New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రాసలీల – 2
రాసలీల 5 min read

రాసలీల – 2

తన భర్త జాడ అక్కడ కూడా కనిపించక 

“ఆయనేరి?”  అడిగింది….

 

 

ఆవిడ వెంటనే తడబడుతూ… “అది అమ్మా…! బాబు గారూ..?” చెప్పలేక సతమవుతున్న ఆవిడ వైపు విచిత్రం గా చూసింది… 

 

“పర్వాలేదు చెప్పండి!”  భరోసా ఇచ్చింది… 

 

 

“అయ్యగారు…  ఆయన మొదటి భార్య దగ్గరికి వెల్లారమ్మ.! మీకు చెప్పడానికి మీరు ఇక్కడ లేరని, మీకు చెప్పమని నాకు చెప్పారు…!” చెప్పి తలదించుకుంది..

      ******

 

కాసేపు  తలవంచుకునే ఉన్న ఆయమ్మ కి..

ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో  కొత్త పెళ్లి కూతురు మొహంలోకి చూసింది అనుమానం గా…

 

ఆమె మొహం లో ఎటువంటి  గాబరాలేదు అలా అని సంతోషము లేదు. 

 

 

బాబు ఏడుపు ఆపకపోవడం తో భుజం మీద వేసుకుని  అటు ఇటు తిప్పుతూ ఊరడిస్తుంది…

 

చిత్రం గా అనిపించింది ఆయమ్మకి..

 

 

ఆమె ఒంటి మీద నగలు గుచ్చుకుని  ఇంకా ఏడుస్తున్నాడు తప్ప ఊరుకోవడం లేదు రిహాన్… 

 

 

 

“నా బాబువి కదూ! ఊరుకో నాన్న!”  కంగారు పడిపోతూ.. ఉయ్యాలలో వేసి తన  చిట్టి చిట్టి పెదవులను సాగదీస్తూ… చేతులతో సైగలు చేస్తూ.. తను కూడా చిన్నపిల్లలా మారి  నవ్వించాలని చూస్తుంది…

 

 

అప్పుడే లోపలికి వచ్చారు  భానుమతి గారు.. వాము, జీలకర్ర వేసి మరిగించిన కషాయంలో తేనె కలుపుకొని తీసుకొచ్చింది ఆవిడ..

 

“నానమ్మ! ఇటు చూడు. వీడు ఎంత ఊరుకోబెట్టినా ఏడుపాపడం లేదు!”  బిక్క మొహం వేసుకుని చెప్పింది…

 

 

 

“కంగారు పడకు. వాడికి  అజీర్తి చేసినట్టు ఉంది.!”  చెప్పి ఆయమ్మకి సైగ చేసింది…

 

 

ఆవిడ  రెండు కాళ్ళు చాపుకుని కింద కూర్చుంటే.. బాబు ని తీసుకెళ్ళి ఆవిడ ఒడిలో పడుకోబెట్టింది.. 

 

 

 

పక్కకి జారిపోవడానికి ప్రయత్నిస్తూ తెగ ఆడిస్తున్న రిహాన్ కాళ్ళు, చేతుల్ని గట్టిగా పట్టుకుని తను తెచ్చిన కషాయాన్ని ఉగ్గు గిన్నెలో వేసి పట్టించింది..

 

కాస్త బయటకు ఉసేసి కాస్త మింగాడు…

 

 

వెంటనే భుజాన వేసుకుని వెన్ను నిమిరింది భానుమతి…

 

 

కాసేపటికే త్రేన్పు  వచ్చింది…

 

అప్పుడు ఏడుపాపాడు..

 

 

“హమ్మయ్య! ఇంకేం భయం లేదు!”  ఉయ్యాలలో  వేస్తూ చెప్పింది బామ్మ.. 

 

 

ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరూ…

 

 

 

అప్పటివరకు రిహాన్ గొడవలో  పడి పట్టించుకోలేదు మనవరాలిని…

 

 

“నువ్వేంటి ఇక్కడ? గదిలో ఉండకుండా వచ్చావ్?” అయోమయం గా చూస్తూ అడిగింది మనవరాలిని..

 

 

“అది! వాడి ఏడుపు వినిపించి…!” నసుగుతూ చెప్పింది….

