New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
స్వయంసిద్ధ – 4

స్వయంసిద్ధ – 4

స్వయంసిద్ధ – 4వ భాగం

 

ఉదయం ఎనిమిది గంటలు. వంటగదిలో ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తుంది. హాల్లో టీవీలో వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణ మూర్తి ఆఫీసుకు వెళ్లడానికి చొక్కా బటన్లు పెట్టుకుంటూ గడియారం వైపు చూస్తున్నారు. సుజాత లంచ్ బాక్స్ లో అన్నం పెడుతుంది.

 

అదే సమయంలో జాహ్నవి మాత్రం తన నోట్‌ బుక్‌ ముందు కూర్చుని ఒక వార్తను మూడోసారి చదువుతుంది.

 

శేఖర్‌ ఇచ్చిన పని ప్రకారం వార్తలోని వాస్తవాలను, అభిప్రాయాలను, నిర్ధారణ కాని ఆరోపణలను విడదీసింది. ఇప్పుడు ప్రతి అంశానికి ఆధారం ఏమిటో రాయడానికి ప్రయత్నిస్తుంది.

 

“జాను, టిఫిన్‌ తినవా?” హాల్ నుండి సుజాత అడిగింది.

 

“ఒక్క నిమిషం అమ్మా.”

 

“నిన్న కూడా ఒక్క నిమిషమే అన్నావు. చివరికి చల్లారిన ఇడ్లీలు తిన్నావు. నీ ఇన్వెస్టిగేషన్ కోసం ఇడ్లీలను బలి ఇవ్వాల్సిన అవసరం లేదు.” అంటూ సుజాత అనగానే నవ్వుతూ హాల్ లోకి వచ్చింది జాహ్నవి!

 

“నిన్న ఎవరినో కలుస్తాను అని వెళ్లావు కదా! ఏమైంది?”

 

“కలిసాను నాన్న! ముందు న్యూస్ ను ఎలా పరిశీలించాలో నేర్చుకోమన్నారు!. ఒక విషయం నిజమని అనిపించినంత మాత్రాన నమ్మకూడదని చెప్పారు.”

 

“అది మంచి మాటే. కానీ నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?” అంటూ కృష్ణ మూర్తి అడిగిన ప్రశ్న కి సుజాత వెంటనే భర్త వైపు చూసింది.

 

“పొద్దున్నే మొదలుపెట్టకండి. తను ఏదో నేర్చుకుంటోంది కదా!”

 

“ఇప్పుడు నేనేమన్నానని? తన భవిష్యత్తు గురించి అడుగుతున్నాను.”

 

“నాకు తెలుసు నాన్నా! ఉద్యోగం అవసరమే. నేను దాని కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను. కానీ ఉద్యోగం వచ్చే వరకు ఏమీ నేర్చుకోకుండా ఉండకూడదు కదా!”

 

“సరే! నీ ప్రయత్నం కొనసాగించు. కానీ ఇంటి పరిస్థితిని కూడా అర్థం చేసుకో! నీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పు.”

 

ఆ మాటల్లో ఆయన ప్రేమతో పాటు ఆర్థిక బాధ్యతల ఒత్తిడి కూడా ఉంది. జాహ్నవి దాన్ని అర్థం చేసుకుంది.

 

ఆమెకు స్వతంత్రంగా ఎదగాలనే కోరిక ఉంది. కానీ ఆ స్వాతంత్ర్యం అంటే తన కుటుంబం పడుతున్న కష్టాలను పట్టించుకోకపోవడం కాదని కూడా ఆమెకు  బాగా తెలుసు.

 

టిఫిన్‌ పూర్తి చేసి, తండ్రికి క్యారియర్‌ అందించి, తలుపు దగ్గర నిలబడి వీడ్కోలు చెప్పింది జాహ్నవి.

 

“నాన్నా! జాగ్రత్తగా వెళ్లండి.”

 

“నువ్వూ జాగ్రత్తగా ఉండు. ఏదైనా కొత్త విషయం మొదలుపెడితే ముందుగా చెప్పు.”

 

“అలాగే నాన్నా!”

 

ఆయన వెళ్లిపోయాక జాహ్నవి మళ్లీ తన నోట్‌ బుక్‌ తెరిచింది.

