New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ ప్రేమకు మరో రూపం – 1

నీ ప్రేమకు మరో రూపం – 1

 

 

కొన్ని ప్రేమకథలు పెళ్లితో ముగియవు… మరణం తర్వాత కూడా ఒకరి జ్ఞాపకాలతో మరొకరు బతుకుతారు.

 

ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయింది. అప్పుడప్పుడూ మెరుస్తున్న మెరుపులు, ఉరుములు ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చెదరగొడుతున్నాయి.

 

హాస్పిటల్ కారిడార్‌లో ఓ అమ్మాయి చేతిలో ఒక రిపోర్ట్ పట్టుకుని కూర్చుంది.ఆమె పేరు అక్షర.

కళ్లలో నీళ్లు, మనసులో చెప్పలేనంత బాధ. చేతిలో ఉన్న రిపోర్ట్ వైపు చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటోంది.

 

ఆ రిపోర్ట్‌లో ఉన్న విషయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది.ఆమె తల్లి కాబోతోంది.4 మంత్స్ ప్రెగ్నెంట్……

 

కానీ ఆ సంతోషాన్ని పంచుకోవాల్సిన వ్యక్తి మాత్రం ఆమె దగ్గర లేడు.ఒక్కసారి కళ్లు మూసుకోగానే అరుణ్ నవ్వుతున్న ముఖం గుర్తొచ్చింది.

 

“అక్షరా… ఏంటి మేడమ్! ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు. కొంచెం నవ్వొచ్చు కదా!”

అంటూ తనను ఆటపట్టించే అరుణ్ మాటలు చెవుల్లో మారుమోగాయి.

 

అక్షర పెదవులపై చిన్న నవ్వు కనిపించింది.కానీ మరుక్షణమే ఆ నవ్వు మాయమైంది.ఎందుకంటే ఆ నవ్వును చూడటానికి అరుణ్ ఇప్పుడు లేడు.

 

ఐదు నెలల క్రితం…

 

“అరుణ్! నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు. కనీసం ఒక్కసారి ఫోన్ ఎత్తవా?”అంటూ అక్షర ఫోన్‌లో మాట్లాడుతోంది.

 

అవతలి నుంచి సమాధానం రాకపోవడంతో చిరాకుగా ఫోన్ పక్కన పెట్టింది.అంతలోనే ఫోన్ మోగింది.తెలియని నంబర్.”హలో!””మీరు అక్షర గారేనా?””అవును. ఎవరు?”

 

“మీకు అరుణ్ తెలుసా మేడమ్?”ఆ పేరు వినగానే ఆమె ముఖంలో నవ్వు వచ్చింది.”తెలుసు. నా హస్బెండ్. ఏమైంది?”

 

అవతలి వ్యక్తి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు.”మేడమ్… అరుణ్ గారికి యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నారు. మీరు వెంటనే రాగలరా?”

 

అక్షర చేతిలోని ఫోన్ జారిపడింది.”అరుణ్…”

ఆ ఒక్క మాట తప్ప ఆమె నోటి నుంచి ఇంకేమీ రాలేదు.

 

హాస్పిటల్‌కు చేరుకునేసరికి అంతా అయిపోయింది.

డాక్టర్లు ప్రయత్నించినా అరుణ్‌ను కాపాడలేకపోయారు.

 

అతని నిర్జీవమైన శరీరం పక్కన కూర్చున్న అక్షర అతని చేతిని పట్టుకుని ఏడుస్తోంది.”అరుణ్… లే! నాతో మాట్లాడవా? నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి చెప్పు!”అతని చేతిని తన కళ్లకు అద్దుకుంది.

 

“నిన్ను ఒక విషయం అడగాలి అరుణ్… మనం కలిసి కనుకున్న కలలు గుర్తున్నాయా? మనకంటూ ఒక చిన్న ఇల్లు… అందులో మనిద్దరం… మన పిల్లలు…”ఆమె గొంతు వణికింది.

 

“నువ్వు లేచి రా అరుణ్. మన కలల్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోకు.”

 

కానీ సమాధానం లేదు.ఆ రోజు అక్షర జీవితంలో అరుణ్ అనే వ్యక్తి మాత్రమే కాదు… తన భవిష్యత్తు కూడా దూరమైపోయింది.

 

ప్రస్తుతం…

 

హాస్పిటల్ బెడ్‌పై కూర్చున్న అక్షర తన కడుపుపై చేయి వేసుకుంది.

 

“నాన్న మనల్ని వదిలేసి వెళ్లిపోయాడు బంగారం… కానీ నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్లిపోవద్దు.” కన్నీళ్లు ఆగడం లేదు.

 

“నిన్ను చూడాలని మీ నాన్న ఎంత ఆశపడ్డాడో తెలుసా? నువ్వు పుట్టిన తర్వాత నిన్ను ఎత్తుకుని ప్రపంచమంతా తిరగాలని అనుకునేవాడు.”

 

ఆమె కళ్ల నుంచి కన్నీటి చుక్కలు కడుపుపై పడ్డాయి.

“ఇకపై నీకు అమ్మే నాన్న అవుతుంది. నీకు ఏ లోటూ రాకుండా చూసుకుంటాను. నాకు ఎంత కష్టమైనా సరే… నిన్ను మాత్రం బాగా చూసుకుంటాను.”

 

అంతలో డాక్టర్ లోపలికి వచ్చారు.

 

“అక్షర గారు, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన సమయంలో భోజనం చేయాలి. మందులు కూడా మిస్ అవ్వకూడదు.”

 

“అలాగే డాక్టర్.””మీతో పాటు ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీకు సహాయం చేసే వాళ్లు?”

 

అక్షర చిన్నగా తల ఊపింది.”ఉన్నారు డాక్టర్. నా అన్నయ్య ఉన్నాడు.”

 

“మంచిది. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండకూడదు.”డాక్టర్ వెళ్లిపోయారు.

 

అక్షర తన ఫోన్ తీసుకుని అన్నయ్య కళ్యాణ్‌కి కాల్ చేసింది.”అన్నయ్యా…”అవతల నుంచి కళ్యాణ్ కంగారుగా మాట్లాడాడు.

 

“ఏమైంది అక్షరా? ఎందుకలా మాట్లాడుతున్నావ్?”

“అన్నయ్యా… నేను హాస్పిటల్‌లో ఉన్నాను.”

“ఏంటి? ఏమైంది నీకు?”

 

“నాకు ఏమీ కాలేదు అన్నయ్యా… కానీ…””కానీ ఏంటి?”అక్షర కన్నీళ్లు తుడుచుకుంది.”అన్నయ్యా… మన ఇంటికి ఇంకొకరు రాబోతున్నారు.”

 

కళ్యాణ్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు.

ఆ తర్వాత విషయం అర్థమవగానే అతని గొంతు మారిపోయింది.

 

“అక్షరా… నిజమా?””హ్మ్ అన్నయ్యా…””నువ్వు అక్కడే ఉండు. నేను వస్తున్నాను.”

 

ఫోన్ కట్ అయింది.అక్షర మళ్లీ తన కడుపుపై చేయి వేసుకుంది.”చూశావా బంగారం… నువ్వు రాకముందే నీ కోసం ఎదురుచూసేవాళ్లు వచ్చేశారు.”

 

చిన్నగా నవ్వుకుంది.

 

ఆమెకు తెలియదు… రాబోయే రోజుల్లో తన బిడ్డ కోసం ఎంతటి పోరాటం చేయాల్సి వస్తుందో.తన కన్నీళ్లను దాచుకుని నవ్వడం నేర్చుకోవాల్సి వస్తుందో.

 

కానీ ఒక్క విషయం మాత్రం ఆమెకు తెలుసు.

అరుణ్ తనకు ఇచ్చి వెళ్లిన చివరి గుర్తును ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలి.అదే తన జీవితం.

అదే తన ప్రపంచo…….

అక్షర జీవితంలో అరుణ్ లేని లోటు ప్రతి క్షణం కనిపిస్తూనే ఉంది. కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఆ బాధను దిగమింగుకుంటూ రోజులు గడుపుతోంది.

 

ఐదు నెలలు గడిచిపోయాయి.ఆ రోజు తెల్లవారుజామున…అక్షర నొప్పితో విలవిలలాడుతోంది.

 

“అన్నయ్యా… నాకు చాలా నొప్పిగా ఉంది!”అంటూ కళ్యాణ్ చేయి గట్టిగా పట్టుకుంది.

 

“ఏం కాదు అక్షరా… ధైర్యంగా ఉండు. హాస్పిటల్‌కి వచ్చేశాం కదా!”కళ్యాణ్ బయటకు ధైర్యంగా చెబుతున్నా అతని మనసులో భయం అలాగే ఉంది.

 

నర్స్ అక్షరను లోపలికి తీసుకెళ్లింది.

“అన్నయ్యా…!”అక్షర పిలుపుతో కళ్యాణ్ గుండె బరువెక్కింది.

