Crazy ప్రేమమ్ – 1
బయటనుండి అదేపనిగా వినిపిస్తున్న కాలింగ్ బెల్ శబ్దానికి, గబా గబా వచ్చి డోర్ తీసి ఎదురుగా ఉన్న ఆవిడని కొత్తగా చూస్తూ “ఎవరండీ మీరు..?? “ అని అడిగింది 20 ఏళ్ల “ఆముక్త“..
చేతిలో పాయసం బౌల్స్ ఉన్న ట్రే పట్టుకుని తనను కాస్త పరీక్షగా చూస్తూనే ఆశ్చర్యం, ఆనందంతో కళ్ళు విప్పార్చి…
“నువ్వు..?? నిన్న కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో శివ కీర్తనలు పాడింది నువ్వే కదా అమ్మాయి..?? “ అడిగింది అనసూయ…
ఆమె గురించి తనకెలా తెలుసు అనుకుంటూ “హ, అవును..!! కానీ మీరూ..??” అయోమయంగా అడిగింది ఆముక్త…
కానీ ఆ విషయం పక్కన పెట్టేసిన అనసూయ గారు మాత్రం “చాలా చక్కగా పాడావు అమ్మాయి.. నీ గొంతులో శివ పురాణం వింటుంటే, నిజంగా ఆ కైలాసంలో శివయ్య సాన్నిథ్యంలో ఉండి, ఆయన్ను కళ్ళారా చూసినట్టు మనసు నిండిపోయిందంటే నమ్ము..!!” ఆవిడపాటికి ఆవిడ చెప్తూ పోతున్నారు.
“అమ్ము.. ఎవర్రా..??” లోపల నుండి వినిపించిన పిలుపుకి..
“హ, బాబాయ్ వస్తున్న..!!” అని చెప్పి అసలు ఆవిడేవరో తనక్కూడా తెలియక, అనసూయ గారిని చూసింది ఆముక్త.
“అయ్యో… చెప్పడం మర్చిపోయా..!!” అని ఆమె నవ్వుతూ..
“నా పేరు అనసూయ.. ఈరోజే ఇక్కడకి కొత్తగా వచ్చాం.. అదిగో ఆ రెండిల్ల అవతలే మా ఇల్లు కూడా..!!” అని చెప్పింది..
“ఆముక్త ఎవరది..?? పొద్దున్నే ఎవరితో ముచ్చట్లు..? టైమ్ అవుతుంది త్వరగా రా..!!” కాస్త విసుగ్గానే వినిపించిన పిన్ని పిలుపుకి..
“హ, వస్తున్న పిన్ని..” అంటూ అనసూయ గారిని చూసి నవ్వుతూ.. “థాంక్స్ అండీ..!!” అని చెప్పి మొహం మీదే తలుపు మూయలేక మొహమాటంగా చేతులు నలుపుకుంది ఆముక్త.
“పర్లేదమ్మా ఏదో హడావిడిలో ఉన్నట్టున్నారు వెళ్ళు.. నేను మళ్ళీ కలుస్తాలే.. ఈరోజే పాలు పొంగించాం కదా..పాయసం చేసి దేవునికి పూజ చేసుకున్నాం.. తీసుకో ప్రసాదం.!!” అని ట్రే ముందుకి పెట్టింది అనసూయ.
ఈలోగా లోపల నుండి బయటకు వచ్చిన సుకన్య గారు.. “ఏంటి ఆముక్త ఎంతసేపు ఇక్కడ..?? “ అని విసుక్కుంటూ ఎదురుగ ఉన్న అనసూయ గారిని చూస్తే….
“ పిన్ని ఈ ఆంటీ వాళ్లు.. “
“ఆ విన్నానులే..!” అంటూ అనసూయ గారి వైపు చూసి మొహాన్ని చిట్లిస్తూ..
“ఏంటి ఊరునుండి వచ్చారా..?? “ అని అడిగింది సుకన్య హడావిడిగా రెడీ అవుతూ…
“అవునండి.. మీకెలా తెలుసు..!!” నవ్వుతూ అడుగుతున్న అనసూయ గారితో…
“మిమ్మల్ని చూస్తేనే అర్ధం అవుతుంది లెండి..! అయినా ఇక్కడ ఇలాంటివి ఎవరు చేయరు.. మీరు అడక్కున్నా మీకో ఫ్రీ అడ్వైస్..