 

ఆమెకు తెలియకుండానే, జీవితంలో నేర్చుకోవాల్సిన మరో పాఠం మొదలైంది! కలల కోసం పోరాడుతూనే, మనల్ని ప్రేమించే వాళ్ల ఆందోళనలను కూడా అర్థం చేసుకోవడం.

 

సౌమ్య విషయంలో సమాచారం తక్కువగా ఉందని తనకు తెలుసు. కానీ ఆ ఒక్క కారణంతోనే ఏదో దాచిపెడుతున్నారని అనుకోవడం సరైంది కాదు.

 

తనకు ఆ కేసులో ఆసక్తి కలిగింది. అయినా ఆసక్తి ఒక్కటే ఇన్వెస్టిగేషన్ కి సరిపోదు.

 

సౌమ్య గురించి అధికారికంగా ఏమైనా సమాచారం అందుబాటులో ఉందేమో చూడాలని నిర్ణయించుకుంది.

 

జాహ్నవి వెబ్‌ సైట్‌ లో వార్త ప్రచురించిన తేదీని మరోసారి చూసింది. ఆ తర్వాత సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఏదో తెలుసుకోవడానికి వార్త లోని ప్రాంతం గురించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించింది.

 

కానీ సౌమ్య కుటుంబం నుండి అధికారిక ప్రకటన ఉందా, ఫిర్యాదు నమోదైందా అనే విషయాలను నిర్ధారించే సమాచారం ఆమెకు దొరకలేదు.

 

ఆమెకు నిరాశ కలిగింది. సమాధానం దొరకనంత మాత్రాన నిరాశ చెందకూడదు! తప్పుడు నిర్ణయానికి రావడం కంటే సమాధానం లేకుండా ఉండటం ఒక్కోసారి మంచిదే! అది తనకు తాను చెప్పుకుంది జాహ్నవి!

 

సాయంత్రం జాహ్నవి ఇంటి దగ్గర లోని కిరాణా దుకాణానికి వెళ్లింది. తల్లి చెప్పిన సరుకులు కొనుక్కుని తిరిగి వస్తుండగా, వీధి చివర ఉన్న ఇంటి ముందు కొంతమంది మహిళలు గుమిగూడి మాట్లాడుకుంటున్నారు.

 

“ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందట. అందుకే ఇంట్లో వాళ్ల మాట వినడం లేదట!”

 

“ఉద్యోగం వస్తే మాత్రం తల్లిదండ్రులకంటే ఎక్కువైపోతారా?”

 

“అదే కదా! ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇస్తే ఇలాగే తయారవుతారు.”

 

వాళ్లు మాట్లాడుతున్న అమ్మాయి ఎవరో జాహ్నవి తెలియదు. అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. ఆగి వాళ్లను ప్రశ్నించాలనే ఆలోచన వచ్చింది. కానీ పూర్తి విషయం తెలియకుండా సంభాషణ లోకి వెళ్లడం వల్ల ఉపయోగం ఉండదని భావించింది.

 

అంతలో ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. ఇరవై ఏళ్ల వయసున్న అమ్మాయి బయటకు వచ్చింది. కళ్లలో నీళ్లు ఉన్నాయి. చేతిలో ఒక చిన్న బ్యాగ్‌ ఉంది.

 

“అమ్మా! నేను ఆఫీసుకు వెళ్తున్నాను. సాయంత్రం మాట్లాడుకుందాం,” అని లోపల ఉన్నవారికి చెప్పింది.

 

“ఇప్పుడే వెళ్లిపో! నీకు నీ ఉద్యోగమే ముఖ్యమైతే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు,” లోపల నుండి ఒక మహిళ గొంతు వినిపించింది.

 

ఆ అమ్మాయి కాసేపు తలుపు దగ్గర నిలబడింది. ఏదో చెప్పాలనుకుంది. కానీ మాట బయటకు రాలేదు. చివరకు బ్యాగ్‌ భుజానికి వేసుకుని నడవడం ప్రారంభించింది.

 

“చూశారా? తల్లికి ఎదురు చెప్పి వెళ్లిపోతుంది.” గుమిగూడిన మహిళల్లో ఒకరు తల అడ్డంగా ఊపారు.