 

 

“నీ మొహమేం కాదా! వాడ్ని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కానీ అబ్బాయిని వదిలేసి వస్తావా? తప్పు!” హితబోధ చేసింది మనవరాలికి…

 

 

 

“మరేం పర్వాలేదు నానమ్మ! ఆయన గదిలో లేరు.!” చెప్పి నాలిక్కరుచుకుంది…

 

 

“ఏంటి కొత్త పెళ్లి కొడుకు గదిలో లేడా?”  మరింత ఆశ్చర్యంగా చూసి…

“ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్ళాడు?”  ఆవిడ లో కంగారు..

 

 

నీళ్ళు నమిలింది నవ వధువు..

 

 

“కొయ్య బొమ్మలా అలా నిలబడతావేమే చెప్పు?” రెట్టించింది మామ్మ…

 

 

“పనుండి బయటకు వెల్లారమ్మ! వచ్చేస్తానన్నారు!” మధ్యలో కల్పించుకుని చెప్పింది ఆయమ్మ…

 

 

“హవ్వ!” ముక్కు మీద వెలేసుకుని…

 

“ఇదెక్కడి చోద్యమే?!.. శోభనం గదిలో  ఉండాల్సిన పెళ్ళి కొడుకు పనుందని బయటకు వెళ్ళాడా?”  గడ్డం కింద చెయ్యి పెట్టుకుని ఆరళ్ళు తీస్తూ  అంది…

 

“రాని వస్తాడు కదా! అప్పుడు చెప్తాను!”  అంటున్న  మామ్మ మాటలకి 

 

కంగారుగా ముందుకు వచ్చి “నానమ్మ ఆయన వచ్చాక తిట్టకు!”  బతిమాలింది…

 

 

“నువ్వో పిచ్చి మొహం!”  తల పట్టుకుంది బామ్మ 

 

 

 

మొహం చిన్నబుచ్చుకున్న  మనవరాలిని చూసి నిట్టూర్చింది.

 

 

“అది కాదమ్మా!”..  మనవరాలి ని దగ్గర తీసుకుని భుజం మీద చెయ్యి వేసింది…

 

 

 

“పెళ్ళికొడుకుని చేసినప్పటి నుండి మూడు రాత్రులు అయ్యేవరకు బయటికి వెళ్ళకూడదు.! మా భయాలు మావి చెప్తెనేమో చాదస్తం అనుకుంటారు!” నిరుత్సాహం గా అంటున్న భానుమతి గారి ని చూసి…

 

 

తలూపింది..

“ఆయన త్వరగానే వచ్చేస్తారు నానమ్మ! నేను  వెళ్లి ఫోన్ చేస్తాను!” చెప్పి అక్కడ నుండి  తన గదిలోకి  నడిచింది…

 

 

వెళ్ళిపోయిన  మనవరాలిని  తలచుకుని… 

 

“ఏంటో ఇది ఎలా బతుకుతుందో.!”  ఆలోచనల్లో పడింది..

 

 

“ఇంకా నయం  పెళ్ళికొడుకు గదిలో లేడన్న విషయం ముత్తైదువులందరూ వెళ్లిపోయాక బయటకొచ్చింది..

 

లేకపోతే  ఎంత అప్రతిష్ట!” అనుకుంది..

ఆవిడ బాధ ఆవిడది మరి..

 

 ఇంకా ఆవిడ చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉండడం తో 

“బాబు ని జాగ్రత్తగా చూసుకో!”. ఆయమ్మ కి  చెప్పేసి తన పనులు  చూసుకోవడానికి వెళ్ళిపోయింది

 

నిద్రపోయాడు బుల్లి రిహాన్…

 

 

రూమ్ లోకి వెళ్ళి  ఫోన్ తీసుకుంది…

 

స్క్రీన్ మీద తన  పతి నెంబర్ కోసం వెతుకుతున్న ఆమెకి ఎక్కువ కష్ట పడకుండానే  ముందు వరస లోనే దొరికేసింది పేరు “మై లవ్!”  వెంటనే కాల్ కలిపింది… 

 

 

టూ టైమ్స్ రింగ్ అవుతున్న అవతల నుండి ఎవరు లిఫ్ట్ చేయలేదు..

రెండు మూడు రింగులు అయ్యాక గుర్తొచ్చింది ఆమెకి అసలు విషయం..

 

 

అక్కడికి ఎప్పుడు వెళ్ళినా… ఫోన్ సైలెంట్ లో పెడతారు కదా!  తెలిసి చేస్తున్నానేంటో తల మీద తట్టుకుని దీర్ఘం గా ఆలోచించిన ఆమెకి మరొక ఐడియా వచ్చింది…

 

అప్పటి వరకు ముడుచుకున్న ఆమె పెదవుల్లో చిరునవ్వు..