ఈ పాయసం పంచడం అంతా ఇక్కడితో ఆపేయండి..ఇదేం మీ ఊరు కాదు మీరు ఇచ్చినా ఎవరు తీసుకోరు..!” మొహం మీదే చెప్పింది సుకన్య.
ఆమె మాటకి అనసూయ గారు మొహం చిన్నబోతే..
“ఆంటీ ప్రసాదం అంటున్నారు కదా ఇలా ఇవ్వండి పర్లేదు.. “ నవ్వుతూ తీసుకుంది ఆముక్త.
అప్పుడే తన రూమ్ లో నుండి బయటకు వచ్చింది 19 ఏళ్ల సంయుక్త.. సుకన్య కూతురు..
మినీ స్కర్ట్, క్రాప్ టాప్ లో ఉన్న తను లీవ్ చేసిన హెయిర్ బ్రష్ చేసుకుంటూ.. “ మా ఏంటి మెయిన్ డోర్ దగ్గర ఈ మీటింగ్ పొద్దున్నే..?? “ అని ఆముక్త చేతిలో పాయసం బౌల్ చూసి చిరాకు పడుతూ అడిగింది..
అడిగి మళ్ళీ ఆముక్త సమాధానం చెప్పకముందే అక్కడినుండి వెళ్ళిపోతూ..
హెయిర్ బ్రష్ ఆముక్త చేతిలో పెట్టి, సుకన్యకి, అముక్తకి మధ్యలో నుండి బయటకు వెళ్తూ.. “బాయ్ మా..!” అంది.
ఓ పక్క లంగా ఓణిలో పద్దతిగా ఉన్న ఆముక్త, మరో పక్క చిన్న మిడ్డిలో పోర్ష్ గా ఉన్న సంయుక్తని చూసి ఈసారి అనసూయ గారు మొహం చిట్లించి చూస్తే..
“ఏయ్ సంయు.. టిఫిన్ తినకుండా వెళ్తున్నావ్ ఆగవే..!!” అంది ఆముక్త.
“ష్…అమ్ము నీకు తెలుసు కదా ఐ ఆమ్ ఇన్ డైటింగ్ అని..!! ఇంకెందుకు ఈ షో అప్ అవసరమా..?? వెళ్ళు.. వెళ్లి నీ మసాలా దోశ నువ్వు తినెయ్.. తినేసి ఇంకాస్త బొండంలా తయారవ్వు గొ.. గో..!!” అని చెప్తూనే లిఫ్ట్ వైపు వెళ్ళిపోయింది సంయుక్త.
“ ప్చ్, అదేమో కడుపు కాల్చుకుని జీరో సైజ్ అంటుంది.. ఇదేమో దేవుళ్ళ ప్రసాదాలు అంటూ ఇలా..!!” అని విసుక్కుంటూ..
“ ఆముక్త ఇక్కడ మాట్లాడ్డం అయిపోతే త్వరగా రావే.. ఆఫీస్ కి టైమ్ అవుతుంది..!!” అని చెప్తూనే రూమ్ లోకి వెళ్ళిపోతున్న సుకన్యని చూసి…
“హ్మ్, సరేనమ్మా.. ఏదో పనిలో ఉన్నట్టున్నావ్ వెళ్ళు..!!” అని అనసూయ గారు వెనక్కి తిరిగితే టక్కున డోర్ క్లోజ్ చేసిన సుకన్య..
“ఒసేయ్ పిచ్చి మొద్దు.. అలా ఎవరు ఏదిచ్చినా తీసుకోవడం ఏనా అసలు బుర్ర బుద్ది ఎక్కడ పెట్టావే పొద్దున్నే..?? “ అని అరుస్తున్న సుకన్య మాటలు అనసూయకి కి వినబడి, ఒక్క క్షణం అక్కడే ఆగిపోయింది..
“ప్చ్, పిన్ని ఆ ఆంటీని చూస్తే అలా అనిపించలేదు.. పైగా దేవుడి ప్రసాదం..!!” అంటున్న ఆముక్తని చూసి..
“నీ మొహం.. అందరు మెళ్ళో బోర్డ్ వేసుకుంటారు మరి మేమిలాంటివాళ్ళం అని.. అయినా ప్రసాదమ్ అంటే చాలు ముందుంటావ్…!!” వెటకారంగా అంది సుకన్య..
