స్వయంసిద్ధ – 5
స్వయంసిద్ధ – 5వభాగం
ఉదయం ఏడున్నర గంటలు! వంటగదిలో వేడివేడి ఉప్మా వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. కిటికీ బయట రాత్రి కురిసిన వానకు తడిసిన ఆకుల మీద నుండి నీటిచుక్కలు నేలమీద పడుతున్నాయి.
వీధిలో స్కూల్ బస్సు హారన్ వినిపించగానే, ఎదురింటి పిల్లాడు బ్యాగ్ వేసుకుని పరుగెత్తాడు. అతని తల్లి వెనక నుండి టిఫిన్ బాక్స్ అందిస్తూ, “నెమ్మదిగా వెళ్లు! పడిపోతావు!” అని అరిచింది.
ఆ దృశ్యాన్ని చూస్తూ నవ్వుకుంది జాహ్నవి. ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న ఆందోళనలు. ప్రతి మనిషికీ ఏదో ఒక బాధ్యత. ఎవరి జీవితం వాళ్లకు ఒక ప్రపంచం.
తన ప్రపంచంలో మాత్రం ఈ మధ్య ఒక కొత్త అలవాటు చేరింది. ఉదయం లేవగానే ఫోన్ లో వార్తలు చూడటం కాదు! ముందుగా తాను నిన్న నేర్చుకున్నదాన్ని గుర్తుచేసుకోవడం.
నిన్న రాసుకున్న వాక్యాన్ని నోట్‌బుక్‌లో మరోసారి చదివింది.
“ఒక స్త్రీకి ధైర్యం చెప్పడం అంటే, ఆమెను ప్రతి బంధం నుండి దూరం చేయడం కాదు. ఆమె బంధాలను గౌరవిస్తూనే, తన జీవితాన్ని తాను ఎంచుకునే హక్కు ఉందని గుర్తుచేయడం.”
పెన్ను తీసుకుని దాని కింద మరో వాక్యం రాసింది.
“ఒకరి స్వేచ్ఛను అర్థం చేసుకోవాలంటే, మనకు నచ్చిన నిర్ణయాలు మాత్రమే కాదు, మనకు నచ్చని నిర్ణయాలను కూడా గౌరవించడం నేర్చుకోవాలి.” రాస్తున్న జాహ్నవి ని చూసింది సుజాత!
“జాను! నువ్వు నోట్ బుక్ లో రాసుకునే మాటలన్నీ ఎప్పుడైనా పుస్తకంగా వేస్తావా?” సుజాత ఉప్మా గిన్నె టేబుల్ మీద పెడుతూ అడిగింది.
“పుస్తకం కోసం కాదు అమ్మా! నేను నేర్చుకున్న విషయాలు మర్చిపోకుండా ఉండటానికి.”
“అయితే సరే! కానీ ఆ నోట్ బుక్ చదివి నువ్వే నీకు మార్కులు వేసుకోకు! జీవితంలో అన్నీ మనం రాసుకున్నట్టు జరగవు.”
“తెలుసమ్మా.”
“తెలిస్తే ముందు తిను.”
ఆ సాధారణమైన మాటల్లో కూడా ఆమెకు ఒక విషయం కనిపించింది. ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నా, జీవితం మాత్రం చిన్న చిన్న పనులతోనే ముందుకు సాగుతుంది. మనం నేర్చుకున్నదాన్ని రోజువారీ జీవితంలో పాటించగలిగినప్పుడే దానికి విలువ ఉంటుంది.
@ @ @ @
ఉదయం తొమ్మిది గంటలకు జాహ్నవి తన రెస్యూమ్ ని ఒకసారి చెక్ చేసుకుంది! గతంలో పంపిన అప్లికేషన్లలో చేసిన తప్పులను పరిశీలించింది. కొన్ని చోట్ల తనకు ఉన్న నైపుణ్యాలను స్పష్టంగా రాయలేదు. మరికొన్ని చోట్ల అనుభవం లేని విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉందని మాత్రమే పేర్కొంది.
