New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
స్నేహం కోసం…!! – 1

స్నేహం కోసం…!! – 1

అగ్నిసాక్షిగా వివాహం జరగడం మన సాంప్రదాయం.

కానీ ఇక్కడ ఒక జంట పెళ్లికి మాత్రం చితి మంటలే అగ్నిసాక్షిగా మారి… వారి నిండు నూరేళ్ల జీవితాన్ని ఆనందమయం చేయాలని ఆశీర్వదిస్తాయి.
అసలు ఆ జంట పెళ్లి అలా ఎందుకు జరగాల్సి వచ్చింది?
వారి జీవితంలో ఏం జరిగింది?
తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
ఢిల్లీలో… ఉదయం ఏడు గంటలకు…
హాస్టల్ రూమ్‌లో ఓ ఫోన్ నిరంతరాయంగా మోగుతోంది.
అప్పటికే తన డ్రెస్ సర్దుకుంటున్న పూజ, బెడ్‌పై పడుకున్న తన స్నేహితురాలిని చూసి…
“ఫోన్ వైపు చూడకుండానే… ఫోన్ లిఫ్ట్ చేయవే!” అని అంది.
కానీ ఆ అమ్మాయిలో ఎలాంటి చలనం లేదు.
“ఇప్పుడే షిఫ్ట్‌కి వెళ్లి వచ్చాను పూజా. ప్లీజ్! కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. ఆ కాల్ ఎవరిదో లిఫ్ట్ చేసి, నేను పడుకున్నానని చెప్పు” అంటూ మళ్లీ బెడ్‌పై బోర్లా పడుకుంది.
“హా… సరేలే!” అని చెప్పిన పూజ ఫోన్ చేతిలోకి తీసుకుంది.
స్క్రీన్‌పై కనిపిస్తున్న పేరును చూసి ఒక్కసారిగా కనుబొమ్మలు పైకెత్తింది.
“ఒసేయ్! ఇందులో ‘మై లవ్’ అని వస్తుందే!” అంటూ పడుకున్న అమ్మాయిని పిలిచింది.
ఆ మాట వినగానే అప్పటివరకు నిద్ర మత్తులో ఉన్న ఆ అమ్మాయి ఒక్కసారిగా బెడ్‌పై నుంచి లేచింది.
“అవునా? మై లవ్ అని వస్తుందా?”
అంటూ వెంటనే పూజ చేతిలోని ఫోన్ లాక్కుంది.
“నువ్వు షిఫ్ట్‌కి వెళ్లాలి కదా! నువ్వు వెళ్లిపో. నేను కాల్ మాట్లాడతాలే!” అంది ఆత్రంగా.
ఆమె హడావుడిని చూసిన పూజ ఆశ్చర్యంగా చూస్తూ…
“ఇప్పుడే కదే రెస్ట్ కావాలని అన్నావ్? మరి ఇప్పుడు రెస్ట్ అవసరం లేదా?” అని అడిగింది.
“రెస్ట్ కావాలి. కానీ ఇది అంతకంటే ఇంపార్టెంట్!” అంటూ కన్నుకొట్టి కాల్ లిఫ్ట్ చేసింది ఆరు.
“హలో…”
కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుంచి తన తల్లి గొంతు వినిపించింది.
“అమ్మా! ఎలా ఉన్నావ్? ఎన్ని రోజులైంది మీరు నాకు కాల్ చేసి! కనీసం నేను కాల్ చేద్దామన్నా కుదరట్లేదు. నాకు నైట్ షిఫ్ట్ ఉంటుంది. మళ్లీ మార్నింగ్ వచ్చి కాల్ చేద్దామంటే మీరు ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు.”
అంటూ తన మనసులోని బాధను బయటపెట్టింది ఆరు.
కానీ అవతలి వైపు నుంచి వెంటనే సమాధానం రాలేదు.
“మేము బాగానే ఉన్నామే… కానీ…” అంటూ ఆవిడ మాట మధ్యలోనే ఆపేశారు.
తల్లి గొంతులో ఏదో తెలియని ఆందోళన కనిపించడంతో ఆరు కంగారుపడింది.
“ఏమైంది అమ్మా? ఏదైనా సమస్యా?” అని ఆత్రంగా అడిగింది.
“అదేం లేదే ఆరు. నువ్వు నెక్స్ట్ ఫ్లైట్‌కి హైదరాబాద్ రావాలి. అందుకే నీకు కాల్ చేశాను” అని చెప్పారు ఆవిడ.
ఆ మాట వినగానే ఆరు ముఖంలో ఆశ్చర్యం కనిపించింది.
“నెక్స్ట్ ఫ్లైట్‌కా? ఏంటి అమ్మా, అంత సడన్‌గా అంటే ఎలా? హాస్పిటల్‌లో లీవ్ అప్లై చేయాలి కదా! ఇప్పటికిప్పుడు రావడం కష్టం కదా!” అంటూ దిగులుగా అంది.
“నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆరు. రేపు మార్నింగ్ కల్లా నువ్వు హైదరాబాద్‌లో ఉండాలి. ఇది మీ నాన్నగారు చెప్పిన మాట!” అని ఖచ్చితంగా చెప్పారు ఆవిడ.
“కానీ ఎందుకమ్మా? అసలు ఏమైంది? ఏదైనా జరిగిందా?” అని అడిగింది ఆరు కంగారుగా.
“ఆ విషయం నేను ఇప్పుడు చెప్పలేను. కానీ నువ్వు మాత్రం రేపు ఇక్కడ ఉండాలి.”
అంటూ ఆవిడ ఆర్డర్ వేసినట్టుగా చెప్పి కాల్ కట్ చేయబోయారు.
“అమ్మా! ప్లీజ్… నైట్ వరకు ఫ్లైట్ చూసుకుని బయలుదేరుతాను. ఇప్పుడే నైట్ షిఫ్ట్ నుంచి వచ్చాను. కొంచెం రెస్ట్ తీసుకుని వస్తాను” అని బతిమాలింది ఆరు.
