╰┈➤𝐀𝐥𝐦𝐨𝐬𝐭 𝐈𝐬𝐡𝐪 ᥫ᭡🪽 – 1
ముంబైలోని ఆ చిన్న బస్తీ… ఇరుకైన గదులైనా ప్రేమకు కొదవలేని ఇల్లు అది.
సోఫాలో హాయిగా పడుకుని టీవీ చూస్తున్నాడు విజయ్ (విజ్జు). అప్పుడే వెనక నుంచి సైలెంట్‌గా వచ్చిన ఇరా, వాడి నెత్తి మీద ఒక్కటి మొట్టి, చేతిలో నుండి రిమోట్ లాక్కుని చానల్ మార్చేసింది.
“అక్కా! రిమోట్ ఇవ్వు, నేను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నా కదా, ఎందుకు మార్చావ్?” అంటూ ఉడుక్కుంటూ లేచి ఆమెతో ఫైటింగ్ కి దిగాడు విజయ్.
“నేను ఇవ్వను! ఇప్పటి వరకు నీకు నచ్చింది నువ్వు చూశావు కదా, ఇప్పుడు నేను చూస్తా,” అని రిమోట్ వెనక్కి దాచుకుంటూ వాడితో గొడవకు దిగింది ఇరా.
“అబ్బబ్బా… మళ్లీ మొదలెట్టారా టీవీ రిమోట్ కోసం గొడవ? ఉండండి మీకు ఇలా కాదు…” అంటూ వంటగదిలో నుండి కోపంగా వచ్చిన వాళ్ల అమ్మ మీనాక్షి, డైరెక్ట్ గా వెళ్లి టీవీ స్విచ్ కట్టేసింది.
“అమ్మా.. నేనేం చేశానే? అక్కే గొడవ ముందు స్టార్ట్ చేసింది!” అని విజయ్ బుంగమూతి పెట్టుకుంటే…
“ఆహా! మార్నింగ్ నుండి అడుగుతుంటే నన్ను పట్టించుకోకుండా నీకు నచ్చినవి చూస్తున్నావ్. మరి గొడవ పడకుండా ముద్దు పెట్టుకుంటారా?” అని వెటకారంగా అంది ఇరా.
“అబ్బా… యాక్! నీ ముద్దా? ఎవరికి కావాలి? మేకప్ లేని దెయ్యంతో ముద్దు పెట్టుకున్నట్లే ఉంటుంది,” అని విజయ్ చిరాగ్గా ముఖం పెట్టి అనగానే…
ఇరా కళ్ళు పెద్దవి చేసి, “ఏంట్రా అన్నావ్? దెయ్యాన్నా? ఉండురా నీ పని చెప్తా! ఈరోజు నా చేతుల్లో అయిపోయావు నువ్వు,” అంటూ తమ్ముడిని కొట్టడానికి పరిగెత్తింది ఇరా.
వాడు ఆగుతాడా? ఆమెకు అందకుండా, “దమ్ముంటే పట్టుకో అక్కా!” అంటూ స్పీడ్ గా సోఫా ఎక్కి దిగుతూ గదుల్లోకి పరిగెడుతున్నాడు విజయ్.
వాళ్ల అల్లరి చూసి చిరునవ్వు నవ్వుకుని, “పోనీలే, కరెంట్ బిల్లైనా మిగిలింది,” అని గొణుక్కుంటూ మీనాక్షి తిరిగి వంటగదిలోకి వెళ్తుండగా…
“ఇరా… ఇరా!” అని ఆత్రంగా అరుస్తూ, ఆయాసపడుతూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది చరిత (చెర్రీ).
“ఏమైందే చెర్రీ? ఎందుకంతలా అరుస్తూ దాన్ని పిలుస్తున్నావ్? ఏమైనా కుక్క తరిమిందా?” అడిగింది మీనాక్షి కంగారుగా.
“కుక్క కాదు ఆంటీ! మీకు తెలుసా… ఎంత పెద్ద గుడ్ న్యూసో ? అసలు ఇలా అవుతుంది అని నేను కలలో కూడా అనుకోలేదు !” అని చెర్రీ ఎక్సైట్మెంట్ తో చెబుతుంటే…
వాళ్ల మాటలు విని గొడవ ఆపేసి అక్కడికి వచ్చింది ఇరా.
” ఏమైందే? ఏంటి నీ గోల?”
“రా చెప్తాను!” అని ఇరా చేయి పట్టుకుని లాక్కెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది. తను కూడా పక్కనే కూర్చుని, తన ప్యాంట్ జేబులో ఉన్న ఫోన్ తీసింది చెర్రీ.
అది చూడగానే ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేసిన ఇరా, “ఏంటే ఇది? నీకు ఈ టచ్ స్క్రీన్ ఫోన్ ఎక్కడిదే?” అని అడిగింది.
“మా అన్నయ్యదేనే, బతిమాలుకుని అడిగి తెచ్చా. ముందు ఇది చూడు,” అని వాళ్ళు అప్లయ్ చేసిన ఆన్లైన్ సైట్ ఓపెన్ చేసి, ఇరా చేతిలో పెట్టింది.
“రాయల్ ఎలైట్ కాలేజ్… ఇండియాలోని టాప్ బిలియనీర్స్, కార్పొరేట్ వారసులు చదివే కాలేజ్ అది! అందులో మన ఇద్దరికి ఫ్రీ సీట్ వచ్చిందే ఇరా!” అని గంతులు వేస్తూ ఆనందంగా చెప్పింది చెర్రీ.
