తీర్చిదిద్దిన కనుబొమ్మలు, చిట్టి చిట్టి పెదాలు, పుట్టుకతో వచ్చిన అందానికి తోడుగా కొత్త పెళ్ళికూతురు అందం మొత్తం ద్విగుణీకృతం అయ్యిందేమో ముచ్చటగా ఏర్చి కూర్చి ఎంత శ్రద్ధ గా చెక్కాడో ఆ బ్రహ్మ ఈ బొమ్మ ని అనేంత  అందమైన   శిల్పం లా ఉంది.

 

దానికి తోడుగా మెడలో కొత్త గా చేరిన పసుపు తాడు,  తెల్లటి కంచి పట్టు  చీర కి, పచ్చటి బోర్డర్ జత కలిసి దాని మీద అందం గా తీర్చిదిద్దిన  ముత్యాల వంకీలు,, తల నిండుగా తురిమిన మల్లెపువ్వులు, బుగ్గ మీద దిష్టి చుక్క ఆమెను చూడడానికి  రెండు కళ్ళు సరిపోవడం లేదు ఎవరికీ… 

 

 

“నా బంగారు తల్లే! ఎంత ముద్దుగా ఉన్నావో! అచ్చం నా కోడలి పోలికే!” చేతులతో నే దిష్టి తీసింది… 

 

“మీ కోడలు  కాదు మా అమ్మ!” బుంగమూతి పెట్టుకుంది… 

 

 

“ముందు నా  కోడలయ్యాకే నీకు అమ్మయింది లేవే!”.. మనవరాలి  భుజం తట్టి.. 

 

“దిష్టి చుక్క పెట్టారా? నా మనవరాలికి!” పక్కనున్న వాళ్ళని అడిగింది

 

 

“పెట్టాం!.. పెట్టాం!..” మూకుమ్మడిగా  సమాధానం  ఇచ్చారు అందరూ…

 

“సరే పదమ్మ! దేవుడికి దణ్ణం పెట్టుకుందువు కానీ!”  మనవరాలిని బయటకు తీసుకెళ్ళింది…. 

 

“భానుమతి మామ్మ  కి  తన   మనవరాలంటే ఎంత ఇష్టమో!” గుంపులో ఒకావిడ నవ్వుతూ అంది… 

 

 

“నీ మొహం అంత ఇష్టమైతే మనవరాలి గొంతు ఇలా కోస్తుందేమిటి?” ఇంతలో కాంతం  అందుకుంది…

 

 

“అలా అంటావేంటి కాంతం? పెళ్ళి కొడుక్కేమి తక్కువ  మహారాజులా ఉన్నాడు,,  ఇద్దరినీ పక్క పక్కన నిలబెడితే  ఎంత చూడ ముచ్చటగా ఉన్నారో!” మురిపెంగా అంది లక్ష్మి…

 

“ఆ! చూడటానికి బాగుంటే సరిపోతుందా? ఈడు జోడు చూసుకోవద్దు. ఈ పిల్లకేమో నిన్న కాక మొన్నే ఇరవై వచ్చాయి. పెళ్ళి కొడుక్కేమో ముప్పై ఏళ్ళుంటాయి. ఇక్కడ మీకేవరికి వయసు తేడా కనిపించడం లేదా?” అడిగింది కాంతం అంతకు ముందు అన్న ఆవిడని…

 

“వయసుదేముంది కాంతం!. ఇంత కన్నా పెద్ద పెద్ద తేడా లోనే పెళ్ళిళ్ళు చేసేవారు..  ఇంత డబ్బు, అందం ఉన్న పెళ్ళికొడుకు దొరికితే వయసు సమస్య  పెద్దదా ఏంటి?” అంటూ బయటకు  వెళ్లిపోయింది ఆ గుంపులో ఒక పెద్దావిడ…

 

 

“అవునవును పిన్ని చెప్పింది కూడా నిజమే కాంతం!”  అంటున్న  సరోజ ను చూసి..