“సరే!” అని చెప్పి ఆవిడ కాల్ కట్ చేశారు.
ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ కొద్దిసేపు అలాగే ఉండిపోయింది ఆరు.
తల్లి చెప్పిన మాటలు ఆమె మనసులో ఏవేవో అనుమానాలను రేకెత్తించాయి. అసలు ఇంట్లో ఏం జరిగి ఉంటుంది? నాన్నగారు అంత అత్యవసరంగా తనను హైదరాబాద్‌కు ఎందుకు రమ్మంటున్నారు?
ఎన్ని ఆలోచనలు వచ్చినా సమాధానం మాత్రం దొరకలేదు.
చివరికి, అలసటకు తోడు ఆలోచనలను కూడా పక్కన పెట్టి మళ్లీ బెడ్‌పై వాలిపోయింది.
కోల్‌కతాలో…
ఓ పెద్ద కాన్ఫరెన్స్ హాల్.
దాదాపు యాభై మంది వరకు అక్కడ ఉన్నారు. వారందరి చూపులూ ప్రస్తుతం ఒక్క వ్యక్తి మీదే ఉన్నాయి.
అతడు ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రెజెంటేషన్‌ను వివరిస్తున్నాడు.
అతని కళ్లలో కనిపించే ఆత్మవిశ్వాసం, పెదవులపై మెరిసే ఆటిట్యూడ్‌తో కూడిన చిరునవ్వు, ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరించే విధానం… అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.
అంతమంది తనను గమనిస్తున్నా అతనిలో ఎలాంటి బెరుకూ లేదు.
తన గొంతులోని గంభీరతతో, మాటల్లోని స్పష్టతతో ప్రాజెక్ట్‌లోని ప్రతి అంశాన్ని వివరిస్తూ ముందుకు సాగుతున్నాడు.
అతని ప్రెజెంటేషన్ పూర్తయ్యే సమయానికి హాల్‌లో ఉన్నవారందరికీ ప్రాజెక్ట్‌పై పూర్తి అవగాహన వచ్చింది.
“Is there any more doubts?” అని తన బేస్ వాయిస్‌తో అడిగాడు అతడు.
“No more doubts, sir!” అంటూ అక్కడున్న ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు.
“Congratulations for the project!” అంటూ అతనికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.
“Thank you!” అని చిరునవ్వుతో సమాధానమిచ్చిన అతడు, తన పని పూర్తవడంతో కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వచ్చాడు.
బయటకు వచ్చిన వెంటనే అతని ఫోన్ మోగింది.
స్క్రీన్‌పై నాన్న పేరు కనిపించడంతో కాల్ లిఫ్ట్ చేశాడు.
“ఏంటి నాన్నా? కాల్ చేశారు?” అని అడిగాడు.
“యష్! మీటింగ్ కంప్లీట్ అయిందా?” అని అడిగారు అవతలి వైపు నుంచి.
“హా నాన్నా! ఇప్పుడే అయిపోయింది. ఏంటి? ఈ టైమ్‌లో కాల్ చేశారు?” అని అడిగాడు యష్.
ఎందుకో ఆయన గొంతులో ఏదో కంగారు కనిపించినట్టుగా అనిపించింది అతనికి.
“ఏం లేదు యష్. నీ మీటింగ్ అయిపోయింది కదా! వెంటనే హైదరాబాద్ బయలుదేరు. రేపు మార్నింగ్ కల్లా ఇక్కడ ఉండాలి” అని చెప్పారు ఆయన.
“ఎందుకు నాన్నా? ఏదైనా ప్రాబ్లమా?” అని అడిగాడు యష్.
“అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు మాత్రం రేపు ఇక్కడ ఉండేలా చూసుకో” అని చెప్పి కాల్ కట్ చేశారు ఆయన.
ఫోన్ చేతిలోనే పట్టుకుని కాసేపు ఆలోచనలో పడిపోయాడు యష్.
అసలు నాన్న తనను అంత అత్యవసరంగా హైదరాబాద్‌కు ఎందుకు రమ్మంటున్నారు?
అదే సమయంలో ఆరును కూడా ఇంటికి రమ్మని పిలిచారు.
ఇద్దరినీ ఒకేసారి హైదరాబాద్‌కు రప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది?
వాళ్లిద్దరి జీవితాల్లో ఏదో జరగబోతోంది…
కానీ అది ఏంటో తెలుసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది.
Continues…
ఆరుకి, యష్‌కి ముందే ఒకరితో ఒకరికి పరిచయం ఉందా?
వాళ్లిద్దరినీ ఇంత అత్యవసరంగా హైదరాబాద్‌కు ఎందుకు పిలిచారు?
అసలు ఆ జంట పెళ్లి చితి మంటల సాక్షిగా ఎందుకు జరగబోతోంది?
తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే!
స్టోరీ నచ్చితే రేట్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, బ్యూటిఫుల్స్! ❤️