రహస్యమైన బంగ్లాలో అడుగు పెట్టిన ఆద్వైత్ కు ప్రతి క్షణం ఒక కొత్త భయం ఎదురవుతుంది. తన పేరునే పిలిచే విచిత్ర స్వరాలు, తెల్లటి కళ్లున్న వృద్ధురాలు, పాత కుటుంబ ఫోటోలో తనలాగే కనిపించిన యువకుడు… ఇవన్నీ అతని గతానికి ఆ బంగ్లాతో ఏదో సంబంధం ఉందనే అనుమానాన్ని మరింత బలపరుస్తాయి. కానీ రాత్రి ముగిసినా… ఆ ఇంటి రహస్యం మాత్రం ఇంకా మొదలే అవుతుంది.
***
ఆ ముసలాయన చెప్పింది విన్న తరువాత ఆద్వైత్ కు సందేహం మరింత పెరిగింది. వెంటనే అతను ఊరి లోనికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాడు.
ఇక అతను ఒక్కసారి బంగ్లా వైపు చూసి, ‘నీలో దాగి ఉన్నది ఏంటో తెలుసుకునే వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు’ అని తనలో తానే అనుకుంటూ గ్రామంలోకి వెళ్లాడు.
బంగ్లా నుంచి కొంత దూరం లోపలికి వెళ్తేనే గ్రామం మొదలవుతుంది. ఆ బంగ్లాకు, ఆ గ్రామానికి ఎలాంటి సంబంధమే లేనట్టుగా అనిపిస్తోంది.
‘ఈ గ్రామంలో ఎవరికైనా ఆ బంగ్లా గురించి నిజం తెలిసి ఉంటుందా?’ అని మనసులో అనుకుంటూ ముందుకు నడిచాడు.