 

 

“ఏంటి నిజం? అందరికీ అదే తెలుసు. మీకు తెలియని ఇంకో విషయం చెప్పనా?” కుడి చేతిని గడ్డం కింద పెట్టుకుని మూతి తిప్పుకుంటూ అంది కాంతం…

 

 

“ఏంటది?” ఆసక్తిగా అడిగారు అక్కడున్న  నలుగురు… 

 

“ఆ పెళ్ళికొడుక్కి ఇది మొదటి పెళ్లి కాదు. రెండో పెళ్లి.!”  కాంతం చెప్పగానే 

 

“ఆ!” అందరూ  నోర్లు తెరిచి ఉండిపోయారు…

 

“మరే!”  బయటకు వెళ్ళిపోయింది కాంతం…

 

“అయ్యయ్యో! బంగారం లాంటి  పిల్లని తీసుకెళ్ళి  ఇలాంటి  వాడి చేతిలో పెట్టిందా?

ఎంత సంపాదన ఉంటే మాత్రం ఏంటి? 

ఆ పిల్లకి అమ్మా నాన్న ఉంటే ఇలాగే చేసేవారా?”  తలో మాట అనుకుంటూ..

మిగిలిన వాళ్ళందరూ చెవులు కొరుక్కుంటూ… నోళ్ళు నొక్కుకుంటూ బయటికి వచ్చారు…

 

 

   “రండమ్మా! అమ్మాయిని రూమ్ దగ్గరికి తీసుకెళ్లండి.!” అప్పుడే గదిలో నుండి బయటకు వచ్చిన ఆడవాళ్ళను చూసి చెప్పింది భానుమతి.. 

 

 

అప్పటి వరకు మాట్లాడుకున్న మాటలన్నీ వదిలేసి… నవ్వుతూ  ముందుకొచ్చారు అందరూ… 

 

 

బిడియాల బంగారపు బొమ్మ చేతిలో పాల గ్లాస్ పెట్టి… 

 

అంతా కలిసి నవవధువును రూమ్ వరకు తీసుకెళ్ళి లోపలికి తోసి  పకపకా నవ్వుకుంటూ తలుపులు వేసేసారు.. 

 

 

గదిలోకి వెళ్ళగానే ఒక్కసారిగా  గుప్పుమని గుభాలిస్తున్న పువ్వుల పరిమళాలు ఆమె నాశికాన్ని తాకి మైమరపించాయి….

 

గదిలో పరుచుకున్న  పెర్ఫ్యూమ్ ల సుగంధాలన్నీ ఆమెను  మరో లోకం లోకి తీసుకుపోవాలని తహతహ లాడుతున్నాయి… 

 

 

అప్పటి వరకూ అందరిలో ఉన్న సిగ్గు..  ఏకాంతం లో  మరింత పెరిగింది ఆమెకి.. 

 

అందరు ఆడపిల్లల్లాగే  ఆమెకి కూడా ఎన్నో కలలు, ఆశలు..

 

 

ఇప్పుడు తన భర్త వచ్చి తన చుట్టూ అతని చేతులుంచి నడిపించుకు తీసుకెళ్తాడు అనుకోగానే…

 

ఆ ఊహకే  ఉక్కిరిబిక్కిరయిపోయింది…

 

బుగ్గల్లో కెంపులు, గుండెల్లో అలజడి, కనురెప్పల్లో భారం, అదురుతున్న పెదాలు,  వణుకుతున్న చేతులు శోభనపు పెళ్ళి కూతురు మొహం లో ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆమెలో  తారాడుతున్నాయి…

 

తల పైకెత్తి చూడలేక  అలానే నిలబడిపోయింది… 

 

 

నేలవైపు చూస్తున్న ఆమె చూపులకి ఎంత చూసినా తన పతి అడుగుల జాడ కనిపించక అలిగాయి అవి… 

 

మెల్లిగా కళ్ళు మాత్రమే పైకెత్తి చూసింది… 

 

 

ఇరవై అయిదు అడుగుల విశాలమైన గదిలో  ఎక్కడా కనిపించని అతని జాడతో పూర్తిగా తల  ఎత్తి  గది మొత్తం  జల్లెడ వేసింది…

 

 

గోడకు అందం గా అలంకరించిన రోజ్ ఫ్లవర్స్  ముందుగా ఆమెకు ఆహ్వానం పలికాయి… 

 

 

ఎర్రటి గులాబీ రేకులతో మంచం మీద అలంకరించిన  హార్ట్ సింబల్ ముచ్చటగా ఉంటే.. దాని చుట్టూ పరిచిన తెల్లటి మల్లెలు మరింత కళను తీసుకొచ్చాయి… 

 

యెల్లో కలర్ పెటల్స్ తో వేసిన బోర్డర్..  బెడ్ కి  చుట్టుపక్కలంతా వేలాడుతున్న జాజి పూదండలు  సన్నగా కవ్విస్తున్నాయి ఆమెని… 

 

 

సందిగ్ధం లో  నిలబడి చూస్తున్న ఆమె చూపులు తడబడ్డాయి…  మొహం పక్కకు తిప్పుకుంది… 

 

గది నాలుగు వైపుల వెతికిన ఆమెకి ఏ దిక్కున కనిపించని భర్త ఎక్కడున్నాడో  కనిపెట్టే పనిలో పడింది..

