“చూద్దాం, ముందైతే రిజల్ట్ రానివ్వు. నాకైతే నువ్వు కచ్చితంగా క్వాలిఫై అవుతావు అనిపిస్తుంది. ఎందుకంటే నీ కష్టం ప్రతిరోజూ చూశాను కదా! ఎంత కష్టం అనుభవించావో నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచించకు” అన్నాడు విక్కీ.
ఇక అప్పుడే ఐస్క్రీమ్ రావడంతో ఇద్దరూ ఐస్క్రీమ్ తినేసి, కొంచెంసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకొని, ఆ తర్వాత బ్రౌనీ కూడా తిని ఇంటికి స్టార్ట్ అయ్యారు.
“ఎలా రాశావు మా బుజ్జి తల్లి ఎగ్జామ్?” అని అడిగారు ఊర్మిళా గారు, కోడలు రాగానే.
“పర్వాలేదు అత్తయ్య, కానీ భయంగా ఉంది” అంటూ వైదేహి అత్తగారిని చుట్టుకుంది.
“అబ్బా! కంగారు పడకమ్మా, అయిపోతుందిలే. నాకు నమ్మకం ఉంది. నీకు కచ్చితంగా సీటు వస్తుంది. మంచి ర్యాంకుతో క్వాలిఫై అవుతావు నువ్వు” అన్నారు ఊర్మిళా గారు, కోడలిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తూ.