 

జాహ్నవి ఆ మాట విని తన నడక ని ఆపేసింది!

 

“ఆ అమ్మాయి ఏం చేసిందో మీకు పూర్తిగా తెలుసా?” వాళ్ళ వైపు చూస్తూ అడిగింది జాహ్నవి! వాళ్ళంతా ఆమె వైపుగా చూసారు!

 

“మాకెందుకు తెలియదు? ఈ వీధిలోనే కదా ఉంటుంది.”

 

“వాళ్ల ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలుసా? లేక బయటకు వినిపించిన మాటలే తెలుసా?” అంటూ జాహ్నవి అనగానే ఒక ఆవిడ ముఖం చిట్లించింది.

 

“అదేం ప్రశ్నమ్మా? తల్లికి ఎదురు చెప్పడం తప్పు కాదా?”

 

“తల్లిదండ్రులను గౌరవించడం ముఖ్యం. కానీ ఒక అమ్మాయి ఉద్యోగం చేయాలని కోరుకోవడం తప్పా? ఆమె ఎందుకు వెళ్లిపోతోందో తెలుసుకోకుండా, ఆమెను తప్పు పట్టడం సరైనదేనా?”

 

“అంటే తల్లిదండ్రులే తప్పు చేస్తున్నారని అంటున్నావా?”

 

“నేను అలా అనలేదు అండి! వాళ్ల పరిస్థితి నాకు తెలియదు. ఆ అమ్మాయి పరిస్థితి కూడా తెలియదు. అందుకే ఎవరు తప్పు చేసారో నేను చెప్పలేను.”

 

ఆమె మాటలకు అక్కడున్న ఆడవాళ్ళు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.

 

“ఒకవేళ ఆ అమ్మాయి నిజంగా తప్పు చేసి ఉంటే, దాని గురించి మాట్లాడొచ్చు. కానీ ఆమె ఉద్యోగానికి వెళ్లడమే తప్పు అని ఎలా నిర్ణయిస్తాం? అబ్బాయి ఉద్యోగం కోసం ఇంటి నుండి బయటకు వెళ్తే, అతను కుటుంబాన్ని వదిలేసాడని అంటామా?”

 

“అబ్బాయిలకు వేరే బాధ్యతలు ఉంటాయి,” ఒక ఆవిడ సమాధానమిచ్చింది.

 

“అమ్మాయిలకు బాధ్యతలు ఉండవా అండి? కుటుంబాన్ని చూసుకోవడం, తల్లిదండ్రులను గౌరవించడం అమ్మాయిల బాధ్యత అయితే, తమ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా ఉంచుకోవడం కూడా అమ్మాయిల హక్కే కదా!”

 

ఆ మాటలు విన్న వాళ్ళలో ఒకరు అసహనంగా ముఖం తిప్పుకున్నారు.

 

“ఈ కాలం పిల్లలతో మాట్లాడలేం. అన్నీ ప్రశ్నలే!” అంటూ అంది.

 

జాహ్నవి వాళ్లను మరింత వాదనలోకి లాగలేదు. తాను చెప్పిన మాటలతో వాళ్ల అభిప్రాయం వెంటనే మారిపోదని తెలుసు. అందుకే అక్కడి నుండి ఆమె సరుకుల బ్యాగ్ పట్టుకుని ఇంటివైపు నడిచింది.

 

ఇంటికి వెళ్ళిన జాహ్నవి మనసులో ఒక ప్రశ్న మెదిలింది.

 

ఒక అమ్మాయి తన కుటుంబం కోసం ఎన్నో విషయాలను వదులుకుంటే, అది ఆమె బాధ్యత అంటాం. అదే అమ్మాయి తన భవిష్యత్తు కోసం ఒక నిర్ణయం తీసుకుంటే, దాన్ని కుటుంబానికి వ్యతిరేకంగా చూడడం ఎందుకు?

 

ఆమెకు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు. ఆ అమ్మాయి నిర్ణయం సరైందో కాదో కూడా తెలియదు.