 

కుడి చేతి చూపుడు వేలు నోట్లో పెట్టుకొని ఆలోచిస్తూ నిలబడ్డ ఆమెకి గుర్తొచ్చింది గది బాల్కనీ…

 

ఆమె పెదవుల మీద చిరునవ్వొచ్చింది…

 

 

వెంటనే చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కనే ఉన్న టేబుల్ మీద  పెట్టి.. ఎడమ చేత్తో  చీర కుచ్చీళ్లను ఎత్తి పట్టుకుంది.. 

 

 

కుడి చేతి చూపుడు వేలిని నోటి మీద పెట్టుకుని కాళ్ళకున్న పట్టీలను  శబ్ధం చేయొద్దని    వాటికి సైగ చేసి చెప్పింది…

 

 

మునివేళ్ళ మీద నిలబడి చిట్టి చిట్టి అడుగులు వేస్తూ….

   కింద పెదవిని పంటి బిగువున నొక్కిపెడుతూ.. దొంగ పిల్లిలా బాల్కనీ వైపు కి కదిలిన ఆమెకి  ఒంటరిగా ఉన్న బాల్కనీ ఎదురొచ్చేసరికి నిరుత్సాహం  వచ్చేసింది.. 

 

 

“ఎక్కడికి వెళ్ళిపోయారు ఈయన?”  రెండు చేతులు నడుముకున్న వడ్డాణం మీద పెట్టుకుని దీర్ఘం గా ఆలోచించసాగింది… 

 

 

ఆమె మెడలో ఉన్న చైన్  ఎప్పుడు చేరిందో మరి ఆమె పంటి కిందకు చేరిపోయింది…

 

“రానీ వస్తాడు కదా! అప్పుడు చెప్తా!” లో లోపలే ఉడుక్కుంటూ గదిలోకి వచ్చి 

 

“ఏ మూలనైనా నక్కి ఉన్నాడా?”  అనుమానం గది మొత్తం కలయతిరిగింది…

 

అక్కడ ఆమె తప్ప మరొకరు ఉంటేగా.. ఆమెకి కనిపించడానికి…

 

ఇక లాభం లేదు అనుకుంటూ తలుపు తెరిచిన ఆమెకి… 

 

చంటి బిడ్డ ఏడుపు వినిపించగానే.. రెండు చేతులతో తన పట్టుచీరను గట్టిగా పట్టుకుని అటుగా పరుగు తీసింది..

 

ఏడాదిన్నర  వయసున్న  “రిహాన్” ఏడుస్తుంటే ఉరుకోబెడుతుంది  అక్కడే ఉన్న ఆయమ్మ.. 

 

 

“ఏది ఇలా ఇవ్వండి?” వాడిని చేతిలోకి తీసుకుని భుజాన్న వేసుకుంది..

 

“నాన్న! రిహ! ఎందుకు ఏడుస్తున్నావు ఆకలేస్తుందా?”  బుజ్జిగాడిని అడుగుతూనే ….

 

తన భర్త జాడ అక్కడ కూడా కనిపించక 

“ఆయనేరి?”  అడిగింది….

 

ఆవిడ వెంటనే తడబడుతూ… “అది అమ్మా…! బాబు గారూ..?” చెప్పలేక సతమవుతున్న ఆవిడ వైపు విచిత్రం గా చూసింది… 

“పర్వాలేదు చెప్పండి!”  భరోసా ఇచ్చింది… 

 

“అయ్యగారు…  ఆయన మొదటి భార్య దగ్గరికి వెల్లారమ్మ.! మీకు చెప్పడానికి మీరు ఇక్కడ లేరని, మీకు చెప్పమని నాకు చెప్పారు…!” చెప్పి తలదించుకుంది..

 

    ******

నా మొదటి కథ ను ఆదరిస్తారని ఆశిస్తూ..  మీ కౌముది.

ధన్యవాదాలు.