ఈసారి ఆమె తనకు నిజంగా తెలిసిన విషయాలనే రాసింది. తెలుగు భాషపై పట్టు, సమాచారాన్ని పరిశీలించే ఆసక్తి, ప్రాథమిక ఇన్వెస్టిగేషన్, రాయగల సామర్థ్యం, నేర్చుకోవాలనే పట్టుదల ఇలా ప్రతి అంశాన్ని స్పష్టంగా పేర్కొంది.
తనకు అనుభవం లేదనే విషయాన్ని దాచలేదు. అప్లికేషన్ పూర్తిచేసి పంపించిన తర్వాత, ఉద్యోగాల కోసం వెతుకుతూనే శేఖర్ ఇచ్చిన సాధనను కొనసాగించాలని నిర్ణయించుకుంది. అప్పుడే మానస ఫోన్ చేసింది.
“జాను! ఏం చేస్తున్నావు?”
“ఉద్యోగాలకు అప్లై చేస్తున్నాను! చెప్పు ఏంటి విషయం?”
“నిన్న మన కాలేజీ గ్రూపులో ఒక విషయం గురించి మాట్లాడుకున్నారు. గుర్తుందా? మనతో చదివిన లావణ్య గురించి!”
“ఏమైంది తనకి?”
“తను ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది కదా! వాళ్ల ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తున్నారట. కానీ తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిందట. దాంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని తెలిసింది.”
“తనకు ఏం కావాలో తనే నిర్ణయించుకోవాలనుకుంటోంది. అందులో తప్పేముంది?” అని అడిగింది జాహ్నవి.
“అదే నేను కూడా అన్నాను. కానీ గ్రూపులో కొంతమంది, ‘తల్లిదండ్రులు పిల్లల మంచికే చూస్తారు. వాళ్ల మాట వినాలి’ అంటున్నారు.”
“తల్లిదండ్రులు పిల్లల మంచిని కోరుకోవడం నిజమే మానసా. కానీ వాళ్లకు మంచిగా అనిపించేది, పిల్లలకు కూడా మంచిగా అనిపించాలనే నియమం ఎక్కడుంది?”
“అయితే తల్లిదండ్రులను పట్టించుకోకూడదా?”
“అలా ఎవరు చెప్పారు? వాళ్లతో మాట్లాడాలి. వాళ్ల ఆందోళనను అర్థం చేసుకోవాలి. కానీ పెళ్లి అనేది ఒక మనిషి జీవితాన్ని మార్చే నిర్ణయం. అందులో ఆ మనిషి అభిప్రాయానికి విలువ ఉండాలి కదా!”
“నిజమే! కానీ మనం ఇలా మాట్లాడితే కొంతమంది, అమ్మాయిలకు స్వేచ్ఛ ఇచ్చేస్తే కుటుంబాలు నిలవవు అంటారు.”
“కుటుంబం నిలవాలంటే ఒక మనిషి తన ఇష్టాన్ని పూర్తిగా చంపుకోవాలా? ఇద్దరి మధ్య అనుబంధం ఉండాలంటే ఇద్దరికీ మాట చెప్పే హక్కు ఉండాలి కదా! ఒకరి నిర్ణయమే ఎప్పుడూ నడిస్తే అది కుటుంబమా, లేక ఒకరు ఆజ్ఞలు ఇచ్చి ఇంకొకరు పాటించే సిస్టమా?”
“నువ్వు చెప్పేది నిజమే. కానీ ప్రతి ఇంటి పరిస్థితి వేరు కదా!”