 

అస్సలు టైం వేస్ట్ చేయకుండా తనకి కావాల్సిన నెంబర్ వెతికి ఫోన్ కలిపింది..

 

అవతలి వ్యక్తి లిఫ్ట్ చేయగానే… “హలో నందు అన్నయ్య!”  పిలిచింది…

 

“ఆ! చెప్ప రా!”  అవతల నుండి..

 

“నువ్వు ఎక్కడున్నావ్?” అడిగింది….

 

 

“ఇంకెక్కడుంటాను? నీ మొగుడితోనే! వీడు నీకు మాత్రమే కాదు నాక్కూడా మొగుడేగా!”  నీరసం గా  అంటున్న నందు మాటలకి కిలకిల నవ్వేసింది…

 

 

“నవ్వు.! నవ్వు..! నీకు మీ ఆయనకి అలా ఉంది నా పరిస్తితి చూస్తుంటే…” నీరసం గా అంటూ….

“ఒరేయ్ నందు! ఐ పిటూ యూ రా! ఐ పిటు యూ!” సానుభూతి వ్యక్తం చేసుకున్నాడు తన మీద తనే.

 

 

“సర్లే! ఇంతకీ ఎందుకు చేసావ్ రా?” అడిగాడు…

 

 

“అదే అన్నయ్య! మీరు రావడానికి  ఎంత టైం పడుతుందో తెలుసుకుందాం అని! అదే  నానమ్మ అడగమంది.”  చెప్పింది.. మళ్లీ తన గురించి ఏమనుకుంటాడో అని..

 

“గంటయినా పడుతుంది రా! మాట్లాడతావా? వాడిని పిలవనా?” అడిగాడు…

 

 

“వద్దొద్దు!  ఆయన్నేమీ డిస్టర్బ్ చేయకు. నేనేదో  క్యాజువల్ గా చేశాను అంతే!” చెప్పింది…

 

 

“సరిపోయింది పో!” విసుగంతా కుమ్మరించాడు…

 

“అసలు  ఈ టైంలో నిన్ను వదిలేసి వచ్చినందుకు వాడికే ఫోన్ చేసి చెడా మడా నాలుగు తిట్టాల్సింది పోయి! రివర్స్లో  వెనకేసుకొస్తున్నావ్! ఆదర్శ భార్యవై పోయావ్!”  పొగడ్త లో వెటకారం కలగలిపాడు……

 

 

“నేను కూడా మీ ఫ్రెండ్ ని చాలా విసిగించా కదా అన్నయ్య! రివెంజ్  తీర్చుకుంటున్నాడేమో? పోనీలే ఒక అవకాశం ఇద్దాం!”  అంటున్న ఆమె మాటలు విని… 

 

“ఇంకా ఎక్కువ విసిగించిన తప్పేం లేదు ఆ రాక్షసుడిని!” కచ్చగా  అంటూ….

 

 

“నువ్వు ఇంకా  ఏడిపిస్తా అన్నా కూడా నా సపోర్ట్ ఎప్పుడు నీకే చెల్లాయ్!” నవ్వాడు….

 

“థాంక్స్ నందు అన్నయ్య!” మనస్ఫూర్తిగా చెప్పింది..

 

“ఆయన మీ ఫ్రెండ్ అయినా కూడా  మీరు నాకే సపోర్ట్ చేశారు. మీ వల్లే  మా ఇద్దరి పెళ్లి జరిగింది.!”.

 

 

“అరెరే! ఇందులో నా తప్పేం లేదు. తప్పంతా నీదే! శిక్ష అంతా నీదే! ఆ మహానుభావుడ్ని ఎలా భరిస్తావో భరించుకో నాకేం సంబంధం లేదు!” భయపడుతుటున్నట్టు నటిస్తున్న  నందు  మాటలు విని  హాయిగా నవ్వేసింది

 

 

“ఊరుకోండన్నయ్య మీరు మరీను..!” నవ్వుతూ చెప్తున్న ఆమె మాటలు విని..

 

 

“నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి రా!” అన్నాడు…

 

“అలాగే అన్నయ్య!” చెప్పింది..