 

కానీ ఆమెకు ఒక విషయం స్పష్టమైంది! ఒకరి జీవితంలో ఏమి జరుగుతోందో తెలుసుకోకుండానే, వాళ్ల ప్రవర్తనను బట్టి వాళ్ల స్వభావాన్ని నిర్ణయించడం ఎంత సులభమో ఆ క్షణం ఆమెకు అర్థమైంది!

 

ఆ రాత్రి జాహ్నవి తన నోట్‌బుక్‌లో ఆ సంఘటన గురించి రాసుకుంది. ఎవరి పేర్లూ రాయలేదు. వారి వ్యక్తిగత విషయాలను నమోదు చేయలేదు. కేవలం తాను చూసినదాన్ని, విన్నదాన్ని, తనకు తెలియని విషయాలను వేర్వేరుగా రాసింది.

 

చూసిన విషయం. ఒక యువతి బ్యాగ్‌తో ఇంటి నుండి బయలుదేరింది.

విన్న విషయం, ఆమె ఉద్యోగానికి వెళ్లడం గురించి కుటుంబంలో వాగ్వాదం జరిగింది.

తెలియని విషయం, వాగ్వాదానికి పూర్తి కారణం, ఇరువైపుల పరిస్థితులు!

 

ఆ మూడు విషయాలను చూసి ఆమెకు ఒక చిన్న సంతృప్తి కలిగింది.

 

తాను చూసినదాన్ని నిజంగా రాయడం నేర్చుకుంటుంది. తనకు తెలియనిదాన్ని ఊహించి నింపకుండా ఉండడం నేర్చుకుంటోంది.

 

ఇదే అలవాటు ఒకరోజు తనను కఠినమైన ప్రశ్నల ముందు నిలబెట్టవచ్చు. అయినా ఆమె దాన్ని వదులుకోవాలనుకోలేదు.

 

రాత్రి తన తల్లి సుజాత పక్కన కూర్చుని కూరగాయలు తరుగుతుంది జాహ్నవి.

 

“అమ్మా! ఒక విషయం అడగనా?”

 

“అడుగు జాను.”

 

“నువ్వు చదువుకునే రోజుల్లో ఉద్యోగం చేయాలనుకున్నావా?” అంటూ జాహ్నవి అడిగిన ప్రశ్నకు సుజాత చేతి లోని కత్తి కాసేపు ఆగింది.

 

“అనుకున్నాను.”

 

“మరి ఎందుకు చేయలేదు?”

 

“మా ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి. చదువు పూర్తయ్యాక పెళ్లి చేశారు. తర్వాత మీ నాన్న ఉద్యోగం, ఇల్లు! ఆ అప్పుడే నువ్వు పుట్టావు! ఇక నిన్ను, మీ నాన్న ని జాగ్రత్తగా చూసుకుంటూ అలా జీవితం గడిచిపోయింది.”

 

“నీకు బాధగా అనిపించలేదా?”

 

“బాధ ఎందుకు ఉండదు? నాకు కూడా కొన్ని కోరికలు ఉండేవి. కానీ అప్పట్లో నేను తీసుకున్న నిర్ణయాలు, నాకు ఎదురైన పరిస్థితులు వేరు. ఇప్పుడు వాటి గురించి బాధపడుతూ ఉంటే ఏం లాభం?”

 

“నువ్వు ఉద్యోగం చేసి ఉంటే బాగుండేదనిపిస్తుందా?” జాహ్నవి తన తల్లి చెయ్యిని పట్టుకుంది!

 

“కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ ఉద్యోగం చేయడం కన్నా నాకు మీరిద్దరు ముఖ్యం అని అనిపిస్తుంది! మీ కోసం చేసిన పనులన్నీ వృథా అయ్యాయని మాత్రం అనిపించదు.”

 

“అది నాకు తెలుసమ్మా! నువ్వు మా కోసం ఎంత చేసావో నాకు తెలుసు. కానీ నువ్వు నీ కోసం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు, నీకు ఆ అవకాశం రాకపోవడం గురించి కూడా ఆలోచిస్తుంటాను.”