“అవును! అందుకే లావణ్య జీవితంలో ఏం జరుగుతోందో పూర్తిగా తెలుసుకోకుండా, ఆమెను తప్పు పట్టకూడదు. తన తల్లిదండ్రులు కూడా ఏ పరిస్థితుల్లో ఆలోచిస్తున్నారో తెలియకుండా వాళ్లను చెడ్డవాళ్లని అనకూడదు. సమస్యకు పరిష్కారం వెతకాలి. ఇద్దరిలో ఎవరో ఒకరిని ఓడించడం కాదు.”
“నీతో మాట్లాడితే ప్రతి విషయానికీ ప్రశ్నలు తయారవుతున్నాయి.”
“ప్రశ్నలు అడగడం తప్పు కాదు. సమాధానం వినకుండా ముందే తీర్పు చెప్పడమే సమస్య.” అంటూ అంది జాహ్నవి!
ఫోన్ పెట్టిన తర్వాత చాలాసేపు జాహ్నవి ఆలోచనలలో ఉండిపోయింది! లావణ్య గురించి విన్న సమాచారం చాలా తక్కువే. ఆమె పరిస్థితి ఏమిటో తెలియదు. అందుకే జాహ్నవి ఆ విషయాన్ని తన నోట్‌బుక్‌లో కేసులా నమోదు చేయలేదు. కానీ ఆ సంభాషణ తనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసింది.
స్త్రీల జీవితాల గురించి సమాజం తరచూ రెండు కోణాల్లోనే ఆలోచిస్తుంది. కుటుంబం కోసం తన కోరికలను వదులుకుంటే గొప్పదని పొగుడుతుంది. తన కోరికలను వ్యక్తపరిస్తే స్వార్థపరురాలని విమర్శిస్తుంది.
కానీ ఒక స్త్రీ కుటుంబాన్ని ప్రేమిస్తూనే తన జీవితాన్ని కోరుకోవచ్చు కదా! ఆమె బాధ్యతలను నెరవేర్చుతూనే తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవచ్చు కదా!
ఈ రెండు విషయాలు ఒకేసారి నిజం కావడానికి సమాజం ఎందుకు ఇష్టపడదు? జాహ్నవి నోట్ బుక్ లో ఆ ప్రశ్నలను రాసుకుంది.
ఆ సమయంలోనే శేఖర్ నుండి సందేశం వచ్చింది.
“నిన్నటి సాధన గురించి మాట్లాడాలి. వీలైతే సాయంత్రం ఆఫీసుకు రా.” అంటూ ఆ మెసేజ్ ని చూడగానే చిన్నగా నవ్వి సరే సర్ అంటూ సమాధానం పంపింది.
సాయంత్రం నాలుగు గంటల సమయంలో శేఖర్ ఉన్న ఆఫీస్ కి చేరుకుంది జాహ్నవి. ఈసారి లోపలికి వెళ్లేటప్పుడు ముందు కంటే కొంచెం ధైర్యంగా అనిపించింది.
అయితే అక్కడ పనిచేస్తున్న వాళ్లతో తనకు పరిచయం లేదనే విషయం ఆమెకు తెలుసు. అందుకే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా నేరుగా శేఖర్ గది దగ్గరకు వెళ్లింది.
ఆయన టేబుల్ మీద కొన్ని పేపర్స్ ని సర్దుతున్నారు.
“రా జాహ్నవి. నేను చెప్పింది చేసావా?” అంటూ శేఖర్ అనగానే ఆమె నోట్ బుక్ అందించింది.
శేఖర్ ఒక్కో పేజీ చదివారు. మధ్యలో కొన్ని చోట్ల ఆగి ప్రశ్నలు అడిగారు.
“ఇక్కడ ఈ వ్యక్తి చెప్పిన మాటను నువ్వు నిర్ధారించని సమాచారంగా పేర్కొన్నావు. ఎందుకు?”
“ఆయన చెప్పిన విషయం నిజమని నిరూపించే మరో ఆధారం న్యూస్ లో లేదు సర్.”
“సరే! అయితే ఆయన చెప్పిన మాటను పూర్తిగా పక్కన పెట్టేయాలా?”