ఆ మాట వినగానే ఇరాకు మాట రాలేదు. స్క్రీన్ మీద ఉన్న తన పేరు, సెలెక్టెడ్ అన్న అక్షరాలు చూసి, “ఏంటి… నిజామా?” అని నమ్మలేనట్టు ముఖం పెట్టింది.
“నువ్వు చెప్పేది నిజమేనా చరిత? అంత పెద్ద కాలేజీలో మీ ఇద్దరికీ ఉచితంగా సీటు వచ్చిందా?” అని సంతోషంగా అడిగారు మీనాక్షి.
“అవును ఆంటీ! వందల మంది రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మన ఇరా టాప్ ఫైవ్ ర్యాంక్ కొట్టింది. దానికి నేను కూడా తోడయ్యాను,” అని గర్వంగా చెప్పింది చెర్రీ.
“అమ్మో! ఉండు ఇప్పుడే వస్తాను,” అని వంట గదిలోకి వెళ్ళి చక్కెర డబ్బా తెచ్చి, గుప్పెడు చక్కెర తీసుకుని ఇద్దరి నోట్లో ప్రేమగా పోసింది మీనాక్షి.
“ఎంత మంచి వార్త చెప్పావే తల్లి! మీరు కానీ ఆ కాలేజీలో చదివి ప్రయోజకులు అయితే… మనకి ఈ బస్తీలో పడుతున్న కష్టాలు తీరిపోతాయి,” అని ఆనందంతో ఆవిడ కళ్లు చెమర్చాయి.
“కంగ్రాట్స్ అక్కా! కంగ్రాట్స్ చెర్రీ!” అని విజయ్ కూడా వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
అందరూ అంత సంతోషంగా ఉన్నా, ఇరా ముఖంలో మాత్రం ఒక తెలియని టెన్షన్ మొదలైంది. ఆమె ఆలోచనలు వేరేలా ఉన్నాయి.
“కాలేజ్ ఫీజు ఉండదు సరే… కానీ, మనకి ఆ కాలేజ్ ఇక్కడినుండి చాలా దూరం కదమ్మా. అక్కడ హాస్టల్ లో ఉండాలి, బుక్స్ కొనాలి,యూనిఫాం కొనాలి , సిటీలో బతకాలి… దానికి డబ్బు కావాలి కదా! నాన్న కారు తోలితే వచ్చే జీతం ఈ ఇంటి నెల ఖర్చుకే సరిగ్గా సరిపోవట్లేదు. మన దగ్గర ఎక్కడివి ఇప్పుడు అంత డబ్బు?” అని ముభావంగా, చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ అంది ఇరా.
ఆ మాటతో ఒక్కసారిగా ఇంట్లో సైలెన్స్.
కానీ మీనాక్షి వెంటనే తేరుకుని ఇరా దగ్గరకు వచ్చి ఆమె బుగ్గలు నిమిరింది. “నువ్వెందుకు అవన్నీ ఆలోచిస్తున్నావు తల్లి? నీ హాస్టల్ గురించి మేము చూసుకుంటాము. మీ నాన్న పగలు డ్యూటీకి, రాత్రి ఆటోకి వెళ్తున్నాడు. నేను కావాలంటే మరో రెండు ఇళ్లలో అంట్లు తోమడానికైనా వెళ్తాను… కానీ నీ చదువు మాత్రం ఆపను.”
ఆ మాటలకు ఇరా గుండె బరువెక్కింది. “అమ్మా…” అంటూ ఎమోషనల్ గా మీనాక్షిని వాటేసుకుంది ఇరా.
“ఇంతకీ ఎప్పుడు జాయిన్ అవ్వాలి చరిత?” ఇరా తల నిమురుతూ అడిగింది మీనాక్షి.
“ఇంకో పదిహేను రోజుల్లో ఆంటీ,” అంది చెర్రీ కూడా ఎమోషనల్ అవుతూ.
“హ్మ్.. పదిహేను రోజులు అంటే ఎక్కువ టైమ్ లేదు. సర్లే మీరు కాలేజ్ కి వెళ్లే పనిలోనే ఉండండి. నేను ఈ విషయం ముందు మీ నాన్నకి చెప్పాలి. ఆయన ఎంత సంతోషిస్తారో,” అని బల్ల మీద ఉన్న తన పాత నోకియా ఫోన్ తీసి ఆనంద్ గారికి ఫోన్ చేయడానికి బయటకు వెళ్ళింది మీనాక్షి.
ఇరా, చెర్రీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.
“మొత్తానికి మన కల నెరవేరుతుంది ఇరా!” అని ఇరాను గట్టిగా హగ్ చేసుకుంది చెర్రీ.
“అవునురా… మనం బాగా చదువుకుని మన ఫ్యామిలీలను ఈ కష్టాల నుండి బయట పడేయాలి. మన సక్సెస్ తో ఈ బస్తీ వాళ్ళకి కూడా హెల్ప్ చెయ్యాలి ,” అని చిన్నగా నవ్వుతూ, ఎంతో దృఢనిశ్చయంతో చెప్పింది ఇరా.
వాళ్ళిద్దరి కళ్ళలో భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు.
కానీ ఆ ‘రాయల్ ఎలైట్ కాలేజ్’లో వాళ్ల కోసం ఒక ముళ్ల కిరీటం… ఒక ‘నీలి కళ్ళ నియంత’ ఎదురుచూస్తున్నాడని ఆ క్షణంలో వాళ్లకు తెలియదు!
ఇంకా ఉంది….
Swipe left/right or tap the sides to turn pages