“హుష్.. సుక్కు ఎందుకే అమ్ముని ఎప్పుడూ ఏదోటి అంటుంటావ్.. ఇప్పుడేమైందని పక్కన ఇంట్లోకి ఎవరో వచ్చారు.. దేవుడి ప్రసాదం అన్నారు కదాని కాదనలేదు.. తప్పేముంది అందులో.. తీసుకుంది అంతే కదా.. తినడం తినకపోవడం తర్వాత విషయం..!!” అని భార్యకి చెప్పి..
“అమ్ము త్వరగా నాకు టిఫిన్ వడ్డించు..టైమ్ అవుతుంది..!!” అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు శివరాం గారు.
“అవునవును మరి నేనే ఖాళీగా ఉన్నాను.. నాకు మాత్రం టైమ్ అవ్వట్లేదా ఏంటి..? నాకూ వడ్డించు..!!” అని కోపంగా చెప్పి, భర్త పక్కన కూర్చుంది సుకన్య.
@@@
అక్కడివరకు వాళ్ళ మాటలు వినబడుతుంటే.. “సిటీ అయితే మాత్రం ఇరుగుపొరుగు వాళ్ళకి కనీసం ప్రసాదాలు కూడా పంచుకోరా ఏంటి..?? “ విడ్డురంగా అనుకుంటూ వాళ్ళ ఫ్లాట్ లోకి వెళ్ళింది.
ఇంట్లోకి అడుగు పెట్టగానే.. “మ్మా…మ్మా.. ఎక్కడున్నావే..? “ బెడ్ రూమ్ లో నుండి గారంగా అరుస్తున్న కొడుకు పిలుపుకి..
పాయసం ట్రే టేబుల్ మీద పెట్టేసి లోపలికి వెళ్లిన వైదేహి గారు.. బెడ్ మీద బోర్లా పడుకుని కళ్ళు కూడా తెరవకుండా దొర్లుతూ అరుస్తున్న 27 ఏళ్ల కొడుకు వీపున ఒక్కటిచ్చింది.
“ స్…మ్మా..!! కొట్టకుండా కాఫీ ఇవ్వమ్మా ప్లీజ్..”
“ఒరేయ్ శివ.. ఇంకా ఎంతసేపు పడుకుంటావురా.. అయినా సిగ్గులేకుండా పాచి మొహంతో కాఫీ ఏంట్రా అడ్డగాడిద.. లే లేచి రెడీ అవ్వు..!!” అని దుప్పటి లాగేసి, వెళ్లి విండో కర్టెన్స్ తెరిచింది.
“ఆ.. అమ్మా పడుకుందే పొద్దున్న 5 కి..!! బ్రహ్మ ముహూర్తంలో పాలు పొంగించాలి, పూజ చేయాలి అంటూ రాత్రంతా నిద్రపోనివ్వకుండా షంటుతూనే ఉన్నావ్..
తీరా పొద్దున్నే ఎలాగోలా తీసుకోచ్చి ఇక్కడ వదిలేస్తే నీ పూజ ఏదో నువ్వు చేసుకోవాలి గానీ.. నాకేంటమ్మా పొద్దున్నే ఈ టార్చెర్..?? “ విసుక్కుంటూ లేచి కూర్చున్నాడు శివిన్.
“టార్చెర్ ఏంట్రా టార్చెర్.. అసలు ఊరునుండి వచ్చాక పూర్తిగా చెడిపోయావ్ వెధవ.. అర్థరాత్రి అయినా ఆ ఫోన్ పట్టుకునే ఉంటావ్..తెల్లారి ఇంతసేపైనా పడుకోవడం ఏంటో..!!” అని తిడుతూ వచ్చి శివ్ తల నిమురుతూ..
“ అరే నాన్న ఈరోజు నీకు తలంటనా..?? “ ప్రేమగా అడిగింది..
“ నో..!! అని గట్టిగా అరిచి.. తల్లీ చేతుల్లోంచి జుట్టు విడిపించుకొని..
“మ్మా నాకు ఆఫీస్ కి టైమ్ అవుతుంది..!!” అని వాష్రూమ్ లోకి పరిగెత్తాడు శివ్.
“మొండోడు “ అని నవ్వుతూ తిట్టుకుని, శివ్ వెళ్ళగానే బెడ్ సర్ది టిఫిన్ చేయడానికి వెళ్ళింది ఆవిడ..
@@
continued…
Swipe left/right or tap the sides to turn pages