“లేదు సర్! అది ఒక ఆధారంగా పరిగణించవచ్చు. కానీ దాన్ని వ్యాలిడేట్ చెయ్యాల్సిన అవసరం ఉంది!”
“బాగుంది.” అంటూ ఆయన మరో పేజీ తెరిచారు.
“ఇక్కడ నువ్వు ఈ అంశంపై మరింత సమాచారం అవసరం’ అని రాసావు. ఏ సమాచారం అవసరమో కూడా పేర్కొనాలి. లేదంటే ఇన్వెస్టిగేషన్ కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియదు.”
“అంటే, ఏ ప్రశ్నకు సమాధానం కావాలో స్పష్టంగా గుర్తించాలా?”
“అవును! ఉదాహరణకు, ఒక ప్రభుత్వ పథకంలో నిధులు ఖర్చు చేశారని వార్త వస్తే, నువ్వు అడగాల్సిన ప్రశ్న నిధులు ఖర్చు చేశారా లేదా అని మాత్రమే కాదు. అసలు నిధులు ఎప్పుడు విడుదలయ్యాయి? ఎవరు వినియోగించారు? దానికి సంబంధించిన అఫీషియల్ రికార్డులు ఏంటి? ఆ పథకం వల్ల ప్రజలకు ప్రయోజనం కలిగిందా? ఇవన్నీ వేర్వేరు ప్రశ్నలు.”
“అర్థమైంది సర్.” అంటూ ఆమె అనగానే ఆయన నోట్ బుక్ మూసి ఆమెకు అందించారు.
“నువ్వు నేర్చుకోవాలనే ఆసక్తితో వస్తున్నావు. అది మంచిది. కానీ ఒక విషయం గుర్తుంచుకో! ప్రతి వార్త వెనుక దాగి ఉన్న రహస్యాన్ని బయటపెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని వార్తల్లో రహస్యమే ఉండకపోవచ్చు.”
“అంటే ప్రతిదాని లోనూ కుట్ర ఉందని అనుకోకూడదన్నమాట.”
“అదే! నిజమైన ఇన్వేస్టిగేటర్ అనుమానం వచ్చిన ప్రతిసారీ తనను తాను కూడా ప్రశ్నించాలి. మనం ఏదైనా నమ్మాలని కోరుకుంటున్నామా? లేక నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నామా? ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది! దాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం!”
ఆమెకు తన లోని ఉత్సాహం గుర్తొచ్చింది. ఒక వార్త చదివిన వెంటనే దాని వెనుక ఏదో పెద్ద విషయం ఉందేమోనని అనిపించడం సహజం. కానీ ఆ ఉత్సాహాన్ని నియంత్రించకపోతే, తాను కూడా ఆధారాలు లేకుండా కథలు అల్లే వ్యక్తిగా మారిపోవచ్చు. ఆమె అలా కావాలనుకోలేదు.
“సర్, నేను ఇంకా ఏం నేర్చుకోవాలి?”
“ముందుగా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ప్రైమరీ వేస్ నేర్చుకో! ప్రజలకు అందుబాటులో ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎలా వెతకాలి, రికార్డ్స్ లో ఉన్న తేదీలు, మూలాలు ఎలా పరిశీలించాలి, ఫొటో లేదా వీడియో ఎప్పుడు తీసారో ఎలా ధ్రువీకరించాలి, ఒక వ్యక్తి చెప్పిన మాటను ప్రచురించే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ఇవన్నీ నేర్చుకో! తర్వాత చిన్న అంశాన్ని ఎంచుకుని, దానిపై ఆర్డర్ లో వర్క్ చేయొచ్చు!”
“సరే సర్. థాంక్ యుసో ముచ్!”