 

“నేను బయటే ఉంటాను అక్షరా. నీకు ఏం కాదు.”

అంటూ ఆమెను లోపలికి పంపించాడు.గంటలు గడుస్తున్నాయి.

 

ఆపరేషన్ థియేటర్ బయట అటూ ఇటూ తిరుగుతున్నాడు కళ్యాణ్. చేతులు జోడించి దేవుడిని ప్రార్థిస్తున్నాడు.

 

“దేవుడా… నా చెల్లికి ఏం కాకూడదు. ఆ అమ్మాయికి ఇప్పటికే చాలా కష్టాలు ఇచ్చావు. కనీసం ఈ బిడ్డనైనా ఆరోగ్యంగా ఇవ్వు.”

 

అంతలోనే లోపల నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది……కళ్యాణ్ ఒక్కసారిగా ఆగిపోయాడు.

 

కొన్ని క్షణాల తర్వాత డాక్టర్ బయటకు వచ్చారు. “కంగ్రాట్యులేషన్స్! పాప పుట్టింది. తల్లీబిడ్డ ఇద్దరూ బాగున్నారు.”

 

ఆ మాట వినగానే కళ్యాణ్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

“థాంక్యూ డాక్టర్!”అతని ఆనందానికి అవధులు లేవు.

 

కొద్దిసేపటి తర్వాత అక్షరను రూమ్‌కి షిఫ్ట్ చేశారు.

చిన్న పాపను చేతుల్లో పెట్టగానే అక్షర కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి.

 

చిన్నగా కదులుతున్న ఆ చేతులను చూస్తూ మురిసిపోయింది.”హాయ్ బంగారం…”పాప బుగ్గను మెల్లగా తాకింది.

 

“నువ్వు వచ్చేశావా అమ్మ దగ్గరికి?”అంటూ పాప నుదుటిపై ముద్దు పెట్టుకుంది.

 

అప్పుడే కళ్యాణ్ లోపలికి వచ్చాడు.”ఏమిటి చెల్లెమ్మా… మన ఇంట్లోకి కొత్త మహారాణి వచ్చేసింది!”

 

అక్షర నవ్వింది.”అన్నయ్యా… చూడు ఎంత బాగుందో!”

 

“అచ్చం నీలాగే ఉంది.””లేదు అన్నయ్యా… అరుణ్‌లా ఉంది.”

 

ఆ పేరు వినగానే కళ్యాణ్ ముఖంలో చిన్న మార్పు వచ్చింది.అక్షర మాత్రం పాపను చూస్తూనే ఉంది.

 

“అరుణ్ ఉంటే ఎంత సంతోషపడేవాడో కదా అన్నయ్యా!”కళ్యాణ్ ఆమె పక్కన కూర్చుని భుజంపై చేయి వేశాడు.

 

“వాడు మన మధ్య లేకపోయినా… వాడి ప్రేమ మన మధ్యే ఉంది అక్షరా. నువ్వు బాధపడకు.”

 

అక్షర మౌనంగా తల ఊపింది.”ఈ పాపకి ఏ పేరు పెడదాం అన్నయ్యా?””అది నువ్వే చెప్పాలి.”

అక్షర పాప వైపు చూస్తూ చిన్నగా నవ్వింది.

 

“ఇషిత…”

 

“ఇషితా?”

 

“అవును అన్నయ్యా. నా జీవితంలోకి వచ్చిన చిన్న సంతోషం పేరు ఇషిత.”కళ్యాణ్ కూడా నవ్వుతూ పాప నుదుటిపై ముద్దు పెట్టాడు.

 

“చాలా బాగుంది. మన ఇషితకి స్వాగతం!”

ఐదేళ్ల తర్వాత…🥰🥰

 

ఉదయం ఏడు గంటలు.

 

ఒక చిన్న ఇంట్లో వంటగదిలో అక్షర హడావుడిగా టిఫిన్ తయారు చేస్తోంది.

 

“అమ్మాాా!”అంటూ బెడ్‌రూమ్ నుంచి ఒక చిన్న గొంతు వినిపించింది.”ఏంటి ఇషి బంగారం ?”

 

“నా బొమ్మ కనిపించడం లేదు!”

“నిన్న ఎక్కడ పెట్టావో అక్కడే వెతుకు తల్లీ.””అక్కడే వెతికాను అమ్మా. అక్కడ లేదు!”అంటూ చిన్నగా మూతి ముడుచుకుని బయటకు వచ్చింది ఇషిత.