 

“నువ్వు కాబట్టి మార్చావ్ ఆ జడ పదార్థాన్ని ఇంకెవరూ ఆ సాహసం కూడా చేయలేరు!” చెప్తూ..   “సరే సరే నాకు పనుంది!  నేను వెంట పెట్టుకుని తీసుకొస్తాను  నీ  లైఫ్ లో విలన్ ని సరేనా?! బాయ్!”  చెప్పి ఫోన్ కట్ చేశాడు…

 

 

 

ఫోన్ టేబుల్ మీద పెట్టింది…

టేబుల్ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ మీదకి మరలాయి ఆమె చూపులు…

 

 

సిగ్గు పడింది అందులో ఉన్నది ఆమె పతిదేవుడు మరి..

 

నాచురంగు షర్ట్ మీద బ్లాక్ కలర్ బ్లేజర్  వేసుకుని ఒక హ్యాండ్ పాకెట్లో మరొక హ్యాండ్ గడ్డం మీద పెట్టుకుని చూస్తున్న చూపులు సూటిగా తాకాయి ఆమెని… 

 

నడుము వరకు ఎక్స్పోజ్ అవుతున్న ఫోటో అది ఫ్రేమ్ చేతుల్లోకి తీసుకుంది..

 

 

కుడి చేతిని అద్దం  మీద ఉంచి అందం గా  తడిమింది 

 

 

అటు ఇటు చూసింది ఎవరైనా చూస్తున్నారా అని…

 

పిచ్చి ఇక్కడ ఎవరూ లేరుగా  తట్టింది….

 

 

ముందుకు వంగి ముద్దు పెట్టేసుకుంది సున్నితం గా…

 

సూటిగా తాకుతున్న భర్త చూపులు తాళలేక సిగ్గుతో ఆమె పెదవులు కందిపోయాయి.. బుగ్గలు ఎరుపెక్కిపోయాయి..

 

“ఓయ్! ఏంటి అలా చూస్తున్నారు శ్రీవారు?  మీ చూపులు కాస్త పక్కకు తిప్పుకోండి!”  అద్దం మీద నుండే  తన ప్రియ నాధుడి బుగ్గ గిల్లింది..

 

 

పక్కకు తిరగని ఫోటో లోని తీక్షణమైన అతని వాడి చూపులకి నవ్వుకుంది..

 

“మాయలా వచ్చావు నా జీవితం లోకి..

పెనుగాలై చేరావు హృదయం లోకి…

ఏముంది నీలో?”  సమాధానం ఇవ్వడని తెలిసినా అడిగింది…

 

 

“నలుపు తెలుపు రంగుల హరివిల్లువో?.. 

కలలా వచ్చి ఎదుటే నిలిచి  ఎదలో రేగిన కలవరానివో?..

కంటి ముందు నిలవలేని రూపానివో?…

కుదురుగా ఉండనివ్వని కాలానివో?..

ఆసాంతం మధురిమలు పంచే  తీపి చక్కెరవో?..

మూట కట్టుకున్న జ్ఞాపకాల దొంతరవో?..

చిరుగాలిలా చేరి మయూరం మనసు దోచిన ప్రణయానివో??..

ఉప్పెనలా మరి ముంచేసే ప్రళయానివో?..

బాటసారివైయ్యావు..

బదులు లేని ప్రశ్నలెన్నో సంధించావు..

మెత్తంగా  నాలో  చేరి, 

మొత్తం గా నీలా మార్చేసిన మాయాజలమా…

భ్రమవే అయినా కూడా..  బ్రతుకంతా నీతోనే!..”

 

 

ముందుకు వంగి  మరొక ముద్దు పెట్టుకుంది తన్మయత్వం గా.. 

 

మంచం మీద వెనక్కి వాలింది..

ఫోటో ప్రేమ్ ని గుండెల్లో దాచుకుని కళ్ళు మూసుకుంది..

 

 

“నాదొకటే కోరిక ప్రియనేస్తం..

ఇరువురి ప్రపంచాలు వేరే అయినా..

తోడై నిలవాలి కలకాలం..

కలిసిన మన ఈ బంధం..

కావాలి ఎన్నో ఆనంద తీరాల సంగమం..”

 

ఆమె తలంపులన్నీ ఎంతో వేగం గా సాగిపోయాయి గతకాలానికి…

 

 

          ****

 

కథానాయకి తో పాటు మీలో ఎంతమంది ఎదురుచూస్తున్నారు కథానాయకుడి కోసం…???

 

కామెంట్స్ మర్చిపోకండి..

 

ధన్యవాదాలు…