“నేర్చుకోవడానికి వచ్చినందుకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు జాహ్నవి. కాని నువ్వు నేర్చుకున్నదాన్ని బాధ్యతగా ఉపయోగిస్తే చాలు.” అంటూ ఆయన చెప్పిన మాటలు విని చిన్నగా నవ్వి అక్కడి నుండి బయటకు వచ్చింది జాహ్నవి!
ఆఫీసు గోడపై ఉన్న పాత కటింగ్స్‌ను ఈసారి మరోలా చూసింది. వాటి వెనుక ఎంత శ్రమ ఉందో, ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతికి ఉంటారో, ఎన్ని ఆధారాలను పరిశీలించి ఉంటారో ఊహించింది.
ఒక వార్త ప్రజల ముందుకు రావడానికి ముందు, దాని వెనుక కనిపించని ఎన్నో గంటల వర్క్ ఉండవచ్చు. ఆ కనిపించని పనిని నేర్చుకోవడమే ఇప్పుడు తన ముందు ఉన్న లక్ష్యం.
ఆ ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు బస్సు కిటికీ పక్కన కూర్చుంది జాహ్నవి. రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణాలు, బస్సుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, స్కూల్ నుండి వస్తున్న పిల్లలు కనిపిస్తున్నారు.
ఒక చోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, ఒక మహిళ తన స్కూటర్ పక్కన నిలబడి ఫోన్‌లో మాట్లాడుతుంది. ఆమె వెనుక చిన్నపిల్లాడు కూర్చుని ఉన్నాడు. సిగ్నల్ మారగానే ఆమె జాగ్రత్తగా స్కూటర్ ముందుకు నడిపింది.
ఆ దృశ్యం చూసి జాహ్నవి మనసులో చిరునవ్వు మెరిసింది.
ఉదయం ఇంట్లో పిల్లల్ని చూసుకునే తల్లి, మధ్యాహ్నం ఉద్యోగం చేసే మహిళ, సాయంత్రం తన పిల్లాడిని తీసుకుని ఇంటికి వెళ్లే తల్లి! ఆమె ఒకే సమయంలో ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుంది.
ఆమెను చూసి ఎవరైనా, “ఇంటి బాధ్యతలు చూసుకుంటే ఉద్యోగం ఎందుకు?” అని అడగవచ్చు. ఇంకొకరు, “ఉద్యోగం చేస్తే పిల్లలకు సమయం ఎలా ఇస్తుంది?” అని ప్రశ్నించవచ్చు.
కానీ ఆమె జీవితంలో ఏది ముఖ్యమో నిర్ణయించాల్సింది ఎవరు?
తనకు సాధ్యమైనంతవరకు బాధ్యతలను నిర్వహిస్తూ, తన జీవితాన్ని నిర్మించుకోవాలనుకోవడం తప్పా?
అయితే అదే సమయంలో, ప్రతి స్త్రీ ఉద్యోగం చేయాలనే నియమం కూడా లేదు. ఇంట్లో ఉండాలని ఎంచుకున్న ఆడవాళ్ళను తక్కువగా చూడటం కూడా తప్పే.
స్వేచ్ఛ అంటే అందరూ ఒకే నిర్ణయం తీసుకోవడం కాదు. ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాన్ని భయం లేకుండా, ఒత్తిడి లేకుండా తీసుకునే అవకాశం ఉండటం.
జాహ్నవి ఆ ఆలోచనను తన నోట్‌బుక్‌లో రాసుకుంది.
తన కథలోని స్త్రీలు కూడా ఒకేలా ఉండకూడదని ఆమెకు అనిపించింది. కొందరు కుటుంబాన్ని ఎంచుకోవచ్చు. కొందరు వృత్తిని ఎంచుకోవచ్చు. మరికొందరు రెండింటినీ సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఎవరి నిర్ణయం సరైనదో నిర్ణయించడానికి ఒకే కొలమానం ఉండకూడదు.
జాహ్నవి తనను తాను చూసుకుంది. తనకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా ఎదగాలనే కల ఉంది. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది. కానీ తనకు భిన్నంగా జీవించే స్త్రీలను తక్కువగా చూడకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం.
ఎందుకంటే స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడేవాళ్లు, స్త్రీలు తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే కాదు, తమకు నచ్చని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఆ స్వేచ్ఛను గౌరవించగలగాలి!
ఆ ఆలోచనలతో ఇంటికి వెళ్ళిన తరువాత రాత్రి సమయంలో నోట్ బుక్ తెరిచి, శేఖర్ చెప్పిన విషయాలను ఒక చోట రాసుకుంది. ప్రతి సమాచారానికి మూలం కావాలి. ఒకే మూలం నుండి వచ్చిన రెండు వాదనలు నిజమే అని నమ్మకుండా, తన అనుమానానికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను కూడా పరిశీలించాలి.
“నిజాన్ని వెతికే వ్యక్తి మొదట తన పక్షపాతాలను గుర్తించాలి. ఎందుకంటే మనం నమ్మాలనుకునే విషయాన్ని నిజమని నిరూపించడం సులభమే! కాని మనం నమ్మింది తప్పని అంగీకరించడానికి మాత్రం చాలా ధైర్యం కావాలి!” అంటూ తన నోట్ బుక్ లో రాసింది జాహ్నవి!
ఇప్పటివరకు ఆమె నేర్చుకున్న పాఠాలు తనలో మార్పు తీసుకొస్తున్నాయి. కానీ అసలు పరీక్ష ఎప్పుడు వస్తుందో ఆమెకు తెలియదు.
ఒకరోజు తన ముందుకు వచ్చే ఆధారాలు తనకు ఇష్టమైన వాళ్ళను కూడా తప్పు పట్టేలా చేయొచ్చు . మరొక రోజు సమాజం మొత్తం నమ్ముతున్న అభిప్రాయం తప్పు కావొచ్చు!
ఇంకో సందర్భంలో తనకు ఎంతో బాధ కలిగించిన సంఘటన వెనుక తాను ఊహించని కారణం ఉండవచ్చు. అప్పుడు కూడా ఆమె నిజం వైపే నిలబడగలదా?
ఆ ప్రశ్నకు సమాధానం మాటల్లో చెప్పడం చాలా సులభం. కాని అదే మాటను జీవితంలో నిరూపించడం మాత్రం అంతకన్నా కష్టం.
ఆలస్యమైనా సరే కాని నిజాయితీగా ఉండాలని మాత్రం ఆమె అనుకుంది! తన కలను నెరవేర్చుకోవడానికి మాత్రమే కాదు, తనను తాను ఒక బాధ్యత గల మనిషిగా నిర్మించుకోవడానికి కూడా సిద్ధమైంది.
తాను ఏదోఒకరోజు ఏదైనా అన్యాయాన్ని బయటపెట్టగలిగితే, అది తన ధైర్యం వల్ల మాత్రమే కాకుండా, నిజాన్ని తెలుసుకోవడానికి అవసరమైన ఓర్పు, క్రమశిక్షణ, బాధ్యతలను నేర్చుకున్నందువల్ల కూడా అవ్వాలి.
ఆమెకు ఇంకా పెద్ద అవకాశం రాలేదు. కానీ ఆ అవకాశాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన పునాది మాత్రం నెమ్మదిగా పడుతుంది. ఆ అవకాశాన్ని అరచేతిలో పట్టుకోవడానికి ఆమె స్వయంసిద్ధంగా ఉంది!
:: ఇంకా ఉంది ::
‘జ్వాలా’ పోటీకి రాస్తున్న ఈ “స్వయంసిద్ధ“ ధారావాహిక లోని ఈ భాగం చదివిన తరువాత మీ విలువైన సమీక్షలను తెలుపుతారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు! – మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹‘
Swipe left/right or tap the sides to turn pages