 

ఐదేళ్ల వయసు. రెండు చిన్న జడలు, అందమైన కళ్ళు, ముఖమంతా అల్లరి.అక్షరను చూస్తూ…”అమ్మా… నువ్వే తీసి ఉంటావ్!”

“అబ్బా! నేనెందుకు తీస్తాను?””నన్ను స్కూల్‌కి పంపించడానికి!”

 

అక్షర నవ్వు ఆపుకోలేకపోయింది.”అయితే స్కూల్‌కి వెళ్లకపోతే బొమ్మ దొరుకుతుందా?”

 

“యెస్!”

 

“సరే… మరి స్కూల్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటావా?”ఇషిత వెంటనే తల అడ్డంగా ఊపింది.

“నో… నాకు స్కూల్‌కి వెళ్లాలి. నా ఫ్రెండ్‌తో ఆడుకోవాలి.”

 

“మరి త్వరగా రెడీ అవ్వు.”ఇషిత గబగబా వెళ్లిపోయింది.అక్షర నవ్వుకుంటూ టిఫిన్ బాక్స్ సిద్ధం చేసింది.

 

ఇంతలో ఫోన్ మోగింది.”హలో అన్నయ్యా!”

“ఏం చేస్తున్నావ్ అక్షరా?””ఇషితని స్కూల్‌కి రెడీ చేస్తున్నాను అన్నయ్యా.”

 

“సరే. ఈరోజు సాయంత్రం నేను వస్తాను. ఇషితకి ఏమైనా తీసుకురావాలా?””తనకి ఏం కావాలో నీకు తెలుసు కదా అన్నయ్యా. మళ్ళీ బొమ్మలే!”

 

“హాహా… సరే. మరి నీకేం కావాలి?””నాకా? నాకేం వద్దు అన్నయ్యా.”

 

“అదే నీ సమస్య అక్షరా. నీ గురించి అస్సలు పట్టించుకోవు.”అక్షర చిన్నగా నవ్వింది.

 

“సరే అన్నయ్యా. ఇషిత రెడీ అయింది. తర్వాత మాట్లాడతాను.ఫోన్ పెట్టేసింది.

 

మరోవైపు…

 

ఇషిత తన స్కూల్ బ్యాగ్ వేసుకుని బయటకు వచ్చింది.”అమ్మా… ఈరోజు నువ్వు నన్ను స్కూల్‌కి తీసుకెళ్తావా?””అవును తల్లీ.””మరి ఈరోజు త్వరగా వచ్చేయాలి. నేను నీతో పార్క్‌కి వెళ్లాలి.”

 

“ఎందుకమ్మా?””అక్కడ పెద్ద పెద్ద ఊయలలు ఉంటాయి కదా! నాకు ఊగాలి.”

 

“సరే మేడమ్. మీరు చెప్పినట్టే!”అంటూ ఇషిత బుగ్గను పట్టుకుంది అక్షర.

 

ఆ చిన్నారి నవ్వుతో ఆ ఇల్లు మొత్తం సందడిగా మారిపోయింది.కానీ అక్షర జీవితంలో ఇంకా ఎన్నో కష్టాలు ఎదురుచూస్తున్నాయని ఆమెకు తెలియదు.

 

తన కూతురి కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్న ఆమెకు, త్వరలోనే ఒక కొత్త ఉద్యోగం… ఒక కొత్త జీవితం ఎదురుకాబోతోంది.

 

ఆ జీవితంలోకి అడుగుపెట్టబోతున్న వ్యక్తి ఎవరో ఆమెకు తెలియదు…..

 

కొనసాగుతుంది…

 

అక్షర జీవితంలో అరుణ్ స్థానాన్ని ఎవరు అయినా భర్తీ చేయగలడని మీరు అనుకుంటున్నారా?

 

మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో చెప్పండి. ❤️

హాయ్ రీడర్స్! ❤️

ఇది నా మొదటి కథ. మీ ముందుకు ఒక కొత్త కథను తీసుకొస్తున్నాను. ఇందులో ప్రేమ, బాధ, కుటుంబ బంధాలు, చిన్నారి అల్లరి, అందమైన అనుబంధాలు అన్నీ ఉంటాయి.

ఈ ప్రయాణంలో మీ అందరి ప్రేమ, ప్రోత్సాహం నాకు చాలా ముఖ్యం. కథలో ఏవైనా తప్పులు ఉన్నా మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీ సపోర్ట్‌తో ఈ కథను మరింత అందంగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను.

నా మొదటి ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

మీ మోనిషా ❤️