 

“జాను! నేను చేయలేకపోయినదంతా నువ్వు చేయాలని నేను కోరుకోను. నీకు నిజంగా ఏం కావాలో అది తెలుసుకుని, నీకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో! నువ్వు నీ కలను నెరవేర్చుకోవడం కోసం నీ ఆరోగ్యాన్ని, నీ మనశ్శాంతిని, నీకు కావాల్సిన వాళ్లను పూర్తిగా కోల్పోవాల్సిన అవసరం లేదు.”

 

“అర్థమైంది అమ్మా.”

 

సుజాత కాసేపు మౌనంగా ఉండి మళ్లీ మాట్లాడింది.

 

“ఇంకో విషయం! నువ్వు బయటికి వెళ్లి ఎవరి గురించైనా ప్రశ్నలు అడుగుతావు కదా! వాళ్లూ మనుషులే! వాళ్లకు కూడా కుటుంబాలు, బాధలు ఉంటాయి. నిజం తెలుసుకోవాలని అడుగుతున్నప్పుడు, వాళ్ల మనసు ఎంత బాధపడుతుందో కూడా ఆలోచించు.”

 

జాహ్నవి తల్లి భుజంపై తల ఆనించింది.

 

“అందుకే నువ్వు నాకు కావాలి అమ్మా! నాకు తెలియని విషయాలు నువ్వు నేర్పిస్తావు.” అంటూ జాహ్నవి అనగానే సుజాత ఆమె తలను నిమిరింది.

 

“నువ్వు ఏం చేసినా, మంచిగా చేయాలని కోరుకుంటాను. అంతే!”

 

ఆ చిన్న సంభాషణలో జాహ్నవి తన తల్లిని కొత్తగా చూసింది. ఒకప్పుడు తన కలను అర్థం చేసుకోవడం లేదని అనుకున్న తల్లి, ఇప్పుడు తనకు తెలియని అనుభవాన్ని పంచుకుంటోంది.

 

ప్రతి తరం తమకు సాధ్యమైనంతవరకు జీవిస్తుంది. తర్వాతి తరానికి తమ అనుభవాల నుండి ఏదో ఒకటి అందిస్తుంది. ఆ అనుభవాన్ని అడ్డంకిగా చూడాలా? లేక మంచి భవిష్యత్తు కి పునాదిగా తీసుకోవాలా అనేది మన నిర్ణయం.

 

జాహ్నవి తన తల్లి అనుభవాన్ని అడ్డంకిగా చూడకూడదని నిర్ణయించుకుంది. అదే సమయంలో, తల్లి నెరవేర్చుకోలేకపోయిన కలలను తన భుజాల మీద వేసుకుని జీవించాల్సిన అవసరం కూడా లేదని అర్థం చేసుకుంది.

 

ఆమెకు తనదైన ప్రయాణం ఉంది. తనదైన నిర్ణయాలు ఉన్నాయి. వాటికి తానే బాధ్యత వహించాలి.

 

ఆ రాత్రి నిద్రపోయే ముందు నోట్‌ బుక్‌ లో ఒక  వాక్యం రాసింది.

 

“ఒక స్త్రీకి ధైర్యం చెప్పడం అంటే, ఆమెను ప్రతి బంధం నుండి దూరం చేయడం కాదు. ఆమె బంధాలను గౌరవిస్తూనే, తన జీవితాన్ని తాను ఎంచుకునే హక్కు ఉందని గుర్తుచేయడం.”

 

రేపు మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. తనకు తెలియని ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి.

 

ఆమెకు ఇంకా ఉద్యోగం లేదు. ప్రత్యేకమైన గుర్తింపు లేదు. తన మాటలు వినడానికి పెద్ద వేదిక లేదు.

 

కానీ ఆమెకు ఇప్పుడు ఒక విషయం బాగా తెలుసు. తన గొంతు వినిపించడానికి ముందుగా పెద్ద వేదిక అవసరం లేదు. తను మాట్లాడే మాటలో నిజాయితీ, తను తీసుకునే నిర్ణయానికి బాధ్యత చాలా అవసరం అని!

 

:: ఇంకా ఉంది ::

‘జ్వాలా’ పోటీకి రాస్తున్న ఈ “స్వయంసిద్ధ“ ధారావాహిక లోని ఈ భాగం చదివిన తరువాత మీ విలువైన సమీక్షలను తెలుపుతారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు! – మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹’